కంటెంట్‌కు వెళ్లు

బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా?

బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా?

 లేదు. ప్రాచీన రాతప్రతులతో పోల్చిచూస్తే, బైబిలు పెద్దగా మారలేదని తెలుస్తోంది. త్వరగా పాడయ్యే వాటిమీద వేల సంవత్సరాలపాటు బైబిలు నకలు చేయబడింది. అయినా అది మారలేదు.

అంటే, బైబిల్ని నకలు చేస్తున్నప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగలేదనా?

 వేలకొలది ప్రాచీన బైబిలు రాతప్రతులు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిశీలిస్తున్నప్పుడు కొన్ని చోట్ల తేడాలు కనిపించాయి. అంటే మూలప్రతి నుండి చూసి రాస్తున్నప్పుడు పొరపాట్లు జరిగాయని తెలుస్తోంది. అవి చాలావరకు చిన్నచిన్న పొరపాట్లే, కానీ వాటివల్ల లేఖనాల అర్థం మారలేదు. అయితే, ఆ రాతప్రతులను పరిశీలిస్తున్నప్పుడు కొన్ని పెద్ద పొరపాట్లు కూడా కనిపించాయి. బైబిలు సందేశాన్ని మార్చాలన్న ఉద్దేశంతో కొంతమంది కావాలనే అలా చేశారనిపిస్తోంది. రెండు ఉదాహరణలు పరిశీలించండి:

  1.   కొన్ని పాత బైబిలు అనువాదాల్లో, 1 యోహాను 5:7 లో ఈ మాటలు కనిపిస్తాయి: “పరలోకంలో, తండ్రి, వాక్కు, పవిత్రాత్మ: ఈ ముగ్గురూ ఒక్కటే.” కానీ ఆ మాటలు మూలప్రతిలో లేవని, వాటిని ఆ తర్వాత చేర్చారని, నమ్మదగిన రాతప్రతులను చూస్తే తెలుస్తుంది. a అందుకే, కొన్ని ఆధునిక బైబిలు అనువాదాలు ఆ మాటలను తీసేశాయి.

  2.   ప్రాచీన బైబిలు రాతప్రతుల్లో దేవుని పేరు వేలసార్లు కనిపిస్తుంది. అయినప్పటికీ చాలా బైబిలు అనువాదాలు, ఆ పేరును తీసేసి దాని స్థానంలో “ప్రభువు” లేదా “దేవుడు” వంటి బిరుదుల్ని పెట్టాయి.

బైబిల్లో ఇంకెన్ని తప్పులు ఉన్నాయో అని మనం సందేహించాలా?

 ప్రస్తుతం చాలా రాతప్రతులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పులేమైనా ఉంటే సులభంగా బయటపడేవే. b ఆ రాతప్రతులను పోల్చి చూడడం వల్ల, బైబిలు ఖచ్చితత్వానికి సంబంధించిన ఏ విషయాలు వెల్లడయ్యాయి?

  •    “పాత నిబంధన” అని పిలిచే హీబ్రూ లేఖనాల మీద వ్యాఖ్యానిస్తూ, విలియమ్‌ హెచ్‌. గ్రీన్‌ అనే విద్వాంసుడు ఇలా అన్నాడు: “వేరే ఏ ప్రాచీన పుస్తకం ఇంత ఖచ్చితంగా లేదని ధైర్యంగా చెప్పవచ్చు.”

  •    “కొత్త నిబంధన” అని పిలిచే క్రైస్తవ గ్రీకు లేఖనాల గురించి, ఎఫ్‌. ఎఫ్‌. బ్రూస్‌ అనే బైబిలు విద్వాంసుడు ఇలా రాశాడు: “ఖచ్చితమైనవా కావా అని ఎవ్వరూ కలలో కూడా ప్రశ్నించలేని సాహిత్య రచనలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటికి లేనన్ని రుజువులు మన కొత్త నిబంధనలోని పుస్తకాలకు ఉన్నాయి.”

  •    బైబిలు రాతప్రతులకు సంబంధించిన ప్రఖ్యాత అధికారి, సర్‌ ఫ్రెడరిక్‌ కెన్యన్‌ ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి పూర్తి బైబిల్ని చేతిలో పట్టుకుని, ఇది నిజంగా దేవుని వాక్యమనీ శతాబ్దాలు-తరాలు గడుస్తున్నా ఇది మాత్రం మారలేదనీ నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పవచ్చు.”

బైబిలుకు మార్పులు-చేర్పులు జరగలేదని నమ్మడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయి?

  •    యూదా లేఖికులు అలాగే క్రైస్తవ లేఖికులు బైబిల్ని నకలు చేస్తున్నప్పుడు, దేవుని ప్రజలు చేసిన ఘోరమైన తప్పులున్న వృత్తాంతాలను తీసేయలేదు. c (సంఖ్యాకాండము 20:12; 2 సమూయేలు 11:2-4; గలతీయులు 2:11-14) అంతేకాదు, యూదా జనాంగపు అవిధేయతను తెలిపే వృత్తాంతాలను; మానవ కల్పిత సిద్ధాంతాలను బట్టబయలు చేసే వృత్తాంతాలను తీసేయకుండా అలాగే ఉంచారు. (హోషేయ 4:2; మలాకీ 2:8, 9; మత్తయి 23:8, 9; 1 యోహాను 5:21) ఆ వృత్తాంతాలను ఉన్నదున్నట్లుగా నకలు చేయడం ద్వారా, ఆ లేఖికులు నమ్మదగినవారనీ, పవిత్రమైన దేవుని వాక్యం పట్ల తమకు అపార గౌరవం ఉందనీ చూపించారు.

  •    బైబిల్ని రాయించిన దేవుడు, దాని ఖచ్చితత్వాన్ని కాపాడలేడా? d (యెషయా 40:8; 1 పేతురు 1:24, 25) ప్రాచీనకాల ప్రజల కోసమే కాదు, మనకాలంలో జీవిస్తున్నవాళ్ల కోసం కూడా దేవుడు దాన్ని రాయించాడు. (1 కొరింథీయులు 10:11) నిజానికి, “పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి. మన సహనం ద్వారా, లేఖనాల నుండి దొరికే ఊరట ద్వారా మనం నిరీక్షణ కలిగివుండేందుకు అవి రాయబడ్డాయి.”—రోమీయులు 15:4.

  •    యేసు, ఆయన అనుచరులు హీబ్రూ లేఖనాలను ఉల్లేఖిస్తున్నప్పుడు, అవి ఖచ్చితమైనవా కావా అని ఏమాత్రం సందేహించలేదు.—లూకా 4:16-21; అపొస్తలుల కార్యాలు 17:1-3.

a ఆ మాటలు కోడెక్స్‌ సైనాయ్‌టికస్‌లో గానీ, కోడెక్స్‌ అలెక్సాండ్రినస్‌లో గానీ, 1209కి చెందిన వాటికన్‌ మూలప్రతిలో గానీ, ప్రాచీన లాటిన్‌ వల్గేట్‌లో గానీ, ఫీలొసీనియన్‌-హర్‌క్లియన్‌ సిరియాక్‌ వర్షన్‌లో గానీ, సిరియాక్‌ పెషిట్టాలో గానీ లేవు.

b ఉదాహరణకు, కొత్త నిబంధన అని పిలువబడుతున్న క్రైస్తవ గ్రీకు లేఖనాలకు సంబంధించిన రాతప్రతులు 5,000కు పైగా దొరికాయి.

c దేవుడు ఉపయోగించుకున్న మనుషులు ఏ తప్పూ చేయనివాళ్లని బైబిలు చెప్పడంలేదు. బదులుగా అది ఇలా ఒప్పుకుంటుంది: “పాపము చేయనివాడు ఒకడును లేడు.”—1 రాజులు 8:46.

d బైబిల్లో ఉన్న ప్రతీ పదాన్ని దేవుడే చెప్పి రాయించలేదు గానీ, ఆయన మానవ రచయితల ఆలోచనలను నిర్దేశించాడని బైబిలు చెప్తుంది.—2 తిమోతి 3:16, 17; 2 పేతురు 1:21.