కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యెషయా 60:1లో ఉన్న “స్త్రీ” ఎవరు? ఆమె ఎలా ‘లేచి వెలుగు ప్రసరించింది’?

యెషయా 60:1 లో ఇలా ఉంది: “ఓ స్త్రీ, లే! లేచి వెలుగు ప్రసరించు, ఎందుకంటే నీకు వెలుగు వచ్చేసింది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తోంది.” ఈ లేఖన సందర్భాన్నిబట్టి చూస్తే “స్త్రీ” ఒకప్పటి యూదాకు రాజధానియైన సీయోను లేదా యెరూషలేమును సూచిస్తుంది. a (యెష. 60:14; 62:1, 2) ఆ నగరం ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి ప్రాతినిధ్యం వహించింది. యెషయా చెప్పిన మాటల్నిబట్టి మనకు రెండు ప్రశ్నలు వస్తాయి. ఒకటి, యెరూషలేము ఎప్పుడు, ఎలా “లేచి” ఆధ్యాత్మిక వెలుగు ప్రసరించింది? రెండు, యెషయా చెప్పిన మాటలు మన కాలంలో గొప్ప స్థాయిలో నెరవేరతాయా?

యెరూషలేము ఎప్పుడు, ఎలా “లేచి” ఆధ్యాత్మిక వెలుగు ప్రసరించింది? యూదులు 70 సంవత్సరాలపాటు బబులోను చెరలో ఉన్నప్పుడు యెరూషలేము, దాని ఆలయం శిథిలావస్థలో ఉంది. కానీ మాదీయ పారసీక రాజైన కోరెషు బబులోనును జయించినప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదలయ్యారు. వాళ్లు తమ స్వదేశానికి తిరిగొచ్చి, సత్యారాధనను మళ్లీ మొదలుపెట్టారు. (ఎజ్రా 1:1-4) క్రీ.పూ. 537 మొదలుకొని 12 గోత్రాల్లో మిగిలిన నమ్మకమైన వాళ్లందరూ అలా తిరిగి రావడం మొదలుపెట్టారు. (యెష. 60:4) వాళ్లు యెహోవాకు బలులు ఇవ్వడం, పండుగలు జరుపుకోవడం, ఆలయాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు. (ఎజ్రా 3:1-4, 7-11; 6:16-22) ఇంకోసారి యెహోవా మహిమ యెరూషలేము మీద అంటే, పునరుద్ధరించబడిన ప్రజల మీద ప్రసరించింది. దానివల్ల యెహోవా ఎవరో తెలియని ప్రజలకు వాళ్లు ఒక వెలుగులా మారారు.

అయితే, పునరుద్ధరించడం గురించి యెషయా చెప్పిన ప్రవచనాలు అప్పట్లో కొంత వరకే నెరవేరాయి. చాలామంది ఇశ్రాయేలీయులు తర్వాత్తర్వాత యెహోవా మాట వినలేదు. (నెహె. 13:27; మలా. 1:6-8; 2:13, 14; మత్త. 15:7-9) ఆ తర్వాత, వాళ్లు మెస్సీయ అయిన యేసుక్రీస్తును కూడా తిరస్కరించారు. (మత్త. 27:1, 2) క్రీ.శ. 70 లో యెరూషలేము, దాని ఆలయం రెండోసారి నాశనమైంది.

అలా జరుగుతుందని యెహోవా ముందే చెప్పాడు. (దాని. 9:24-27) యెషయా 60వ అధ్యాయంలోని పునరుద్ధరించడం గురించిన ప్రవచనాల్లో ప్రతీది భూమ్మీదున్న యెరూషలేము విషయంలో నెరవేరడం యెహోవా ఉద్దేశం కాదని స్పష్టంగా తెలుస్తుంది.

యెషయా చెప్పిన మాటలు మన కాలంలో గొప్ప స్థాయిలో నెరవేరతాయా? అవును. కానీ ఇంకో సూచనార్థక స్త్రీ విషయంలో అవి నెరవేరుతాయి. ఆమె“పైనున్న యెరూషలేము.” అపొస్తలుడైన పౌలు ఆమె గురించి చెప్తూ “ఆమె మన తల్లి” అని అన్నాడు. (గల. 4:26) పైనున్న యెరూషలేము అంటే నమ్మకమైన పరలోక ప్రాణులతో ఉన్న దేవుని సంస్థలోని పరలోక భాగం. ఆమె పిల్లలో యేసు అలాగే పౌలులా పరలోక నిరీక్షణ ఉన్న 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులు ఉన్నారు. వాళ్లందర్నీ కలిపి “పవిత్ర జనం,” “దేవుని ఇశ్రాయేలు” అని బైబిలు పిలుస్తుంది.—1 పేతు. 2:9; గల. 6:16.

పైనున్న యెరూషలేము ఎలా “లేచి” తన ‘వెలుగు ప్రసరించింది’? ఆమె తన పిల్లలైన భూమ్మీది అభిషిక్త క్రైస్తవుల ద్వారా అలా చేసింది. వాళ్లకు ఎదురైన అనుభవాలకు, యెషయా 60వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలకు మధ్య ఎలాంటి పోలికలు ఉన్నాయో గమనించండి.

అభిషిక్త క్రైస్తవులు ‘లేవాల్సిన’ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందే చెప్పినట్టు, క్రీ.శ. రెండో శతాబ్దంలో మతభ్రష్టత్వం అనే గురుగుల వల్ల వాళ్లు ఆధ్యాత్మిక చీకట్లోకి వెళ్లారు. (మత్త. 13:37-43) అలా వాళ్లు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనుకు బందీలు అయ్యారు. అభిషిక్త క్రైస్తవులు “ఈ వ్యవస్థ ముగింపు” వరకు, అంటే 1914 వరకు అలా బందీలుగానే ఉన్నారు. (మత్త. 13:39, 40) కొంతకాలానికి అంటే 1919 లో వాళ్లు విడుదలైన వెంటనే దేవుని రాజ్యం గురించి ఎక్కువగా ప్రకటించడం ద్వారా వాళ్లు ఆధ్యాత్మిక వెలుగును ప్రసరించడం మొదలుపెట్టారు. b సంవత్సరాలు గడుస్తుండగా అన్ని దేశాల ప్రజలు ఆ వెలుగులోకి వచ్చారు. ఆఖరికి, దేవుని ఇశ్రాయేలులో మిగిలినవాళ్లు అంటే యెషయా 60:3 లో ప్రస్తావించిన “రాజులు” కూడా ఆ వెలుగులోకి వచ్చారు.—ప్రక. 5:9, 10.

భవిష్యత్తులో, అభిషిక్త క్రైస్తవులు యెహోవా నుండి వచ్చే వెలుగును ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రసరిస్తారు. ఎలా? వాళ్లు తమ భూజీవితాన్ని ముగించుకుని, “కొత్త యెరూషలేములో” భాగమౌతారు లేదా క్రీస్తు పెళ్లి కూతురైన 1,44,000 మంది సహరాజుల్లో, యాజకుల్లో ఒకరౌతారు.—ప్రక. 14:1; 21:1, 2, 24; 22:3-5.

యెషయా 60:1 లోని మాటల నెరవేర్పులో కొత్త యెరూషలేము ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. (యెషయా 60:1, 1, 3, 5, 11, 19, 20 ని ప్రకటన 21:2, 9-11, 22-26 తో పోల్చండి.) భూమ్మీది యెరూషలేము ఒకప్పటి ఇశ్రాయేలులోని ప్రభుత్వానికి కేంద్రంగా ఉంది. అదేవిధంగా, కొత్త యెరూషలేము అలాగే యేసుక్రీస్తు కొత్త వ్యవస్థలోని ప్రభుత్వంగా ఏర్పడతారు. మరి, కొత్త యెరూషలేము “పరలోకంలోని దేవుని దగ్గర నుండి” ఎలా దిగి వస్తుంది? భూమ్మీది మనుషుల మీద దృష్టి పెట్టి, వాళ్ల మీద తన వెలుగు ప్రసరించడం ద్వారా. అన్ని దేశాల నుండి దేవునికి భయపడే ప్రజలు దాని “వెలుగులో” నడుస్తారు. అలాగే వాళ్లు పాపం, మరణం నుండి కూడా విడిపించబడతారు. (ప్రక. 21:3, 4, 24) ఫలితంగా, యెషయా అలాగే మిగతా ప్రవక్తలు ముందే చెప్పినట్టు అన్ని విషయాలు పునరుద్ధరించబడతాయి. (అపొ. 3:21) ఆ గొప్ప పునరుద్ధరణ పని యేసుక్రీస్తు రాజు అవ్వడంతో మొదలైంది, అది తన వెయ్యేండ్ల పరిపాలన చివర్లో ముగుస్తుంది.

a కొత్త లోక అనువాదం బైబిలు యెషయా 60:1 లో “సీయోను” లేదా “యెరూషలేము” అనే పదాలకు బదులు “స్త్రీ” అనే పదం ఉపయోగించింది. ఎందుకంటే, “లే” అలాగే “వెలుగు ప్రసరించు” అని అనువదించిన హీబ్రూ క్రియా పదాలు స్త్రీ లింగంలో ఉన్నాయి. ఈ లేఖనంలో ఉన్న “నీ” అనే పదం కూడా హీబ్రూలో స్త్రీ లింగంలోనే ఉంది.

b 1919 లో జరిగిన ఆధ్యాత్మిక పునరుద్ధరణ పని గురించి యెహెజ్కేలు 37:1-14 అలాగే ప్రకటన 11:7-12 లో కూడా ఉంది. చాలా కాలం బందీలుగా ఉన్న తర్వాత, అభిషిక్త క్రైస్తవులందరూ ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడతారని యెహెజ్కేలు ముందే చెప్పాడు. అన్యాయంగా జైల్లో వేయబడడం వల్ల కొంతకాలం పాటు యెహోవా సేవను చురుగ్గా చేయలేకపోయిన తర్వాత, నాయకత్వం వహిస్తున్న అభిషిక్త సహోదరుల చిన్న గుంపు ఆధ్యాత్మికంగా మళ్లీ పుడతారని ప్రకటనలోని ప్రవచనం చెప్పింది. 1919 లో వాళ్లు “నమ్మకమైన, బుద్ధిగల” దాసునిగా నియమించబడ్డారు.—మత్త. 24:45; సత్యారాధన పునరుద్ధరించబడింది (ఇంగ్లీష్‌) పుస్తకంలో 118వ పేజీ చూడండి.