కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్పు తీసుకోవాలా?

అప్పు తీసుకోవాలా?

‘అప్పు తీసుకోవడం పెళ్లి లాంటిది; తిరిగి ఇవ్వడం చావు లాంటిది.’ —స్వాహిలీ సామెత.

తూర్పు ఆఫ్రికా ప్రజలందరికీ ఈ సామెత బాగా తెలుసు. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లు అలానే ఆలోచిస్తారు. మీ స్నేహితుని నుండో వేరేవాళ్ల నుండో అప్పు తీసుకోవడం గురించి మీ అభిప్రాయమూ అదేనా? కొన్నిసార్లు అప్పు తీసుకోవడమే మంచిది అనిపించినా, అది నిజంగా మంచిదేనా? అప్పు తీసుకోవడంలో ఉన్న ప్రమాదాలు, చిక్కులు ఏమిటి?

మరో స్వాహిలీ సామెత అప్పు తీసుకోవడంలో అసలు సమస్య ఏమిటో ఇలా చెబుతుంది: “అప్పు తీసుకోవడం, ఇవ్వడం స్నేహాన్ని పాడు చేస్తుంది.” చెప్పాలంటే అప్పులు స్నేహాల్ని, బంధుత్వాల్ని ప్రమాదంలో పడేస్తాయి. ఎంత చక్కగా ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని మంచి కారణాలున్నా ప్రతీసారి మనం అనుకున్నట్టే జరగదు. ఉదాహరణకు, సమయం గడిచేకొద్దీ వాయిదాలు చెల్లించకపోతే, అప్పిచ్చిన వాళ్లకు కోపం రావచ్చు. కోపం పెరిగి అప్పు ఇచ్చిన-తీసుకున్న ఇద్దరి మధ్య, కొన్నిసార్లు రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయేంత వరకు రావచ్చు. అప్పుల వల్ల పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి, అప్పు తీసుకోవడాన్ని సులువైన పరిష్కారంగా చూసే బదులు చివరి అవకాశంగా చూడాలి.

అప్పు తీసుకోవడం దేవునితో మనకున్న సంబంధాన్ని కూడా దెబ్బతీయవచ్చు. ఎలా? చెడ్డవాళ్లే కావాలని తెలిసి కూడా అప్పులు తిరిగివ్వరని బైబిలు చెబుతుంది. (కీర్తన 37:21) “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు” అని కూడా ఉంది. (సామెతలు 22:7) అప్పు తీసుకున్నతను దాన్ని తిరిగి ఇచ్చేంత వరకు అప్పిచ్చిన వాళ్లకు జవాబుదారీ అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మరో ఆఫ్రికా సామెత ఇలా అంటుంది: “మీరు ఒకరి కాళ్లను అప్పుగా తీసుకుంటే, మీరు అతను చెప్పిన దారిలోనే నడవాలి.” దానర్థం, ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకుంటే ఇక మనకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛ పూర్తిగా పోతుంది.

కాబట్టి, తీసుకున్న వాటిని వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చెయ్యడమే అన్నిటికన్నా ముఖ్యం. లేదంటే, సమస్యలు పుట్టుకొస్తాయి. అప్పు కొండలా పెరిగి పోతుంటే దిగులు పెరుగుతుంది, రాత్రులు నిద్ర పట్టదు, పగలూరాత్రి కష్టపడాలి, భార్యాభర్తల మధ్య గొడవలొస్తాయి, కుటుంబాలు విచ్ఛిన్నమౌతాయి, కోర్టులు, కేసులు, జైళ్లు . . . ఇంకెన్నో. “ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు” అని రోమీయులు 13:8⁠లో ఉన్న మాటలు అక్షరాలా నిజం.

అప్పు చేయడం నిజంగా అవసరమా?

వీటన్నిటిని ఆలోచించిన తర్వాత అప్పు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ముందు జాగ్రత్తగా ఇలా ప్రశ్నించుకోండి: అప్పు తీసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? అప్పు చేస్తున్నది నిజంగా కుటుంబ కనీస అవసరాలు తీర్చడం కోసమేనా? లేక గొప్పగా జీవించాలనే అత్యాశతోనా? అప్పు తీసుకుని కష్టాల్లో పడడం కన్నా ఉన్నంతలోనే తృప్తిగా ఉండడం ఎంతో మేలు.

నిజమే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ఇంకేదారీ లేనప్పుడు అప్పు తీసుకోవడం తప్పదు. అప్పుడు నిజాయితీగా, నీతిగా ప్రవర్తించాలి. ఎలా?

ఎదుటివాళ్ల దగ్గర మీకన్నా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అని అప్పుచేయకూడదు. ఆస్తి ఉన్నంతమాత్రాన మనకు అప్పు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్లకు ఉందని ఎప్పుడూ అనుకోవద్దు. లేదా బాగా ఉన్నవాళ్లు కాబట్టి, మనం నిజాయితీగా తిరిగి చెల్లించాల్సిన అవసరమేమీ లేదులే అని కూడా అనుకోవద్దు. ఉన్నవాళ్లను చూసి కుళ్లుకోవద్దు.—సామెతలు 28:22.

కాబట్టి, అప్పు తీసుకున్న దాన్ని తప్పకుండా గడువులోపే చెల్లించండి. ఒకవేళ, అప్పు ఇచ్చినతను ఏ గడువూ పెట్టకపోయినా మీరే ఒక గడువు పెట్టుకుని, ఆ సమయానికి డబ్బు తిరిగి ఇవ్వండి. ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకుండా మీ ఒప్పందం గురించి నోటు రాసుకోవడం మంచిది. (యిర్మీయా 32:9, 10) వీలైతే, అప్పిచ్చినతని దగ్గరకు స్వయంగా మీరే వెళ్లి తీసుకున్నది తిరిగి చెల్లించండి. అప్పుడు అతనికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం మీకుంటుంది. నమ్మకంగా తిరిగిస్తే ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఒక ప్రసంగంలో యేసు, “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను” అని చెప్పాడు. (మత్తయి 5:37) అంతేకాకుండా ఈ బంగారు సూత్రాన్ని కూడా ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్తయి 7:12.

సహాయపడే మంచి సలహాలు

అప్పు తీసుకోవాలనే కోరికకు బైబిలు మంచి విరుగుడు చెబుతుంది: “సంతృప్తితో ఉండి, భక్తిని అవలంబిస్తే అదే ఒక గొప్ప ధనము.” (1 తిమోతి 6:6, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మరో మాటలో చెప్పాలంటే ఉన్నవాటితో సంతృప్తి పడితే, అప్పుల వల్ల వచ్చే చెడు పర్యవసానాలను తప్పించుకోవచ్చు. నిజమే తక్షణ పరిష్కారం, ఆనందం కోరుకునే ఈ లోకంలో సంతృప్తిగా ఉండడం అంత సులువేమీ కాదు. ఈ విషయంలోనే “భక్తి” సహాయం చేస్తుంది. ఎలా?

ఆసియాలో ఒక క్రైస్తవ దంపతులకు ఏమి జరిగిందో చూడండి. మొదట్లో వాళ్లు సొంత ఇల్లు ఉన్న వాళ్లను చాలా గొప్పగా చూసేవాళ్లు. కాబట్టి కూడబెట్టుకున్న డబ్బుతో; బ్యాంకులో, బంధువుల దగ్గర తీసుకున్న డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కున్నారు. కానీ కొంతకాలానికే పెద్ద మొత్తాల్లో వాయిదాలను కట్టడం చాలా కష్టమైపోయింది. పిల్లలతో కూడా సమయం గడపలేనంతగా ఎక్కువ గంటలు పని చేయాల్సివచ్చింది. ఆ భర్త ఇలా అన్నాడు: “ఒత్తిడి, బాధ, నిద్రలేకపోవడం వల్ల తలపై పెద్ద బండ మోస్తున్నట్లు అనిపించేది. ఊపిరి ఆడనట్లు అనిపించేది.”

‘ఆస్తిపాస్తుల విషయంలో దేవునిలా ఆలోచిస్తే ప్రమాదాల్లో పడము’

అయితే వాళ్లు 1 తిమోతి 6:6⁠లో ఉన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని ఇల్లు అమ్మేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు. చేసిన అప్పులు తీర్చడానికి వాళ్లకు రెండు సంవత్సరాలు పట్టింది. ఆ అనుభవం నుండి వాళ్లు ఏమి నేర్చుకున్నారు? వాళ్లు ఇలా అన్నారు: ‘ఆస్తిపాస్తుల విషయంలో దేవునిలా ఆలోచిస్తే ప్రమాదాల్లో పడము.’

మనం మొదట్లో చూసిన స్వాహిలి సామెత చాలామందికి తెలిసిందే. అయినా, ప్రజలు అప్పులు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటివరకు చూసిన బైబిలు సూత్రాలన్నీ జాగ్రత్తగా ఆలోచించి “నేను అప్పు తీసుకోవాలా?” అని ప్రశ్నించుకోవడం మంచిది. (w14-E 12/01)