కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?

వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?

 “వాతావరణంలో మార్పు ఒక ముప్పులా తయారైంది. భూమ్మీద జీవించడం ఇప్పటికే కష్టమైపోతుంది.”—ద గార్డియన్‌.

 మనుషులు వాళ్లకువాళ్లే కొనితెచ్చుకున్న ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. భూమి ఉష్ణోగ్రత పెరగడానికి (గ్లోబల్‌ వార్మింగ్‌కి) మనుషుల పనులే కారణమని చాలామంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. భూమి ఉష్ణోగ్రత పెరగడంవల్ల వాతావరణంలో మార్పులు రావడమే కాదు, భయంకరమైన పర్యవసానాల్ని కూడా ఎదుర్కొంటున్నాం. వాటిలో కొన్ని ఏంటంటే:

  •   వడగాలులు, కరువులు, తుఫానులు ఎక్కువైపోతున్నాయి. వాటివల్ల కుండపోత వర్షాలు కురవడం, అడవులు తగలబడిపోవడం వంటివి మరీ ఎక్కువ జరుగుతున్నాయి.

  •   మంచు కొండలు, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఐస్‌ కరుగుతున్నాయి.

  •   సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.

 వాతావరణ సమస్య భూమంతటి మీద ప్రభావం చూపిస్తుంది. 193 దేశాల్లో ఉన్న పరిస్థితిని గమనించాక న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా చెప్తుంది: “భూమి తనను కాపాడమని అడుగుతుంది.” వాతావరణ మార్పువల్ల జరుగుతున్న మరణాలు, ఎదురౌతున్న ఇబ్బందుల్నిబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వాతావరణ మార్పును “మనుషుల ఆరోగ్యానికి పొంచివున్న అత్యంత పెద్ద ప్రమాదం” అని పిలుస్తుంది.

 అలాగని మనం కంగారుపడాల్సిన అవసరంలేదు. భవిష్యత్తు విషయంలో ఒక ఆశతో ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని బైబిలు ముందే చెప్పింది. అంతేకాదు దేవుడు చర్య తీసుకుంటాడని మనమెందుకు నమ్మవచ్చో, మనకొక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడో కూడా బైబిలు ముందే చెప్పింది.

వాతావరణంలో వచ్చే మార్పుల గురించి బైబిలు ముందే చెప్పిందా?

 అవును. మనకాలంలో భూమి ఉష్ణోగ్రత పెరగడంవల్ల వాతావరణంలో వచ్చే సమస్యల గురించి బైబిలు ముందే చెప్పింది.

 ప్రవచనం: దేవుడు ‘భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేస్తాడు.’—ప్రకటన 11:18.

 మనుషులు తమ పనులవల్ల భూమిని దాదాపు నాశనంచేసే సమయం వస్తుందని బైబిలు ముందే చెప్పింది. మనుషులవల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగిపోయి, ఇంతకుముందుకన్నా ఎక్కువగా పాడౌతుంది.

 మనుషులు ఈ భూమిని కాపాడలేరు అనడానికి ఒక కారణాన్ని ఈ ప్రవచనం తెలియజేస్తుంది. ప్రజలు భూమిని నాశనం చేస్తున్నప్పుడు దేవుడు చర్య తీసుకుంటాడని బైబిలు చెప్తుందని గమనించండి. కొంతమంది మంచి ఉద్దేశంతో పాడౌతున్న వాతావరణాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ వాళ్లెంత ప్రయత్నించినా భూమిని కాపాడడానికి వాళ్ల శక్తి చాలదు.

 ప్రవచనం: ‘భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి.’—లూకా 21:11.

 మనకాలంలో “భయంకరమైన దృశ్యాలు” లేదా భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బైబిలు ముందే చెప్పింది. వాతావరణంలో వస్తున్న మార్పులవల్ల ప్రపంచవ్యాప్తంగా కరువులు, భూకంపాలు లాంటి భయంకరమైన ప్రకృతి విపత్తులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల్లో, మనుషులు జీవించడానికి వీల్లేనంతగా ఈ భూమి పాడైపోతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు.

 ప్రవచనం: ‘చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, . . . విశ్వసనీయంగా ఉండనివాళ్లు, . . . మొండివాళ్లు, . . . నమ్మకద్రోహులు, మూర్ఖులు.’—2 తిమోతి 3:1-4.

 బైబిలు ముందే చెప్పినలాంటి ప్రజలు మనకాలంలో కనిపిస్తున్నారు. వాళ్లవల్లే వాతావరణం పాడౌతుంది. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు భవిష్యత్తు తరాల గురించి పట్టించుకోకుండా కేవలం డబ్బు గురించే ఆలోచిస్తున్నాయి. అవి కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ గ్లోబల్‌ వార్మింగ్‌ సమస్యను ఆపడానికి మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నాయి.

 ఈ ప్రవచనం బట్టి మనకొక విషయం అర్థమౌతుంది. ప్రజలు మారతారని, భూమిని కాపాడతారని మనం ఆశించలేం. నిజానికి తమ స్వార్థాన్ని చూసుకునేవాళ్లు “అంతకంతకూ చెడిపోతారు” అని బైబిలు చెప్తుంది.—2 తిమోతి 3:13.

దేవుడు భూమిని కాపాడడానికి ఏదోకటి చేస్తాడని మనమెందుకు నమ్మవచ్చు?

 మన సృష్టికర్తయైన యెహోవాకు a భూమిపట్ల, దానిమీద జీవించే ప్రజలపట్ల శ్రద్ధవుందని బైబిలు చెప్తుంది. ఆయన భూమిని కాపాడడానికి ఏదోకటి చేస్తాడని నమ్మకం కలిగించే మూడు బైబిలు లేఖనాల్ని పరిశీలించండి.

  1.  1. దేవుడు “భూమిని ఊరికే చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు.”—యెషయా 45:18.

     భూమిపట్ల దేవుడు తనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చి తీరతాడు. (యెషయా 55:11) ఆయన భూమిని నాశనం అవ్వనివ్వడు లేదా మనుషులు జీవించడానికి వీల్లేనంతగా పాడవ్వనివ్వడు.

  2.  2. “సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:11, 29.

     శాంతిగా ఉండే పరిస్థితుల్లో మనుషులు ఈ భూమ్మీద శాశ్వతకాలం జీవిస్తారని దేవుడు మాటిస్తున్నాడు.

  3.  3. “దుష్టులు భూమ్మీద ఉండకుండా నాశనం చేయబడతారు.”—సామెతలు 2:22.

     భూమిని పాడుచేసేవాళ్లతో పాటు అలవాటుగా చెడ్డపనులు చేసేవాళ్లను దేవుడు నాశనం చేస్తానని మాటిస్తున్నాడు.

మన భవిష్యత్తు కోసం దేవుడు ఏం చేస్తాడు?

 భూమి విషయంలో దేవుడు తన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడు? ఆయన భూవ్యాప్తంగా తన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. దాన్ని దేవుని రాజ్యమని పిలుస్తారు. (మత్తయి 6:10) ఆ రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది. దేవుడు మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేసి వాటి స్థానంలో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి భూమికి, వాతావరణానికి సంబంధించిన సమస్యల గురించి మానవ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఆ రాజ్యానికి ఉండదు.—దానియేలు 2:44.

 దేవుని రాజ్యం మనుషులతోపాటు ప్రకృతికి కూడా మంచి చేస్తుంది. (కీర్తన 96:10-13) యెహోవా దేవుడు తన రాజ్యం ద్వారా ఏం చేస్తాడో పరిశీలించండి.

  •   పాడైన వాతావరణాన్ని బాగుచేస్తాడు

     బైబిలు ఇలా చెప్తుంది: “ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి, ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.”—యెషయా 35:1.

     అంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనుషుల ఇష్టానుసారంగా పాడుచేసిన ప్రాంతాలతో పాటు భూమంతటిని యెహోవా బాగుచేస్తాడు.

  •   వాతావరణంలో విపరీతమైన మార్పులు రాకుండా చేస్తాడు

     బైబిలు ఇలా చెప్తుంది: “[యెహోవా] తుఫానును నిమ్మళింపజేస్తాడు; సముద్ర తరంగాలు నిశ్శబ్దమౌతాయి.”—కీర్తన 107:29.

     అంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ప్రకృతిని అదుపుచేసే శక్తి యెహోవాకు ఉంది. వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులవల్ల ప్రజలు ఇక ఎప్పుడూ ఇబ్బందిపడరు.

  •   భూమిని ఎలా కాపాడాలో మనుషులకు నేర్పిస్తాడు

     బైబిలు ఇలా చెప్తుంది: “నేను నీకు లోతైన అవగాహనను ఇస్తాను, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాను.”—కీర్తన 32:8.

     అంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? భూమిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను యెహోవా మనుషులకు ఇచ్చాడు. (ఆదికాండం 1:28; 2:15) ఆ బాధ్యతను చక్కగా ఎలా చేయాలో, భూమిని పాడుచేయకుండా ఎలా జీవించాలో ఆయన మనుషులకు నేర్పిస్తాడు.

a యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.