కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | భార్యాభర్తలు

అత్తామామలతో ఎలా ఉండాలి?

అత్తామామలతో ఎలా ఉండాలి?

సమస్య

“మాకు ఒక సమస్య వచ్చినప్పుడు నా భార్య దాని గురించి వాళ్ల అమ్మానాన్నలకు చెప్పింది. తర్వాత వాళ్ల నాన్న నాకు సలహా ఇవ్వడానికి ఫోన్‌ చేశాడు. అది నాకస్సలు నచ్చలేదు.”—హేమంత్‌. a

“నా కొడుకు నాకు చాలా దూరమయ్యాడు అని మా అత్తగారు ఎప్పుడూ అంటుంది. వాళ్లు ఎంతగా కలిసి ఉండే వాళ్లో చెబుతుంది. ఆమె బాధ చూసి, నేను వాళ్ల కొడుకును పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో అనిపిస్తుంది.”—సునిత.

అత్తామామలతో సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్య కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

మీరు తెలుసుకోవాల్సినవి

పెళ్లితో ఒక కొత్త కుటుంబం మొదలవుతుంది. పెళ్లి చేసుకున్న అబ్బాయి “తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును” అని దేవుని వాక్యం చెబుతుంది. అమ్మాయి విషయంలోనూ అంతే. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు “వారిద్దరును ఏకశరీరము” అని దేవుని వాక్యం అంటుంది. వాళ్లిద్దరూ కలిసి ఇప్పుడు ఒక కొత్త కుటుంబం.—మత్తయి 19:5.

మీ అమ్మానాన్నలకన్నా మీ భర్త లేదా భార్యే ముఖ్యం. “పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరి మధ్య ‘మనం’ అనే ఆలోచన రావడం చాలా ముఖ్యం” అని భార్యాభర్తలకు సలహాలిచ్చే ప్రొఫెసర్‌ జాన్‌ ఎమ్‌. గాట్‌మెన్‌ రాశారు. “భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒక్కటే అనే భావన రావాలంటే మీ తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు కాస్త దూరం అవ్వాల్సి రావచ్చు.” b

కొందరు తల్లిదండ్రులకు కష్టంగానే ఉంటుంది. “పెళ్లికి ముందు నా భార్య వాళ్ల అమ్మానాన్నలు ఏది చెబితే అది చేసేది. పెళ్లి తర్వాత అమ్మానాన్నల కన్నా భర్తే ఎక్కువయ్యే సరికి ఆ విషయం మా అత్తయ్యకు కొంచెం కష్టమనిపించింది” అని కొత్తగా పెళ్లయిన ఒకతను అన్నాడు.

కొత్తగా పెళ్లయిన వాళ్లకు కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. “మామూలుగా మనకు నచ్చిన వాళ్లను స్నేహితులుగా చేసుకుంటాం. కానీ అత్తామామల విషయంలో అలాకాదు. ఎవరో అన్నట్లు ‘మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఇప్పుడు ఇద్దరు కొత్త స్నేహితులు ఉన్నారు.’ మీకు చిరాకు తెప్పించినా వాళ్లు మీ కుటుంబమే!” అని మొదట్లో మాట్లాడిన హేమంత్‌ అంటున్నాడు.

ఏమి చేయవచ్చు

అత్తామామల విషయంలో మీ ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటే, ఒకరిని ఒకరు అర్థంచేసుకుని సమస్యను పరిష్కరించుకోండి. “సమాధానము వెదకి దాని వెంటాడుము” అనే సలహాను పాటించండి.—కీర్తన 34:14.

ఎలా పాటించవచ్చో తెలుసుకోవడానికి కింద ఉన్న పరిస్థితుల్ని గమనించండి. భర్త లేదా భార్య తరఫు నుండి చెప్తున్నా ఆ పరిస్థితులు ఇద్దరిలో ఎవరికైనా ఎదురవ్వవచ్చు. ఇక్కడ ఇచ్చిన సలహాలు అత్తామామలతో వచ్చే ఇతర సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

మీరు వాళ్ల అమ్మతో మంచిగా ఉండాలని మీ భార్య చెప్తుంది. కానీ ఆమెతో మంచిగా ఉండడం అంత సులువు కాదు అని మీకనిపిస్తే . . .

ఇలా చేసి చూడండి: సమస్య ఏంటో మీ భార్యతో మాట్లాడండి. మీరనుకున్నట్లు కాకుండా ఆమె చెప్పినవి కొన్ని చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ విషయం మీ అత్తగారి గురించి కాదు, ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటానని మీరు మాటిచ్చిన మీ ప్రియమైన భార్య గురించి. ఒకట్రెండు విషయాల్లో ఇకముందు మీ అత్తగారితో మంచిగా ఉండడానికి ఏమి చేయవచ్చో మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆలోచించండి. వాటిని పాటించండి. మీ ప్రయత్నాల్ని చూసి మీ భార్యకు మీ మీద ఉన్న గౌరవం తప్పకుండా పెరుగుతుంది.—మంచి సలహా: 1 కొరింథీయులు 10:24.

మీరు తనకన్నా మీ అమ్మానాన్నల్నే ఎక్కువగా పట్టించుకుంటున్నారని మీ భర్త అంటే . . .

ఇలా చేసి చూడండి: సమస్య ఏంటో మీ భర్తతో మాట్లాడండి. ఆయన ఎందుకు అలా అనుకుంటున్నాడో తెలుసుకోండి. మీరు మీ అమ్మానాన్నలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నప్పుడు మీ భర్త ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. (సామెతలు 23:22) అయినా మీకు అమ్మానాన్నల కన్నా భర్తే ముఖ్యం అని మీ మాటల్లో, చేతల్లో చూపించాలి. ఆ నమ్మకం కలిగితే మీరు ఆయన్ని పట్టించుకోవట్లేదు అని అనుకోడు.—మంచి సలహా: ఎఫెసీయులు 5:33.

సలహాల కోసం మీ భార్య మిమ్మల్ని కాకుండా వాళ్ల అమ్మానాన్నల దగ్గరికి వెళ్తుంటే . . .

ఇలా చేసి చూడండి: ఏ విషయాల్లో సలహా కోసం అమ్మానాన్నలను అడగవచ్చో, ఏ విషయాల్లో అడగకూడదనుకుంటున్నారో మీ భార్యతో మాట్లాడండి. ప్రతీ చిన్న విషయానికి హద్దులు పెట్టకండి. అమ్మానాన్నల దగ్గర సలహాలు అస్సలు తీసుకోకూడదా? ఏయే విషయాల్లో వాళ్ల సలహా తీసుకోవచ్చు? మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని హద్దులు నిర్ణయించుకుంటే అసలు ఇది సమస్యగా మారదు.—మంచి సలహా: ఫిలిప్పీయులు 4:5.

a అసలు పేర్లు కావు.

b ద సెవెన్‌ ప్రిన్సిపిల్స్‌ ఫర్‌ మేకింగ్‌ మ్యారేజ్‌ వర్క్‌ పుస్తకం నుండి తీసుకున్నారు.