కంటెంట్‌కు వెళ్లు

కొత్తలోక అనువాదం ఖచ్చితమైనదేనా?

కొత్తలోక అనువాదం ఖచ్చితమైనదేనా?

 కొత్తలోక అనువాదం మొదటి భాగాన్ని 1950లో విడుదల చేశారు. అయితే కొత్తలోక అనువాద a బైబిల్ని మిగతా బైబిలు అనువాదాలతో పోలిస్తే కొన్ని తేడాలు కనిపించాయి. అందుకే కొంతమంది ప్రజలు దాని ఖచ్చితత్వం గురించి రకరకాలుగా మాట్లాడారు, కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ కిందున్న వాటిల్లోని ఏదోక దానివల్లే ఆ తేడాలు ఉన్నాయి.

  •   నమ్మదగినది. కొత్తలోక అనువాదంలోని సమాచారం నిపుణులు పరిశోధనచేసి ఇచ్చిన తాజా సమాచారం మీద, నమ్మదగిన పూరాతన రాతప్రతుల మీద ఆధారపడినది. దానికి భిన్నంగా 1611వ సంవత్సరానికి సంబంధించిన కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ను అంత ఖచ్చితంగాలేని రాతప్రతుల ఆధారంగా తయారుచేశారు. పైగా ఆ రాతప్రతులు, కొత్తలోక అనువాదం తయారుచేసేటప్పుడు ఉపయోగించిన రాతప్రతులంత పురాతనమైనవి కూడా కాదు.

  •   అర్థాన్ని మార్చలేదు. కొత్తలోక అనువాదం దేవుడు చెప్పిన విషయాలను ఉన్నదున్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. (2 తిమోతి. 3:16) చాలా బైబిలు అనువాదాలు మనుషుల పద్ధతుల్ని పాటిస్తూ దేవుడు చెప్పిన విషయాలను నమ్మకంగా తెలియజేయలేకపోయాయి. ఉదాహరణకు, దేవుని పేరు యెహోవా అని ఉన్నచోట ప్రభువు లేదా దేవుడు అనే బిరుదులను పెట్టారు.

  •   ఉన్నదున్నట్లు అనువదించింది. కొత్తలోక అనువాదం, సారాంశ రూపంలో రాసిన అనువాదాల్లాంటిది కాదు. బదులుగా పదాలు ఎబ్బెట్టుగా లేనంతవరకు లేదా అసలు రాతప్రతుల్లోని అర్థం మారనంతవరకు పదాలను మక్కీకిమక్కీ అనువదించింది. బైబిలు మూలప్రతిలోని విషయాలను మార్చి రాసిన అనువాదాలు మనుషుల అభిప్రాయాలను చేర్చి ఉండవచ్చు లేదా ముఖ్యమైన వివరాలను తీసేసి ఉండవచ్చు.

కొత్తలోక అనువాదానికి, వేరే అనువాదాలకి ఉన్న తేడాలు

 కొన్ని పుస్తకాలు లేవు. రోమన్‌ క్యాథలిక్‌ అలాగే ఈస్ట్రన్‌ ఆర్థడాక్స్‌ చర్చీల బైబిల్లో అపాక్రఫ అనే పేరుతో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అయితే, ఈ పుస్తకాలను యూదులు తమ ప్రామాణిక పుస్తకంలో భాగంగా ఒప్పుకోలేదు. ఇది గమనించాల్సిన విషయం. ఎందుకంటే “దేవుని పవిత్ర సందేశాలు వాళ్లకు [యూదులకు] ఇవ్వబడ్డాయి” అని బైబిలు చెప్తోంది. (రోమీయులు 3:1, 2) కాబట్టి, కొత్తలోక అనువాదం అలాగే ఇప్పుడున్న వేరే బైబిలు అనువాదాలు అపాక్రఫలోని పుస్తకాలను తమ బైబిల్లో నుండి తీసేశాయి లేదా చేర్చుకోలేదు.

 కొన్ని వచానాల్ని తీసేశారు. అత్యంత పాత రాతప్రతుల్లో లేని వచనాలను, పదబంధాలను కొన్ని అనువాదాలు తమ బైబిల్లో చేర్చాయి. కానీ అలా చేర్చిన వాటిని కొత్తలోక అనువాదం పెట్టలేదు. ఈ మధ్య వచ్చిన అనువాదాలు అలా తర్వాత చేర్చిన వచనాలను తీసేస్తున్నాయి లేదా అవి అధికారిక మూలం నుండి తీసుకున్నవి కాదని చెప్తున్నాయి. b

 పదాలు వేరు. మక్కీకిమక్కీ చేసే అనువాదం అప్పుడప్పుడు స్పష్టంగా అర్థంకాకపోవచ్చు లేదా తప్పు అర్థాన్ని ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మత్తయి 5:3లో ఉన్న యేసు మాటల్ని చాలామంది ఇలా అనువదించారు, ‘ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నవాళ్లు ఆశీర్వదించబడినవాళ్లు.’ (ఇంగ్లీష్‌ స్టాండర్డ్‌ వర్షన్‌; కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌; న్యూ ఇంటర్నెషనల్‌ వర్షన్‌) ‘ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నవాళ్లు’ అని మక్కీకిమక్కీ చేసిన అనువాదం అంత స్పష్టంగా లేదని చాలామంది అనుకుంటున్నారు. కొందరైతే, యేసు ఆ వచనంలో వినయంగా లేదా పేదరికంలో ఉండడం గురించి చెప్తున్నాడని అనుకున్నారు. కానీ, దేవుని సహాయం మనకు అవసరమని గుర్తించినప్పుడే నిజమైన సంతోషాన్ని పొందవచ్చనేది యేసు మాటలకున్న అర్థం. అయితే కొత్తలోక అనువాదం ఆ వచనానికి ఉన్న అర్థాన్ని “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు” అనే మాటలతో చక్కగా చెప్పింది.—మత్తయి 5:3. c

సాక్షులుకాని నిపుణులు కొత్తలోక అనువాదాన్ని మెచ్చుకుంటూ చెప్పిన మాటలు

ఎడ్గర్‌ జె. గుడ్‌స్పీడ్‌

  •   డిసెంబరు 8, 1950 తేదీతో ఉన్న ఉత్తరంలో కొత్తలోక అనువాదం క్రైస్తవ గ్రీకు లేఖనాలు గురించి బైబిలు అనువాదకుడు, నిపుణుడైన ఎడ్గర్‌ జె. గుడ్‌స్పీడ్‌ ఇలా చెప్పాడు, ‘ప్రపంచవ్యాప్తంగా మీ ప్రజలు చేస్తున్న ప్రకటనాపని నన్ను ఆకట్టుకుంది, మీరు సరైన అర్థం వచ్చేలా, స్పష్టంగా చేసిన ఈ శక్తివంతమైన అనువాదం నాకు చాలా నచ్చింది. నాకు తెలిసినంతవరకు మీరు చాలా పరిశోధన చేసివుంటారు.’

  •   చికాగో యూనిర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆలన్‌ విక్‌గ్రెన్‌, కొత్తలోక అనువాదం ఇప్పటికాలం భాషకు ఒక ఉదాహరణగా ఉందని అన్నాడు. అంతేకాదు కొత్తలోక అనువాదాన్ని వేరే అనువాదాల ఆధారంగా కాదుగానీ మూల రాతప్రతుల ఆధారంగా అనువదించారని కూడా అన్నాడు.—ది ఇంటర్‌ప్రిటర్స్‌ బైబిల్‌, 1వ సంపుటిలో 99వ పేజీ.

  •   బ్రిటీష్‌ బైబిల్‌ క్రిటిక్‌, అలెగ్జాండర్‌ థామ్సన్‌ కొత్తలోక అనువాదం క్రైస్తవ గ్రీకు లేఖనాలు గురించి ఇలా రాశాడు, “ఈ అనువాదం ఇంగ్లీషులో సాధ్యమైనంత వరకూ గ్రీకు లేఖనాల అసలైన అర్థాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నించింది. ఇది నిపుణత, తెలివి ఉన్న నిపుణుల పని అని స్పష్టంగా అర్థమౌతుంది.”—ద డిఫరెన్షియేటర్‌, ఏప్రిల్‌ 1952, 52వ పేజీ.

  •   కొత్తలోక అనువాదంలో ప్రత్యేకతలు, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని రాబర్ట్‌ ఎమ్‌. మెకాయ్‌కి అనిపించినప్పటికీ, దాని గురించి తన అభిప్రాయాన్ని ఆయనిలా చెప్పాడు, “బైబిలు అనువదిస్తున్నప్పుడు వచ్చే చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించగలిగే అర్హులైన నిపుణులు యెహోవాసాక్షుల్లో ఉన్నారు అనడానికి కొత్తనిబంధనను వాళ్లు అనువదించిన విధానమే ఒక రుజువు.”1963 జనవరి ఆడోవర్‌ న్యూటన్‌ క్వార్టర్లీ, 31వ పేజీ.

  •   ప్రొఫెసర్‌ ఎస్‌. మాక్‌లీన్‌ గిల్‌మోర్‌ కొత్తలోక అనువాదంలోని కొన్ని విషయాలను ఒప్పుకోకపోయినా దాన్ని అనువదించినవాళ్లకు “గ్రీకు భాషపై అసాధారణమైన పట్టు ఉంది” అని ఆయన గుర్తించాడు.1966 సెప్టెంబరు, ఆడోవర్‌ న్యూటన్‌ క్వార్టర్లీ, 2వ పేజీ.

  •   కింగ్డమ్‌ ఇంటర్లీనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద గ్రీక్‌ స్క్రిప్చర్స్‌ ఒక భాగంగా ఉన్న కొత్తలోక అనువాదం గురించి తన అభిప్రాయాన్ని చెప్తూ సహాయక ప్రొఫెసర్‌ థామస్‌ ఎన్‌. విటర్‌ ఇలా రాశాడు, “ఈ అనువాద కమిటీ చేసిన అనువాదంలో అన్ని వివరాలతోపాటు ఖచ్చితత్వం కూడా ఉంది.ఏప్రిల్‌-మే 1974 ద క్లాసికల్‌ జర్నల్‌, 376వ పేజీ.

  •   ఇజ్రాయిల్‌లో హెబ్రీ స్కాలర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ బెంజమీన్‌ కదార్‌ 1989లో ఇలా చెప్పాడు, “హెబ్రీ బైబిలు, దాని అనువాదాలకు సంబంధించిన భాషపై నేను పరిశోధన చేస్తున్నప్పుడు కొత్తలోక అనువాదం అనే పేరుతో ఉన్న ఇంగ్లీషు ఎడిషన్‌ని ఎక్కువగా చూస్తుంటాను. అలా ఆ బైబిల్ని చూస్తున్నప్పుడు, సమాచారాన్ని వీలైనంత ఖచ్చితంగా అర్థమైయ్యేలా అనువదించడానికి అనువాదకులు ఎంతో నిజాయితీగా కష్టపడ్డారని నాకు చాలాసార్లు అనిపించింది.”

  •   మతం గురించి అధ్యాయనం చేస్తున్న సహాయక ప్రొఫెసర్‌ జేసన్‌ డేవిడ్‌ బీడూన్‌, తొమ్మిది ప్రధాన ఇంగ్లీషు అనువాదాలను పరిశీలించిన తర్వాత ఇలా రాశాడు, “వేరే అనువాదాలతో పోలిస్తే NW [కొత్తలోక అనువాదమే] అన్నిటికన్నా ఖచ్చితంగా ఉంది.” అయితే సామాన్య ప్రజలు అలాగే చాలామంది బైబిలు నిపుణలు, కొత్తలోక అనువాదాన్ని అనువదించిన వాళ్లకు మతపరమైన పక్షపాతం ఉండడంవల్లే ఈ అనువాదంలో తేడాలు ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, బీడూన్‌ మాత్రం “కొత్తనిబంధన రచయితలు అప్పట్లో రాసిన విధానాన్ని ఉన్నదున్నటు, ఏం మార్చకుండా NWలో చాలా ఖచ్చితంగా అనువదించడమే ఇన్ని తేడాలు ఉండడానికి కారణం” అని చెప్పాడు.—ట్రూత్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌, 163, 165 పేజీలు.

a దీనిలో ఉన్న విషయాలన్నీ, కొత్తలోక అనువాదం బైబిల్ని 2013లో రివైజ్‌ చేయకముందు ఉన్న ఎడిషన్‌ల గురించి.

b ఉదాహరణకు న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌ అలాగే కాథోలిక్‌ న్యూ జెరూసలెమ్‌ బైబిల్‌ చూడండి. అదనంగా చేర్చిన వచనాలు ఏమిటంటే, మత్తయి 17:21; 18:11; 23:14; మార్కు 7:15; 9:44, 45; 11:25; 15:28; లూకా 17:35; 23:17; యోహాను 5:4; అపొస్తలుల కార్యాలు 8:37; 15:34; 24:7; 28:29. రోమీయులు 15:24. కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో అలాగే డుయే రీమ్స్‌ వర్షన్‌లో 1 యోహాను 5:7, 8 వచనాల్లో త్రిత్వానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి. వాటిని బైబిల్ని రాసిన వందల సంవత్సరాల తర్వాత ఆ వర్షన్‌లలో చేర్చారు.

c అదేవిధంగా, జె. బి. ఫిలిప్స్‌ అనువాదం యేసు చెప్పిన మాటల్ని ‘దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరత తమకుందని గుర్తించిన వాళ్లు’ అని అనువదించింది. అలాగే ద ట్రాన్స్‌లేటర్స్‌ న్యూ టెస్ట్మెంట్‌ ఆ పదబంధాలను ‘తమ అధ్యాత్మిక అవసరతను గుర్తించినవాళ్లు’ అని అనువదించింది.