కంటెంట్‌కు వెళ్లు

పస్కా అంటే ఏమిటి?

పస్కా అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 అది ఒక యూదుల పండగ. క్రీ.పూ. 1513లో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినందుకు యూదులు దాన్ని ఆచరిస్తారు. యూదుల క్యాలెండర్‌లో ఒక నెల అయిన అబీబు నెలలో, 14వ రోజున ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం ఆ ప్రాముఖ్యమైన సంఘటనను గుర్తుచేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కొంతకాలానికి అబీబు నెలకు నీసాను అనే పేరు వచ్చింది.—నిర్గమకాండము 12:42; లేవీయకాండము 23:5.

పస్కా అనే పేరు ఎలా వచ్చింది?

 “పస్కా” అనే పదానికి హీబ్రూ భాషలో “దాటి వెళ్లడం” అనే అర్థం ఉంది. ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానం చంపబడినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీయుల్ని కాపాడిన సమయానికి “పస్కా” సూచనగా ఉంది. (నిర్గమకాండము 12:27; 13:15) దేవుడు ఈ భయంకరమైన తెగులును తీసుకొచ్చే ముందు, వధించిన గొర్రెపిల్ల లేదా మేక రక్తమును తమ ద్వారబంధాలకు పూయమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (నిర్గమకాండము 12:21, 22) అప్పుడు ఆ రక్తాన్ని చూసి, దేవుడు వాళ్ల ఇళ్లను ‘దాటి వెళ్తాడు,’ వాళ్ల మొదటి సంతానాన్ని చంపకుండా వదిలేస్తాడు.—నిర్గమకాండము 12:7, 13.

బైబిలు కాలాల్లో పస్కాను ఎలా ఆచరించేవాళ్లు?

 మొదటి పస్కాను ఎలా ఆచరించాలో తెలియజేస్తూ దేవుడు ఇశ్రాయేలీయులకు నిర్దేశాలను ఇచ్చాడు. a ఆ ఆచరణకు సంబంధించి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు ఏమిటంటే:

  •   బలి: అబీబు నెల (నీసాను) 10వ రోజున ఇశ్రాయేలీయుల కుటుంబాలు ఒక ఏడాదిగల గొర్రెపిల్లను (లేదా మేకను) తీసుకొని, ఆ నెల 14వ రోజున దాన్ని వధించారు. మొదటి పస్కా పండుగప్పుడు, యూదులు ఆ రక్తంలో కొంచెం తీసి గుమ్మపు రెండు నిలువు కమ్ముల మీద, పైకమ్మి మీద పూశారు. తర్వాత, వధించిన ఆ జంతువు మొత్తాన్ని కాల్చి, తిన్నారు.—నిర్గమకాండము 12:3-9.

  •   భోజనం: పస్కా భోజనంలో భాగంగా ఇశ్రాయేలీయులు ఆ గొర్రెపిల్లతోపాటు (లేదా మేకతోపాటు) పులవని రొట్టెలు, చేదు కూరలు తినాలి.—నిర్గమకాండము 12:8.

  •   పండుగ: పస్కాను ఆచరించిన తర్వాత ఇశ్రాయేలీయులు పులియని రొట్టెల పండుగను ఏడు రోజులు జరుపుకునేవాళ్లు. ఈ సమయంలో ఇశ్రాయేలీయులు పులిసిన రొట్టెలను తినేవాళ్లు కాదు.—నిర్గమకాండము 12:17-20; 2 దినవృత్తాంతములు 30:21.

  •   విద్య: పస్కా సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవా దేవుని గురించి బోధించేవాళ్లు.—నిర్గమకాండము 12:25-27.

  •   ప్రయాణం: కొంతకాలం తర్వాత, ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వెళ్లి పస్కాను ఆచరించడం మొదలుపెట్టారు.—ద్వితీయోపదేశకాండము 16:5-7; లూకా 2:41.

  •   ఇంకొన్ని విషయాలు: యేసు కాలానికి వచ్చేసరికి, పస్కా పండుగలో ద్రాక్షారసం తీసుకోవడం, పాటలు పాడడం భాగమయ్యాయి.—మత్తయి 26:19, 30; లూకా 22:15-18.

పస్కా గురించిన అపోహలు

 అపోహ: ఇశ్రాయేలీయులు పస్కా భోజనాన్ని నీసాను 15న తిన్నారు.

 నిజం: నీసాను 14 సూర్యాస్తమయం తర్వాత గొర్రెపిల్లను వధించి అదే రాత్రి దాన్ని తినాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండము 12:6, 8) ఇశ్రాయేలీయులు, సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక రోజుగా లెక్కించేవాళ్లు. (లేవీయకాండము 23:32) కాబట్టి, ఇశ్రాయేలీయులు నీసాను 14 ప్రారంభంలోనే గొర్రెపిల్లను వధించి, తినేవాళ్లు.

 అపోహ: క్రైస్తవులు పస్కాను ఆచరించాలి.

 నిజం: క్రీ.శ. 33, నీసాను 14న యేసు పస్కాను ఆచరించిన తర్వాత ఒక కొత్త ఆచరణను ప్రవేశపెట్టాడు. అదే ప్రభువు రాత్రి భోజనం. (లూకా 22:19, 20; 1 కొరింథీయులు 11:20) నిజానికి పస్కా స్థానంలో ప్రభువు రాత్రి భోజనం వచ్చింది. ఎందుకంటే ప్రభువు రాత్రి భోజన ఆచరణ, “పస్కా గొర్రెపిల్లలా” బలి అయిన యేసు మరణాన్ని మనకు గుర్తుచేస్తుంది. (1 కొరింథీయులు 5:7) యేసు విమోచన క్రయధన బలి ప్రజలందర్నీ పాపమరణాల బానిసత్వం నుండి విడిపిస్తుంది కాబట్టి అది పస్కా బలి కన్నా గొప్పది.—మత్తయి 20:28; హెబ్రీయులకు 9:15.

a కాలం గడుస్తుండగా, పస్కాను ఆచరించే పద్ధతిలో కొన్ని మార్పులు వచ్చాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచివెళ్లడానికి సిద్ధపడాలి కాబట్టి మొదటి పస్కాను “త్వరపడుచు” లేదా హడావిడిగా చేశారు. (నిర్గమకాండము 12:11) అయితే వాళ్లు వాగ్దాన దేశానికి వెళ్లాక, పస్కాను హడావిడిగా ఆచరించాల్సిన అవసరం లేదు.