కంటెంట్‌కు వెళ్లు

యేసుక్రీస్తు ఉన్నాడని విద్వాంసులు నమ్ముతున్నారా?

యేసుక్రీస్తు ఉన్నాడని విద్వాంసులు నమ్ముతున్నారా?

 యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మడానికి విద్వాంసులకు గట్టి ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి, తొలి క్రైస్తవుల గురించి మొదటి రెండు శతాబ్దాల్లోని చరిత్రకారులు చెప్పిన వృత్తాంతాల ఆధారంగా ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 2002 సంచిక ఇలా చెబుతుంది: “పూర్వకాలంలోని క్రైస్తవమత వ్యతిరేకులు సహితం చరిత్రలో యేసుక్రీస్తు ఉన్నాడనే విషయాన్ని ఎన్నడూ సందేహించలేదని వేర్వేరు వృత్తాంతాలు నిరూపిస్తున్నాయి. కానీ, 18వ శతాబ్దం చివర్లో, 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దం ఆరంభంలో, మొదటిసారిగా ఆయన ఉన్నాడనే విషయంలో వివాదాలు మొదలయ్యాయి.”

 2006లో రాసిన జీసస్‌ అండ్‌ ఆర్కియాలజీ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “యోసేపు కుమారుడైన యేసు అనే యూదుని గురించి పేరున్న విద్వాంసులెవరూ ప్రశ్నించరు. వాళ్లలో ఎక్కువమంది ఆయన చేసిన బోధలు, పనుల గురించి తెలుసని వెంటనే అంగీకరిస్తున్నారు.”

 యేసుక్రీస్తు ఒక నిజమైన వ్యక్తని బైబిలు స్పష్టంగా చెబుతుంది. ఆయన సొంత కుటుంబం, వంశం గురించి బైబిలు స్పష్టమైన సమాచారం ఇస్తుంది. (మత్తయి 1:1; 13:55) ఇంకా యేసు కాలంలో పరిపాలించిన ప్రముఖుల పేర్లు కూడ బైబిల్లో ఉన్నాయి. (లూకా 3:1, 2) ఈ వివరాలన్నీ బైబిలు వృత్తాంతాల ఖచ్చితత్వం పరిశీలించేందుకు విద్వాంసులకు సహాయం చేస్తాయి.