కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని మిగతావాళ్లు చేసుకున్నట్లుగా ఎందుకు చేసుకోరు?

యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని మిగతావాళ్లు చేసుకున్నట్లుగా ఎందుకు చేసుకోరు?

 ప్రభువు రాత్రి భోజన ఆచరణకు సంబంధించి బైబిలు చెప్తున్నవాటిని మేము చాలా జాగ్రత్తగా పాటిస్తాము. ప్రభువు రాత్రి భోజనాన్ని, “ప్రభు భోజనం,” లాస్ట్‌ సప్పర్‌, యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ అని కూడా అంటారు. (1 కొరింథీయులు 11:20; పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అయితే ఈ ఆచరణకు సంబంధించి, ఇతర మత సంస్థలు నమ్మే చాలా విషయాలకు, వాళ్లు పాటించే చాలా ఆచారాలకు బైబిల్లో ఆధారాలు లేవు.

ఉద్దేశం

 ప్రభువు రాత్రి భోజన ఆచరణ ఉద్దేశం, యేసును జ్ఞాపకం చేసుకోవడం, మన కోసం ఆయన ఇచ్చిన బలి విషయంలో కృతజ్ఞత చూపించడం. (మత్తయి 20:28; 1 కొరింథీయులు 11:24) ఈ ఆచరణ ‘నివేదన సంస్కారం’ (sacrament) కాదు; లేదా దయ, పాపక్షమాపణ వంటి ప్రయోజనాలను తెచ్చిపెట్టే మత ఆచారం కాదు. a ఎందుకంటే ఒక మత ఆచారం వల్ల మన పాపాలు క్షమించబడతాయని బైబిలు చెప్పట్లేదు గానీ, యేసు మీద విశ్వాసం ఉంచడం వల్లే క్షమాపణ పొందుతామని బైబిలు బోధిస్తోంది.—రోమీయులు 3:26; 1 యోహాను 2:1, 2.

ఎన్ని రోజులకొకసారి చేసుకోవాలి?

 యేసు తన శిష్యులకు, ప్రభువు రాత్రి భోజనాన్ని జ్ఞాపకార్థంగా చేసుకోమని చెప్పాడు గానీ, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలో చెప్పలేదు. (లూకా 22:19) కొంతమంది దాన్ని నెలకు ఒకసారి చేసుకోవాలని అనుకుంటారు, కొందరైతే వారానికోసారి, ఇంకొదరు రోజుకోసారి, మరికొందరు ప్రతీరోజు కొన్నిసార్లు లేదా ఎన్నిసార్లు చేయడం కరెక్టనుకుంటే అన్నిసార్లు చేసుకుంటారు. అయితే, మనం పరిశీలించాల్సిన కొన్ని విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 యేసు, ప్రభువు రాత్రి భోజనాన్ని పస్కా పండుగ రోజున ప్రవేశపెట్టాడు, అదే రోజున కొన్ని గంటల తర్వాత ఆయన చనిపోయాడు. (మత్తయి 26:1, 2) ఇది అనుకోకుండా జరిగింది కాదు. లేఖనాలు యేసును పస్కా గొర్రెపిల్లతో పోలుస్తున్నాయి. (1 కొరింథీయులు 5:7, 8) పస్కా పండుగను సంవత్సరానికి ఒకసారి చేసుకునేవాళ్లు. (నిర్గమకాండము 12:1-6; లేవీయకాండము 23:5) అదేవిధంగా, యేసు మరణ జ్ఞాపకార్థ రోజును కూడా తొలి క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారే చేసుకునేవాళ్లు, b బైబిలు ఆధారమున్న ఆ విధానాన్నే యెహోవాసాక్షులు పాటిస్తున్నారు.

తేదీ, సమయం

 పైన చూసినట్లుగా, యేసు ప్రవేశపెట్టిన పద్ధతి వల్ల జ్ఞాపకార్థ ఆచరణ ఎన్ని రోజులకొకసారి చేసుకోవాలో అర్థమవుతుంది. అంతేకాదు ఆ పద్ధతి దాని తేదీని, సమయాన్ని నిర్ధారించుకోవడానికి కూడా సహాయపడుతుంది. క్రీస్తు శకం 33, నీసాను నెల 14వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఆయన ఆ ఆచరణను పరిచయం చేశాడు. (మత్తయి 26:18-20, 26) తొలి క్రైస్తవులు చేసుకున్నట్లుగానే మేము కూడా ప్రతీ సవత్సరం ఆ రోజునే జ్ఞాపకార్థ ఆచరణ చేస్తాం. c

 క్రీస్తు శకం 33వ సంవత్సరంలో నీసాను నెల 14వ తేదీ, శుక్రవారం వచ్చింది, అయినా ప్రతీ సంవత్సరం ఆ తేదీ శుక్రవారమే రాదు కదా. నీసాను 14వ తేదీ ఏ రోజు వస్తుందో తెలుసుకోవడానికి యేసు కాలంలోని ప్రజలు ఉపయోగించిన పద్ధతినే మేము ప్రతీ సంవత్సరం ఉపయోగిస్తాం, అంతేకానీ ఆధునిక యూదా క్యాలెండరులోని పద్ధతిని ఉపయోగించం. d

రొట్టె, ద్రాక్షారసం

 కొత్త ఆచరణ కోసం యేసు, పస్కా భోజనంలో మిగిలిన పులవని రొట్టెను, ఎర్రని ద్రాక్షారసాన్ని ఉపయోగించాడు. (మత్తయి 26:26-28) ఆయనలాగే, మేము కూడా పులిసిన పిండిగానీ, వేరే ఏ పదార్థాలు గానీ కలవని రొట్టెను ఉపయోగిస్తాం. తీపి పదార్థాలు, ఘాటు పదార్థాలు లేదా సుగంధ ద్రవ్యాలు కలిపిన వైన్‌ను గానీ, తాజా ద్రాక్షారసాన్ని గానీ కాకుండా మామూలు వైన్‌ను (పులిసిన ద్రాక్షారసాన్ని) ఉపయోగిస్తాం.

 కొన్ని మత సంస్థలు, పులిసిన పిండి లేదా ఈస్ట్‌ కలిపిన రొట్టెను ఉపయోగిస్తాయి, కానీ బైబిలు చాలాసార్లు పులిసిన పిండిని పాపానికి, అవినీతికి గుర్తుగా ఉపయోగించింది. (లూకా 12:1; 1 కొరింథీయులు 5:6-8; గలతీయులు 5:7-9) కాబట్టి, పులిసిన పిండిగానీ, వేరే ఏ పదార్థాలుగానీ కలవని రొట్టె మాత్రమే పాపంలేని యేసు శరీరానికి సరైన గుర్తుగా ఉంటుంది. (1 పేతురు 2:22) ద్రాక్షారసానికి బదులు ద్రాక్షపళ్ల జ్యూస్‌ను వాడడాన్ని కూడా బైబిలు సమర్థించడం లేదు. కొన్ని చర్చీలవాళ్లు మద్యం తాగకూడదని వాళ్లు పెట్టుకున్న నిషేధం వల్ల అలా చేస్తారు. దానికి లేఖనాధారం లేదు.—1 తిమోతి 5:23.

అవి చిహ్నాలు, నిజంగా శరీరం, రక్తం కావు

 జ్ఞాపకార్థ ఆచరణలో ఉపయోగించే పులవని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం క్రీస్తు శరీరానికి, రక్తానికి చిహ్నాలు లేదా గుర్తులు. కొంతమంది అనుకున్నట్లుగా అవి అద్భుతరీతిగా క్రీస్తు శరీరంలా, రక్తంలా మారిపోవు, లేదా ఆయన శరీరం, రక్తం వాటిలో కలవదు. దీనికి లేఖనాల్లో ఉన్న ఆధారాలను పరిశీలించండి.

  •   ఒకవేళ యేసు తన శిష్యులకు, తన రక్తాన్ని తాగమని ఆజ్ఞాపించివుంటే, రక్తాన్ని తీసుకోకూడదని దేవుడు పెట్టిన నియమాన్ని మీరమని చెప్పినట్టే. (ఆదికాండము 9:4; అపొస్తలుల కార్యములు 15:28, 29) కానీ అలా జరిగే అవకాశమే లేదు ఎందుకంటే, రక్తానికున్న పవిత్రతకు సంబంధించి దేవుడు పెట్టిన నియమాన్ని మీరమని యేసు ఎవరికీ ఎప్పుడూ చెప్పడు.—యోహాను 8:28, 29.

  •   ఒకవేళ అప్పుడు యేసు శిష్యులు ఆయన రక్తాన్ని తాగుతూ ఉండుంటే, “అనేకులకోసం చిందబోయే ఒడంబడిక రక్తం” అని తన రక్తం గురించి ఆయన చెప్పివుండేవాడు కాదు. తన బలి ఇంకా జరగాల్సివుందని ఆయన ఆ మాటలో సూచిస్తున్నాడు.—మత్తయి 26:28; పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

  •   యేసు అన్నికాలాలకు సరిపోయేలా ‘ఒక్కసారే’ బలయ్యాడు. (హెబ్రీయులు 9:25, 26) అయినా, ప్రభువు రాత్రి భోజనం జరిగేటప్పుడు రొట్టె, ద్రాక్షారసం యేసు శరీరంలా, రక్తంలా మారిపోతే వాటిని తీసుకునేవాళ్లు ఆయనను మళ్లీ బలి ఇస్తున్నట్లు అవుతుంది.

  •   యేసు, ‘నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి’ అని చెప్పాడేగానీ, ‘నన్ను బలి ఇవ్వడానికి దీనిని చేయండి’ అని చెప్పలేదు.—1 కొరింథీయులు 11:24.

 ప్రభువు రాత్రి భోజన సమయంలో రొట్టె యేసు శరీరంగా, ద్రాక్షారసం ఆయన రక్తంగా మారతాయని నమ్మేవాళ్లు, బైబిల్లో కొన్ని వచనాల్లోని పదాల ఆధారంగా అలా నమ్ముతున్నారు. ఉదాహరణకు చాలా బైబిలు అనువాదాల్లో, యేసు ద్రాక్షారసం గురించి, “ఇది నా రక్తము” అని చెప్పినట్లుగా ఉంది. (మత్తయి 26:28) కానీ, యేసు చెప్పిన మాటను ఇలా కూడా అనువదించవచ్చు: “ఇది నా రక్తాన్ని సూచిస్తోంది,” లేదా “ఇది నా రక్తానికి ప్రతీకగా ఉంది,” లేదా “ఇది నా రక్తానికి చిహ్నంగా ఉంది.” e యేసు ఎప్పటిలాగే ఇక్కడ కూడా రూపకాలంకారాన్ని ఉపయోగించి బోధించాడు.—మత్తయి 13:34, 35.

ఎవరు పాలుపంచుకోవాలి?

 యెహోవాసాక్షులమైన మేము ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నప్పుడు, మాలో కేవలం కొంతమంది మాత్రమే రొట్టె, ద్రాక్షారసాల్ని తీసుకుంటారు. ఎందుకు?

 యేసు చిందించిన రక్తం యెహోవా, ఇశ్రాయేలీయుల మధ్యనున్న ఒప్పంద (నిబంధన) స్థానంలో ఒక కొత్త ఒప్పందాన్ని స్థాపించింది. (హెబ్రీయులు 8:10-13) ఆ కొత్త ఒప్పందంలో సభ్యులైన వాళ్లే జ్ఞాపకార్థ చిహ్నాల్లో పాలుపంచుకుంటారు. అయితే, క్రైస్తవులందరూ అందులో సభ్యులు కాదు, ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని చేత “పిలువబడిన వారు” మాత్రమే ఆ ఒప్పందంలో సభ్యులు. (హెబ్రీయులు 9:15; లూకా 22:20) వీళ్లు, పరలోకంలో క్రీస్తుతో కలిసి పరిపాలన చేస్తారు, ఆ గొప్ప అవకాశాన్ని కేవలం 1,44,000 మంది మాత్రమే పొందుతారని బైబిలు చెప్తోంది.—లూకా 22:28-30; ప్రకటన 5:9, 10; 14:1, 3.

 క్రీస్తుతో కలిసి పరిపాలించడానికి పిలుపు అందుకునే వాళ్లను “చిన్న మంద” అని, భూమ్మీద శాశ్వత జీవితాన్ని పొందేవాళ్లను “గొప్పసమూహము” అని బైబిలు చెప్తోంది. మాలో చాలామంది గొప్ప సమూహంలో ఉండాలనే నిరీక్షిస్తున్నారు. (లూకా 12:32; ప్రకటన 7:9, 10) భూమ్మీద శాశ్వత జీవితం పొందే నిరీక్షణ ఉన్నవాళ్లు, జ్ఞాపకార్థ చిహ్నాల్లో పాలుపంచుకోకపోయినా, మన కోసం యేసు అర్పించిన బలి పట్ల కృతజ్ఞత చూపించడానికి ఆ ఆచరణకు హాజరవుతారు.—1 యోహాను 2:2.

a మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా, 9వ సంపుటి, 212వ పేజీలో ఇలా ఉంది: “sacrament అనే పదం NTలో (క్రొత్త నిబంధనలో) ఎక్కడా లేదు; μυστήριον [మిస్టీరియన్‌] అనే గ్రీకు పదాన్ని కూడా ఏ సందర్భంలోనూ బాప్తిస్మం కోసం గానీ, ప్రభువు రాత్రి భోజనం కోసం గానీ లేదా ఏ ఆచరణ కోసం గానీ వాడలేదు.”

b ద న్యూ షాఫ్‌-హెర్ట్సోక్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజియస్‌ నాలెడ్జ్‌, 4వ సంపుటి, 43-44 పేజీలు, మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా, 8వ సంపుటి, 836వ పేజీ చూడండి.

c ద న్యూ కేంబ్రిడ్జ్‌ హిస్టరీ ఆఫ్‌ ద బైబిల్‌, 1వ సంపుటి, 841వ పేజీ చూడండి.

d ఆధునిక యూదుల క్యాలెండరులో, నీసాను నెల మొదటి రోజును ఖగోళశాస్త్ర అమావాస్య ఆధారంగా లెక్కించి నిర్ణయిస్తారు. కానీ మొదటి శతాబ్దంలో ఈ విధానాన్ని ఉపయోగించలేదు. యెరూషలేములో, అమావాస్య తర్వాత చంద్రుడు మొదటిసారిగా కనిపించిన రోజున నెల మొదలవుతుంది, అది ఖగోళశాస్త్ర అమావాస్య దాటిన ఒక రోజుకో, ఇంకాస్త సమయం తర్వాతో వస్తుంది. యెహోవాసాక్షులు జ్ఞాపకార్థ రోజును ఆచరించే తేదీ, ఆధునిక యూదులు పస్కాను ఆచరించే తేదీ ఒకే రోజు రాకపోవడానికి ఈ తేడా ఒక కారణం.

e జేమ్స్‌ మొఫత్‌ అనువదించిన ఎ న్యూ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద బైబిల్‌; ఛార్లెస్‌ బి. విలియమ్స్‌ అనువదించిన ద న్యూ టెస్టమెంట్‌—ఎ ట్రాన్స్‌లేషన్‌ ఇన్‌ ద లాంగ్వేజ్‌ ఆఫ్‌ ద పీపుల్‌; హ్యూ జె. స్కాన్‌ఫీల్డ్‌ అనువదించిన ద ఒరిజినల్‌ న్యూ టెస్టమెంట్‌ చూడండి.