కంటెంట్‌కు వెళ్లు

బైబిలు అంటే ఏంటి?

బైబిలు అంటే ఏంటి?

 బైబిలు గురించి నిజాలు

  •   బైబిల్ని ఎవరు రాశారు? బైబిలుకు మూలం దేవుడే, కానీ ఆయన దాదాపు 40 వేర్వేరు పురుషులతో దాన్ని రాయించాడు. వాళ్లలో కొంతమంది మోషే, రాజైన దావీదు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. a దేవుడు తన ఆలోచనల్ని వాళ్ల మనసులో పెట్టి తన సందేశాన్ని రాయించాడు.—2 తిమోతి 3:16.

     ఉదాహరణకు, ఒక బాస్‌ తన సెక్రెటరీతో ఒక మెసేజ్‌ రాయించాలని అనుకున్నాడు. అతను ఆ మెసేజ్‌లో ఏం రాయాలో, ఎలా రాయాలో పైపైన చెప్తాడు. దాన్ని రాసింది సెక్రెటరీయే అయినా, ఆ మెసేజ్‌ మాత్రం బాస్‌దే అవుతుంది. అదేవిధంగా, దేవుడు తన సందేశాన్ని మనుషులతో రాయించినప్పటికీ ఆ సందేశం దేవునిదే అవుతుంది.

  •   “బైబిలు” అనే మాటకు అర్థం ఏంటి? “బైబిలు” అనే మాట, “చిన్న పుస్తకాలు” అని అర్థం వచ్చే బిబ్లియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. కాలం గడిచే కొద్దీ, బైబిల్లో చిన్న పుస్తకాలు అన్నిటినీ కలిపి బిబ్లియా అని పిలవడం మొదలుపెట్టారు.

  •   బైబిల్ని ఎప్పుడు రాశారు? క్రీ.పూ. 1513 లో బైబిలు రాయడం మొదలైంది. దాదాపు 1,600 సంవత్సరాల తర్వాత అంటే ఇంచుమించు క్రీ.శ. 98 లో అది పూర్తి అయింది.

  •   మొట్టమొదట రాసిన బైబిలు ఎక్కడుంది? మనకు తెలిసినంతవరకు అది లేదు. ఎందుకంటే, మొదట బైబిల్ని రాసినవాళ్లు పపైరస్‌ మీద, జంతు చర్మాల మీద రాశారు. అయితే అవి త్వరగా పాడైపోయేవి, కానీ అప్పట్లో అవే అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి మీదే రాసేవాళ్లు. అందుకే శాస్త్రులు (నకలు రాసేవాళ్లు) వాటిని ఉన్నదున్నట్టు ఎన్నో సంవత్సరాలపాటు నకలు రాశారు (కాపీ చేశారు). దానివల్ల తర్వాతి తరాలవాళ్లు కూడా వాటిని చదవగలుగుతున్నారు.

  •   పాత నిబంధన, కొత్త నిబంధన అంటే ఏంటి? ముఖ్యంగా హీబ్రూలో రాసిన బైబిలు భాగాన్ని b చాలామంది పాత నిబంధన అని అంటారు. దాన్నే హీబ్రూ లేఖనాలు అని కూడా పిలుస్తారు. గ్రీకులో రాసిన బైబిలు భాగాన్ని కొత్త నిబంధన అని అంటారు, దాన్నే క్రైస్తవ గ్రీకు లేఖనాలు అని కూడా పిలుస్తారు. ఆ రెండు భాగాల్ని కలిపి ఒక పుస్తకంగా, “పవిత్ర లేఖనాలు” అని పిలుస్తారు. c

  •   బైబిల్లో ఏముంది? బైబిల్లో చరిత్ర, నియమాలు, ప్రవచనాలు, కవితలు, సామెతలు, పాటలు, ఉత్తరాలు ఉన్నాయి.—“ బైబిలు పుస్తకాల లిస్ట్‌” చూడండి.

 బైబిల్లో ఏ విషయాలు ఉన్నాయి?

 సర్వశక్తిమంతుడైన దేవుడు భూమిని, ఆకాశాన్ని ఎలా తయారు చేశాడో చెప్పే కొన్ని వివరాలతో బైబిలు మొదలౌతుంది. తన గురించి అందరూ తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందుకే బైబిలు ద్వారా తన పేరు యెహోవా అని తననుతాను పరిచయం చేసుకున్నాడు.—కీర్తన 83:18.

 దేవుని పేరు మీద ఎలాంటి నిందలు పడ్డాయో, దాన్ని ఆయన ఎలా తీసేసుకుంటాడో బైబిలు చెప్తుంది.

 మనుషుల విషయంలో, భూమి విషయంలో దేవునికున్న ఉద్దేశాన్ని బైబిలు తెలియజేస్తుంది. అలాగే భవిష్యత్తులో మనుషుల బాధలకు కారణం అయిన వాటన్నిటినీ ఆయన ఎలా తీసేస్తాడో కూడా చెప్తుంది.

 రోజువారీ జీవితంలో ఉపయోగపడే సలహాలను బైబిలు ఇస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు చూడండి:

  •   అందరితో మంచిగా ఎలా ఉండాలి? “కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”—మత్తయి 7:12.

     అంటే: వేరేవాళ్లు మనతో ఎలా ఉండాలని మనం కోరుకుంటామో, మనమూ వాళ్లతో అలాగే ఉండాలి.

  •   ఒత్తిడి నుండి ఎలా బయటపడొచ్చు? “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి.”—మత్తయి 6:34.

     అంటే: ముందుముందు ఏం జరుగుతుందా అని అతిగా ఆలోచించే బదులు, ఏ రోజు గురించి ఆ రోజు ఆలోచిస్తే సరిపోతుంది.

  •   సంసారం సంతోషంగా సాగాలంటే ఏం చేయాలి? “మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి; భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.”—ఎఫెసీయులు 5:33.

     అంటే: కాపురం బాగుండడానికి ప్రేమ, గౌరవం చాలా ముఖ్యం.

 బైబిల్లో ఏమైనా మార్పులు-చేర్పులు చేశారా?

 లేదు. పండితులు ప్రాచీన బైబిలు చేతిరాత ప్రతుల్ని, ఇప్పుడున్న బైబిలుతో జాగ్రత్తగా పోల్చి చూసినప్పుడు అందులో ఉన్న సందేశం ఏమాత్రం మారలేదని తేలింది. ఎంతైనా తన సందేశాన్ని అందరూ చదివి, అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటే దాన్ని మార్చకుండా చూసుకోడా? dయెషయా 40:8.

 ఎందుకు ఇన్ని బైబిలు అనువాదాలు ఉన్నాయి?

 నేడు చాలామందికి ప్రాచీన బైబిలు భాషలు రావు. కానీ ‘ప్రతీ దేశానికి, తెగకు, భాషకు చెందిన ప్రజల’ కోసం బైబిల్లో ఒక “మంచివార్త” ఉంది. (ప్రకటన 14:6, అధస్సూచి) అందుకే వాళ్లకు అర్థమయ్యే భాషలో ఒక అనువాదం అవసరం. అప్పుడే దేవుని సందేశాన్ని వాళ్లు చదవగలుగుతారు, బాగా అర్థం చేసుకోగలుగుతారు.

 మూడు రకాల బైబిలు అనువాదాలు ఉన్నాయి:

  •   మక్కికిమక్కి అనువదించడం అంటే పొల్లు పోకుండా ఏ పదానికి ఆ పదం అనువదించడం.

  •   ఇంకో రకమైన అనువాదం ఏంటంటే మూల భాషలో ఏం చెప్పాలనుకుంటున్నారో అదే అర్థం వచ్చే పదాల్ని ఉపయోగించడం.

  •   భావానువాదం అంటే చదవడానికి బాగుండేలా వీలైనన్ని మార్పులు చేయడం. అలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దాని అర్థం కూడా మారిపోవచ్చు.

 ఒక మంచి బైబిలు అనువాదం, ఉన్నదున్నట్టు అనువదిస్తూనే అందరికి అర్థమయ్యే ఆధునిక భాషను ఉపయోగిస్తుంది. అలా మనుషులందరికీ దేవుని సందేశాన్ని ఏ మార్పు లేకుండా తెలియజేస్తుంది. e

 బైబిల్లో ఏం చేర్చాలో ఎవరు నిర్ణయించారు?

 బైబిలుకు మూలం దేవుడే కాబట్టి అందులో ఏం ఉండాలో కూడా ఆయనే నిర్ణయించాడు. ముందుగా ఆయన ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకొని తన “పవిత్ర సందేశాలు” వాళ్లకు ఇచ్చాడు. కాబట్టి వాళ్లు హీబ్రూ లేఖనాలను సంరక్షించారు.—రోమీయులు 3:2.

 బైబిల్లో ఉండాల్సిన పుస్తకాలు ఏమైనా మిస్‌ అయ్యాయా?

 ఏదీ మిస్‌ అవ్వలేదు. బైబిలు మొత్తంగా మన దగ్గరుంది. కానీ చాలా ఏళ్లు రహస్యంగా ఉంచిన కొన్ని ప్రాచీన పుస్తకాలు కూడా బైబిల్లో భాగమే f అని కొంతమంది అంటారు. అయితే, బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలో బైబిల్లోనే ఒక ప్రమాణం ఉంది. (2 తిమోతి 1:13) ఆ ప్రమాణాన్ని బట్టి చూస్తే అందులో ఉన్న పుస్తకాలన్నీ ఒకదానికి ఒకటి పొందికగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, అదంతా ఒకే పుస్తకంలా అనిపిస్తుంది. కొంతమంది ఏ పుస్తకాలైతే బైబిల్లో భాగమే అన్నారో అవి ఈ ప్రమాణానికి తగ్గట్టు ఉండవు. g

 బైబిలు వచనాలను ఎలా చూడాలి?

  బైబిలు పుస్తకాల లిస్ట్‌

a బైబిల్లో ఉన్న పుస్తకాల పేర్లు ఏంటో, వాటిని ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో తెలుసుకోవడం కోసం “బైబిలు పుస్తకాల పట్టిక” చూడండి.

b బైబిల్లోని కొన్ని అధ్యాయాలు అరామిక్‌ భాషలో రాయబడ్డాయి, అది కాస్త హీబ్రూ భాషలాగే ఉంటుంది.

c బైబిలు చదివే చాలామంది “హీబ్రూ లేఖనాలు,” “క్రైస్తవ గ్రీకు లేఖనాలు” అనే మాటల్ని ఉపయోగించడాన్ని ఇష్టపడతారు. దానివల్ల “పాత నిబంధన” పాతదని, దాని స్థానంలో “కొత్త నిబంధన” వచ్చిందనే అభిప్రాయం ఏర్పడదు.

e చాలామంది పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదాన్ని చదవడం ఇష్టపడతారు. ఎందుకంటే అది చాలా ఖచ్చితంగా ఉంటుంది, చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. “కొత్తలోక అనువాదం ఖచ్చితమైనదేనా?” చూడండి.

f ఈ పుస్తకాలన్నిటినీ కలిపి అపోక్రిఫా లేదా అప్రమాణిక పుస్తకాలు అని అంటారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, బైబిల్లో అధికారికంగా ఉన్న పుస్తకాల్ని కాకుండా వేరే పుస్తకాల్ని సూచించడానికి ఈ పదాన్ని వాడతారు.