కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొత్త సంఘానికి ఎలా అలవాటుపడొచ్చు?

కొత్త సంఘానికి ఎలా అలవాటుపడొచ్చు?

మీరెప్పుడైనా సంఘం మారారా? అలాగైతే జీన్‌-చార్లెస్‌ అనే బ్రదర్‌కి అనిపించినట్టే మీకు అనిపించి ఉండవచ్చు. ఆయనిలా అన్నాడు: “కుటుంబ సభ్యులందరి ఆధ్యాత్మికతను కాపాడుతూనే కొత్త సంఘానికి అలవాటుపడడం ఒక సవాలే.” మీరొక కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు కొత్త ఉద్యోగం, ఇల్లు, పిల్లలకు కొత్త స్కూళ్లు చూసుకోవాలి. అంతేకాదు అక్కడి వాతావరణానికి, సంస్కృతికి, కొత్త టెరిటరీకి అలవాటుపడాలి.

నికోలస్‌ అలాగే సీలిన్‌ అనే దంపతులు ఇంకో రకమైన సవాలు ఎదుర్కొన్నారు. ఫ్రాన్స్‌ బ్రాంచి వాళ్లను ఒక కొత్త సంఘానికి నియమించింది. అప్పుడు వాళ్లకు ఎలా అనిపించిందో చెప్తూ ఇలా అన్నారు: “మొదట్లో మేము ఎగిరి గంతేశాం. కానీ తర్వాత్తర్వాత మా పాత సంఘంలో ఉన్న స్నేహితుల్ని చాలా మిస్‌ అయ్యాం. కొత్త సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి మేము అప్పుడే అంత దగ్గరవ్వలేకపోయాం.” a ఇలాంటి సవాళ్లు ఉన్నాసరే, కొత్త సంఘంలో మీరెలా సంతోషంగా ఉండవచ్చు? ఇతరులు మీకెలా సహాయం చేస్తారు? మీరు కొత్త సంఘాన్ని ఎలా ప్రోత్సహించవచ్చు? ఆ కొత్త సంఘం మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

కొత్త సంఘానికి అలవాటుపడడానికి చేయాల్సిన నాలుగు పనులు

యెహోవా మీద ఆధారపడండి

1. యెహోవా మీద ఆధారపడండి. (కీర్త. 37:5) జపాన్‌లో ఉంటున్న కజుమీ అనే సిస్టర్‌ వాళ్ల ఆయన వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అవ్వడం వల్ల, ఆమె 20 సంవత్సరాల నుండి సహవసించిన సంఘం నుండి వేరే సంఘానికి మారాల్సి వచ్చింది. మరి ఆమె, ‘తన మార్గాన్ని యెహోవాకు ఎలా అప్పగించింది?’ ఆమె ఇలా చెప్తుంది: “నాకున్న భయాల గురించి, ఆందోళనల గురించి, ఒంటరితనం గురించి యెహోవాకు పదేపదే చెప్పుకున్నాను. అలా చెప్పుకున్న ప్రతీసారి నాకు కావాల్సిన బలం ఆయన ఇచ్చాడు.”

మీరు యెహోవా మీద ఇంకా ఎక్కువ ఎలా ఆధారపడవచ్చు? ఒక మొక్క చక్కగా ఎదగడానికి నీళ్లు, మట్టిలో పోషకాలు చాలా అవసరం. అదేవిధంగా, మన విశ్వాసం పెరగడానికి ఒక రకంగా నీళ్లు, పోషకాలు చాలా అవసరం. ముందు చెప్పుకున్న నికోలస్‌ అనే బ్రదర్‌, యెహోవా ఇష్టం చేయడానికి ఎన్నో త్యాగాలు చేసిన అబ్రాహాము, యేసు, పౌలు గురించి లోతుగా ఆలోచించాడు. దానివల్ల, యెహోవా తనకు కూడా సహాయం చేస్తాడనే నమ్మకం ఆయనకు పెరిగింది. ప్రతీరోజు వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తే, జీవితంలో వచ్చే ఏ మార్పులకైనా అలవాటుపడగలుగుతాం. అలాగే కొత్త సంఘంలో వేరేవాళ్లను ప్రోత్సహించడానికి మన దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి.

పోల్చకండి

2. పోల్చకండి. (ప్రసం. 7:10) జూల్స్‌ అనే బ్రదర్‌ బెనిన్‌ నుండి అమెరికాకు వచ్చినప్పుడు పూర్తి భిన్నమైన సంస్కృతికి అలవాటుపడాల్సి వచ్చింది. ఆయనిలా అంటున్నాడు: “నేను కలిసే ప్రతీఒక్కరికి నా జీవిత కథ చెప్పాలని అనిపించింది.” కొత్త సంఘంలో బ్రదర్స్‌సిస్టర్స్‌ అందరూ చాలా వేరుగా ఉన్నారు కాబట్టి, ఆయన వాళ్లను దూరం పెట్టాడు. కానీ బ్రదర్స్‌-సిస్టర్స్‌ గురించి బాగా తెలుసుకున్న తర్వాత, తన ఆలోచన మార్చుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “భూమ్మీద మనం ఎక్కడున్నా మనందరం ఒక్కటే. కాకపోతే మాట్లాడే, ప్రవర్తించే విధానమే వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్లను వాళ్లలాగే చూడాలి.” అందుకే, మీ కొత్త సంఘాన్ని పాత సంఘంతో పోల్చకండి. ఆని-లీస్‌ అనే ఒక పయినీరు సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నేను వదిలేసిన వాటిని వెదకడానికి మారలేదు గానీ కొత్త వాటిని వెదకడానికి మారాను.”

సంఘపెద్దలు కూడా తమ కొత్త సంఘాన్ని పాత సంఘంతో పోల్చకూడదు. ఒక పనిని వేర్వేరు పద్ధతుల్లో చేయడం తప్పేమీకాదు. అంతేకాదు, ఏదైనా సలహా ఇచ్చే ముందు, స్థానిక పరిస్థితుల్ని బాగా తెలుసుకుని ఇవ్వడం తెలివైన పని. (ప్రసం. 3:1, 7బి) అలాగే మీ సొంత అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దే బదులు, మీ మంచి ఆదర్శంతో బ్రదర్స్‌కి నేర్పించడం మంచిది.—2 కొరిం. 1:24

సంఘంలో చురుగ్గా ఉండండి

3. సంఘంలో చురుగ్గా ఉండండి. (ఫిలి. 1:27) నిజమే ఏదైనా కొత్త సంఘానికి మారినప్పుడు దానికి అలవాటుపడడానికి చాలా సమయం, శక్తి అవసరమౌతాయి. కానీ సాధ్యమైతే, వీలైనంత త్వరగా మీటింగ్స్‌కి నేరుగా వెళ్లడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే, కొత్త సంఘంలో మీరు ఎప్పుడూ కనిపించకపోతే లేదా అడపాదడపా కనిపిస్తే అక్కడున్నవాళ్లు మీకెలా సహాయం చేయగలుగుతారు? లూసిండా అనే సిస్టర్‌, తన ఇద్దరి అమ్మాయిలతో దక్షిణ ఆఫ్రికాలోని ఒక పెద్ద నగరానికి వెళ్లింది. ఆమె గుర్తుచేసుకుంటూ ఇలా చెప్తుంది: “ఇతరులతో ప్రీచింగ్‌ చేయడం మీద, మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పడం మీద దృష్టి పెట్టమని నా ఫ్రెండ్స్‌ నాకు సలహా ఇచ్చారు. అలాగే మా ఇంట్లో క్షేత్రసేవా కూటాలు జరుపుకోవచ్చని మేము పెద్దలకు చెప్పాం.”

“మంచివార్త మీదున్న విశ్వాసాన్ని” కాపాడుకోవడానికి, ఆధ్యాత్మిక పనుల్లో బ్రదర్స్‌సిస్టర్స్‌తో “కలిసికట్టుగా పనిచేయాలి.” పైన చెప్పుకున్న ఆని-లీస్‌ అనే సిస్టర్‌ని, అందరితో కలిసి ప్రీచింగ్‌ చేయమని సంఘపెద్దలు ప్రోత్సహించారు. దానివల్ల ఏం జరిగింది? ఆమె ఇలా చెప్తుంది: “కొత్త సంఘంతో కలిసిపోవడానికి ఇది మంచి పద్ధతి.” అంతేకాదు, రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనుల్లో పాల్గొన్నప్పుడు కొత్త సంఘాన్ని మీ సంఘంగా చేసుకుంటారు. ఈ పనుల్లో మీరు ఎంతెక్కువగా పాల్గొంటే, అంత త్వరగా మీ కొత్త ఆధ్యాత్మిక కుటుంబంతో కలిసిపోగలుగుతారు.

కొత్త స్నేహితుల్ని చేసుకోండి

4. కొత్త స్నేహితుల్ని చేసుకోండి. (2 కొరిం. 6:11-13) స్నేహితుల్ని చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే, వాళ్లమీద శ్రద్ధ చూపించడం. కాబట్టి మీటింగ్స్‌కి ముందు, తర్వాత వేరేవాళ్ల గురించి బాగా తెలుసుకోవడానికి సమయం పెట్టండి. వాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించండి. ప్రజల పేర్లు గుర్తుపెట్టుకుని, వాళ్లను ఆప్యాయంగా పలకరించినప్పుడు అది వాళ్లకు నచ్చుతుంది. దానివల్ల వాళ్లు మిమ్మల్ని ఇష్టపడతారు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి.

కొత్త బ్రదర్స్‌సిస్టర్స్‌కి నచ్చాలని మీ వ్యక్తిత్వానికి వేరుగా ఉండాల్సిన అవసరంలేదు, మీరు మీలాగే ఉండండి. సిస్టర్‌ లూసిండా చేసినట్టే చేయండి. ఆమె ఏం చేసిందో చెప్తూ ఇలా అంది: “వేరేవాళ్లు నన్ను ఇంటికి పిలవకముందే నేనే వాళ్లను మా ఇంటికి పిలిచాను. దానివల్ల మంచి స్నేహాలు ఏర్పడ్డాయి.”

“ఒకరినొకరు ఆహ్వానించండి”

రాజ్యమందిరం నిండా తెలియనివాళ్లే ఉంటే కొంతమందికి చాలా భయంగా అనిపిస్తుంది. మరి మీ సంఘానికి కొత్తవాళ్లు ఎవరైనా వస్తే, వాళ్ల భయాన్ని పోగొట్టడానికి ఏం చేయవచ్చు? “క్రీస్తు మిమ్మల్ని ఆహ్వానించినట్టే మీరు కూడా ఒకరినొకరు ఆహ్వానించండి” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (రోమా. 15:7, అధస్సూచి) క్రీస్తును అనుకరిస్తూ కొత్తగా వచ్చిన వాళ్లను పట్టించుకుంటున్నామని సంఘపెద్దలు చూపించవచ్చు. (“ మీరు సంఘం మారాలనుకుంటే …” అనే బాక్స్‌ చూడండి.) అంతేకాదు, పిల్లలతోసహా సంఘంలో ఉన్నవాళ్లందరూ కొత్తవాళ్లు సంఘానికి అలవాటుపడడానికి సహాయం చేయవచ్చు.

వేరేవాళ్లను ‘ఆహ్వానించడంలో’ వాళ్లను మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడంతోపాటు, వాళ్లకు అవసరమైన సహాయం కూడా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక సిస్టర్‌ తనకున్న విలువైన సమయాన్ని ఉపయోగించి కొత్తగా వచ్చిన ఒక సిస్టర్‌కి ఊరంతా చూపించింది. అలాగే అక్కడ బస్సుల్లో, ఆటోల్లో, ట్రైన్‌లో ఎలా ప్రయాణించాలో వివరంగా చెప్పింది. ఈ సిస్టర్‌ చేసిన పని కొత్తగా వచ్చిన సిస్టర్‌కి బాగా నచ్చింది. దాంతో కొత్త సంఘానికి అలవాటుపడడం ఆమెకు తేలికైంది.

ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశం

ఒక మిడత ఎదుగుతున్నప్పుడు, ఎగిరే సామర్థ్యం రాకముందే తన ఒంటి మీదున్న పొరల్ని చాలాసార్లు వదిలేస్తూ ఉంటుంది. అదేవిధంగా, మీరు కొత్త సంఘానికి మారినప్పుడు యెహోవా సేవలో మీ రెక్కలు చాచి ఎగరాలంటే, మీకున్న భయాల్ని వదిలేస్తూ ఉండాలి. నికోలస్‌, సీలిన్‌ అనే దంపతులు ఇలా చెప్తున్నారు: “మారడం ఒక మంచి శిక్షణ లాంటిది. మేము కొత్త ప్రజలకు, కొత్త పరిస్థితులకు అలవాటుపడాలంటే, కొత్త లక్షణాల్ని పెంచుకోవాల్సి వచ్చింది.” ఈ ఆర్టికల్‌ మొదట్లో చెప్పిన జీన్‌-చార్లెస్‌ అనే బ్రదర్‌, వాళ్ల కుటుంబం ఎలా ప్రయోజనం పొందిందో చెప్తూ ఇలా అంటున్నాడు: “కొత్త సంఘంలో మా పిల్లలు యెహోవాకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యారు, ఎక్కువ పరిణతి సాధించారు. సంఘం మారిన కొన్ని నెలలకే మా పాప వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో నియామకాలు చేసింది. మా అబ్బాయి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అయ్యాడు.”

ఒకవేళ మీ పరిస్థితుల్ని బట్టి, అవసరం ఎక్కువున్న ప్రాంతానికి మీరు మారలేకపోతుంటే, అప్పుడేంటి? ఈ సలహాల్లో కొన్నింటినైనా పాటిస్తూ, మీరున్న సంఘంలోనే కొత్తగా మొదలుపెట్టండి. యెహోవా మీద ఆధారపడుతున్నప్పుడు ఇతరులతో కలిసి ప్రీచింగ్‌ చేయడం, కొత్త స్నేహాల్ని ఏర్పరచుకోవడం లేదా ఉన్న స్నేహాల్ని బలపర్చుకోవడం లాంటి పనుల్లో పూర్తిగా మునిగిపోండి. కొత్తగా వచ్చినవాళ్లకు లేదా అవసరంలో ఉన్నవాళ్లకు మీరు ముందుకొచ్చి సహాయం చేయవచ్చు. ఎందుకంటే, నిజక్రైస్తవులు ప్రేమకు పెట్టింది పేరు. కాబట్టి మీరు ఆ పనులు చేసినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు. (యోహా. 13:35) అంతేకాదు, “అలాంటి బలులు దేవునికి చాలా ఇష్టం” అని మర్చిపోకండి.—హెబ్రీ. 13:16.

కొత్త సంఘానికి మారినప్పుడు చాలా సవాళ్లు ఉంటాయి. కానీ చాలామంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ వాటిని అధిగమించి, సంతోషంగా ఉన్నారు. మీరు కూడా ఉండగలుగుతారు. ఆని-లీస్‌ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “సంఘాలు మారడం వల్ల నేను నా స్నేహితుల్ని కూడా పెంచుకోగలిగాను.” కజుమీ ఇలా చెప్తుంది: “మారడం వల్ల ముందెప్పుడూ చూడని విధాల్లో యెహోవా సహాయాన్ని రుచి చూడగలుగుతారు.” జూల్స్‌ ఇలా అంటున్నాడు: “నాకు దొరికిన స్నేహితుల వల్ల నేనేదో కొత్త ప్రాంతంలో ఉన్నట్టు అనిపించడం లేదు. ఇప్పుడు ఈ కొత్త సంఘంలో నేను కూడా ఒకడినని, ఈ సంఘాన్ని వదిలి వెళ్లలేనని అనిపిస్తుంది.”

a మరిన్ని సలహాల కోసం కావలికోట మే 15, 1994 పత్రికలోని “దేవుని సేవలో ఇంటిమీద బెంగను అధిగమించండి” అనే ఆర్టికల్‌ చూడండి.