కంటెంట్‌కు వెళ్లు

నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?

నేను ఓ యెహోవాసాక్షి అవ్వాలంటే ఏం చేయాలి?

యెహోవాసాక్షుల్లో ఒకరిగా అవ్వాలంటే ఏం చేయాలో యేసు చెప్పాడు. ఆయన మాటల్ని మనం మత్తయి 28:19, 20లో చూడవచ్చు. ఓ వ్యక్తి క్రీస్తు శిష్యుడవ్వాలంటే, లేదా యెహోవా గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలో ఆ లేఖనం చెప్తుంది.

మొదటిది: బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి. సమస్త ప్రజల్ని ‘శిష్యులుగా చేయండి; ... వాళ్లకు బోధించండి’ అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 28:19, 20) “శిష్యుడు” అని అనువదించబడిన పదానికి “నేర్చుకునే వాడు” అని అర్థం. యేసుక్రీస్తు బోధించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. అంతేకాదు సంతోషంగా, సంతృప్తిగా జీవించాలంటే ఏం చేయాలో బైబిలు చెప్తుంది. (2 తిమోతి 3:16, 17) మీతో ఉచితంగా బైబిలు అధ్యయనం చేసి, బైబిలు ఏం చెప్తుందో తెలుసుకునేలా మీకు సంతోషంగా సహాయం చేస్తాం.—మత్తయి 10:7, 8; 1 థెస్సలొనీకయులు 2:13.

రెండవది: నేర్చుకుంటున్నవాటిని పాటించండి. బైబిలు గురించి నేర్చుకుంటున్న వాళ్లు తన ‘ఆజ్ఞలన్నిటినీ పాటించాలని’ యేసు చెప్పాడు. అంటే బైబిలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరగడం మాత్రమే కాదు, మీ ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు రావాలి. (అపొస్తలుల కార్యములు 10:42; ఎఫెసీయులు 4:22-29; హెబ్రీయులు 10:24, 25) అప్పుడు, యేసును అనుసరించాలని, మీ జీవితాన్ని యెహోవా దేవునికి అంకితం చేసుకోవాలని మీకు మీరే నిర్ణయించుకుంటారు.—మత్తయి 16:24.

మూడవది: బాప్తిస్మం తీసుకోండి. (మత్తయి 28:19) బైబిల్లో, బాప్తిస్మాన్ని పాతిపెట్టడంతో పోల్చారు. (రోమీయులు 6:2-4 పోల్చండి.) మీ పాత ప్రవర్తన విషయంలో మరణించి, ఓ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారని అది సూచిస్తుంది. కాబట్టి బాప్తిస్మం అంటే, మీరు యేసు చెప్పిన మొదటి రెండు చర్యలు తీసుకున్నారని, మంచి మనస్సాక్షి కోసం దేవుణ్ణి అడుగుతున్నారని, అందరి ముందు ఒప్పుకోవడం.—హెబ్రీయులు 9:14; 1 పేతురు 3:21.

నేను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానో లేదో ఎలా తెలుసుకోవచ్చు?

సంఘ పెద్దలతో మాట్లాడండి. బైబిలు బోధిస్తున్నవాటిని మీరు అర్థం చేసుకున్నారో లేదో, వాటిని పాటిస్తున్నారో లేదో, ఇష్టపూర్వకంగా దేవునికి సమర్పించుకున్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్లు మీతో మాట్లాడతారు.—అపొస్తలుల కార్యములు 20:28; 1 పేతురు 5:1-3.

యెహోవాసాక్షుల పిల్లలు కూడా ఇలాగే చేయాలా?

అవును. బైబిలు చెప్తున్నట్లు, మేము మా పిల్లల్ని యెహోవా “ఉపదేశంతో, క్రమశిక్షణతో” పెంచుతాం. (ఎఫెసీయులు 6:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అయితే, వాళ్లు పెరిగి పెద్దవాళ్లౌతుండగా, బైబిలు బోధిస్తున్నవాటిని నేర్చుకోవాలని, అంగీకరించాలని, పాటించాలని, బాప్తిస్మం తీసుకోవాలని వాళ్లకై వాళ్లే నిర్ణయించుకోవాలి. (రోమీయులు 12:2) ఈ విషయంలో ప్రతీఒక్కరు ఎవరికివాళ్లే నిర్ణయం తీసుకోవాలి.—రోమీయులు 14:11, 12; గలతీయులు 6:5.