కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం

మీ పిల్లలకు ఓటమిని ఎదుర్కోవడం నేర్పించండి

మీ పిల్లలకు ఓటమిని ఎదుర్కోవడం నేర్పించండి

 అనుకున్న పని చేయలేకపోయినప్పుడు కలిగే నిరాశను మీ పిల్లలు ఏదోకరోజు రుచి చూడక తప్పదు. ఆ నిరాశ నుండి బయటపడడానికి వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు?

 మీరేం తెలుసుకోవాలి

 ఓటమి జీవితంలో ఒక భాగం. ‘మనమందరం పొరపాట్లు చేస్తాం’ అని బైబిలు చెప్తుంది. (యాకోబు 3:2) పిల్లలు కూడా పొరపాట్లు చేస్తారు. ఒకవిధంగా చూస్తే ఓటమి కూడా మంచిదే, ఎందుకంటే కష్టమైన పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని అది పిల్లల్లో పెంచుతుంది. ఈ సామర్థ్యం పుట్టుకతోనే రాదు, దాన్ని సంపాదించుకోవాలి. లోరా అనే తల్లి ఇలా చెప్తుంది, “ఓటమి ఎదురైనప్పుడు ఏమీ జరగనట్టు ఉండడం కన్నా, దాన్ని ఎలా సరిచేసుకోవాలో నేర్చుకుంటేనే పిల్లలకు మంచి జరుగుతుందని నేనూ నా భర్త గ్రహించాం. దానివల్ల, వాళ్లు అనుకున్నట్టు జరగనప్పుడు పట్టుదలతో పనిచేయగలుగుతారు.”

 చాలామంది పిల్లలకు ఓటమిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా వెనకేసుకొస్తారు. ఉదాహరణకు, తమ పిల్లలకు మంచి మార్కులు రాకపోతే టీచరే సరిగ్గా చదువు చెప్పట్లేదని నిందిస్తారు. ఒకవేళ తమ పిల్లలు స్నేహితులతో గొడవపడితే, తప్పు ఆ స్నేహితులదేనని అంటారు.

 తల్లిదండ్రులు ప్రతీసారి అలా వెనకేసుకొస్తే పిల్లలు చేసిన పొరపాటును ఒప్పుకోవడం, దాన్ని సరిచేసుకోవడం ఎలా నేర్చుకుంటారు? మీరే ఆలోచించండి.

 మీరేం చేయవచ్చు

  •   చేసిన ప్రతీ పనికి తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని మీ పిల్లలకు నేర్పించండి.

     బైబిలు ఇలా చెప్తోంది: “మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు.”—గలతీయులు 6:7.

     ప్రతీ పనికి ఒక ఫలితం ఉంటుంది. దేన్నైనా పాడుచేస్తే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పొరపాట్లు కొన్ని సమస్యల్ని తీసుకొస్తాయి. పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఏదైనా జరిగినప్పుడు దానికి వాళ్లు కూడా బాధ్యులు అవుతారని గుర్తించాలి. కాబట్టి మీ పిల్లల తప్పును వేరేవాళ్ల మీద మోపడం లేదా వెనకేసుకు రావడం చేయకండి. బదులుగా చేసిన పొరపాటును బట్టి వాళ్ల వయసుకు తగ్గ శిక్షను అనుభవించనివ్వండి. పిల్లలు కూడా తమ పొరపాట్ల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోగలగాలి.

  •   పొరపాట్లను సరిదిద్దుకోవడం మీ పిల్లలకు నేర్పించండి.

     బైబిలు సూత్రం: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.”—సామెతలు 24:16.

     అనుకున్నది చేయలేకపోయినప్పుడు లేదా ఓటమి ఎదురైనప్పుడు బాధగా అనిపిస్తుంది, అంతమాత్రాన జీవితం ముగిసిపోదు. జరిగిపోయిన దానిగురించి అతిగా బాధపడే బదులు, మరోసారి అలాంటి పొరపాటు జరగకూడదంటే ఏం చేయాలో ఆలోచించేలా మీ పిల్లలకు సహాయం చేయండి. ఒకవేళ మీ అబ్బాయి ఏదైనా పరీక్షలో ఫెయిల్‌ అయ్యుంటే, ఈసారి పట్టుదలతో ఇంకాస్త ఎక్కువ కష్టపడితే మంచి మార్కులు వస్తాయని అర్థంచేసుకోవడానికి సహాయం చేయండి. (సామెతలు 20:4) ఒకవేళ మీ కూతురు తన స్నేహితురాలితో గొడవపడితే, తప్పు పూర్తిగా తనది కాకపోయినా క్షమాపణ చెప్పి పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చో ఆలోచించడానికి సహాయం చేయండి.—రోమీయులు 12:18; 2 తిమోతి 2:24.

  •   ఎప్పుడూ తామే ముందుండాలని అనుకోవడం మంచిది కాదని మీ పిల్లలకు నేర్పించండి.

     బైబిలు సూత్రం: “మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు.”—రోమీయులు 12:3.

     ఇందులో “నువ్వే ద బెస్ట్‌” అని మీ పిల్లలకు నూరిపోయడం మంచిది కాదు, ఎందుకంటే ప్రతీసారి వాళ్లే బెస్ట్‌ కాకపోవచ్చు. బాగా చదివే పిల్లలకు కూడా అప్పుడప్పుడు తక్కువ మార్కులు వస్తాయి. బాగా ఆడే పిల్లలు కూడా అప్పుడప్పుడు ఓడిపోతారు. తమ గురించి గొప్పగా ఊహించుకోని పిల్లలే ఓటమి, నిరాశ నుండి తేలిగ్గా బయటపడగలుగుతారు.

     కష్టాలు మనల్ని బలవంతుల్ని చేస్తాయనీ, మనలో సహనాన్ని పెంచుతాయని బైబిలు చెప్తోంది. (యాకోబు 1:2-4) కాబట్టి అనుకున్నది సాధించలేక పోయినప్పుడు బాధ కలిగినా, దాన్నుండి బయటపడడం ఎలాగో మీ పిల్లలకు నేర్పించండి.

     అన్ని నైపుణ్యాల్లాగే, కష్టాల్ని ఎదుర్కొనే నైపుణ్యాన్ని నేర్పించడం అంత తేలిక కాదు. దానికి ఎంతో సమయం, కృషి అవసరం. పెద్దయ్యాక వాళ్లు కష్టాల్ని విజయవంతంగా ఎదిరించినప్పుడు, మీ కష్టం వృథా కాలేదని గ్రహిస్తారు. లెట్టింగ్‌ గో విత్‌ లవ్‌ అండ్‌ కాన్ఫిడెన్స్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది, ‘ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే సామర్థ్యం ఉన్న టీనేజీ పిల్లలు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రాణాల్ని తీసుకోవడం లేదా మూర్ఖమైన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయరు. పరిస్థితులు మారినా, అనుకోని సంఘటనలు ఎదురైనా వాటికి అనుగుణంగా మారతారు.’ కష్టాల్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల పెద్దయ్యాక కూడా వాళ్లు ప్రయోజనం పొందుతారు.

 టిప్‌: మీరు ఆదర్శంగా ఉండండి. అనుకున్నది చేయలేకపోయినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారనే దాన్నిబట్టే, మీ పిల్లల ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది.