కంటెంట్‌కు వెళ్లు

తోరహ్‌ అంటే ఏమిటి?

తోరహ్‌ అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 తోరహ్‌ అనే ఇంగ్లీషు పదం, తోహ్‌·రహ్‌ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. ఆ పదాన్ని “ఉపదేశమివ్వడం,” “బోధించడం” లేదా “ధర్మశాస్త్రం” అని అనువదించవచ్చు. a (సామెతలు 1:8; 3:1; 28:4) ఈ హీబ్రూ పదాన్ని బైబిల్లో ఏ అర్థంతో ఉపయోగించారో తెలుసుకోవడానికి ఈ కిందున్న ఉదాహరణలను గమనించండి.

  •   తోహ్‌·రహ్‌ తరచుగా బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని సూచిస్తుంది. అవేమిటంటే: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. వీటిని ఐదు కాండలు అని కూడా అంటారు. ఐదు కాండలు అనే మాట “ఐదు సంపుటులు” అనే అర్థమున్న గ్రీకు పదం నుండి వచ్చింది. తోరహ్‌ను మోషే రాశాడు, అందుకే దాన్ని “మోషే ధర్మశాస్త్ర గ్రంథం” అని కూడా పిలుస్తారు. (యెహోషువ 8:31; నెహెమ్యా 8:1) దీన్నిబట్టి ఏమి అర్థమౌతుందంటే, అసలైతే ఈ ఐదుకాండలు కలిపి ఒకే పుస్తకంగా రాయబడ్డాయి, అయితే ఉపయోగించడానికి వీలుగా ఉండడం కోసం దాన్ని ఐదు భాగాలుగా విభజించడం జరిగింది.

  •   తోహ్‌·రహ్‌ అనే పదం, ఒక నిర్దిష్టమైన అంశంపై ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన నియమాల్ని సూచించడానికి కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకు ‘పాపపరిహారార్థ బలి గురించిన నియమం [తోహ్‌·రహ్‌],’ కుష్ఠువ్యాధి గురించిన నియమం, నాజీరు గురించిన నియమం.—లేవీయకాండము 6:25, 14:57; సంఖ్యాకాండము 6:13.

  •   తోహ్‌·రహ్‌ అనే పదం కొన్ని సందర్భాల్లో, ఉపదేశమివ్వడాన్ని, బోధించడాన్ని కూడా సూచిస్తుంది. అలా ఉపదేశించేది, బోధించేది తల్లిదండ్రులు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, స్వయంగా దేవుడు కూడా కావచ్చు.—సామెతలు 1:8; 3:1; 13:14; యెషయా 2:3.

తోరహ్‌లో లేదా ఐదు కాండల్లో ఏముంది?

  •   సృష్టి ఆరంభం మొదలుకొని, మోషే చనిపోయేంతవరకు దేవుడు మనుషులతో వ్యవహరించిన విషయాలన్నిటి గురించిన చరిత్ర అందులో ఉంది.—ఆదికాండము 1:27, 28; ద్వితీయోపదేశకాండము 34:5.

  •   మోషే ధర్మశాస్త్రంలోని నియమాలు అందులో ఉన్నాయి. (నిర్గమకాండము 24:3) ఆ ధర్మశాస్త్రంలో 600 కన్నా ఎక్కువ నియమాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ప్రసిద్ధి చెందినది షెమా లేదా యూదుల విశ్వాస ప్రకటన. షెమాలో ఒక చోట ఇలా ఉంటుంది, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:4-9) యేసు దీన్ని “అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది” అని పిలిచాడు.—మత్తయి 22:36-38.

  •   యెహోవా అనే దేవుని పేరు దాదాపు 1,800 సార్లు ఉంటుంది. దేవుని ప్రజలు దేవుని పేరును ఉచ్చరించాలని తోరహ్‌ ఆజ్ఞాపిస్తుంది.—సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 6:13; 10:8; 21:5.

తోరహ్‌ గురించిన అపోహలు

 అపోహ: తోరహ్‌లో ఉన్న నియమాల్ని ఎప్పటికీ పాటించాలి. వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

 నిజం: కొన్ని బైబిలు అనువాదాల్లో తోరహ్‌లో ఉన్న నియమాలు కనిపిస్తాయి. ఉదాహరణకు సబ్బాతు, యాజకత్వం, ప్రాయశ్చిత్త దినం వంటి ఆచారాలు ‘శాశ్వతమైనవని’ ఆ అనువాదాలు బోధిస్తాయి. (నిర్గమకాండము 31:16; 40:15; లేవీయకాండము 16:33, 34, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అయితే ఆ వచనాల్లో ఉపయోగించిన హీబ్రూ పదానికి శాశ్వతకాలం అనే అర్థం మాత్రమే కాదుగానీ, అనిశ్చిత సమయం అనే అర్థం కూడా ఉంది. b దాదాపు 900 ఏళ్ల వరకు దేవుని ప్రజలు పాటించిన మోషే ధర్మశాస్త్రం స్థానంలో “క్రొత్త నిబంధన లేదా ఒప్పందం” వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. (యిర్మీయా 31:31-33) ఆయన ‘“కొత్త ఒప్పందం” అనే మాట ఉపయోగించి, అంతకుముందు తాను చేసిన ఒప్పందాన్ని పాతదిగా చేశాడు.’ (హెబ్రీయులు 8:7-13) దాదాపు 2,000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు బలి ఆధారంగా ధర్మశాస్త్రం స్థానంలో కొత్త ఒప్పందం వచ్చింది.—ఎఫెసీయులు 2:15.

 అపోహ: రాతపూర్వక నియమాలు ఉన్న తోరహ్‌ ఎంత విలువైనదో యూదుల మౌఖిక సంప్రదాయాలు, టాల్ముడ్‌ కూడా అంతే విలువైనవి.

 నిజం: దేవుడు మోషేకు రాతపూర్వకమైన నియమాలున్న తోరహ్‌తోపాటు మౌఖిక నియమాలు ఇచ్చాడని అనడానికి ఎలాంటి లేఖనాధారాలు లేవు. బైబిల్లో ఇలా ఉంది, “యెహోవా మోషేతో ఇట్లనెను—ఈ వాక్యములను వ్రాసికొనుము.” (నిర్గమకాండము 34:27) కానీ కాలక్రమేణా మౌఖిక సంప్రదాయాలన్నిటిని రాతపూర్వక నియమాలుగా మార్చి దాన్ని మిష్నా అని పిలిచేవాళ్లు. చివరికి వాటిని టాల్ముడ్‌లో కలిపేశారు. నిజానికి ఆ మౌఖిక సంప్రదాయాలన్నీ యూదాకు చెందిన పరిసయ్యులు మొదలుపెట్టిన ఆచారాలు. వాటిలో కొన్ని ఆచారాలు తోరహ్‌లో ఉన్నవాటికి వ్యతిరేకంగా ఉండేవి. అందుకే యేసు పరిసయ్యులతో ఇలా అన్నాడు, “మీరు మీ ఆచారం వల్ల దేవుని వాక్యాన్ని నీరుగార్చారు.”—మత్తయి 15:1-9.

 అపోహ: తోరహ్‌ను స్త్రీలకు బోధించకూడదు.

 నిజం: ధర్మశాస్త్రానంతటినీ స్త్రీలు, పిల్లలతోసహా ఇశ్రాయేలు ప్రజలందరికీ చదివి వినిపించాలనే నియమం మోషే ధర్మశాస్త్రంలో ఉంది. అలా చేయడానికి గల కారణం ఏమిటి? అప్పుడు వాళ్లు ‘మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకుంటారు.’—ద్వితీయోపదేశకాండము 31:10-12. c

 అపోహ: తోరహ్‌లో మర్మాలు ఉన్నాయి.

 నిజం: తోరహ్‌ను రాసిన మోషే, అందులోని విషయాలు స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయిగానీ వాటిలో ఏ మర్మమూ లేదని చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 30:11-14) తోరహ్‌లో మర్మాలు ఉన్నాయనే సిద్ధాంతం కబ్బాలా లేదా యూదుల సంప్రదాయక మిస్టిసిజమ్‌ నుండి పుట్టుకొచ్చింది. ఈ మిస్టిసిజమ్‌ పాటించేవాళ్లు లేఖనాలను వివరించడానికి ‘చమత్కార’ పద్ధతుల్ని ఉపయోగించేవాళ్లు. d2 పేతురు 1:16.

a ద స్ట్రాంగెస్ట్‌ స్ట్రారాంగ్స్‌ ఎగ్సాస్టివ్‌ కన్‌కార్డెన్స్‌ ఆఫ్‌ ద బైబిల్‌ రివైజ్డ్‌ ఎడిషన్‌లోని “హీబ్రూ-అరామిక్‌ డిక్షనరీ-ఇండెక్స్‌ టు ద ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌” విభాగంలో 8451 ఎంట్రీని చూడండి.

b థీయోలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ద ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ 2వ సంపుటిలోని 672-673 పేజీలు చూడండి.

c స్త్రీలకు కూడా ధర్మశాస్త్రంలోని విషయాలు తెలియాలని తోరహ్‌ బోధిస్తుంటే, యూదా చట్టబద్ధమైన ఆచారం మాత్రం స్త్రీలు తోరహ్‌ను అధ్యయనం చేయడానికి వీల్లేదని చెప్పింది. ఉదాహరణకు ఎలీయాజర్‌ బెన్‌ హిర్‌కానస్‌ అనే రబ్బీ ఇలా అన్నట్లు మిష్నాలో ఉంది, “ఎవరైనా తమ కూతురికి తోరహ్‌ బోధిస్తే వాళ్లకు అశ్లీలత బోధిస్తున్నట్లే.” (సోటాహ్‌ 3:4) అతని మాటలు యెరూషలేము టాల్ముడ్‌లో ఇలా రాయబడ్డాయి, “తోరహ్‌ను స్త్రీకి బోధించడం కన్నా దాన్ని అగ్నితో కాల్చేయడం మేలు.”—సోటాహ్‌ 3:19 ఎ.

d ఉదాహరణకు ఎన్‌సైక్లోపీడియా జూడైకా ప్రకారం కబ్బాలా ఆచారాన్ని పాటించేవాళ్లు తోరహ్‌ గురించి ఇలా భావిస్తారు, “తోరహ్‌లో దేనిగురించీ నిర్దిష్టంగా చెప్పలేదు. నిజానికి ఎన్నో వేర్వేరు విషయాలకు సంబంధించిన వేర్వేరు స్థాయిల గురించి మాత్రమే అందులో ఉంది.”—రెండవ సంచిక, 11 వ సంపుటి, 659 వ పేజీ.