కంటెంట్‌కు వెళ్లు

పరలోకానికి ఎవరు వెళ్తారు?

పరలోకానికి ఎవరు వెళ్తారు?

బైబిలు ఇచ్చే జవాబు?

 దేవుడు కొద్దిమంది నమ్మకమైన క్రైస్తవులను ఎంచుకుంటాడు. వాళ్లు మాత్రమే చనిపోయాక పరలోకానికి వెళ్తారు. (1 పేతురు 1:3, 4) అయితే అలా ఎంచుకోబడిన వాళ్లు చనిపోయే వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే వాళ్లు పరలోక నిరీక్షణను సొంతం చేసుకుంటారు.—ఎఫెసీయులు 5:5; ఫిలిప్పీయులు 3:12-14.

వాళ్లు పరలోకానికి వెళ్లి ఏమి చేస్తారు?

 యేసుతోపాటు 1,000 ఏళ్లు రాజులుగా, యాజకులుగా సేవచేస్తారు. (ప్రకటన 5:9, 10; 20:6) ‘కొత్త భూమిని’ అంటే భూమ్మీదున్న వాళ్లను పరిపాలించేలా ‘కొత్త ఆకాశంగా’ అంటే కొత్త ప్రభుత్వంగా రూపొందించబడతారు. యెహోవా మొదట్లో కోరుకున్నట్లుగా మనుషులందరూ నీతిమంతులుగా అవ్వడానికి పరలోకంలో ఉన్న ఆ పరిపాలకులు మనుషులకు సహాయం చేస్తారు.—యెషయా 65:17; 2 పేతురు 3:13.

పరలోకానికి వెళ్లే వాళ్ల సంఖ్య ఎంత?

 పరలోకానికి వెళ్లే వాళ్ల సంఖ్య 1,44,000 మంది అని బైబిలు చెప్తోంది. (ప్రకటన 7:4) యోహాను ఒక దర్శనంలో ‘గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండడాన్ని, 1,44,000 మంది ఆయనతో పాటు ఉండడాన్ని’ ప్రకటన 14:1-3 వచనాల్లో గమనిస్తాం. యోహాను చూసిన దర్శనంలోని “గొర్రెపిల్ల” పునరుత్థానమైన యేసును సూచిస్తుంది. (యోహాను 1:29; 1 పేతురు 1:19) “సీయోను పర్వతం” యేసు, అలాగే ఆయనతోపాటు పరిపాలించే 1,44,000 మంది ఉన్న ఉన్నతమైన స్థానాన్ని సూచిస్తుంది.—కీర్తన 2:6; హెబ్రీయులు 12:22.

 రాజ్యంలో క్రీస్తుతోపాటు పరిపాలించడానికి ‘దేవుడు పిలిచినవాళ్లను, ఎంచుకున్నవాళ్లను’ ‘చిన్నమంద’ అని బైబిలు పిలుస్తోంది. (ప్రకటన 17:14; లూకా 12:32) యేసు మందలో ఉన్నవాళ్లతో పోలిస్తే పరలోకానికి వెళ్లే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందని ఇది సూచిస్తోంది.—యోహాను 10:16.

పరలోకానికి వెళ్లే వాళ్ల గురించి ఉన్న అపోహలు

 అపోహ: మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారు.

 నిజం: మంచివాళ్లైన ఎంతోమంది భూమిపై నిత్యం జీవిస్తారని దేవుడు మాటిస్తున్నాడు.—కీర్తన 37:11, 29, 34.

  •   యేసు ఇలా అన్నాడు: “ఏ మనిషీ పరలోకానికి ఎక్కిపోలేదు.” (యోహాను 3:13) అంటే తనకంటే ముందు చనిపోయిన అబ్రాహాము, మోషే, యోబు, దావీదు వంటి మంచివాళ్లు పరలోకానికి వెళ్లలేదని యేసు మాటలకు అర్థం. (అపొస్తలుల కార్యములు 2:29, 34) అయితే వాళ్లు ఈ భూమిపై పునరుత్థానం చేయబడి మళ్లీ జీవితాన్ని ఆనందించే నిరీక్షణ ఉంది.—యోబు 14:13-15.

  •   పరలోకానికి పునరుత్థానం అవ్వడాన్ని “మొదటి పునరుత్థానం” అని బైబిలు పిలుస్తోంది. (ప్రకటన 20:6) అంటే దానర్థం మరో పునరుత్థానం కూడా ఉంది. అదే భూపునరుత్థానం లేదా భూమ్మీద జీవించేలా ప్రజలు పునరుత్థానం అవ్వడం.

  •   దేవుని రాజ్యంలో “మరణం ఇక ఉండదు” అని బైబిలు బోధిస్తోంది. (ప్రకటన 21:3, 4) పరలోకంలో ఉన్నవాళ్లకు మరణం అనేది ఉండదు కాబట్టి ఈ లేఖనం భూమ్మీద ఉండే పరిస్థితి గురించే మాట్లాడుతోందని చెప్పవచ్చు.

 అపోహ: తాము పరలోకానికి వెళ్తామా లేదా భూమ్మీదే నిత్యం జీవిస్తామా అనేది ఎవరికి వాళ్లు నిర్ణయించుకుంటారు.

 నిజం: “పరలోక పిలుపు అనే బహుమానం” ఎవరు పొందుతారో దేవుడు నిర్ణయిస్తాడు. (ఫిలిప్పీయులు 3:14) పరలోకానికి వెళ్లాలనే కోరిక లేదా కల ఉన్నంత మాత్రాన ఎవ్వరూ పరలోకానికి వెళ్లరు.—మత్తయి 20:20-23.

 అపోహ: పరలోకానికి వెళ్లే అర్హత లేనివాళ్లు మాత్రమే భూమ్మీద నిత్యజీవ నిరీక్షణ పొందుతారు.

 నిజం: భూమిపై నిత్యజీవ నిరీక్షణ పొందేవాళ్లను దేవుడు ‘నా జనులు,’ ‘నేను ఏర్పరచుకున్నవారు,’ ‘యెహోవాచేత ఆశీర్వదించబడినవారు’ అని పిలుస్తున్నాడు. (యెషయా 65:21-23) మనుషులు పరిపూర్ణులుగా ఉంటూ పరదైసు భూమిపై నిత్యం జీవించాలన్నది యెహోవా ఆది సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చే గొప్ప అవకాశం భూనిరీక్షణ ఉన్నవాళ్లకు ఉంటుంది.—ఆదికాండము 1:28; కీర్తన 115:16; యెషయా 45:18.

 అపోహ: ప్రకటన గ్రంథంలో ఉన్న 1,44,000 సంఖ్య సూచనార్థకమైనది. దానికి వేరే అర్థం ఉంది.

 నిజం: ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని సంఖ్యలు సూచనార్థకమైనవే. కానీ అందులోని కొన్ని సంఖ్యలు అక్షరార్థంగా కూడా ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు “గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు” గురించి ప్రకటనలో ఉంది. (ప్రకటన 21:14) అదేవిధంగా 1,44,000 అనే సంఖ్య అక్షరార్థంగా ఉపయోగించబడిందని, దానికి వేరే అర్థం లేదని చెప్పడానికి గల రుజువుల్ని పరిశీలించండి.

 “ముద్రించబడిన వాళ్ల సంఖ్య [లేదా, పరలోకానికి వెళ్లే వాళ్ల సంఖ్య] 1,44,000” అని ప్రకటన 7:4 వచనం చెప్తోంది. ఆ తర్వాతి వచనాల్లో భిన్నమైన మరో గుంపు గురించి ఉంది. అదే “ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం.” ‘గొప్ప సమూహంలోని వాళ్లు’ కూడా దేవుని నుండి రక్షణ పొందుతారు. (ప్రకటన 7:9, 10) ఒకవేళ 1,44,000 అనే సంఖ్య సూచనార్థకమైనదైతే, ఆ సంఖ్యను లెక్కపెట్ట లేనంత గుంపుతో పోల్చడంలో అర్థం ఉండదు కదా. a

 పైగా, 144,000 మంది “మనుషుల్లో నుండి ప్రథమఫలంగా కొనబడ్డారు” అని బైబిలు చెప్తోంది. (ప్రకటన 14:4) “ప్రథమ ఫలం” అనే మాట ఎంచుకోబడిన ఓ చిన్న గుంపును సూచిస్తుంది. భూమ్మీద ఉండే గొప్పసమూహాన్ని పరిపాలించే వాళ్లను అది సరిగ్గా వర్ణిస్తోంది.—ప్రకటన 5:10.

a అంతేకాదు ప్రకటన 7:4 వ వచనంలోని 1,44,000 అనే సంఖ్య గురించి ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఎల్‌. థామస్‌ ఇలా రాశాడు, “7:9 వచనంలో లెక్కపెట్టలేనంత పెద్ద సంఖ్యకు వ్యతిరేకంగా 1,44,000 అనే సంఖ్యను ఉపయోగించారు. ఒకవేళ ఆ సంఖ్యను సూచనార్థకంగా వాడారని అనుకుంటే, ఆ పుస్తకంలోని ప్రతీ సంఖ్యను సూచనార్థకంగానే వాడారని అనుకోవాల్సిందే.”—ప్రకటన 1-7: An Exegetical Commentary, 474వ పేజీ.