కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1

నిగ్రహం చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలు

నిగ్రహం చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలు

నిగ్రహం చూపించడం (ఆత్మనిగ్రహం) అంటే ఏంటి?

నిగ్రహం చూపించడం అంటే

  • కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలని కాకుండా వాటికోసం ఎదురుచూడడం

  • ఎలా అనిపిస్తే అలా ప్రవర్తించకుండా ఉండడం

  • ఇష్టంలేని పనులు కూడా చేయడం

  • సొంత అవసరాల కంటే ఎదుటివాళ్ల అవసరాలకు ఎక్కువ విలువ ఇవ్వడం

నిగ్రహం చూపించడం ఎందుకు ముఖ్యం?

మంచి నిగ్రహాన్ని చూపించే పిల్లలు చెడు ప్రలోభాలకు లొంగిపోరు, అలాంటి పనులు కాసేపు ఆనందాన్ని కలిగిస్తాయన్నా వాళ్లు వాటికి దూరంగా ఉంటారు. కానీ సరైన నిగ్రహంలేని పిల్లలు ఎక్కువగా

  • ఆవేశంగా ఉంటారు

  • డిప్రెషన్‌తో బాధపడతారు

  • సిగరెట్లు తాగుతారు, లేదా తాగుడుకు, మాదకద్రవ్యాలకు బానిసలు అవుతారు

  • ఆహార నియమాలు పాటించకుండా ఏది పడితే అది తింటారు

మంచి నిగ్రహాన్ని చూపించే పిల్లలకు పెద్దవాళ్లయ్యాక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని, చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవడం కూడా తక్కువేనని ఒక పరిశోధనలో తెలుసుకున్నారు. ఆ పరిశోధనను బట్టి యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో ఉన్న ప్రొఫెసర్‌ ఏంజల డక్‌వర్త్‌ ఇలా అన్నారు: “నిగ్రహం వల్ల నష్టం అంటూ ఉండదు.”

నిగ్రహం చూపించడం పిల్లలకు ఎలా నేర్పించాలి

వద్దు అని చెప్పడం నేర్చుకోండి, దానికి కట్టుబడి ఉండండి.

మంచి సూత్రాలు: “మీ మాట ‘అవును’ అంటే అవును, ‘కాదు’ అంటే కాదు అన్నట్టే ఉండాలి.”—మత్తయి 5:37.

చిన్న పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల నిర్ణయాన్ని పరీక్షించవచ్చు. వాళ్లు బహుశా అందరిముందు ఏడుస్తూ మొండికేయవచ్చు. తల్లిదండ్రులు వాళ్లు అడిగింది ఇచ్చేస్తే, ఇంక పిల్లలు తల్లిదండ్రులు వద్దు అన్నప్పుడల్లా దాన్ని మార్చడానికి మొండికేయడం నేర్చుకుంటారు.

అలా కాకుండా తల్లిదండ్రులు వద్దు అని చెప్పి దానికి కట్టుబడి ఉంటే, పిల్లలు మనం కావాలనుకున్నవన్నీ మనకు అన్నిసార్లు దక్కవు అనే ఒక ముఖ్యమైన వాస్తవాన్ని నేర్చుకుంటారు. ‘కోరుకున్న ప్రతీది పొందేవాళ్లే సంతోషంగా ఉంటారని అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే కోరికల్ని అదుపుచేసుకోవడం నేర్చుకున్నవాళ్లే ఎక్కువ సంతృప్తిగా ఉంటారు. పిల్లలకు, ఈ ప్రపంచంలో ఏది కావాలంటే అది దొరుకుతుందనే విధంగా పెంచడం వల్ల మీరు వాళ్లకు నష్టమే చేస్తున్నారు’ అని డా. డేవిడ్‌ వోల్ష్‌ రాస్తున్నారు. *

మీరు మీ పిల్లలకు ఇప్పుడు వద్దని చెప్తే, పెద్దయ్యాక వాళ్లకు వాళ్లు వద్దని చెప్పుకోవడం నేర్చుకుంటారు. ఉదాహరణకు డ్రగ్స్‌ తీసుకోవాలనే, లేదా పెళ్లికాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకోవాలనే లేదా వేరే చెడ్డ పనులు చేయాలనే ప్రలోభాలు ఎదురైతే వాళ్లు వాటికి వద్దని చెప్పగలుగుతారు.

మీ పిల్లలకు మంచి, చెడు పర్యవసానాలు రెండిటినీ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి.

మంచి సూత్రాలు: “మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు.” —గలతీయులు 6:7.

మీ పిల్లలు చేసే పనులకు పర్యవసానాలు ఉంటాయని, వాళ్లను వాళ్లు అదుపులో ఉంచుకుని నిగ్రహం చూపించకపోతే అనుకోని పర్యవసానాలు వస్తాయని వాళ్లు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీ బాబు అలవాటుగా కోపపడుతున్నాడు అనుకోండి వేరేవాళ్లు అతన్ని దూరం పెట్టవచ్చు. అలా కాకుండా ఆయనకు కోపం వచ్చినా తనను తాను అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటే లేదా వేరే వాళ్లను తొందరపెట్టకుండా ఓపికగా ఉండడం నేర్చుకుంటే అందరూ ఆయనకి దగ్గర అవుతారు. వాళ్లను వాళ్లు అదుపు చేసుకోవడం నేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మీ పిల్లలు నేర్చుకునేలా వాళ్లకు సహాయం చేయండి.

ఏది ముఖ్యమో తెలుసుకునేలా మీ పిల్లలకు నేర్పించండి.

మంచి సూత్రాలు: ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మీరు పరిశీలించి తెలుసుకోవాలి.—ఫిలిప్పీయులు 1:10.

ఆత్మనిగ్రహం లేదా నిగ్రహం చూపించడం అంటే కేవలం తప్పుచేయకుండా మనల్ని మనం ఆపుకోవడం మాత్రమే కాదు, అవసరమైనవాటిని చేయడం అని అర్థం. కొన్నిసార్లు అంత ఆసక్తిగా సరదాగా అనిపించనివాటిని కూడా చేయాల్సి ఉంటుంది. ఏవి ముఖ్యమైనవో, వేటిని ముందు చేయాలో మీ పిల్లలు తెలుసుకోవాలి. తర్వాత వాటిని పూర్తి చేయడం కూడా ముఖ్యం. ఉదాహరణకు ఆటలకు ముందు హోంవర్క్‌ చేయాలి.

మీరు వాళ్లకు మంచి రోల్‌ మోడల్‌గా అంటే మంచి ఆదర్శంగా ఉండాలి.

మంచి సూత్రాలు: “నేను మీకు చేసినట్లే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.”—యోహాను 13:15.

విసుగు పుట్టించే సందర్భాల్లో లేదా ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు గమనిస్తారు. నిగ్రహం చూపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మీ ఆదర్శం ద్వారా చూపించండి. ఉదాహరణకు మీ పిల్లలు మీ సహనాన్ని పరీక్షిస్తే మీరు కోపంతో స్పందిస్తారా లేదా నెమ్మదిగా ఉంటారా?

^ పేరా 20 నో: వై కిడ్స్‌—ఆఫ్‌ ఆల్‌ ఏజెస్‌—నీడ్‌ టు హియర్‌ ఇట్‌ అండ్‌ వేస్‌ పేరెంట్స్‌ కెన్‌ సే ఇట్‌ అనే పుస్తకం నుండి తీసుకోబడింది.