కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విపత్తు వచ్చినప్పుడు

విపత్తు వచ్చినప్పుడు

“మొదట్లో మాకు ఏ ఆశా లేదనిపించింది, మాకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది.”—ఆండ్రూ, సియర్రా లియోన్‌.

“తుఫాను తర్వాత మేం ఇంటికి తిరిగొచ్చాం. అక్కడ మాకు ఏమీ మిగల్లేదు, అది చూసి మా నోట మాట రాలేదు. నా కూతురు నేలమీద పడి ఏడ్చింది.”—డేవిడ్‌, వర్జిన్‌ దీవులు.

మీరు ఎప్పుడైనా విపత్తుకు గురై ఉంటే, అలాంటి వాళ్లకు ఎలా అనిపిస్తుందో మీరు అర్థం చేసుకోగలరు. వాళ్లు షాక్‌లో ఉంటారు, నమ్మలేని స్థితిలో ఉంటారు, అంతా అయోమయంగా ఉంటుంది, ఆందోళన పడుతుంటారు, పీడకలలు వస్తుంటాయి. తీవ్రమైన నిరాశ వల్ల, అలసట వల్ల చాలామందిలో మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనే కోరిక కూడా చచ్చిపోతుంది.

ఒకవేళ విపత్తు వల్ల మీరు సర్వం కోల్పోయి ఉంటే, మీకు కూడా ఒత్తిడిని, ఆందోళనను తట్టుకునే శక్తి ఇక లేదని అనిపించవచ్చు. అంతేకాదు మీరు జీవితం మీద ఆశను కోల్పోవచ్చు. అయితే జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండడానికి, మెరుగైన భవిష్యత్తు కోసం కనిపెట్టుకొని ఉండడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది.

బైబిల్లో ఉన్న సత్యం జీవితం మీద ఆశను చిగురింపజేస్తుంది

ప్రసంగి 7:8లో ఇలా ఉంది: “కార్యారంభముకంటె కార్యాంతము మేలు.” మీరు విపత్తు నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లయితే జీవితం మీద మీకు ఎలాంటి ఆశ ఉండకపోవచ్చు. కానీ మీరు కొత్త జీవితం మొదలుపెట్టడానికి ఓపిగ్గా కృషిచేస్తే మళ్లీ పరిస్థితులు చక్కబడతాయి.

‘రోదన ధ్వని, విలాప ధ్వని ఇక వినబడని’ కాలం వస్తుందని బైబిలు చెప్పింది. (యెషయా 65:19) దేవుని పరిపాలన కింద ఈ భూమి ఒక అందమైన తోటగా మారినప్పుడు ఆ మాట నిజమౌతుంది. (కీర్తన 37:11, 29) అప్పుడు విపత్తులు అనేవే ఉండవు. ఎలాంటి చేదు జ్ఞాపకాలైనా, దీర్ఘకాలంగా అనుభవించిన వేదనైనా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే సర్వశక్తిగల దేవుడు ఇలా మాటిస్తున్నాడు: “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.”—యెషయా 65:17.

ఒక్కసారి ఆలోచించండి, సృష్టికర్త “మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ” సిద్ధం చేశాడు. మీరు దేవుని పరిపూర్ణ పాలన కింద మనశ్శాంతితో జీవించవచ్చు. (యిర్మీయా 29:11, NW) ఆ మాట నిజమని నమ్మితే, మీకు జీవితం మీద ఆశ చిగురిస్తోందా? ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించిన శాలీ ఇలా అంటోంది, “భవిష్యత్తులో దేవుని రాజ్యం చేయబోయే అద్భుతమైన విషయాలను గుర్తుచేసుకున్నప్పుడు మీరు గతాన్ని మర్చిపోయి ముందుకు సాగగలుగుతారు.”

త్వరలో దేవుని రాజ్యం మనుషుల కోసం చేయబోయే పనులన్నిటి గురించి మీరు ఎందుకు తెలుసుకోకూడదు? అలా తెలుసుకుంటే, విపత్తు వల్ల మీరు ఎంత బాధ అనుభవించినా సరే జీవితం మీద మీలో ఆశ చిగురిస్తుంది. అంతేకాదు విపత్తులు ఉండని రోజుల కోసం ఎదురుచూస్తారు. ఈలోపు విపత్తు వల్ల వచ్చే కష్టాలను తట్టుకోవడానికి బైబిలు చక్కని సలహాల్ని ఇస్తుంది. కొన్ని సలహాలను గమనించండి.