కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | తల్లిదండ్రులు

మీ పిల్లలకు ఓపిగ్గా ఉండడం నేర్పించండి

మీ పిల్లలకు ఓపిగ్గా ఉండడం నేర్పించండి

సమస్య

మీ ఆరేళ్లబ్బాయి ఏదైనా ఇచ్చేంతవరకు కొంచెం కూడా ఓపిక చూపించట్లేదు, మొండికేస్తున్నాడు. ఏదైనా కనబడితే చాలు వాడికది కావాలి, అప్పటికప్పుడు కావాల్సిందే! ఒకవేళ కోపం వస్తే కొన్నిసార్లు కాళ్లు, చేతులు కొట్టుకుంటూ అరుస్తాడు. ‘మామూలుగానే పిల్లలంతా ఇలానే ఉంటారా?’ అని మీకనిపించవచ్చు. ‘చిన్నపిల్లాడే కదా అని వదిలేయాలా? లేక ఓపికగా ఉండడం, మొండి చేయకుండా ఉండడం ఇప్పటి నుండే నేర్పించాలా?’ a

మీరు తెలుసుకోవాల్సినవి

ఈ రోజుల్లో చాలామంది ఓపిక చూపించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉన్నారు. “ఇప్పుడున్న కల్చర్‌లో (సంస్కృతిలో) మనకు ఏది నచ్చితే అదే చేయాలి అనేమాట ఎక్కువగా వినబడుతోంది” అని డాక్టర్‌ డేవిడ్‌ వాల్ష్‌ అన్నాడు. “కొంతమంది ఎదుటి వాళ్ల మేలు కోరి తమ సొంత అనుభవంతో, జ్ఞానంతో సలహాలిస్తారు, ఇంకొంతమంది డబ్బు కోసం పనికిరాని సలహాలిస్తారు. వీళ్లంతా ‘మనకు ఏది అనిపిస్తే అది చేసెయ్యాలి’ అనే చెప్తుంటారు.” b

చిన్నప్పటి నుండే నేర్పించడం చాలా ముఖ్యం. పరిశోధకులు 4 ఏళ్ల లోపు పిల్లలు కొంతమందిని చాలాకాలం పాటు అధ్యయనం చేశారు. వాళ్లకు ఒక స్వీట్‌ ఇచ్చి, వాళ్లు కావాలంటే దాన్ని అప్పుడే తినవచ్చు లేదా కాసేపాగి తినవచ్చని చెప్పారు. కాసేపు ఓపిగ్గా ఆగి తర్వాత తింటే వాళ్లకు ఇంకో స్వీట్‌ కూడా ఇస్తాం అని చెప్పారు. తర్వాత కాలేజ్‌కు వెళ్లే వయసొచ్చాక ఈ పిల్లల్లో ఎవరైతే ఓపిక చూపించారో వాళ్లు మిగతా వాళ్లకంటే చదువుల్లో ముందున్నారని, మానసికంగా దృఢంగా ఉన్నారని, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది.

నేర్పించకపోతే ఆ తర్వాత పిల్లలకు చాలా ఇబ్బందులు రావచ్చు. జీవితంలో వాళ్లు చూసినవాటిని బట్టి పిల్లల మెదడు పనితీరు మారుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు. దాన్ని వివరిస్తూ డాక్టర్‌ డాన్‌ కిండ్లోన్‌ ఇలా రాశాడు: “అడిగిన వెంటనే మన పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే, ఇచ్చేంత వరకు ఓపిగ్గా ఆగడం నేర్పించకపోతే, మొండికేయడం మాన్పించకపోతే వాళ్లను మానసికంగా బలమైనవాళ్లుగా చేసే మార్పులు మెదడులో జరగవు.” c

ఏమి చేయవచ్చు

మీరు చేసి చూపించండి. పెద్దవాళ్లుగా మీరు ఎలా ఓపిక చూపిస్తున్నారు? ట్రాఫిక్‌ ఆగిపోయినప్పుడు మీకు కోపం వస్తుందా? షాపులో లైన్లో నుంచున్నప్పుడు మీరు అందరిని దాటుకుని ముందుకు వెళ్లిపోడానికి ప్రయత్నిస్తారా? వేరేవాళ్లు మాట్లాడుతుంటే మధ్యలో ఆపుతారా? ఇలాంటి వాటన్నిటిని మీ పిల్లలు చూస్తుంటారు. “కాబట్టి మీ పిల్లలకు ఓపిక నేర్పించడానికి అన్నిటికన్నా మంచి మార్గం, ముందు మీరు ఓపిక చూపించడమే” అని కిండ్లోన్‌ అన్నారు.—మంచి సలహా: రోమీయులు 12:9.

ఓపికగా ఉండకపోతే ఏమి జరుగుతుందో మీ పిల్లలకు తెలియాలి. మనకిష్టమైనవన్నీ కావాలని మొండి చేస్తే నష్టం ఏంటి? మొండి చేయకపోతే లాభం ఏంటి? అనే విషయాలు మీ పిల్లల వయసుకు తగ్గట్లుగా వాళ్లకు అర్థమయ్యేలా నేర్పించాలి. ఎవరైనా ఏడిపించినప్పుడు కోపం వస్తే: ‘వెళ్లి గొడవపడితే బాగుంటుందా? లేదా ఒకటి నుండి పది వరకు లెక్కపెట్టుకుని కోపం తగ్గించుకోవడం గానీ అక్కడి నుండి వెళ్లిపోవడం గానీ చేస్తే బాగుంటుందా’ అని ఆలోచించుకుని, ఆ ప్రకారం చేయడానికి మీ పిల్లలకు సహాయం చేయండి.—మంచి సలహా: గలతీయులు 6:7.

మెచ్చుకోండి. మీ పిల్లలు ఓపిక చూపిస్తే మెచ్చుకోండి. మనకు నచ్చింది చేయకుండా ఉండడం అంత సులువేం కాదు. కానీ అలా చేయకుండా ఉండేవాళ్లు నిజంగా బలమైన వాళ్లని మీ పిల్లలకు చెప్పండి. కోపాన్ని అదుపు చేసుకోలేనివాడు గోడలు కూలిపోయిన పట్టణంలా బలహీనుడు, శాంతంగా ఉండేవాడు పరాక్రమశాలి కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది.—సామెతలు 25:28; 16:32.

ఓపికను నేర్పించండి. సరదాగా ఆటలు ఆడుతూ మీ పిల్లలకు ఓపిక నేర్పించవచ్చు. వాళ్ల కోసం ఆటల్ని మీరే సృష్టించవచ్చు. ఉదాహరణకు “నువ్వయితే ఏం చేస్తావు?” అని పిల్లలకు సాధారణంగా ఎదురయ్యే కొన్ని పరిస్థితుల గురించి చెప్పి ఆ పరిస్థితుల్లో వాళ్లేం చేస్తారో చేసి చూపించమనండి. వాటిలో “ఏది మంచి పనో, ఏది చెడ్డ పనో” వాళ్లతోనే చెప్పించండి. రకరకాలుగా ఆటలు ఆడిస్తూ నేర్పించండి: తోలుబొమ్మలు చేసి, బొమ్మలు గీసి, ఇంకా ఏమైనా చేసి మీ పిల్లలకు నచ్చేలా, వాళ్లు నేర్చుకునేలా చేయండి. ఇష్టం వచ్చినట్లు చేయడం, మొండికేయడం కన్నా ఓపికగా ఉండడం మంచిదని మీ పిల్లలకు నేర్పించండి.—మంచి సలహా: సామెతలు 29:11.

ఓపికతో ఉండండి. “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అని దేవుని వాక్యం చెప్తుంది. (సామెతలు 22:15) కాబట్టి మీ పిల్లలు ఒక్క రోజులోనే ఓపిక చూపించడం నేర్చేసుకుంటారని అనుకోకండి. “కొన్నిసార్లు చెప్పినట్టు చేయకపోయినా, నిదానంగా, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. చివరకు మంచి ఫలితాలు వస్తాయి” అని టీచ్‌ యువర్‌ చిల్డ్రన్‌ వెల్‌ అనే పుస్తకం చెప్తుంది. కానీ మీ కష్టానికి ఫలితం ఉంటుంది. “12 సంవత్సరాలకే మాదక ద్రవ్యాలు ఇచ్చినా వద్దనే శక్తి, 14 సంవత్సరాలకే శారీరక కోరికలను అదుపు చేసుకునే శక్తి వాళ్లకు వస్తుంది” అని కూడా ఆ పుస్తకం చెప్తుంది. ◼ (g15-E 08)

a ఇక్కడ మేము అబ్బాయి అన్నాగానీ ఇందులో ఉన్న విషయాలు అమ్మాయిలకు కూడా ఉపయోగపడతాయి.

b నో: వై కిడ్స్‌—ఆఫ్‌ ఆల్‌ ఏజెస్‌—నీడ్‌ టు హియర్‌ ఇట్‌ అండ్‌ వేస్‌ పేరెంట్స్‌ కెన్‌ సే ఇట్‌ పుస్తకం నుండి తీసుకున్న మాటలు.

c టూ మచ్‌ ఆఫ్‌ ఎ గుడ్‌ థింగ్‌—రెయిజింగ్‌ చిల్డ్రన్‌ ఆఫ్‌ క్యారెక్టర్‌ ఇన్‌ యాన్‌ ఇండల్జంట్‌ ఏజ్‌ అనే పుస్తకం నుండి తీసుకున్నారు.