కంటెంట్‌కు వెళ్లు

క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?

క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?

బైబిలు ఇచ్చే జవాబు

 క్రైస్తవులు ప్రతీవారం విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవులు “క్రీస్తు నియమము” కింద ఉన్నారు. ఆ నియమంలో విశ్రాంతి దినం లేదు. (గలతీయులు 6:2; కొలొస్సయులు 2:16, 17) అలా అని ఎందుకు చెప్పవచ్చు? అసలు విశ్రాంతి దినాన్ని ఆచరించడం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూద్దాం.

విశ్రాంతి దినం అంటే ఏమిటి?

 విశ్రాంతి దినం లేదా “సబ్బాతు” అనే మాట, “విశ్రాంతి తీసుకోవడం; ఆపడం” అనే అర్థాలున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. విశ్రాంతి దినం అనే మాట, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటిసారిగా కనిపిస్తుంది. (నిర్గమకాండము 16:23) ఉదాహరణకు, పది ఆజ్ఞల్లోని నాల్గవ ఆజ్ఞ ఏమిటంటే, ‘విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవున యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో ... ఏ పనియు చేయకూడదు.’ (నిర్గమకాండము 20:8-10) ఇశ్రాయేలీయులు, శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు విశ్రాంతి దినంగా చూసేవాళ్లు. ఆ సమయంలో, వాళ్లు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లరు, మంట వెలిగించరు, కట్టెలు ఏరుకోరు, లేదా ఏ బరువు మోయరు. (నిర్గమకాండము 16:29; 35:3; సంఖ్యాకాండము 15:32-36; యిర్మియా 17:21) విశ్రాంతి దినాన్ని పాటించకపోవడాన్ని మరణశిక్ష విధించేంత పెద్ద పాపంగా చూసేవాళ్లు.—నిర్గమకాండము 31:15

 యూదుల క్యాలెండరు ప్రకారం మరికొన్ని దినాలతోపాటు ఏడవ సంవత్సరాన్ని, 50వ సంవత్సరాన్ని కూడా విశ్రాంతి సంవత్సరాలుగా చూసేవాళ్లు. ఆ సంవత్సరాల్లో, పొలాల్లో పంట పండించకూడదు, అప్పు తీర్చమని ఇశ్రాయేలీయుల్ని ఎవ్వరూ బలవంతపెట్టకూడదు.—లేవీయకాండము 16:29-31; 23:6, 7, 32; 25:4, 11-14; ద్వితీయోపదేశకాండము 15:1-3.

యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించాల్సిన అవసరం లేదు

విశ్రాంతి దినాన్ని క్రైస్తవులు ఎందుకు పాటించాల్సిన అవసరంలేదు?

 విశ్రాంతి దినం పాటించాలనే నియమం మోషే ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 5:2, 3; యెహెజ్కేలు 20:10-12) వేరేవాళ్లు విశ్రాంతి దినాన్ని పాటించాలని యెహోవా ఎప్పుడూ చెప్పలేదు. అయితే యేసు బలి అర్పించిన తర్వాత, యూదులు కూడా పది ఆజ్ఞలతోపాటు “ధర్మశాస్త్రమునుండి విడుదల” పొందారు. (రోమీయులు 7:6, 7; గలతీయులు 3:24, 25; ఎఫెసీయులు 2:15) క్రైస్తవులు, మోషే ధర్మశాస్త్రంలోని నియమాలకు అంటిపెట్టుకుని ఉండే బదులు అంతకన్నా గొప్పదైన ప్రేమ చూపించాలనే నియమాన్ని పాటిస్తారు.—రోమీయులు 13:9, 10; హెబ్రీయులు 8:13.

విశ్రాంతి దినం గురించిన అపోహలు

 అపోహ: దేవుడు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నప్పుడు విశ్రాంతి దినాన్ని ప్రారంభించాడు.

 నిజం: బైబిలు ఇలా చెప్తుంది, “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.” (ఆదికాండము 2:3) ఈ వచనం మనుషులకు ఓ నియమాన్ని ఇవ్వడంలేదు గానీ సృష్టిని చేసిన ఏడవ రోజున దేవుడు చేసినదాని గురించి చెప్తుంది. మోషే కాలం కన్నా ముందు, ప్రజలు విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లు బైబిలు చెప్పడం లేదు.

 అపోహ: ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రానికి ముందు విశ్రాంతి నియమం కింద ఉండేవాళ్లు.

 నిజం: మోషే ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, “మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను.” హోరేబు అనే ప్రాంతం సీనాయి పర్వతం పరిసరాల్లో ఉంటుంది. ఆయన అక్కడ చేసిన ఒప్పందంలో విశ్రాంతి దినం కూడా ఉంది. (ద్వితీయోపదేశకాండము 5:2, 12) విశ్రాంతి దినాన్ని ఆచరించడం అనేది ఇశ్రాయేలీయులకు కొత్తగా ఇచ్చిన నియమం అని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్లు దాన్ని ఈజిప్టులో ఉంటున్నప్పటి నుండే పాటిస్తుంటే, దేవుడు చెప్పినట్లు అది వాళ్లకు ఈజిప్టు నుండి యెహోవా దయచేసిన విడుదలను ఎలా గుర్తు చేయగలదు? (ద్వితీయోపదేశకాండము 5:15) దేవుడు వాళ్లను ఏడవ రోజు మన్నా ఏరుకోవద్దని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? (నిర్గమకాండము 16:25-30) విశ్రాంతి దినాన్ని పాటించని మొదటి వ్యక్తిని ఏమి చేయాలో వాళ్లకు ఎందుకు అర్థంకాలేదు?—సంఖ్యాకాండము 15:32-36.

 అపోహ: విశ్రాంతి దినం పాటించడం అనేది నిత్య ఒప్పందం కాబట్టి దాన్ని ఇప్పుడు కూడా పాటించాలి.

 నిజం: కొన్ని బైబిలు అనువాదాలు విశ్రాంతి దినాన్ని “నిత్య ఒప్పందం” అని పిలుస్తున్నాయి. (నిర్గమకాండము 31:16, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అయితే నిత్య ఒప్పందం అని అనువదించబడిన హీబ్రూ పదానికి “నిరంతర భవిష్యత్తు ఉండేది” అనే అర్థం కూడా ఉంది. అయితే అది శాశ్వతం అయ్యుండాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులకు యాజకుడు ఉండే ఏర్పాటు గురించి కూడా బైబిలు అదే హీబ్రూ పదాన్ని ఉపయోగిస్తుంది. కాని దేవుడు ఆ ఏర్పాటును 2,000 సంవత్సరాల క్రితమే ఆపేశాడు.—నిర్గమకాండము 40:15; హెబ్రీయులు 7:11, 12.

 అపోహ: యేసు పాటించాడు కాబట్టి క్రైస్తవులందరూ విశ్రాంతి దినాన్ని పాటించాలి.

 నిజం: యేసు ఓ యూదుడు, పైగా ఆయన భూమ్మీద పుట్టే సమయానికి వాళ్లందరూ మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. (గలతీయులు 4:4) కానీ యేసు చనిపోయిన తర్వాత, ఆ ధర్మశాస్త్రంతోపాటు విశ్రాంతి దినం కూడా కొట్టివేయబడింది.—కొలొస్సయులు 2:13, 14.

 అపోహ: ఓ క్రైస్తవునిగా అపొస్తలుడైన పౌలు కూడా విశ్రాంతి దినాన్ని పాటించాడు.

 నిజం: పౌలు విశ్రాంతి దినాల్లో సమాజమందిరానికి వెళ్లేవాడు అన్న మాట నిజమే. కానీ ఆయన అక్కడికి వెళ్లింది వాళ్లతో పాటు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి కాదు. (అపొస్తలుల కార్యములు 13:14; 17:1-3; 18:4) ఆకాలంలోని పద్ధతుల్ని అనుసరిస్తూ, ఆయన సమాజమందిరాల్లో సువార్తను ప్రకటించేవాడు. ఆరాధన కోసం సమకూడిన వాళ్లకు ప్రకటించే అవకాశం వేరే చోట నుండి వచ్చిన ప్రసంగీకులకు ఉండేది. (అపొస్తలుల కార్యములు 13:15, 32) పౌలు కేవలం విశ్రాంతి దినాల్లోనే కాదు “ప్రతిదినము” ప్రకటించేవాడు.—అపొస్తలుల కార్యములు 17:17.

 అపోహ: క్రైస్తవులు ఆదివారాన్ని విశ్రాంతి దినంగా పాటించాలి.

 నిజం: వారంలో మొదటి రోజు అయిన ఆదివారాన్ని విశ్రాంతికి, ఆరాధనకు అంకితం చేయాలని బైబిలు ఆజ్ఞాపించట్లేదు. తొలిక్రైస్తవులకు ఆదివారం కూడా మిగతా రోజుల్లాగా పని దినమే. ద ఇంటర్నేషనల్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తోంది, ‘నాల్గవ శతాబ్దం వరకు ఆదివారాన్ని విశ్రాంతి దినంగా పరిగణించేవాళ్లు కాదు. కానీ ఆ తర్వాత కాన్‌స్టంటైన్‌ [అన్యమత రోమా చక్రవర్తి], ఆదివారం రోజున కొన్ని రకాల పనుల్ని చేయకూడదని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అప్పటి నుండి ఆదివారాన్ని సబ్బాతు దినంగా ఆచరించడం మొదలైంది.’ a

 మరి, ఆదివారాన్ని ఓ ప్రత్యేక దినంగా చెప్పే వృత్తాంతాల సంగతేంటి? అపొస్తలుడైన పౌలు, “ఆదివారమున” తన తోటి విశ్వాసులతో కలిసి భోజనం చేశాడని బైబిలు చెప్తోంది. కానీ అసలు కారణమేమిటంటే, ఆయన ఆ తర్వాతి రోజు అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు కాబట్టే ఆయన వాళ్లతో కలిసి ఆరోజు భోజనం చేశాడు. (అపొస్తలుల కార్యములు 20:7) అదేవిధంగా, సహాయక చర్యల కోసం ప్రతీ “ఆదివారమున” కొంత డబ్బును పక్కన పెట్టాలని కొన్ని సంఘాలకు ఆజ్ఞాపించబడింది. కానీ ఇది కేవలం డబ్బును ఆదా చేయడం కోసం ఇచ్చిన ఓ సలహా మాత్రమే. పైగా ఆ డబ్బును ఇంట్లోనే దాచిపెట్టేవాళ్లు, ఆరాధనా స్థలానికి తీసుకువచ్చేవాళ్లు కాదు.—1 కొరింథీయులు 16:1, 2.

 అపోహ: వారంలో ఒకరోజును విశ్రాంతికి, ఆరాధనకు కేటాయించడం తప్పు.

 నిజం: అది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలని బైబిలు చెప్తుంది.—రోమీయులు 14:5.

a న్యూ క్యాతలిక్‌ ఎన్‌సైక్లోపీడియా, రెండవ ఎడిషన్‌, 13వ సంపుటి, 608వ పేజీ కూడా చూడండి.