కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ భాగం

ఏదైనా విషాదకరమైన పరిస్థితి తలెత్తినప్పుడు . . .

ఏదైనా విషాదకరమైన పరిస్థితి తలెత్తినప్పుడు . . .

‘మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతోంది.’ —1 పేతురు 1:6.

దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి మీరు ఎంత కృషి చేసినా ఊహించని సంఘటనలు కొన్నిసార్లు మీ సంతోషాన్ని హరించివేస్తాయి. (ప్రసంగి 9:11) అయితే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రేమగా సహాయం చేస్తాడు. మీరు ఈ భాగంలో ఇచ్చిన లేఖన సూత్రాలు పాటిస్తే చిన్నచిన్న కష్టాల్లోనే కాదు, పెద్దపెద్ద కష్టాల్లో కూడా చక్కగా నెట్టుకురాగలుగుతారు.

1 యెహోవా మీద ఆధారపడండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:7) మీ కష్టాలకు దేవుణ్ణి నిందించకూడదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. (యాకోబు 1:13) మీరు ఆయనకు దగ్గరయ్యే కొద్దీ, ఆయన మీకు అత్యుత్తమ రీతిలో సహాయం చేస్తాడు. (యెషయా 41:9, 10) ‘ఆయన సన్నిధిలో మీ హృదయాల్ని కుమ్మరించండి.’—కీర్తన 62:8.

ప్రతీరోజు బైబిలు చదివి, అందులోని విషయాలు మీ జీవితానికి ఎలా పనికొస్తాయో ఆలోచించడం వల్ల కూడా మీకు ఊరట కలుగుతుంది. అవన్నీ చేస్తే, యెహోవా ‘మన శ్రమలన్నిటిలో మనల్ని ఎలా ఆదరిస్తాడో’ మీరే స్వయంగా చవిచూస్తారు. (2 కొరింథీయులు 1:3, 4; రోమీయులు 15:4) ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం’ మీకు ఇస్తానని ఆయన మాటిస్తున్నాడు. —ఫిలిప్పీయులు 4:6, 7, 13.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, సరైన కోణంలో ఆలోచించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి

  • పరిష్కార మార్గాలు ఎన్నో ఉంటాయి, అయితే బాగా ఆలోచించి మీ పరిస్థితికి సరిగ్గా సరిపోయే అత్యుత్తమ మార్గాన్ని ఎంచుకోండి

2 మీ గురించి, మీ కుటుంబం గురించి శ్రద్ధ తీసుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.” (సామెతలు 18:15) వివరాలన్నీ తెలుసుకోండి. కుటుంబంలో ప్రతీ ఒక్కరికి ఏమి అవసరమో కనుక్కోండి. వాళ్లతో మాట్లాడండి. వాళ్లు మాట్లాడుతుంటే వినండి.—సామెతలు 20:5.

మనకు బాగా ఇష్టమైన వాళ్లెవరైనా చనిపోతే? మీ దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి భయపడకండి. యేసు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడని గుర్తుంచుకోండి. (యోహాను 11:35; ప్రసంగి 3:4) తగిన విశ్రాంతి, నిద్ర కూడా అవసరం. (ప్రసంగి 4:6) దుఃఖకరమైన పరిస్థితిని సులువుగా తట్టుకోవడానికి అవన్నీ ఉపకరిస్తాయి.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • విషాదకరమైన పరిస్థితులు తలెత్తకముందే, మీ కుటుంబ సభ్యులతో సంభాషించడం ఓ అలవాటుగా చేసుకోండి. దానివల్ల, సమస్యలు వచ్చినప్పుడు వాళ్లు మీతో నిశ్చింతగా మాట్లాడతారు

  • మీలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న వాళ్లతో మాట్లాడండి

3 మీకు కావాల్సిన సహాయం తీసుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” (సామెతలు 17:17) మీకు సహాయం చేయాలనే కోరిక మీ స్నేహితులకు ఉన్నా ఏమి చేయాలో వాళ్లకు పాలుపోకపోవచ్చు. కాబట్టి మీకు నిజంగా ఏ సహాయం అవసరమో వాళ్లకు చెప్పడానికి వెనకాడకండి. (సామెతలు 12:25) ఇంకా, బైబిలు జ్ఞానం ఉన్న వాళ్ల దగ్గర ఆధ్యాత్మిక సహాయం తీసుకోండి. బైబిలు నుండి వాళ్లు ఇవ్వగలిగే మార్గనిర్దేశాలు మీకు సహాయం చేస్తాయి.—యాకోబు 5:14.

దేవుని మీద నిజంగా విశ్వాసం ఉన్నవాళ్లతో, ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉన్నవాళ్లతో సహవసిస్తూ ఉండండి, అప్పుడు మీకు కావాల్సిన సహాయం అందుతుంది. ప్రోత్సాహం కరువైన వాళ్లకు సహాయం చేయండి, అది కూడా మీకు ఎంతో ఊరటనిస్తుంది. యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద మీకున్న విశ్వాసం గురించి వాళ్లకు చెప్పండి. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడంలో బిజీగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్లకు, మీ బాగోగుల్ని పట్టించుకునే వాళ్లకు దూరంగా ఉండకండి.—సామెతలు 18:1; 1 కొరింథీయులు 15:58.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ ఆప్తమిత్రులతో మాట్లాడండి, వాళ్ల సహాయాన్ని కాదనకండి

  • మీ అవసరాలేంటో స్పష్టంగా, ఉన్నదున్నట్టుగా చెప్పండి