కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు

“మా అన్నయ్య అకస్మాత్తుగా చనిపోయినప్పుడు నాకు అంతా కోల్పోయినట్టు అనిపించింది. నెలలు గడిచినా, ఒక్కసారిగా అన్నయ్య గుర్తొచ్చేవాడు, ఎవరో నన్ను కత్తితో పొడుస్తున్నట్టు అనిపించేది. కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది. అసలు మా అన్నయ్య ఎందుకు చనిపోయాడు? నేను అన్నయ్యతో ఎక్కువ సమయం గడపలేదని చాలా బాధపడేదాన్ని.”—వనెసా, ఆస్ట్రేలియా.

మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోయుంటే బాధ, ఒంటరితనం, అంతా కోల్పోయినట్టు అనిపించడం వంటి రకరకాల భావోద్వేగాలు మీకు కూడా కలిగివుండవచ్చు. బహుశా కోపం, తప్పు చేశానన్న బాధ, భయం కూడా మీలో కలిగివుండవచ్చు. చివరికి మీరు జీవితం మీద ఆశ కోల్పోయివుండవచ్చు.

ఏడ్వడం మీ బలహీనత అని ఎప్పుడూ అనుకోకండి. అది మీ వాళ్ల మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. అయినాసరే, మీ బాధ నుండి కాస్త ఉపశమనం పొందడం సాధ్యమేనా?

కొంతమంది ఎలా సహించారు?

మీ బాధ ఎప్పటికీ తీరేది కాదని అనిపించినా, ఈ సలహాలు మీకు ఓదార్పునిస్తాయి:

మీ బాధను వెళ్లగక్కండి, కోలుకోవడానికి సమయం తీసుకోండి

అందరూ ఒకేలా బాధపడరు, కోలుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది. అయినా సరే ఏడ్వడం వల్ల మీ బాధ కొంచెం తగ్గుతుంది. ముందు ప్రస్తావించిన వనెసా ఇలా చెప్తుంది, “నా బాధ నుండి ఉపశమనం పొందడానికి నేను ఏడ్చేదాన్ని.” సుజాత వాళ్ల చెల్లి హఠాత్తుగా చనిపోయింది. ఆమె ఇలా అంటోంది: “జరిగిన విషాదం గురించి ఆలోచించడం చాలా బాధగా ఉంటుంది. అది గాయం మీదున్న కట్టును విప్పి, దాన్ని శుభ్రం చేయడం లాంటిది. అది తట్టుకోవడం చాలా కష్టం, కానీ గాయం మానాలంటే అలా చేయడం తప్పనిసరి.”

మీ ఆలోచనలు, భావాలు ఇతరులకు చెప్పండి

నిజమే మీకు కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. అయితే మీ అంతట మీరే దుఃఖాన్ని తట్టుకోవడం చాలా కష్టం. 17 సంవత్సరాల జాన్‌ వాళ్ల నాన్న చనిపోయాడు. అతనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “నా భావాలను ఇతరులతో పంచుకునేవాణ్ణి. నా భావాలను సరిగ్గా చెప్పలేకపోయినా ఇతరులతో వాటిని పంచుకున్నందుకు సంతోషంగా ఉంది.” దాని వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది. మొదటి ఆర్టికల్‌లో ప్రస్తావించిన జానస్‌ ఇలా చెప్తుంది: “ఇతరులతో మాట్లాడినప్పుడు చాలా ఊరటగా ఉంటుంది. దానివల్ల వాళ్లు నా భావాలను అర్థం చేసుకుంటున్నట్టు, నేను ఒంటరిదాన్ని కాదన్నట్టు అనిపించేది.”

సహాయాన్ని అంగీకరించండి

ఒక డాక్టరు ఇలా చెప్తున్నాడు: “బాగా ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు వెంటనే స్నేహితుల, బంధువుల సహాయం తీసుకుంటే దుఃఖాన్ని తేలిగ్గా తట్టుకోగలుగుతారు, దాన్నుండి త్వరగా బయటపడగలుగుతారు.” మీకు ఎలాంటి సహాయం కావాలో మీ స్నేహితులకు చెప్పండి. మీకు సహాయం చేయాలనే కోరిక వాళ్లకు ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో వాళ్లకు తెలియకపోవచ్చు.—సామెతలు 17:17.

దేవునికి దగ్గరవ్వండి

టీనా ఇలా చెప్తుంది: “క్యాన్సర్‌ వల్ల నా భర్త హఠాత్తుగా చనిపోయినప్పుడు నా సమస్యలు, బాధలు, భావాలు ఎవరికి చెప్పుకోవాలో నాకర్థం కాలేదు. కాబట్టి నేను ప్రతీది దేవునితో చెప్పుకునేదాన్ని. మళ్లీ ఎప్పటిలా జీవించడానికి సహాయం చేయమని ప్రతీరోజు దేవుణ్ణి అడిగేదాన్ని. దేవుడు నాకు ఎన్ని విధాలుగా సహాయం చేశాడో మాటల్లో చెప్పలేను.” త్రిషా వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు త్రిషాకు 22 ఏళ్లు. ఆమె ఇలా చెప్తుంది: “ప్రతీరోజు బైబిలు చదవడం వల్ల ఓదార్పు పొందాను. మంచి విషయాల గురించి ఆలోచించేలా అది నాకు సహాయం చేసింది.”

పునరుత్థానాన్ని ఊహించుకోండి

టీనా ఇంకా ఇలా చెప్తుంది: “మొదట్లో పునరుత్థాన నిరీక్షణ నాకు అంతగా ఓదార్పునివ్వలేదు. ఎందుకంటే ఆ సమయంలో నాకు నా భర్త అవసరం, నా పిల్లలకు వాళ్ల నాన్న అవసరం. అయితే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆ నిరీక్షణ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు నా జీవితానికి అదే ఆధారం. నేను నా భర్తను మళ్లీ కలుసుకున్నట్టు ఊహించుకుంటే నాకు చాలా మనశ్శాంతిగా, సంతోషంగా ఉంటుంది!”

మీ బాధ నుండి వెంటనే ఉపశమనం దొరక్కపోవచ్చు. అయితే వనెసా అనుభవం మనకు భరోసానిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది: “మీరు ఎప్పటికీ మళ్లీ మామూలుగా అవ్వలేరని మీకు అనిపించవచ్చు, కానీ మీరు మెల్లమెల్లగా బాధ నుండి కోలుకుంటారు.”

మీవాళ్లు లేరనే వెలితి మీకున్నా, మీరు జీవితం మీద ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ప్రేమగల దేవుని సహాయంతో మీరు ఇప్పటికీ మీ స్నేహితులతో ఆనందించవచ్చు, అర్థవంతమైన జీవితాన్ని గడపవచ్చు. త్వరలో దేవుడు చనిపోయినవాళ్లను పునరుత్థానం చేస్తాడు. మీకు ఇష్టమైనవాళ్లను మీరు మళ్లీ కలుసుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అప్పుడు మీ హృదయానికి అయిన గాయం పూర్తిగా నయమౌతుంది.