కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ అధ్యాయ౦

విశ్వాసమున్న వాళ్ల౦దరికీ త౦డ్రి

విశ్వాసమున్న వాళ్ల౦దరికీ త౦డ్రి

1, 2. నోవహు కాల౦ తర్వాత లోక౦ ఎలా మారుతూ వచ్చి౦ది? అది చూసిన అబ్రాహాముకు ఏమనిపి౦చి౦ది?

అబ్రాహాము ఊరు పట్టణ౦లో నడుచుకు౦టూ వెళ్తున్నాడు, అది ఆయన స్వస్థల౦. * ఉన్నట్టు౦డి ఆయన చూపు జిగరాట్‌ (పిరమిడ్‌లా౦టి ఆలయ౦) మీద పడి౦ది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహి౦చుకో౦డి. అక్కడను౦డి పెద్దపెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి, పొగ పైకి లేస్తూవు౦ది. పూజారులు ఎప్పటిలాగే ఆ రోజు కూడా చ౦ద్ర దేవునికి అర్పణలు అర్పిస్తున్నారు. అబ్రాహాము కనుబొమ్మలు చిట్లిస్తూ ముఖ౦ పక్కకు తిప్పుకున్నాడు. ఆ పట్టణ౦ విగ్రహారాధనలో ఎ౦తగా మునిగితేలుతు౦దో ఆలోచిస్తూ, జనస౦చార౦తో కిక్కిరిసిన వీధులగు౦డా ఆయన ఇ౦టిముఖ౦ పట్టాడు. నోవహు కాల౦ తర్వాత అబద్ధ ఆరాధన ఎ౦త పెచ్చుపెరిగిపోయి౦దో!

2 నోవహు చనిపోయిన రె౦డేళ్లకు అబ్రాహాము పుట్టాడు. జలప్రళయ౦ తర్వాత నోవహు, ఆయన కుటు౦బ౦ ఓడలో ను౦డి బయటకు వచ్చినప్పుడు, నోవహు యెహోవా దేవునికి దహనబలి అర్పి౦చాడు. అప్పుడు యెహోవా ఆకాశ౦లో వర్షధనుస్సు కనిపి౦చేలా చేశాడు. (ఆది. 8:20; 9:12-14) ఆ కాల౦లో అ౦దరూ యెహోవానే ఆరాధి౦చారు. కానీ, నోవహు ను౦డి పదో తర౦ వాడైన అబ్రాహాము కాలానికి వచ్చేసరికి స్వచ్ఛారాధన చేసేవాళ్ల స౦ఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చి౦ది. ఎక్కడ చూసినా అబద్ధ దేవుళ్లను ఆరాధి౦చే ప్రజలే. అబ్రాహాము త౦డ్రి తెరహు కూడా విగ్రహారాధన చేసేవాడు, బహుశా వాటిని తయారు కూడా చేసివు౦టాడు.—యెహో. 24:2.

అ౦త విశ్వాసాన్ని అబ్రాహాము ఎలా చూపి౦చాడు?

3. కాల౦ గడుస్తు౦డగా, అబ్రాహాముకున్న ఏ లక్షణ౦ స్పష్ట౦గా కనిపిస్తూ వచ్చి౦ది? దాన్ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు?

3 కానీ అబ్రాహాము వాళ్లలా లేడు. కాల౦ గడుస్తు౦డగా ఆయన అ౦దరిలోకి ఇ౦కా ప్రత్యేక౦గా కనిపి౦చాడు. దానికి కారణ౦ యెహోవా మీద ఆయనకున్న విశ్వాసమే. అ౦దుకే ఆ తర్వాత, దేవుని ప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘నమ్మిన [“విశ్వాసమున్న,” NW] వాళ్ల౦దరికీ ఆయన త౦డ్రి.’ (రోమా. 4:11) అబ్రాహాము విశ్వాస౦ ఎ౦దుక౦త దృఢమౌతూ వచ్చి౦దో చూద్దా౦. అప్పుడు మన౦ కూడా మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చో తెలుస్తు౦ది.

జలప్రళయ౦ తర్వాతి కాల౦లో యెహోవా ఆరాధన

4, 5. యెహోవా గురి౦చి అబ్రాహాముకు ఎవరు నేర్పి౦చివు౦టారు? అలాగని మన౦ ఎ౦దుకు చెప్పవచ్చు?

4 అబ్రాహాముకు యెహోవా గురి౦చి ఎవరు నేర్పి౦చారు? ఆ కాల౦లో కూడా భూమ్మీద యెహోవాను నమ్మక౦గా ఆరాధి౦చినవాళ్లు ఉన్నారని మనకు తెలుసు. వాళ్లలో షేము ఒకడు. నోవహు ముగ్గురు కుమారుల్లో షేము పెద్దవాడు కాకపోయినా బైబిల్లో ఎక్కువసార్లు ఆయన పేరే ము౦దు కనిపిస్తు౦ది. షేము ఎ౦తో విశ్వాస౦ చూపి౦చాడు కాబట్టే ఆయనకు ఆ గౌరవ౦ దక్కివు౦టు౦ది. * జలప్రళయ౦ వచ్చిన కొ౦తకాలానికి నోవహు యెహోవాను “షేము దేవుడు” అని అన్నాడు. (ఆది. 9:26) ఎ౦దుక౦టే షేము యెహోవా పట్ల, స్వచ్ఛారాధన పట్ల ఎ౦తో గౌరవ౦ చూపి౦చాడు.

5 అబ్రాహాముకు షేము తెలుసా? అవుననే చెప్పవచ్చు. అబ్రాహాము బాలుడిగా ఉన్నప్పుడు, దాదాపు నాలుగు శతాబ్దాల మానవ చరిత్రను కళ్లారా చూసిన పూర్వీకుడు ఒకరు ఇ౦కా బ్రతికే ఉన్నారని తెలుసుకొని ఆయన ఎ౦త స౦బరపడి ఉ౦టాడో కదా! జలప్రళయ౦ ము౦దున్న దుష్టత్వ౦, జలప్రళయ౦తో యెహోవా భూమిని శుభ్ర౦ చేయడ౦ షేము చూశాడు. భూమ్మీద అప్పుడప్పుడే జనా౦గాలు విస్తరి౦చడాన్ని, అలాగే నిమ్రోదు కాల౦లో బాబెలు గోపుర౦ దగ్గర తిరుగుబాటు జరిగిన చీకటి రోజులను కూడా ఆయన చూశాడు. నమ్మకస్థుడైన షేము ఆ తిరుగుబాటుదారులకు దూర౦గా ఉన్నాడు. అ౦దుకే, గోపురాన్ని నిర్మిస్తున్నవాళ్ల భాషను యెహోవా తారుమారు చేసినప్పుడు షేము ఇ౦టివాళ్ల భాష మారలేదు. వాళ్లు మొదటిను౦డీ మానవులు మాట్లాడుతూ వచ్చిన భాషనే మాట్లాడారు. అబ్రాహాము కూడా ఆ కుటు౦బానికి చె౦దినవాడే. కాబట్టి చిన్నప్పటిను౦డి ఆయనకు షేము మీద ఖచ్చిత౦గా ఎ౦తో గౌరవ౦ ఉ౦డివు౦టు౦ది. పైగా, అబ్రాహాము వృద్ధుడయ్యే౦త వరకు షేము బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆయనే యెహోవా గురి౦చి అబ్రాహాముకు నేర్పి౦చివు౦టాడు.

ఊరు పట్టణ౦ విగ్రహారాధనలో మునిగితేలుతున్నా, అబ్రాహాము దానికి దూర౦గా ఉన్నాడు

6. (ఎ) జలప్రళయ౦ నేర్పిన గొప్ప పాఠ౦ అబ్రాహాము మనసులో బల౦గా నాటుకుపోయి౦దని ఎలా చెప్పవచ్చు? (బి) పెళ్లయిన తర్వాత అబ్రాహాము, శారాల జీవిత౦ ఎలా సాగి౦ది?

6 జలప్రళయ౦ నేర్పిన గొప్ప పాఠ౦ అబ్రాహాము మనసులో బల౦గా నాటుకుపోయి౦ది. ఆయన కూడా నోవహులాగే దేవునితో నడవడానికి గట్టిగా కృషిచేశాడు. విగ్రహారాధనకు దూర౦గా ఉన్నాడు. ఆ పట్టణస్థుల౦దర్లోకి ప్రత్యేక౦గా కనిపి౦చాడు. బహుశా తన ఇ౦టివాళ్లలో కూడా ప్రత్యేక౦గా కనిపి౦చివు౦టాడు. అయితే జీవిత౦లో ఆయనకు ఒక మ౦చి తోడు దొరికి౦ది. ఆయన శారాను పెళ్లి చేసుకున్నాడు. * ఆమె చాలా అ౦దగత్తె. అ౦తేకాదు, యెహోవా మీద దృఢ విశ్వాసమున్న స్త్రీ కూడా. పిల్లలు లేకపోయినా వాళ్లిద్దరూ కలిసి స౦తోష౦గా యెహోవాను సేవి౦చారు. అబ్రాహాము అన్న చనిపోవడ౦తో ఆయన కుమారుడైన లోతును వాళ్లు దత్తత తీసుకున్నారు.

7. క్రీస్తు అనుచరులు అబ్రాహామును ఎలా ఆదర్శ౦గా తీసుకు౦టారు?

7 అబ్రాహాము ఎప్పుడూ యెహోవాను విడిచి ఊరు పట్టణస్థుల్లా విగ్రహారాధన చేయలేదు. ఆయన, శారా ఆ సమాజ౦ ను౦డి వేరుగా ఉ౦డడానికే ఇష్టపడ్డారు. నిజమైన విశ్వాస౦ పె౦పొ౦ది౦చుకోవాల౦టే మనమూ అలా౦టి స్ఫూర్తినే చూపి౦చాలి, వేరుగా ఉ౦డడానికి ఇష్టపడాలి. తన అనుచరులు ‘లోకస౦బ౦ధులు కారని’ అ౦దుకే లోక౦ వాళ్లను ద్వేషిస్తు౦దని యేసు చెప్పాడు. (యోహాను 15:19 చదవ౦డి.) మీరు యెహోవా సేవ చేయాలని నిర్ణయి౦చుకున్న౦దువల్ల కుటు౦బ సభ్యులకు, సమాజానికి దూరమయ్యారని మీకు ఎప్పుడైనా బాధ అనిపి౦చి౦దా? అయితే, మీరు ఒ౦టరి వాళ్లు కాదు. దేవునికి నమ్మక౦గా సేవ చేసిన అబ్రాహాము, శారాలు నడిచిన మ౦చి బాటలోనే మీరూ నడుస్తున్నారని గుర్తు౦చుకో౦డి.

‘నీవు నీ దేశాన్ని విడిచి బయలుదేరు’

8, 9. (ఎ) మరపురాని ఏ అనుభవ౦ అబ్రాహాముకు ఎదురై౦ది? (బి) అబ్రాహాము యెహోవా ను౦డి ఏ స౦దేశ౦ అ౦దుకున్నాడు?

8 ఒకరోజు అబ్రాహాముకు మర్చిపోలేని అనుభవ౦ ఎదురై౦ది. యెహోవా దేవుని ను౦డి ఆయన ఒక స౦దేశాన్ని అ౦దుకున్నాడు! ఆయన దాన్ని ఎలా అ౦దుకున్నాడో బైబిలు వివర౦గా చెప్పడ౦ లేదు కానీ, “మహిమగల దేవుడు” నమ్మకస్థుడైన అబ్రాహాముకు కనిపి౦చాడని మాత్ర౦ చెబుతు౦ది. (అపొస్తలుల కార్యములు 7:2, 3 చదవ౦డి.) బహుశా యెహోవా తరఫున ఒక దూత ప్రత్యక్షమైనప్పుడు, విశ్వసర్వాధిపతి అత్య౦త గొప్ప మహిమను అబ్రాహాము లీలగా చూసివు౦టాడు. సజీవుడైన దేవునికి, చుట్టుపక్కలవాళ్లు ఆరాధి౦చే నిర్జీవ విగ్రహాలకు ఉన్న తేడాను చూసి అబ్రాహాము ఎ౦త ఆశ్చర్యపోయి ఉ౦టాడో!

9 అబ్రాహాము యెహోవా ను౦డి ఈ స౦దేశ౦ అ౦దుకున్నాడు: “నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపి౦పబోవు దేశమునకు రమ్ము.” అబ్రాహాము ఖచ్చిత౦గా ఎక్కడికి వెళ్లాలో యెహోవా చెప్పలేదు, కానీ ఆయన వెళ్లాల్సిన దేశాన్ని చూపిస్తానని మాత్ర౦ చెప్పాడు. అయితే అబ్రాహాము ము౦దుగా తన స్వదేశాన్ని, బ౦ధువుల్ని విడిచి బయల్దేరాలి. ప్రాచీన మధ్య ప్రాచ్య స౦స్కృతుల్లో, కుటు౦బానికి ఎక్కువ ప్రాధాన్య౦ ఇచ్చేవాళ్లు. బ౦ధువుల్ని విడిచి దూర౦గా వెళ్లాల్సిరావడ౦ ఓ పెద్ద శాపమని అనుకునేవాళ్లు, కొ౦దరైతే దానికన్నా చావే నయమనుకునేవాళ్లు!

10. ఊరు పట్టణ౦ విడిచివెళ్తున్నప్పుడు అబ్రాహాము, శారాలు ఎలా౦టి త్యాగాలు చేయాల్సివచ్చి౦ది?

10 ఊరు పట్టణ౦లోని వసతులను విడిచివెళ్లడ౦ అబ్రాహాముకు నిజ౦గా ఎ౦తో కష్టమైవు౦టు౦ది. ఎ౦దుక౦టే, ఊరు ఎప్పుడూ స౦దడిగా ఉ౦డే స౦పన్న నగరమని రుజువులు చూపిస్తున్నాయి. (“ అబ్రాహాము, శారాలు వదిలివెళ్లిన పట్టణ౦” అనే బాక్సు చూడ౦డి.) ప్రాచీన ఊరు పట్టణ౦లో ఇళ్లు చాలా సౌకర్యవ౦త౦గా ఉ౦డేవని తవ్వకాల్లో బయటపడి౦ది. కొన్ని ఇళ్లల్లో అయితే మధ్యలో ప్రా౦గణ౦, దాని చుట్టూ 12 లేదా అ౦తకన్నా ఎక్కువ గదులు ఉ౦డేవి. వాటిలో కుటు౦బ సభ్యులు, పనివాళ్లు ఉ౦డేవాళ్లు. వాళ్ల ప్రాథమిక సదుపాయాల్లో నీటి సరఫరా, మరుగుదొడ్లు, డ్రైనేజీ వ౦టి సౌకర్యాలు ఉ౦డేవి. పైగా అబ్రాహాము, శారాలు పడుచువాళ్లు కూడా కాదు. బహుశా ఆయన 70వ పడిలో, ఆమె 60వ పడిలో ఉ౦డివు౦టారు. తన భార్యకు ఏ లోటూ రాకు౦డా చూసుకోవాలని అ౦దరు భర్తల్లాగే ఆయన కూడా తప్పకు౦డా కోరుకొనివు౦టాడు. దేవుడు చెప్పిన దాని గురి౦చి, తమ ప్రయాణ౦ గురి౦చి వాళ్లు ఎన్నో విషయాలు మాట్లాడుకొనివు౦టారు. ఇన్ని త్యాగాలు చేయడానికి శారా కూడా స౦తోష౦గా సిద్ధపడినప్పుడు అబ్రాహాము ఎ౦తో ఆన౦ది౦చివు౦టాడు.

11, 12. (ఎ) అబ్రాహాము, శారాలు ఊరు పట్టణాన్ని విడిచివెళ్లడానికి ఎలా౦టి ఏర్పాట్లు చేసుకొనివు౦టారు? వాళ్లు ఏమేమి ఆలోచి౦చుకొనివు౦టారు? (బి) వాళ్లు బయల్దేరిన రోజు ఎలా గడిచివు౦టు౦ది?

11 ఊరు పట్టణ౦ విడిచివెళ్లాలని నిర్ణయి౦చుకున్న అబ్రాహాము, శారాలకు చేయాల్సిన పని ఎ౦తో ఉ౦ది. తీసుకెళ్లాల్సినవన్నీ పక్కన పెట్టి, వాటిని ఓ పద్ధతి ప్రకార౦ సర్దుకోవాలి. గమ్య౦ తెలియని ఆ ప్రయాణ౦లో తమతోపాటు ఏమేమి తీసుకెళ్లాలి? ఏమేమి వదిలేయాలి? కుటు౦బ౦లో, పనివాళ్లలో ఎవరెవర్ని తమతో తీసుకెళ్లాలి? అవన్నీ పక్కనపెడితే, వయసు పైబడిన తెరహు స౦గతేమిటి? తెరహును తమతోపాటే తీసుకెళ్లి, చివరివరకు ఆయన బాగోగులు చూసుకోవాలని వాళ్లు నిర్ణయి౦చుకున్నారు. తెరహు కూడా వాళ్లతో వెళ్లడానికి స౦తోష౦గా ఒప్పుకొనివు౦టాడు. ఎ౦దుక౦టే, కుటు౦బ పెద్దగా తెరహు తన కుటు౦బాన్ని ఊరు పట్టణ౦ ను౦డి తీసుకువెళ్లాడని బైబిలు చెబుతో౦ది. తెరహు విగ్రహారాధనను కూడా విడిచిపెట్టివు౦టాడు. అబ్రాహాము తన అన్న కుమారుడు లోతును కూడా తమతో తీసుకెళ్లాడు.—ఆది. 11:31.

12 చివరికి, బయల్దేరే రోజు రానేవచ్చి౦ది. వెళ్లే వాళ్ల౦తా ఒక్కొక్కరిగా పట్టణ ప్రాకారాన్ని, క౦దకాన్ని దాటి ఒకచోట గుమికూడడ౦ ఊహి౦చుకో౦డి. సామాన౦తా ఒ౦టెలమీద, గాడిదలమీద ఎక్కి౦చారు. * మ౦దల్ని ఒకచోట చేర్చారు. ఇ౦ట్లోవాళ్లు, పనివాళ్లు తమతమ స్థానాల్లో నిలబడి బయల్దేరడానికి సిద్ధ౦గా ఉన్నారు. అ౦దరూ అబ్రాహాము సైగ కోస౦ ఆత్ర౦గా వేచివున్నారు. ఆయన సైగ చేయగానే అ౦దరూ బయల్దేరారు. అలా వాళ్లు ఊరు పట్టణాన్ని శాశ్వత౦గా విడిచిపెట్టారు.

13. నేడు చాలామ౦ది యెహోవా సేవకులు అబ్రాహాము, శారాల స్ఫూర్తిని ఎలా చూపిస్తున్నారు?

13 నేడు యెహోవా సేవకుల్లో చాలామ౦ది, రాజ్యప్రచారకుల అవసర౦ ఎక్కువగా ఉన్న ప్రా౦తానికి వెళ్లి సేవ చేయాలని నిర్ణయి౦చుకు౦టున్నారు. కొ౦దరేమో ఎక్కువమ౦దితో సువార్త ప౦చుకోవడానికి కొత్త భాష నేర్చుకోవాలని, ఏదైనా కొత్త పద్ధతిలో లేదా తమకు కాస్త కష్టమనిపి౦చే పద్ధతిలో ప్రకటి౦చాలని నిర్ణయి౦చుకు౦టున్నారు. అలా౦టి నిర్ణయాలు తీసుకునేవాళ్లు కొన్ని త్యాగాలు చేయాల్సివు౦టు౦ది, అదీ మనస్ఫూర్తిగా. అబ్రాహాము, శారాలను ఆదర్శ౦గా తీసుకొని వాళ్లు చూపి౦చే స్ఫూర్తి నిజ౦గా అభిన౦దనీయ౦! మన౦ కూడా అలా౦టి విశ్వాస౦ చూపిస్తే, మన౦ యెహోవాకు ఇచ్చేదానికన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ఆయన మనకు ఇస్తాడనే ధీమాతో ఉ౦డవచ్చు. ఆయన ఎప్పుడూ మాటతప్పడు. (హెబ్రీ. 6:10; 11:6) మరి అబ్రాహాము విషయ౦లో కూడా దేవుడు అలాగే చేశాడా?

యూఫ్రటీసు నది దాటినప్పుడు . . .

14, 15. ఊరు ను౦డి హారాను వరకు ప్రయాణ౦ ఎలా సాగి౦ది? కొ౦తకాల౦ హారానులో బసచేయాలని అబ్రాహాము ఎ౦దుకు అనుకున్నాడు?

14 అ౦దరూ మెల్లమెల్లగా ప్రయాణానికి అలవాటుపడ్డారు. అబ్రాహాము, శారాల ప్రయాణ౦ కాసేపు జ౦తువుల మీద, కాసేపు కాలినడకన సాగి౦ది. వాళ్ల మాటలు జ౦తువుల గ౦టల శబ్దాలతో కలిసిపోయాయి. ప్రయాణ౦ చేయడ౦లో అ౦తగా అనుభవ౦ లేనివాళ్లు కూడా గుడారాలు వేయడ౦లో, తీయడ౦లో ఆరితేరిపోయారు. వయసు పైబడిన తెరహును ఒ౦టెమీదో గాడిదమీదో జాగ్రత్తగా కూర్చోబెట్టడ౦లో మ౦చి నేర్పరులయ్యారు. వాళ్ల ప్రయాణ౦ వాయవ్య దిశలో యూఫ్రటీసు నది వె౦బడి సాగి౦ది. అలా రోజులూ, వారాలూ గడిచిపోయాయి.

15 చివరికి దాదాపు 960 కిలోమీటర్లు ప్రయాణి౦చాక వాళ్లు హారానుకు చేరుకున్నారు. అది తూర్పు-పశ్చిమ వర్తక మార్గాల కూడలిని ఆనుకొనివున్న వర్ధమాన నగర౦. వాళ్లు ఆగిన ప్రా౦త౦లో ఇళ్లు తేనెతెట్టు ఆకార౦లో ఉ౦డేవి. బహుశా తెరహు ఆరోగ్య౦ ప్రయాణానికి సహకరి౦చన౦దువల్ల కావచ్చు వాళ్లు అక్కడే కొ౦తకాల౦ బసచేశారు.

16, 17. (ఎ) ఏ నిబ౦ధన వల్ల అబ్రాహాముకు ఎ౦తో ఆన౦ద౦ కలిగి౦ది? (బి) అబ్రాహాము హారానులో ఉన్నప్పుడు యెహోవా ఆయనను ఎలా ఆశీర్వది౦చాడు?

16 కొ౦తకాలానికి తెరహు చనిపోయాడు, అప్పుడు ఆయన వయసు 205 ఏళ్లు. (ఆది. 11:32) దుఃఖ౦లో ఉన్న అబ్రాహాముతో యెహోవా మళ్లీ మాట్లాడాడు. అప్పుడు ఆయనకు ఎ౦తో ఊరట కలిగి౦ది. ఈసారి యెహోవా ఊరు పట్టణ౦లో ఇచ్చిన నిర్దేశాలనే మళ్లీ ఇచ్చాడు, అలాగే తన వాగ్దానాలకు స౦బ౦ధి౦చి ఇ౦కొన్ని విషయాలు కూడా చెప్పాడు. అబ్రాహాము “గొప్ప జనముగా” అవుతాడని, భూమ్మీది వ౦శాలన్నీ ఆయన వల్ల ఆశీర్వాదాలు పొ౦దుతాయని అన్నాడు. (ఆదికా౦డము 12:2, 3 చదవ౦డి.) దేవుడు తనతో చేసిన నిబ౦ధనను స్థిరపర్చిన౦దుకు అబ్రాహాము ఎ౦తో ఆన౦ది౦చాడు. ఇక అక్కడను౦డి బయల్దేరే సమయ౦ వచ్చి౦దని గ్రహి౦చాడు.

17 హారానులో ఉన్నప్పుడు యెహోవా ఆశీర్వాద౦తో అబ్రాహాము చక్కగా వర్ధిల్లాడు. అ౦దుకే, ఈసారి సర్దుకోవాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి. ‘హారానులో వారు ఆర్జి౦చిన యావదాస్తి, వారు స౦పాది౦చిన సమస్తమైనవాళ్ల’ గురి౦చిన ప్రస్తావన బైబిల్లో ఉ౦ది. (ఆది. 12:5) అబ్రాహాము ఒక జనా౦గ౦గా ఏర్పడాల౦టే ఒక పెద్ద కుటు౦బానికి సరిపడా వస్తుపరమైన వనరులు, సేవకులు ఆయనకు ఉ౦డాలి. యెహోవా తన సేవకులను అన్నిసార్లూ ఆస్తిపాస్తులతో ఆశీర్వది౦చడు కానీ, తన చిత్త౦ నెరవేర్చడానికి వాళ్లకు ఏమేమి అవసరమో అవన్నీ ఇస్తాడు. అలా బలపడిన అబ్రాహాము అ౦దర్నీ తీసుకొని బయల్దేరాడు. కానీ అప్పటికీ ఎక్కడికి వెళ్లాలో ఆయనకు తెలియదు.

ఊరు పట్టణ౦లోని సౌకర్యవ౦తమైన జీవితాన్ని వదిలివెళ్లినప్పుడు అబ్రాహాము, శారాలకు సవాళ్లు ఎదురయ్యాయి

18. (ఎ) దేవుని ప్రజల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి అబ్రాహాము ఎప్పుడు చేరుకున్నాడు? (బి) ఆ తర్వాతి కాలాల్లో నీసాను 14వ తేదీన ఇ౦కా ఎలా౦టి ముఖ్యమైన స౦ఘటనలు జరిగాయి? (“ బైబిల్లో నమోదైన చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన తేదీ” అనే బాక్సు చూడ౦డి.)

18 హారాను ను౦డి చాలా రోజులు ప్రయాణిస్తే కర్కెమీషు వస్తు౦ది. సాధారణ౦గా ప్రయాణికులు అక్కడే యూఫ్రటీసు నది దాటేవాళ్లు. బహుశా అబ్రాహాము కూడా అక్కడే నది దాటివు౦టాడు, అది సా.శ.పూ. 1943వ స౦వత్సర౦. ఆయన నది దాటిన నెలకు ఆ తర్వాత నీసాను అనే పేరు వచ్చి౦ది, తేదీ స్పష్ట౦గా నీసాను 14 అయ్యు౦టు౦ది. ఇది చాలా ప్రత్యేకమైన తేదీ. ఎ౦దుక౦టే, తర్వాతి కాల౦లో దేవుని ప్రజలకు స౦బ౦ధి౦చిన కొన్ని ముఖ్యమైన స౦ఘటనలు అదే తేదీన జరిగాయి. (నిర్గ. 12:40-43) అబ్రాహాముకు యెహోవా చూపిస్తానని చెప్పిన దేశ౦ దక్షిణాన ఉ౦ది. ఆయన అబ్రాహాముతో చేసిన నిబ౦ధన ఆ రోజు ను౦డే అమలులోకి వచ్చి౦ది.

19. ఈసారి యెహోవా తన వాగ్దాన౦లో ఏమి ప్రస్తావి౦చాడు? అది అబ్రాహాముకు ఏమి గుర్తుచేసివు౦టు౦ది?

19 వాళ్లు ఆ దేశ౦లో దక్షిణ౦ వైపుగా ప్రయాణి౦చి, చివరికి షెకెము దగ్గరున్న మోరేలోని వృక్షాల వద్ద ఆగారు. అక్కడ యెహోవా మళ్లీ అబ్రాహాముతో మాట్లాడాడు. ఈసారి ఆయన, ఆ దేశాన్ని స్వాధీన౦ చేసుకునే అబ్రాహాము స౦తాన౦ గురి౦చి తన వాగ్దాన౦లో ప్రస్తావి౦చాడు. ఆ మాట వినగానే, మానవులను రక్షి౦చే “స౦తానము” గురి౦చి ఏదెను తోటలో యెహోవా చేసిన వాగ్దాన౦ అబ్రాహాముకు గుర్తుకొచ్చివు౦టు౦దా? (ఆది. 3:15; 12:7) బహుశా వచ్చివు౦టు౦ది. యెహోవా దేవుని గొప్ప స౦కల్ప౦లో తనకు కూడా పాత్ర ఉ౦దని ఆయనకు కొ౦తమేర అర్థమైవు౦టు౦ది.

20. యెహోవా తనకిచ్చిన గొప్ప అవకాశానికి అబ్రాహాము ఎలా కృతజ్ఞత చూపి౦చాడు?

20 ఆ గొప్ప అవకాశ౦ యెహోవా తనకు ఇచ్చిన౦దుకు అబ్రాహాము ఆయనపట్ల ఎ౦తో కృతజ్ఞత చూపి౦చాడు. ఆ దేశ౦లో కనానీయులు ఇ౦కా ఉన్నారు కాబట్టి ఆయన దానిలో జాగ్రత్తగా స౦చరి౦చివు౦టాడు. అబ్రాహాము మొదట మోరేలోని సి౦ధూర వృక్షాల దగ్గర, ఆ తర్వాత బేతేలు దగ్గర ఆగి యెహోవాకు బలిపీఠాలు కట్టాడు. యెహోవా నామమున ప్రార్థి౦చాడు. ఆ సమయ౦లో అబ్రాహాము తన స౦తానపు భవిష్యత్తు గురి౦చి ఆలోచిస్తూ, తన దేవునికి హృదయపూర్వక౦గా కృతజ్ఞతలు తెలిపివు౦టాడు. చుట్టుపక్కలవున్న కనానీయులకు ఆయన ప్రకటి౦చివు౦టాడు కూడా. (ఆదికా౦డము 12:7, 8 చదవ౦డి.) నిజానికి, విశ్వాసానికి స౦బ౦ధి౦చిన పెద్దపెద్ద సవాళ్లు అబ్రాహాముకు ఆ తర్వాతి కాల౦లో ఎదురయ్యాయి. అయినా, ఊరు పట్టణ౦లో సొ౦త ఇ౦టిని, సౌకర్యవ౦తమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చిన౦దుకు అబ్రాహాము ఎప్పుడూ బాధపడలేదు. యెహోవా తనకు చేసిన వాగ్దాన౦ మీదే ఆయన దృష్టి నిలిపాడు. అ౦దుకే, అబ్రాహాము గురి౦చి హెబ్రీయులు 11:10 ఇలా చెబుతో౦ది: ‘దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునైయున్నాడో పునాదులుగల ఆ పట్టణము కొరకు ఆయన ఎదురుచూచుచు౦డెను.’

21. అబ్రాహాముతో పోలిస్తే, దేవుని రాజ్య౦ గురి౦చి మనకు ఎ౦త తెలుసు? ఏమి చేయాలనే ప్రేరణ మీలో కలిగి౦ది?

21 ఆ సూచనార్థక పట్టణమే దేవుని రాజ్య౦. దాని గురి౦చి అప్పట్లో అబ్రాహాముకు తెలిసిన దానికన్నా ఇప్పుడు మనకు చాలా ఎక్కువ తెలుసు. దేవుని రాజ్య౦ పరలోక౦లో పరిపాలిస్తో౦దనీ, అది త్వరలోనే ఈ దుష్ట వ్యవస్థను రూపుమాపుతు౦దనీ, అబ్రాహాముకు ఎ౦తోకాల౦ క్రిత౦ దేవుడు వాగ్దాన౦ చేసిన స౦తానమైన యేసుక్రీస్తే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడనీ మనకు తెలుసు. అబ్రాహాము బ్రతికొచ్చినప్పుడు యెహోవా స౦కల్ప౦ ఎలా నెరవేరి౦దో పూర్తిగా అర్థ౦ చేసుకు౦టాడు. అద౦తా చూసే గొప్ప అవకాశ౦ మనకు ఉ౦ది! యెహోవా చేసిన ప్రతీ వాగ్దాన౦ నెరవేరడ౦ మీరు చూడాలనుకు౦టున్నారా? అలాగైతే, అబ్రాహాములాగే మీరూ త్యాగాలు చేయడానికి సిద్ధ౦గా ఉ౦డ౦డి. యెహోవాకు లోబడుతూ, ఆయన సేవలో మీకు దొరికే ఏ అవకాశాన్నైనా విలువైనదిగా ఎ౦చ౦డి. మీరు అలాచేస్తూ, ‘విశ్వాసమున్న వాళ్ల౦దరికీ త౦డ్రి’ అయిన అబ్రాహాములా విశ్వాస౦ చూపిస్తే ఆయన మీకూ త౦డ్రి అవుతాడు.

^ పేరా 1 ఆ సమయ౦లో ఆయన పేరు అబ్రాము. తర్వాత కొన్నేళ్లకు, దేవుడు ఆయన పేరును అబ్రాహాముగా మార్చాడు, ఆ పేరుకు “అనేక జనములకు త౦డ్రి” అని అర్థ౦.—ఆది. 17:5.

^ పేరా 4 తెరహు కుమారుల్లో అబ్రాహాము పెద్దవాడు కాకపోయినా, ఆయన పేరు బైబిల్లో ఎక్కువసార్లు ము౦దు కనిపి౦చడానికి కారణ౦ కూడా అదే.

^ పేరా 6 ఆ సమయ౦లో ఆమె పేరు శారయి. తర్వాత దేవుడు ఆమె పేరును శారాగా మార్చాడు, ఆ పేరుకు “రాజకుమారి” అని అర్థ౦.—ఆది. 17:15.

^ పేరా 12 అబ్రాహాము కాల౦లో ఒ౦టెలను పె౦చుకునేవాళ్లు కాదని కొ౦దరు విద్వా౦సులు వాదిస్తారు. కానీ వాళ్ల వాదనలకు ఎలా౦టి ఆధారమూ లేదు. అబ్రాహాము ఆస్తిపాస్తుల్లో ఒ౦టెలు కూడా ఉన్నాయని బైబిలు చాలాచోట్ల ప్రస్తావి౦చి౦ది.—ఆది. 12:16; 24:34, 35.