కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం

మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా ఎలా సహాయం చేయవచ్చు?

మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా ఎలా సహాయం చేయవచ్చు?

 మీ పిల్లవాడికి స్కూలుకు వెళ్లడం ఇష్టం లేదని మీకనిపిస్తోంది; వాడు సరిగ్గా చదవట్లేదు, హోమ్‌వర్క్‌ చేయట్లేదు. దానివల్ల వాడి మార్కులు తగ్గిపోయాయి, వాడి ప్రవర్తన కూడా మారిపోతోంది. మరి మీ పిల్లవాడికి మంచి మార్కులు వచ్చేలా మీరెలా సహాయం చేయవచ్చు?

 మీరేం తెలుసుకోవాలి?

 ఒత్తిడి చేస్తే సమస్య ఇంకా పెద్దదౌతుంది. మీ పిల్లవాణ్ణి ఒత్తిడి చేస్తే, వాడు స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా ఆందోళనకు గురౌతాడు. దాన్నుండి బయటపడడానికి వాడు అబద్ధాలాడడం, మార్కులు తగ్గాయని చెప్పకపోవడం, ప్రోగ్రెస్‌ రిపోర్టులో మీ సంతకం వాడే పెట్టేయడం, స్కూలు మానేయడం లాంటివి చేయవచ్చు. అలా సమస్య ఇంకా పెద్దదౌతుంది.

 గిఫ్టులు ఇవ్వడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరగవచ్చు. ఆండ్రూ అనే ఒక తండ్రి ఇలా చెప్తున్నాడు: “మా అమ్మాయిని ప్రోత్సహించడం కోసం, మంచి మార్కులు వచ్చినప్పుడు గిఫ్టులు ఇవ్వడం మొదలుపెట్టాం. అయితే దానివల్ల ఆమె గిఫ్టుల మీదే మనసుపెట్టేది. తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మార్కులు తగ్గినందుకు కాకుండా గిఫ్టు రానందుకు ఎక్కువ బాధపడేది.”

 టీచర్ల మీద నిందవేయడం వల్ల ఉపయోగం ఉండదు. అలాచేస్తే, మంచి మార్కులు రావడానికి కష్టపడాల్సిన అవసరం లేదని మీ పిల్లవాడు అనుకోవచ్చు. అంతేకాదు, తన తప్పుకు ఇతరుల్ని నిందించడం, తన సమస్యల్ని వేరేవాళ్లు పరిష్కరించాలని ఆశించడం మొదలుపెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, పెద్దయ్యాక అవసరమయ్యే ఒక ముఖ్యమైన లక్షణాన్ని, అంటే తన పనులకు బాధ్యత వహించడాన్ని అతను నేర్చుకోకపోవచ్చు.

 మీరేం చేయవచ్చు?

 మీ భావాల్ని అదుపు చేసుకోండి. మీరు కోపంగా ఉంటే, మీ పిల్లవాడి మార్కుల గురించి వేరే సమయంలో మాట్లాడండి. “నేను, నా భార్య ప్రశాంతంగా, అర్థంచేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడేవాళ్లం, దానివల్ల మరింత మంచి ఫలితాలు సాధించాం” అని బ్రెట్‌ అనే తండ్రి చెప్తున్నాడు.

 బైబిలు సూత్రం: “వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు, త్వరగా కోపం తెచ్చుకోకూడదు.”​—యాకోబు 1:​19.

 అసలు సమస్య ఏంటో గుర్తించండి. సాధారణంగా తోటివాళ్లు ఏడ్పించడం వల్ల, స్కూళ్లు మారడం వల్ల, పరీక్షల భయం వల్ల, కుటుంబ సమస్యల వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, షెడ్యూల్‌ లేకపోవడం వల్ల, ఏకాగ్రత నిలపలేకపోవడం వల్ల మార్కులు తగ్గుతుంటాయి. కాబట్టి మీ పిల్లవాడి బద్దకం వల్లే మార్కులు రావట్లేదని అనుకోకండి.

 బైబిలు సూత్రం: “ఒక విషయం మీద లోతైన అవగాహన ఉన్నవాడు విజయం సాధిస్తాడు.”​—సామెతలు 16:20, NW.

 చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. హోమ్‌వర్క్‌ చేయడానికి, చదువుకోవడానికి ఒక షెడ్యూల్‌ వేయండి. మీ పిల్లవాడు శ్రద్ధగా హోమ్‌వర్క్‌ చేసేలా, వాడి ధ్యాస పక్కకు మళ్లించేవి (టీవీ, ఫోన్‌ లాంటివి) లేకుండా చూసుకోండి. మధ్యమధ్యలో చిన్నచిన్న విరామాలు ఉంటే, మీ పిల్లవాడు ఏకాగ్రతతో హోమ్‌వర్క్‌ చేయగలుగుతాడు. జర్మనీలోని హెక్టర్‌ అనే ఒక తండ్రి ఇలా అంటున్నాడు: “పరీక్షలు దగ్గరపడుతున్నాయంటే, చివరి నిమిషం వరకు ఆగే బదులు, ముందుగానే రోజూ కొద్దికొద్దిగా చదివిస్తుంటాం.”

 బైబిలు సూత్రం: “ప్రతిదానికి సమయము కలదు.”​—ప్రసంగి 3:1.

 నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచండి. స్కూల్లో నేర్చుకునే వాటివల్ల మీ పిల్లవాడు ఇప్పుడు ఎలా ప్రయోజనం పొందుతున్నాడో అర్థం చేసుకుంటే, నేర్చుకోవాలనే కోరిక వాడిలో పెరుగుతుంది. ఉదాహరణకు, లెక్కలు చేయడం వల్ల, ఇప్పుడు పాకెట్‌ మనీని ఎలా ఖర్చు చేయాలో వాడికి తెలుస్తుంది.

 బైబిలు సూత్రం: “తెలివిని, అవగాహనను సంపాదించు. . . . దాన్ని చాలా విలువైనదిగా ఎంచు.”​—సామెతలు 4:​5, 8, NW.

 టిప్‌: హోమ్‌వర్క్‌ చేసేలా మీ పిల్లవాడికి సహాయం చేయండి, మీరే హోమ్‌వర్క్‌ చేసి పెట్టకండి. ఆండ్రూ ఇలా ఒప్పుకుంటున్నాడు: “మా అమ్మాయి మా మీద ఆధారపడడం మొదలుపెట్టి తన మెదడును ఉపయోగించడం మానేసింది.” మీ పిల్లవాడికి సొంతగా హోమ్‌వర్క్‌ చేసుకోవడం నేర్పించండి.