కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధలు, కష్టాలు

బాధలు, కష్టాలు

బాధలు, కష్టాలు

మనుషులు పడుతున్న బాధలకు కారణం దేవుడని లేదా ఆయన బాధల్లో ఉన్న వాళ్లను పట్టించుకోడని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

దేవుడే మనల్ని బాధపెడుతున్నాడా?

“దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు.”యోబు 34:12.

అందరూ ఏమంటున్నారు . . .

జరిగేవన్నీ దేవుని చిత్తమే అని కొంతమంది అంటారు. కాబట్టి, దేవుడే మనల్ని బాధపెడుతున్నాడని అనుకుంటారు. ఉదాహరణకు, ప్రకృతి విపత్తులు విరుచుకుపడినప్పుడు పాపులను శిక్షించడానికే దేవుడు వాటిని తెస్తున్నాడని వాళ్లు అనుకుంటారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

దేవుడు మనల్ని బాధపెట్టడని ఆయన వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు “నేను దేవునిచేత శోధింపబడుచున్నాను” అని చెప్పడం తప్పని దేవుని వాక్యం అంటుంది. ఎందుకంటే “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు.” (యాకోబు 1:13) ఇంకోమాటలో చెప్పాలంటే మన కష్టాలకు, వాటివల్ల వచ్చే బాధలకు దేవుడు కారణం కాదు. బాధ పెట్టడం చాలా చెడ్డ పని అలాంటి చెడు దేవుడు అస్సలు చేయడు.—యోబు 34:12.

మనల్ని బాధపెట్టేది దేవుడు కాకపోతే మరి ఎవరి వల్ల లేదా దేనివల్ల మనకీ కష్టాలు? బాధ కలిగించే విషయమేమిటంటే మనుషులే తోటి మనుషుల్ని రకరకాలుగా బాధ పెడుతున్నారు. (ప్రసంగి 8:9) అంతేకాకుండా ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నందుకు బాధలు వస్తాయి. (ప్రసంగి 9:11) “ఈ లోకాధికారి” సాతానే మనుషుల బాధలకు ముఖ్య కారణం ఎందుకంటే “లోకమంతయు దుష్టుని యందున్నది” అని దేవుని వాక్యంలో ఉంది. (యోహాను 12:31; 1 యోహాను 5:19) మనుషులను బాధపెట్టేది సాతానే కాని దేవుడు కాదు.

బాధల్లో దేవుడు మనల్ని పట్టించుకుంటాడా?

“వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.”యెషయా 63:9.

అందరూ ఏమంటున్నారు . . .

మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు చూసీచూడనట్టు వదిలేసి పట్టించుకోడని కొందరు అనుకుంటారు. మనం ఇన్ని బాధల్లో ఉన్నా దేవునికి అస్సలు జాలి, దయ లేదని ఒక రచయిత చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు ఉన్నా ఆయన మనుషుల్ని పూర్తిగా వదిలేశాడు అని ఆయన వాదిస్తున్నాడు.

దేవుడు ఏమంటున్నాడు . . .

దేవునికి దయ, జాలి లేవు అని కాకుండా మన బాధలను చూసి ఆయన చలించిపోతాడని, త్వరలోనే వాటిని అంతం చేస్తాడని దేవుని వాక్యంలో ఉంది. ఓదార్పునిచ్చే మూడు విషయాలు చూడండి.

మన బాధల గురించి దేవునికి బాగా తెలుసు. మనుషుల బాధలు మొదలైనప్పటి నుండి యెహోవా a అందరి కష్టాలను “తన కనుదృష్టిచేత” చూస్తున్నాడు. ఇప్పటి వరకు బాధతో కార్చిన ఒక్క కన్నీటి చుక్కని కూడా ఆయన మర్చిపోలేదు. (కీర్తన 11:4; 56:8) ఉదాహరణకు, పురాతన కాలంలో కొంతమంది ఆయన భక్తులను బాధలు పెట్టినప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని.” అయితే వాళ్ల బాధల గురించి దేవునికి పైపైనే తెలుసా? లేదు, ఎందుకంటే ఆ తర్వాత ఆయనిలా అన్నాడు: “వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.” (నిర్గమకాండము 3:7) వేరేవాళ్లకు మన కష్టాలు తెలియకపోయినా, పూర్తిగా అర్థంకాకపోయినా దేవునికి మనం పడుతున్న ప్రతీ కష్టం బాగా తెలుసన్న విషయంవల్ల చాలామంది ఓదార్పు పొందారు.—కీర్తన 31:7; సామెతలు 14:10.

మనం బాధపడినప్పుడు దేవుడు కూడా బాధపడతాడు. దేవునికి మనుషుల బాధలు తెలియడమే కాదు వాటిని చూసి ఆయన బాధపడతాడు కూడా. ఉదాహరణకు భక్తులు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు ఎంతో బాధపడ్డాడు. “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను” అని ఆయన వాక్యం చెప్తుంది. (యెషయా 63:9) మనుషుల కన్నా దేవుడు చాలా గొప్పవాడే కానీ మన బాధల్ని చూసి ఆయన హృదయం చలించిపోతుంది, స్వయంగా ఆయనకే ఆ కష్టం వచ్చినంత బాధపడతాడు. “ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడు.” (యాకోబు 5:11) అంతేకాదు, బాధలు తట్టుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు.—ఫిలిప్పీయులు 4:12, 13.

దేవుడు బాధలను పూర్తిగా తీసేస్తాడు. భూమ్మీదున్న ప్రతీ ఒక్కరి కష్టాలను తీసేస్తానని దేవుడు చెప్తున్నాడు. యెహోవా తన పరిపాలన ద్వారా మనుషుల పరిస్థితిని ఒక్కసారిగా బాగుచేస్తాడు. అప్పుడు దేవుడు ‘వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోతాయి’ అని మాటిచ్చాడు. (ప్రకటన 21:4) మరి ఇప్పటివరకు చనిపోయినవాళ్ల సంగతేమిటి? ఈ భూమ్మీద బాధలు లేకుండా సంతోషంగా జీవించడానికి దేవుడు వాళ్లను మళ్లీ బ్రతికిస్తాడు. (యోహాను 5:28, 29) అప్పుడు మనం అనుభవించిన కష్టాల జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చి పీడిస్తాయా? లేదు, ఎందుకంటే “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు” అని యెహోవా మాటిస్తున్నాడు.—యెషయా 65:17. b

a దేవుని పేరు యెహోవా అని ఆయన వాక్యంలో ఉంది.

b బాధలను దేవుడు కొంతకాలం ఎందుకు అనుమతించాడో, వాటిని పూర్తిగా ఎలా తీసేస్తాడో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 811 అధ్యాయాలు చూడండి.