కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం

యేసు నిజంగా జీవించాడా?

యేసు నిజంగా జీవించాడా?

ఆయన ధనవంతుడు కాదు, ఆయనకు అధికారం కూడా లేదు, తనదని చెప్పుకోవడానికి సొంత ఇల్లు కూడా లేదు. కానీ, ఆయన బోధలు లక్షలమందిని మార్చేశాయి. యేసుక్రీస్తు నిజంగా జీవించాడా? ఆధునిక, ప్రాచీన నిపుణులు ఈ విషయంలో ఏమంటున్నారు?

  • మైకల్‌ గ్రాంట్‌ ఒక చరిత్రకారుడు. ప్రాచీన గ్రీకు, రోమా లాంటి నాగరికతల్లో నిపుణుడు. ఆయన ఇలా అన్నాడు: “క్రొత్త నిబంధనను చారిత్రక సమాచారం ఉన్న ఇతర ప్రాచీన రచనలను చూసే ప్రమాణాలతోనే చూడాలి, అలా చూసినప్పుడు చరిత్రలో ఎందరో అన్య వ్యక్తులు నిజంగా ఉన్నారో లేదో అని ప్రశ్నించకుండా ఉన్నట్లే, యేసు నిజంగా ఉన్నాడా లేదా అని కూడా ప్రశ్నించలేము.”

  • రూడాల్ఫ్‌ బుల్ట్‌మాన్‌ క్రొత్త నిబంధన పరిశోధనల్లో ప్రొఫెసర్‌. ఆయన ఇలా చెప్తున్నాడు: “యేసు నిజంగా జీవించాడో లేదో అనే సందేహానికి ఆధారాలు లేవు, అలా సందేహించాల్సిన అవసరం కూడా లేదు. ఒక చారిత్రక ఉద్యమానికి యేసు స్థాపకుడని, దాని మొదటి భాగం పాలస్తీనా ప్రాంతంలో ఉన్న పురాతన [క్రైస్తవ] వర్గమని ఏ తెలివైన వ్యక్తి సందేహించడు.”

  • విల్‌ డ్యూరంట్‌ ఒక చరిత్రకారుడు, రచయిత, తత్త్వవేత్త. ఆయన ఇలా రాశాడు: “అందరికీ నచ్చే లక్షణాలు ఉన్న ఒక గొప్ప మనిషిని, ఉన్నతమైన నమ్మకాలను, మనుషులందరూ ప్రేమ ఐక్యతలతో కుటుంబంగా జీవించాలనే ఒక ఆలోచనను ఒకే తరంలో జీవించిన కొంతమంది సాధారణ మనుషులు [సువార్తలు రాసినవాళ్లు] సొంతగా సృష్టించి ఉంటే, ఈ అద్భుతం సువార్తల్లో ఉన్న ఏ అద్భుతాన్నైనా మించిపోతుంది.”

  • ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ జర్మనీ దేశానికి చెందిన యూదుడు, భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఇలా ప్రకటించాడు: “నేను యూదుడిని, కానీ ఆ నజరేయుడి గొప్ప వ్యక్తిత్వాన్ని బట్టి నేను ఎంతో ముగ్దుడనయ్యాను.” చరిత్రలో యేసు నిజంగా ఉన్నాడని మీరు నమ్ముతారా అని అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: “నిస్సందేహంగా! సువార్తలు చదువుతున్నప్పుడు యేసు నిజంగా ఉన్నాడని ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రతీ మాటలో ఆయన వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ పురాణంలో ఇంత జీవం కనిపించదు.”

    “సువార్తలు చదువుతున్నప్పుడు యేసు నిజంగా ఉన్నాడని ఎవరికైనా తెలిసిపోతుంది.”​—ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

చరిత్ర ఏమి చూపిస్తుంది?

యేసు జీవితం, పరిచర్య గురించి ఎన్నో వివరాలు బైబిలు వృత్తాంతాలైన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనకు కనిపిస్తాయి. ఆ సువార్తలను రాసినవాళ్ల పేర్లే వాటికి పెట్టారు. అంతేకాదు, యేసు గురించి క్రైస్తవులు కాని ఎంతోమంది చెప్పారు.

  • టాసిటస్‌

    (క్రీస్తు శకం లేదా క్రీ.శ. 56-120 దగ్గర్లో) టాసిటస్‌కు పురాతన రోమా చరిత్రకారుల్లో చాలా గొప్ప స్థానం ఉంది. ఇతను రాసిన Annalsలో క్రీ.శ. 14 నుండి క్రీ.శ. 68 వరకు ఉన్న రోమీయుల సామ్రాజ్యం గురించి ఉంది. (యేసు క్రీ.శ. 33లో చనిపోయాడు.) క్రీ.శ. 64లో వచ్చిన పెద్ద అగ్ని ప్రమాదం వల్ల రోము నాశనం అయినప్పుడు, అందుకు కారణం నీరో చక్రవర్తి అని అనుకున్నారని టాసిటస్‌ రాశాడు. కానీ నీరో, “ఆ పుకారును తీసేసుకోవడానికి” ఆ నిందను క్రైస్తవుల మీద వేశాడు అని కూడా టాసిటస్‌ రాశాడు. తర్వాత ఇలా రాశాడు: “[క్రైస్తవ] అనే పేరుకు స్థాపకుడైన క్రిస్తుస్‌కు తిబెరి పరిపాలన కాలంలో అధిపతి అయిన పొంతి పిలాతు మరణ శిక్ష విధించాడు.”—Annals, XV, 44.

  • స్యుటోనియస్‌

    (క్రీ.శ. 69 దగ్గర్లో నుండి క్రీ.శ. 122 తర్వాత వరకు) లైవ్స్‌ ఆఫ్‌ ద సీసర్స్‌ (Lives of the Caesars) అనే తన పుస్తకంలో ఈ రోమా చరిత్రకారుడు మొదటి 11 రోమా చక్రవర్తుల పరిపాలనల్లో జరిగిన సంఘటనలు రాశాడు. క్లౌదియ గురించి రాసిన భాగంలో, రోములో యూదుల మధ్య నెలకొన్న అల్లకల్లోలం గురించి ఉంది. బహుశా అది యేసు విషయంలో తలెత్తి ఉంటుంది. (అపొస్తలుల కార్యములు 18:2) స్యుటోనియస్‌ ఇలా రాశాడు: “క్రిస్తుస్‌ కారణంగా యూదులు గొడవలు చేస్తున్నారని ఆయన [క్లౌదియ] వాళ్లను రోము నుండి బహిష్కరించాడు.” (The Deified Claudius, XXV, 4) యేసు వల్ల గొడవలు వస్తున్నాయని తప్పుగా నిందించినా యేసు నిజంగా ఉన్నాడా లేదా అని మాత్రం స్యుటోనియస్‌ సందేహించలేదు.

  • ప్లైనీ ద యంగర్‌

    (క్రీ.శ. 61 దగ్గర్లో-క్రీ.శ. 113) ఈ రోమా రచయిత బితూనియలో (ఇప్పుడు టర్కీ) అధికారి. ఆయన రోమా చక్రవర్తి ట్రాజన్‌కు ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులతో ఎలా వ్యవహరించాలో రాశాడు. క్రైస్తవులను రాజీపడమని బలవంత పెట్టానని, ఒప్పుకోని వాళ్లను చంపేశానని ప్లైనీ చెప్పాడు. ఆయన ఇలా వివరించాడు: “నాతోపాటు [అన్య] దేవతలకు ప్రార్థించి, ద్రాక్షారసం, సాంబ్రాణితో మీ విగ్రహాన్ని పూజించి, చివరకు క్రీస్తును శపించిన వాళ్లను . . . వదిలేయడం సరైనదని నేను నిర్ణయించాను.”—ప్లైనీLetters, Book X, XCVI.

  • ఫ్లేవియస్‌ జోసిఫస్‌

    (క్రీ.శ. 37 దగ్గర్లో-క్రీ.శ. 100) ఇతను యూదా యాజకుడు, చరిత్రకారుడు. రాజకీయ విషయాల్లో పలుకుబడిని చూపించుకుంటూ ఉండే యూదా ప్రధాన యాజకుడైన అన్నా ఏం చేశాడో చెప్తూ జోసిఫస్‌ ఇలా రాశాడు, “సమాజమందిరపు [యూదుల హైకోర్ట్‌] న్యాయాధిపతులను పిలిపించి, వాళ్ల ఎదుట యేసుకు తమ్ముడైన యాకోబు అనే అతన్ని నిలబెట్టాడు.”—Jewish Antiquities, XX, 200.

  • టాల్‌ముడ్‌

    ఇది క్రీ.శ. మూడవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం వరకు యూదా రబ్బీలు రాసిన రచనల సముదాయం. యేసు నిజంగా జీవించిన విషయాన్ని ఆయన శత్రువులు కూడా నమ్మారని వీటిలో తెలుస్తుంది. అందులో ఒక చోట ఇలా ఉంది: “పస్కా పండుగ రోజున నజరేయుడైన యేషుని [యేసు] వ్రేలాడదీశారు,” ఇది చారిత్రకంగా ఖచ్చితం. (Babylonian Talmud, Sanhedrin 43a, Munich Codex; యోహాను 19:14-16 చూడండి.) అందులో ఇంకో చోట ఇలా ఉంది: “ఈ నజరేయుడిలా బహిరంగంగా తనను తాను అవమానపర్చుకునే విద్యార్థిని గానీ కొడుకుని గానీ మనం తయారు చేయకూడదు.” యేసును నజరేయుడని తరచుగా పిలిచేవాళ్లు.—Babylonian Talmud, Berakoth 17b, footnote, Munich Codex; లూకా 18:37 చూడండి.

బైబిలులో ఉన్న ఆధారాలు

యేసు జీవితం, ఆయన చేసిన పరిచర్య గురించి సువార్తల్లో వివరంగా ఉంది. అప్పుడు ఉన్న మనుషులు, ప్రాంతాలు, సమయం గురించి చిన్నచిన్న వివరాలు కూడా ఉన్నాయి. ఖచ్చితమైన చరిత్రలో ఇవి చాలా ముఖ్యం. ఉదాహరణకు లూకా 3:1, 2లో యేసుకు ముంగుర్తుగా ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను తన పనిని ఖచ్చితంగా ఏ సమయంలో మొదలుపెట్టాడో ఉంది.

“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము.” —2 తిమోతి 3:16, 17

లూకా ఇలా రాశాడు: “తిబెరి కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, అన్నయు, కయపయు ప్రధానయాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహానునొద్దకు దేవుని వాక్యము వచ్చెను.” ఈ ఖచ్చితమైన, స్పష్టమైన వివరాలను బట్టి “యోహానునొద్దకు దేవుని వాక్యము” క్రీ.శ. 29లో వచ్చిందని మనకు తెలుస్తుంది.

లూకా చెప్పిన ఏడుగురు అధికారుల పేర్లు చరిత్రకారులకు బాగా తెలుసు. కొంత కాలం వరకు విమర్శకులు పొంతి పిలాతు, లుసానియ నిజంగా ఉన్నారో లేదో అని ప్రశ్నించారు. కానీ, వాళ్లు తొందరపడి మాట్లాడారు. ఎందుకంటే ఆ ఇద్దరు అధికారుల పేర్లు ఉన్న పురాతన చిహ్నాలను కనుగొన్నారు. వాటి వల్ల లూకా రాసిన విషయాలు ఖచ్చితమైనవని రుజువైంది. a

తెలుసుకోవడం ఎందుకు అవసరం?

ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే ప్రభుత్వమైన దేవుని రాజ్యం గురించి యేసు ప్రజలకు నేర్పించాడు

యేసు చెప్పిన బోధలు అవసరం కాబట్టి ఆయన నిజంగా జీవించాడో లేదో తెలుసుకోవడం అవసరం. ఉదాహరణకు సంతోషంగా, సంతృప్తిగా జీవించాలంటే ఏం చేయాలో యేసు ప్రజలకు నేర్పించాడు. b అంతేకాదు దేవుని రాజ్యం అనే ఒకే ప్రభుత్వం కింద మనుషులంతా ఐక్యమై, నిజమైన శాంతిభద్రతలతో జీవించే కాలం వస్తుందని ఆయన మాటిచ్చాడు.—లూకా 4:43.

దేవుని రాజ్యం అనే మాట సరైనదే ఎందుకంటే ఈ ప్రభుత్వం భూమిని పరిపాలించే సర్వ హక్కులు దేవునికే ఉన్నాయని చూపిస్తుంది. (ప్రకటన 11:15) మాదిరి ప్రార్థనలో యేసు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు, ఆయన ఇలా చెప్పాడు: “పరలోకమందున్న మా తండ్రీ, . . . నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము . . . భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9, 10) ఆ రాజ్య పరిపాలన వల్ల మనుషులకు ఏం జరుగుతుంది? కింది వాటిని చూడండి:

  • యుద్ధాలు, అంతర్యుద్ధాలు ఇక ఉండవు.కీర్తన 46:8-11.

  • అవినీతి, దురాశతోపాటు ఎలాంటి దుష్టత్వం ఇక కనిపించదు. భక్తిలేని వాళ్లు ఇంక ఉండరు.కీర్తన 37:10, 11.

  • ఆ రాజ్యంలో ఉండేవాళ్లు సంతృప్తికరమైన, ఫలవంతమైన పని చేస్తారు.యెషయా 65:21, 22.

  • ప్రస్తుతం పాడైన స్థితిలో ఉన్న భూమి బాగై, సమృద్ధిగా పంటను ఇస్తుంది.కీర్తన 72:16; యెషయా 11:9.

కొంతమంది ఈ మాటలు ఆశపడేంత వరకే అంటారు. కానీ, మానవ ప్రయత్నాల మీద నమ్మకం పెట్టుకోవడం తీరని ఆశ కాదా? ఒకసారి ఆలోచించండి: విద్య, సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో ఎంత అభివృద్ధి జరిగినా నేడు లక్షలమంది రేపటి గురించి భయంతో, చింతతో జీవిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, మతపరమైన అణచివేత, దురాశ, అవినీతి గురించి మనం రోజూ చూస్తున్నాం. కాబట్టి మనుషుల పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది అనేది నిజం.—ప్రసంగి 8:9.

యేసు నిజంగా జీవించాడో లేదో తెలుసుకోవడం ఎంతైనా మంచిదే. c ఎందుకంటే 2 కొరింథీయులు 1:19, 20 ప్రకారం దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తు ద్వారా నిజం అయ్యాయి. ◼ (g16-E No. 5)

a లుసానియ అనే చతుర్థాధిపతి లేదా “అధిపతి” పేరు మీదున్న చిహ్నం కనుగొన్నారు. (లూకా 3:1) సరిగ్గా లూకా చెప్పిన సమయంలోనే ఆయన అబిలేనేను పరిపాలించాడు.

b యేసు బోధల్లో కొన్ని మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో ఉన్నాయి. వీటిని ఎక్కువగా కొండ మీద ప్రసంగం అని పిలుస్తారు.

c యేసు, ఆయన బోధల గురించి ఇంకా సమాచారం కోసం www.pr418.com వెబ్‌సైట్‌లో బైబిలు బోధలు >బైబిలు ప్రశ్నలకు జవాబులు చూడండి.