కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | తల్లిదండ్రులు

పిల్లలకు వినయాన్ని నేర్పించండి

పిల్లలకు వినయాన్ని నేర్పించండి

సమస్య

  • మీ కొడుకు చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నాడు—వాడికి ఇంకా పది సంవత్సరాలే!

  • ప్రతి ఒక్కరు వాడిని స్పెషల్‌గా చూడాలని వాడు అనుకుంటాడు.

ఎందుకు ఇలా తయారు అయ్యాడు? అని మీరు అనుకోవచ్చు. ‘వాడి గురించి వాడు మంచిగా అనుకోవాలని నేను కోరుకుంటున్నాను, కానీ అందరికన్నా వాడే మంచివాడు అని అనుకోకూడదు.’

పిల్లల ఆత్మ గౌరవం దెబ్బ తినకుండా వాళ్లకు వినయాన్ని నేర్పించడం సాధ్యమేనా?

మీరు తెలుసుకోవాల్సినవి

ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా పిల్లల కోరికలకు తగ్గట్టుగా ఉండాలి, పొగిడేంత పనులు వాళ్లేమీ చేయకపోయినా వాళ్లను బాగా పొగడాలి, వాళ్లను కరెక్ట్‌ చేయకూడదు, వాళ్లకు క్రమశిక్షణ ఇవ్వకూడదు అని తల్లిదండ్రులు ప్రోత్సహించబడుతున్నారు. పిల్లలు చాలా స్పెషల్‌ అని అనుకునేలా చేస్తే, వాళ్లు మంచి ఆత్మాభిమానంతో పెరుగుతారని అనుకుంటున్నారు. కానీ ఫలితాలు ఏమి చూపిస్తున్నాయి? జెనరేషన్‌ మీ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “అన్నిటికీ చక్కగా సర్దుకుపోయి, సంతోషంగా ఉండే పిల్లల్ని సృష్టించే బదులు, ఆత్మాభిమానం అనే ఈ ప్రయత్నం అహంకారులైన చిన్ని సైనికుల్ని తయారు చేస్తుంది.”

అవసరం లేకపోయినా ఎప్పుడూ పొగుడుతూ పెంచితే పిల్లలు వాళ్లు అనుకున్నది జరగనప్పుడు, ఎవరైనా తప్పు పట్టినప్పుడు లేదా ఏదైనా విషయంలో ఓడిపోయినప్పుడు తట్టుకునే స్థితిలో ఉండరు. వాళ్ల సొంత కోరికలు మీదే మనసు పెట్టేలా నేర్పించబడ్డారు కాబట్టి పెద్దవాళ్లు అయ్యాక వాళ్లకు చిరకాలం ఉండే స్నేహాలను ఏర్పర్చుకోవడం కష్టంగా ఉంటుంది. దానివల్ల చాలామంది టెన్షన్‌తో, డిప్రెషన్‌తో బాధపడతారు.

పిల్లలు ఎప్పుడూ స్పెషల్‌ అని అనుకునేలా చేయడంవల్ల నిజమైన ఆత్మగౌరవాన్ని పెంచుకోరు కానీ వాళ్లు నిజంగా ఏదైనా సాధించడం ద్వారా పెంచుకుంటారు. అలా చేయాలంటే వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉంటే సరిపోదు. వాళ్లు ఎన్నుకున్న నైపుణ్యాల్ని బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్‌ చేయాలి, వాటిని మెరుగుపర్చుకుంటూ ఉండాలి. (సామెతలు 22:29) వేరే వాళ్ల అవసరాల గురించి కూడా పట్టించుకోవాలి. (1 కొరింథీయులు 10:24) ఇదంతా జరగాలంటే వినయం ఉండాలి.

ఏమి చేయవచ్చు

నిజంగా పొగడాల్సినప్పుడే పొగడండి. మీ పాపకు స్కూల్‌ పరీక్షలో మంచి మార్కులు వస్తే మెచ్చుకోండి. కానీ తక్కువ మార్కులు వస్తే వెంటనే టీచర్‌ని తప్పుపట్టకండి. అలాచేస్తే మీ పాప వినయం నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈసారి పరీక్షల్లో ఆమె మంచిగా ఎలా మార్కులు తెచ్చుకోవచ్చో తెలుసుకోవడానికి సహాయం చేయండి. వాళ్లు నిజంగా ఏదైనా సాధించిన సందర్భాల కోసం మీ పొగడ్తల్ని దాచిపెట్టుకోండి.

అవసరమైనప్పుడు కరెక్ట్‌ చేయండి. అంటే దానర్థం, వాళ్లు తప్పు చేసిన ప్రతీసారి వాళ్లను తప్పు పట్టాలని కాదు. (కొలొస్సయులు 3:21) కానీ పెద్ద తప్పుల్ని మాత్రం సరిచేయాలి. తప్పుగా ఆలోచిస్తుంటే కూడా సరిచేయాలి. లేకపోతే అలాంటి లక్షణాలు వాళ్లలో బాగా పాతుకుపోతాయి.

ఉదాహరణకు, మీ కొడుకులో మరీ ఎక్కువగా గొప్పలు చెప్పుకునే లక్షణం కనిపిస్తుంది అనుకోండి. దాన్ని సరిదిద్దకపోతే పొగరుబోతులుగా అవుతారు, లేదా వేరేవాళ్లతో కలవకుండా ఉండడం మొదలుపెట్టవచ్చు. కాబట్టి గొప్పలు చెప్పుకుంటే చెడ్డవాడిగా అనుకుంటారు లేదా ఎప్పుడైనా పరువు పోవచ్చు అని మీ బాబుకి చెప్పండి. (సామెతలు 27:2) అంతేకాదు మన గురించి మనం సరిగ్గా ఆలోచించుకున్నప్పుడు వేరేవాళ్లకు మన ప్రతిభ గురించి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా మీ పిల్లలకు వివరించండి. ప్రేమతో అలాంటి దిద్దుబాటును ఇవ్వడం వల్ల వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినకుండానే మీరు పిల్లలకి వినయం నేర్పించవచ్చు.—మంచి సలహా: మత్తయి 23:12.

జీవితంలో అనుభవాలకు మీ పిల్లలను సిద్ధం చేయండి. మీ పిల్లలు కోరుకున్న ప్రతీది వాళ్లకు చేయాలని మీరు అనుకుంటే వాళ్లు చాలా గొప్పవాళ్లని అనుకునేలా మీరు చేస్తున్నారు. ఉదాహరణకు మీ పిల్లలు మీ స్తోమతకు మించింది ఏదైనా అడిగితే మనకు ఉన్నంతలోనే జీవించడం ఎందుకు అవసరమో నేర్పించండి. మీరు ఏదైనా టూర్‌ ఒద్దు అనాల్సివస్తే జీవితంలో నిరాశలు సహజమని వివరించవచ్చు, బహుశా అలాంటి నిరాశ కలిగినప్పుడు మీరైతే ఏమి చేస్తారో కూడా చెప్పవచ్చు. ప్రతీ కష్టం నుండి మీ పిల్లల్ని కాపాడే బదులు, పెద్దయ్యాక వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి వాళ్లను సిద్ధం చేయండి.—మంచి సలహా: సామెతలు 29:21.

ఇతరులకు ఇవ్వడం అలవాటు చేయండి. “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అనే విషయాన్ని మీ పిల్లల ముందు రుజువు చేయండి. (అపొస్తలుల కార్యాలు 20:35) ఎలా? ఎవరికైనా షాపింగ్‌ చేయాల్సి ఉంటే, బయటకు వెళ్లిరావడానికి సహాయం కావాల్సి ఉంటే లేదా ఏదైనా రిపేరు చేయాల్సి ఉంటే అలాంటి వాళ్ల లిస్ట్‌ ఒకటి మీరు కలిసి తయారు చేయండి. తర్వాత వాళ్లకు సహాయం చేయడానికి మీరు వెళ్తుంటే మీతోపాటు మీ పిల్లల్ని తీసుకెళ్లండి. వేరేవాళ్ల అవసరాలు చూసుకుంటుండగా మీరు పొందే ఆనందాన్ని, సంతృప్తిని చూసే అవకాశం మీ పిల్లలకు ఇవ్వండి. అలా మీ పిల్లలకు మీరు చాలా శక్తివంతమైన పద్ధతిలో వినయం నేర్పిస్తారు.—మంచి సలహా: లూకా 6:38.