కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | యువత

నా కోపాన్ని ఆపుకునేదెలా?

నా కోపాన్ని ఆపుకునేదెలా?

సమస్య

“మా అక్క మీద పెద్దపెద్దగా అరిచి తలుపును గోడకేసి కొట్టాను. ఎంత గట్టిగా కొట్టానంటే దాని వెనకున్న హుక్‌ గోడలో గుచ్చుకుపోయింది. గోడ మీద పడ్డ ఆ చిల్లును చూసినప్పుడల్లా నేను ఆ రోజు ఎంత పిచ్చిగా ప్రవర్తించానో గుర్తుకు వస్తుంది.”—అమల. a

“‘నువ్వు మంచి నాన్నవి కాదు!’ అని మా నాన్న మీద అరిచి తలుపు గట్టిగా వేశాను. కానీ తలుపు మూసుకునే ముందు నేను అన్న మాటలకు మా నాన్న మొహంలో బాధ చూశాను. ఆ సమయంలో, ఒక్క క్షణం వెనక్కి వెళ్లి నేను అలా అనకుండా నోరు కట్టేసుకుంటే బావుండేది అనిపించింది.”—శ్రావ్య.

అమల, శ్రావ్యలా మీరూ ఎప్పుడైనా చేశారా? అయితే, ఈ ఆర్టికల్‌ మీకు ఉపయోగపడుతుంది.

మీరు తెలుసుకోవాల్సినవి

కోపంతో అరిస్తే మీకున్న గౌరవం పోతుంది. 21 సంవత్సరాల బ్రియాన ఇలా అంటుంది: “నా చుట్టూ ఉన్నవాళ్లు నా కోపాన్ని భరించాల్సిందే అనుకునేదాన్ని. కానీ బాగా కోపంగా ఉన్నవాళ్లు పిచ్చిగా ప్రవర్తించడం నేను చూశాను. నేను కోపపడినప్పుడు కూడా అందరూ నన్ను అలానే చూస్తారు కదా అని నా కళ్లు తెరుచుకున్నాయి!”

దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును.”—సామెతలు 14:17.

మండుతున్న అగ్నిపర్వతం నుండి పారిపోయినట్లే, కోపాన్ని వెళ్లగక్కే వాళ్ల నుండి అందరూ పారిపోతారు

మీ కోపం వల్ల వేరేవాళ్లు మీకు దూరంగా ఉండవచ్చు. “కోపంతో అరిస్తే వేరేవాళ్లకు మీమీద గౌరవం, మర్యాద తగ్గుతుంది” అని 18 సంవత్సరాల డానియెల్‌ అంటున్నాడు. 18 సంవత్సరాల ఇలేన్‌ కూడా అలానే అంటుంది: “కోపపడడం పెద్ద గొప్పేమీ కాదు. మిమ్మల్ని చూసి మిగతావాళ్లు భయపడిపోతారు.”

దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము.”—సామెతలు 22:24.

మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. “ఏదైనా జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పలేరు కానీ ఆ పరిస్థితిలో మీరేం చేస్తారనేది మీ చేతిలోనే ఉంటుంది. కోపంగా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు” అని 15 సంవత్సరాల శారా అంటుంది.

దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు.”—సామెతలు 16:32.

ఇలా చేయండి

ఒక లక్ష్యం పెట్టుకోండి. “నేనింతే!” అనే బదులు, మీకు మీరే ఇంత కాలం అనుకుని, బహుశా ఒక ఆరు నెలల్లో నా కోపం తగ్గించుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి. ఆ ఆరు నెలల్లో మీరెలా ఉన్నారో రాసి పెట్టుకోండి. మీరు కోపంతో అరిచిన ప్రతిసారి ఈ మూడు విషయాలు రాసుకోండి: (1) అసలు ఏమి జరిగింది, (2) మీరెలా ప్రవర్తించారు, (3) ఎలా చేసి ఉంటే బాగుండేది, ఎందుకు బాగుండేది. ఈసారి కోపం వచ్చినప్పుడు మీరు రాసుకున్న మూడో విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. చిన్న చిట్కా: కోపం అదుపు చేసుకున్నప్పుడు కూడా రాసి పెట్టుకోండి. కోపపడకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు ఎంత హాయిగా అనిపించిందో రాయండి.—మంచి సలహా: కొలొస్సయులు 3:8.

ఏదైనా అనే ముందు కొంచెం ఆగండి. ఏదైనా, ఎవరైనా మీకు కోపం తెప్పిస్తే వెంటనే నోటికొచ్చినట్టు అనేయకండి. కొంచెం ఆగండి. అవసరమైతే గట్టిగా ఊపిరి పీల్చుకోండి. “ఊపిరి పీల్చుకునే సమయంలో ఏమి చెప్పాలో, ఏమి చేయాలో ఆలోచిస్తాను లేకపోతే తర్వాత నేనే బాధపడాల్సి వస్తుంది” అని 15 సంవత్సరాల ఎరిక్‌ అంటున్నాడు.—మంచి సలహా: సామెతలు 21:23.

అన్నివైపుల నుండి ఆలోచించండి. కొన్నిసార్లు ఒకవైపు నుండే ఆలోచిస్తాం అంటే మనకు జరిగిందే చూస్తాం. కానీ అవతలి వాళ్ల పరిస్థితి కూడా ఆలోచించాలి. “అవతలి వాళ్లు కోపంతో ఎంత అరిచినా వాళ్లు అలా మాట్లాడడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం గురించి ఆలోచించి నేను కోపం తగ్గించుకుంటాను” అని జెసిక చెప్తుంది.—మంచి సలహా: సామెతలు 19:11.

అవసరమైతే అక్కడనుండి వెళ్లిపోండి. “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము” అని దేవుని వాక్యం చెప్తుంది. (సామెతలు 17:14) ఆ మాటలో ఉన్నట్టు, కొన్నిసార్లు పరిస్థితి బాగా లేనప్పుడు అక్కడనుండి వెళ్లిపోవడం మంచిది. అక్కడే ఉండి దాని గురించే ఆలోచిస్తూ కోపం పెంచుకునే బదులు ఏదో ఒకటి చేయండి. “వ్యాయామం లేదా ఎక్సర్‌సైజ్‌ వల్ల ఆవేశపడడం తగ్గించుకుని, కోపం ఆపుకుంటాను” అని డాన్యెల్‌ చెప్తుంది.

వదిలేయడం నేర్చుకోండి. ‘కోపపడినపుడు పాపమును చేయకండి . . . మీ హృదయములలో ధ్యానము చేసికోండి మౌనముగా ఉండండి’ అని దేవుని వాక్యంలో ఉంది. (కీర్తన 4:4, పవిత్ర గ్రంథము కతోలిక అనువాదము) అంటే కోపం రావడంలో తప్పులేదు, కానీ కోపం వచ్చాక మీరేమి చేస్తారు? అనేది ముఖ్యం. “ఇతరులు మీకు కోపం తెప్పించడానికి అవకాశం ఇస్తే మీరు వాళ్ల చేతిలో బొమ్మలైపోయినట్టే. కాబట్టి వాళ్లేమి చేసినా మంచితనంతో ఆ విషయాన్ని చూసీచూడనట్టుగా వదిలేయండి” అని రిచర్డ్‌ అంటున్నాడు. అలా చేస్తే, కోపం మిమ్మల్ని అదుపు చేయదుగాని కోపాన్ని మీరు అదుపు చేస్తారు.

a కొన్ని పేర్లను మార్చాం.