కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2

వినయం ఎలా చూపించాలి?

వినయం ఎలా చూపించాలి?

వినయం అంటే ఏంటి?

వినయంగా ఉండేవాళ్లు గౌరవంగా, మర్యాదగా ఉంటారు. అహంకారంగా ప్రవర్తించరు, లేదా వేరేవాళ్లు తమని ప్రత్యేకంగా చూడాలని కోరుకోరు. వినయంగా ఉన్నవాళ్లు ఎదుటివాళ్ల మీద నిజమైన ఇష్టం చూపిస్తారు, వాళ్లనుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

కొన్నిసార్లు వినయాన్ని ఒక బలహీనతగా చూస్తారు. కానీ నిజానికి, అది మన సొంత తప్పుల్ని, మనకున్న పరిమితుల్ని గుర్తించడానికి సహాయం చేసే ఒక శక్తివంతమైన లక్షణం.

వినయం ఎందుకు ముఖ్యం?

  • వినయం వల్ల సంబంధాలు బాగుంటాయి. “వినయంగా ఉండేవాళ్లు అందరితో ఎక్కువగా కలిసిపోతారు,” అని ద నార్సిసిసమ్‌ ఎపిడెమిక్‌ అనే పుస్తకం చెప్తుంది. ఆ పుస్తకంలో ఇంకా ఏమని ఉందంటే వినయం ఉన్నవాళ్లకు “వేరేవాళ్లతో మాట్లాడడం కలవడం సులువుగా ఉంటుంది.”

  • వినయం మీ పిల్లల భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. వినయంగా ఉండడం నేర్చుకుంటే మీ పిల్లలకు ఇప్పుడు భవిష్యత్తులో కూడా మేలు జరుగుతుంది. ఉదాహరణకు, ఉద్యోగం సంపాదించుకునే సమయంలో అది ఉపయోగపడుతుంది. “విపరీతమైన ఆత్మాభిమానంతో తనలో ఉన్న లోపాలు తెలియని యువకుడు జాబ్‌ ఇంటర్వ్యూలో మంచి అభిప్రాయం సంపాదించుకునే అవకాశాలు తక్కువ,” అని డా. లినార్డ్‌ శాక్స్‌ రాశారు. “కానీ ఉద్యోగం ఇచ్చేవాళ్లు చెప్పే విషయాల మీద నిజమైన శ్రద్ధ చూపించే యువకునికి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.” *

వినయం ఎలా నేర్పించాలి

తన గురించి తాను సరిగ్గా ఆలోచించుకునేలా సహాయం చేయండి.

మంచి సూత్రాలు: “ఒక వ్యక్తి గొప్పవాడు కాకపోయినా గొప్పవాణ్ణని అనుకుంటే, తనను తాను మోసం చేసుకుంటున్నట్టే.”—గలతీయులు 6:3.

  • పిల్లలను తప్పుదారి పట్టించే మాటలు చెప్పకండి. “నీ కలలన్నీ నిజం అవుతాయి,” “నువ్వు ఏది కావాలంటే అది అవ్వగలవు” అనే మాటలు చాలా ప్రేరేపించేలా అనిపించవచ్చు, కానీ నిజ జీవితంలో అవి చాలావరకు జరగవు. వాళ్లు చేరుకోగలిగిన లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోవడానికి కష్టపడి పనిచేస్తే మీ పిల్లలు ఎక్కువ విజయవంతం అయ్యే అవకాశం ఉంది.

  • ప్రత్యేకంగా వాళ్ల పనులను పొగడండి. మీ పాప లేదా బాబుకు వాళ్లు “సూపర్‌” అని చెప్పి ఊరుకుంటే వినయం రాదు. వాళ్లను ఎందుకు మెచ్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాలి.

  • ఇంటర్నెట్‌, చాటింగ్‌ విషయంలో హద్దులు పెట్టండి. చాలావరకు సోషల్‌ మీడియా లేదా చాటింగ్‌ సైట్లలో మన గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటాం. అందరూ వాళ్లవాళ్ల సామర్థ్యాలను, వాళ్లు సాధించినవాటిని చూపించుకుంటూ ఉంటారు. అది వినయానికి పూర్తి వ్యతిరేకం.

  • వెంటనే క్షమాపణ అడిగేలా మీ పిల్లలకు నేర్పించండి. మీ పిల్లవాడు ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకుని దాన్ని ఒప్పుకునేలా సహాయం చేయండి.

కృతజ్ఞతను పెంచండి.

మంచి సూత్రాలు: “కృతజ్ఞులై ఉండండి.”—కొలొస్సయులు 3:15.

  • సృష్టిపట్ల కృతజ్ఞత. పిల్లలు ప్రకృతికున్న విలువను, మనం జీవించడానికి అది ఎంత అవసరం అనే విషయాలను అర్థం చేసుకోవాలి. మనకు పీల్చడానికి గాలి, త్రాగడానికి నీరు, తినడానికి ఆహారం అవసరం. ఈ ఉదాహరణలు ఉపయోగించి సృష్టిలో ఉన్న అద్భుతాల పట్ల వాళ్లలో గౌరవాన్ని, ఆశ్చర్యాన్ని, కృతజ్ఞతను పెంచండి.

  • మనుషుల పట్ల కృతజ్ఞత. ప్రతి ఒక్కరు మనకన్నా ఏదో ఒక విషయంలో గొప్పవాళ్లే అని మీ పిల్లవాడికి గుర్తు చేయండి. వేరేవాళ్లకున్న నైపుణ్యాలు, సామర్థ్యాలు చూసి కుళ్లుకునే బదులు వాళ్లనుండి నేర్చుకోవచ్చని పిల్లలకు చెప్పండి.

  • కృతజ్ఞత బయటకు చూపించడం. మీ పిల్లలకు థాంక్యూ చెప్పడం నేర్పించండి, కేవలం మాటల్లో చెప్పడమే కాదు గానీ నిజమైన కృతజ్ఞతతో ఉండేలా నేర్పించండి. కృతజ్ఞత చూపించే మనసు వినయంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది.

వేరేవాళ్లకు సహాయం చేయడం చాలా విలువైనదని మీ పిల్లలకు నేర్పించండి.

మంచి సూత్రాలు: “వినయంతో ఇతరులు మీకన్నా గొప్పవాళ్లని ఎంచండి. మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:3, 4.

  • మీ పిల్లలు ఇంటి పనులు చేయాలి. పిల్లలు ఇంట్లో పనులు చేయాల్సిన అవసరం లేదని మీరు చెప్తే, వాళ్లకు ఇష్టమైన పనులకన్నా ఇంట్లో పనులు అంత ముఖ్యం కాదని పిల్లలు అనుకుంటారు. కానీ ముందు ఇంట్లో పనులే ముఖ్యం ఆ తర్వాతే ఆటలు. ఇంట్లో పనులు చేయడం వల్ల అందరికీ ఎలా మేలు జరుగుతుందో, అందరూ వాళ్లను ఎలా మెచ్చుకుని గౌరవిస్తారో మీ పిల్లలకు చెప్పండి.

  • వేరేవాళ్లకు సేవచేయడం చాలా గొప్పదని చెప్పండి. వేరేవాళ్లకు ఏమైనా చేసిపెట్టడం పరిణతి సాధించడానికి ముఖ్యమైన మార్గం. కాబట్టి ఎవరు అవసరంలో ఉన్నారో ఆలోచించమని మీ పిల్లలను ప్రోత్సహించండి. వాళ్లకు సహాయం చేయడానికి మీ పిల్లవాడు ఏమి చేయవచ్చో వాడితో మాట్లాడండి. వేరేవాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు మీ పిల్లలను మెచ్చుకోండి వాళ్లకు మద్దతు ఇవ్వండి.

^ పేరా 8 ద కొలాప్స్‌ ఆఫ్‌ పేరెంటింగ్‌ అనే పుస్తకం నుండి తీసుకోబడింది.