కంటెంట్‌కు వెళ్లు

భూమి నాశనమౌతుందా?

భూమి నాశనమౌతుందా?

బైబిలు ఇచ్చే జవాబు

 లేదు, భూగ్రహం ఎప్పటికీ నాశనం అవ్వదు, కాలిపోదు, లేదా దాని స్థానంలో ఇంకోటి రాదు. ఈ భూమి ఎప్పటికీ నివాసస్థలంగా ఉండేలా దేవుడు దాన్ని సృష్టించాడని బైబిలు బోధిస్తుంది.

  •   “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తనలు 37:29.

  •   “[దేవుడు] భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.”—కీర్తనలు 104:5.

  •   “భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.”—ప్రసంగి 1:4.

  •   “ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.”—యెషయా 45:18.

మానవులు భూమిని నాశనం చేస్తారా?

 కాలుష్యంతో, యుద్ధాలతో, మరే ఇతర వాటితోనైనా మనుషులు భూమిని పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు అనుమతించడు. బదులుగా ఆయన, “భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం” చేస్తానని చెప్తున్నాడు. (ప్రకటన 11:18) ఆయన వాళ్లను ఎలా నాశనం చేస్తాడు?

 భూమిని కాపాడలేని ఈ మానవ ప్రభుత్వాల స్థానంలో ఒక పరిపూర్ణ పరలోక రాజ్యాన్ని లేదా ప్రభుత్వాన్ని దేవుడు తీసుకొస్తాడు. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) ఆ రాజ్యాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిపాలిస్తాడు. (యెషయా 9:6, 7) యేసు భూమ్మీద ఉన్నప్పుడు ప్రకృతి శక్తుల్ని అద్భుతరీతిలో అదుపు చేశాడు. (మార్కు 4:35-41) దేవుని రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తుకు భూమిపై, దానికి సంబంధించిన వాటన్నిటిపై ఆయనకు పూర్తి అధికారం ఇవ్వబడుతుంది. అప్పుడు ఆయన భూమ్మీదున్న పరిస్థితుల్ని పూర్తిగా మార్చేస్తాడు లేదా కొత్తవిగా చేస్తాడు. అంటే ఏదెను తోటలో ఉన్నలాంటి పరిస్థితుల్నే మళ్లీ ఈ భూమ్మీదికి తీసుకొస్తాడు.—మత్తయి 19:28; లూకా 23:43.

భూమి అగ్ని వల్ల నాశనమౌతుందని బైబిలు బోధిస్తుందా?

 బైబిలు అలా బోధించట్లేదు. 2 పేతురు 3:7 వ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోకవడం వల్లే అలాంటి అపోహ వచ్చింది. ఆ వచనంలో ఇలా ఉంది: “ఇప్పుడున్న ఆకాశం, భూమి . . . అగ్నిలో నాశనం కావడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి.” ఆ మాటల భావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు ముఖ్యమైన విషయాల్ని గమనించండి:

  1.   బైబిల్లో “ఆకాశం” “భూమి” “అగ్ని” అనే పదాలకు ఒకదానికన్నా ఎక్కువ అర్థాలున్నాయి. ఉదాహరణకు, ఆదికాండము 11:1 ఇలా చెప్తుంది: “భూమియందంతట ఒక్క భాష” ఉండెను. ఇక్కడ, “భూమి” మానవ సమాజాన్ని సూచిస్తుంది.

  2.   రెండవ పేతురు 3:7 రాయబడిన సందర్భాన్ని గమనిస్తే, ఆ వచనంలో ప్రస్తావించిన పరలోకం, భూమి, అగ్ని వంటి పదాల అర్థం ఏమిటో తెలుస్తుంది. 5, 6 వచనాలు నోవహు కాలానికి, మన కాలానికి మధ్య ఉన్న ఒక పోలిక గురించి చెప్తున్నాయి. నోవహు కాలంలో ప్రాచీన లోకం నాశనమైంది, కానీ మన గ్రహమేమీ ఉనికిలో లేకుండా పోలేదు. జలప్రళయం వచ్చి అప్పుడున్న దుష్ట మానవ సమాజాన్ని లేదా “భూమిని” తుడిచిపెట్టుకుపోయింది. (ఆదికాండం 6:11) ఆ భూసమాజాన్ని పరిపాలిస్తున్న ప్రజల్ని సూచించే “ఆకాశం” లాంటిది ఆ జలప్రళయంలో నాశనమైంది. ఆ విధంగా, దుష్ట ప్రజలు నాశనమయ్యారు కానీ మన గ్రహం కాదు. నోవహు అతని కుటుంబం ఆ నాశనాన్ని తప్పించుకొని జలప్రళయం తర్వాత ఈ భూమ్మీదే జీవించారు.—ఆదికాండము 8:15-18.

 జలప్రళయం దుష్ట మానవుల్ని నాశనం చేసినట్లే, 2 పేతురు 3:7 లో ప్రస్తావించిన నాశనం లేదా “అగ్ని” దుష్ట మానవ సమాజాన్ని నాశనం చేస్తుందేగానీ ఈ భూమిని కాదు. దేవుడు ‘కొత్త ఆకాశాన్ని,’ ‘కొత్త భూమిని’ ఇస్తానని మాటిచ్చాడు. దానిలో “ఎప్పుడూ నీతి ఉంటుంది.” (2 పేతురు 3:13) దేవుని రాజ్యాన్ని సూచించే “కొత్త ఆకాశం” లేదా కొత్త నాయకత్వం, కొత్త మానవ సమాజాన్ని సూచించే “కొత్త భూమిని” పరిపాలిస్తుంది. ఆ రాజ్య పరిపాలనలో, భూమంతా శాంతికరమైన పరదైసులా మారుతుంది.—ప్రకటన 21:1-4.