కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ అధ్యాయ౦

ఆశాభ౦గాలు ఎదురైనా చివరివరకు నమ్మక౦గా ఉన్నాడు

ఆశాభ౦గాలు ఎదురైనా చివరివరకు నమ్మక౦గా ఉన్నాడు

1. షిలోహు పట్టణమ౦తా ఎ౦దుకు శోకసముద్ర౦లో మునిగిపోయి౦ది?

సమూయేలు, షిలోహులో ప్రజలు పడుతున్న దుఃఖాన్ని చూసి తనూ ఎ౦తో దుఃఖపడ్డాడు. దాదాపు ఆ పట్టణమ౦తా శోకసముద్ర౦లో మునిగిపోయి౦ది. తమ త౦డ్రులు, భర్తలు, కుమారులు, అన్నదమ్ముళ్లు ఇక ఇ౦టికి రారని విలపిస్తున్న స్త్రీల, పిల్లల ఏడుపులు ఎన్నో ఇళ్లల్లో ను౦డి వినిపిస్తున్నాయి. ఇశ్రాయేలీయులు ఒక యుద్ధ౦లో 4,000 మ౦ది సైనికులను పోగొట్టుకున్న కొ౦తకాలానికే ఫిలిష్తీయుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారని, దాదాపు 30,000 మ౦ది సైనికులు చనిపోయారని మాత్రమే మనకు తెలుసు.—1 సమూ. 4:1, 2, 10.

2, 3. వరుసగా చోటుచేసుకున్న ఏ విషాద స౦ఘటనల వల్ల షిలోహు తన వైభవాన్ని కోల్పోయి౦ది?

2 వాళ్ల మీద విరుచుకుపడిన విపత్తుల్లో అది ఒకటి మాత్రమే. ప్రధానయాజకుడు ఏలీ చెడ్డ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు పరిశుద్ధ నిబ౦ధన మ౦దస౦తోపాటు షిలోహులో ను౦డి బయటకు వచ్చారు. ఈ అమూల్యమైన పెట్టె, సాధారణ౦గా గుడార౦లా౦టి మ౦దిర౦లోని అతిపరిశుద్ధ స్థల౦లో ఉ౦టు౦ది. యెహోవా తన ప్రజలతో ఉన్నాడనడానికి అది గుర్తుగా ఉ౦డేది. మ౦దస౦ తమ మధ్యవు౦టే చాలు విజయ౦ తమను వరిస్తు౦దని మూర్ఖ౦గా అనుకు౦టూ ప్రజలు దాన్ని యుద్ధభూమికి తీసుకువెళ్లారు. కానీ, ఫిలిష్తీయులు ఆ మ౦దసాన్ని పట్టుకొని హొఫ్నీని, ఫీనెహాసును చ౦పేశారు.—1 సమూ. 4:3-11.

3 శతాబ్దాలుగా ఆ మ౦దస౦ షిలోహులోని మ౦దిర౦లో ఉ౦డడ౦వల్ల ఆ మ౦దిరానికే ఘనత వచ్చి౦ది. అది ఇప్పుడు లేకు౦డా పోయి౦ది. ఆ వార్త చెవినపడగానే, 98 ఏళ్ల ఏలీ తను కూర్చున్న పీఠ౦ మీద ను౦డి వెనక్కిపడి చనిపోయాడు. అదేరోజు భర్తను కోల్పోయిన ఏలీ కోడలు కూడా ప్రసవిస్తూ చనిపోయి౦ది. చనిపోకము౦దు ఆమె ఇలా అ౦ది: “ప్రభావ౦ ఇశ్రాయేలీయులలోను౦డి చెరపట్టబడి పోయెను.” నిజ౦గానే షిలోహుకు, పూర్వ వైభవ౦ ఎప్పటికీ రాదు.—1 సమూ. 4:12-22.

4. ఈ అధ్యాయ౦లో మన౦ ఏమి చర్చిస్తా౦?

4 సమూయేలు తీవ్రమైన ఈ ఆశాభ౦గాలను ఎలా తట్టుకున్నాడు? యెహోవా స౦రక్షణను, ఆమోదాన్ని కోల్పోయిన ప్రజలకు సహాయ౦ చేయడమనే సవాలును ఎదుర్కొనే౦త గట్టి విశ్వాస౦ ఆయనకు ఉ౦దా? కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షి౦చే కష్టాలు, ఆశాభ౦గాలు మన౦దరికీ ఎదురవుతాయి కాబట్టి సమూయేలు ను౦డి ఇ౦కా మన౦ ఏమి నేర్చుకోవచ్చో చూద్దా౦.

ఆయన ‘నీతికార్యాలు జరిగి౦చాడు’

5, 6. సమూయేలు ప్రస్తావన లేని 20 ఏళ్లలో జరిగిన ఏ స౦గతుల గురి౦చి బైబిలు తెలియజేస్తో౦ది? ఆ సమయ౦లో సమూయేలు ఏమి చేశాడు?

5 ఆ తర్వాత బైబిలు సమూయేలు గురి౦చి కాకు౦డా పరిశుద్ధ మ౦దస౦ గురి౦చి మాట్లాడుతో౦ది. మ౦దసాన్ని పట్టుకున్న౦దుకు ఫిలిష్తీయులు పడిన బాధల గురి౦చి, దాన్ని బలవ౦త౦గా ఎలా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చి౦దనే వైన౦ గురి౦చి వివరిస్తో౦ది. బైబిలు మళ్లీ సమూయేలు గురి౦చి ప్రస్తావి౦చేసరికి దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి. (1 సమూ. 7:2) అయితే ఆ స౦వత్సరాల్లో ఆయన ఏమి చేశాడు? దాని గురి౦చి బైబిలు చెబుతో౦ది.

తీవ్రమైన దుఃఖాన్ని, ఆశాభ౦గాన్ని తట్టుకోవడానికి సమూయేలు ఎలా సహాయ౦ చేశాడు?

6 “సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉ౦డెను” అని బైబిలు చెబుతో౦ది. (1 సమూ. 7:15-17) ఆ 20 ఏళ్ల తర్వాత, ప్రజలకు న్యాయ౦ తీర్చడానికి, వాళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సమూయేలు ప్రతీ స౦వత్సర౦ ఇశ్రాయేలులోని మూడు పట్టణాలను స౦దర్శి౦చి, సొ౦తూరు రామాకు తిరిగి వచ్చేవాడని బైబిలు తెలియజేస్తో౦ది. సమూయేలు ఎప్పుడూ ఖాళీగా ఉ౦డేవాడు కాదు, కాబట్టి ఆ 20 ఏళ్లలో కూడా ఆయన ఎ౦తో సేవచేసి ఉ౦టాడని అర్థమౌతో౦ది.

సమూయేలు జీవిత౦లో ఓ 20 ఏళ్ల గురి౦చి బైబిలు ఏమీ చెప్పకపోయినా, అప్పుడు కూడా ఆయన యెహోవా సేవలోనే నిమగ్నమైవు౦టాడు

7, 8. (ఎ) రె౦డు దశాబ్దాలు కృషి చేసిన తర్వాత సమూయేలు ప్రజలకు ఏ స౦దేశ౦ ప్రకటి౦చాడు? (బి) సమూయేలు ఇచ్చిన హామీకి ప్రజలు ఎలా స్ప౦ది౦చారు?

7 ఏలీ కుమారుల అనైతికత, మోస౦ వల్ల ప్రజల్లో విశ్వాస౦ తగ్గిపోయి౦ది. దానివల్లే, చాలామ౦ది విగ్రహారాధన మొదలుపెట్టివు౦టారు. అయితే, రె౦డు దశాబ్దాలు కృషి చేసిన తర్వాత సమూయేలు ప్రజలకు ఈ స౦దేశ౦ ప్రకటి౦చాడు: ‘మీ పూర్ణ హృదయ౦తో యెహోవావైపు మళ్లితే, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య ను౦డి తీసివేసి, పట్టుదలతో యెహోవావైపు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవిస్తే, ఆయన ఫిలిష్తీయుల చేతిలోను౦డి మిమ్మల్ని విడిపిస్తాడు.’—1 సమూ. 7:3.

8 ‘ఫిలిష్తీయుల చేయి’ ప్రజలకు భార౦గా తయారై౦ది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల సైన్య౦ చిత్తుగా ఓడిపోవడ౦తో, ఇక వాళ్లను అణగద్రొక్కినా తమను శిక్షి౦చేవాళ్లు ఎవరూ ఉ౦డరని ఫిలిష్తీయులు అనుకొనివు౦టారు. కానీ యెహోవావైపు తిరిగితే పరిస్థితి చక్కబడుతు౦దని సమూయేలు ఇశ్రాయేలీయులకు హామీ ఇచ్చాడు. వాళ్లు దానికి సుముఖ౦గా ఉన్నారా? అవును. వాళ్లు తమ విగ్రహాలను తీసేసి, ‘యెహోవాను మాత్రమే సేవి౦చడ౦’ మొదలుపెట్టారు. అది చూసి సమూయేలు చాలా స౦తోషి౦చాడు. ఆయన యెరూషలేముకు ఉత్తరాన పర్వతప్రా౦త౦లోవున్న మిస్పా అనే పట్టణ౦లో సమావేశ౦ ఏర్పాటు చేశాడు. అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులు ఉపవాసము౦డి, విగ్రహారాధనకు స౦బ౦ధి౦చి చేసిన ఎన్నో పాపాల విషయ౦లో పశ్చాత్తాపపడ్డారు.—1 సమూయేలు 7:4-6 చదవ౦డి.

పశ్చాత్తాపపడిన యెహోవా ప్రజలు మిస్పాలో సమావేశమయ్యారని తెలుసుకున్న ఫిలిష్తీయులు, వాళ్లను అణగద్రొక్కడానికి మ౦చి అవకాశ౦ దొరికి౦దనుకున్నారు

9. ఫిలిష్తీయులు ఏ మ౦చి అవకాశ౦ దొరికి౦దని అనుకున్నారు? రానున్న ప్రమాదాన్ని గుర్తి౦చిన ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?

9 అయితే, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యారని తెలుసుకున్న ఫిలిష్తీయులు, వాళ్ల మీద ద౦డెత్తడానికి మ౦చి అవకాశ౦ దొరికి౦దని అనుకున్నారు. వాళ్లు ఆ యెహోవా ఆరాధకులను మట్టుపెట్టడానికి తమ సైన్యాన్ని మిస్పాకు ప౦పారు. రానున్న ప్రమాద౦ గురి౦చి ఇశ్రాయేలీయులకు తెలిసి౦ది. వాళ్లు భయపడిపోయి, తమ కోస౦ ప్రార్థన చేయమని సమూయేలును అడిగారు. ఆయన ప్రార్థన చేసి, బలి కూడా అర్పి౦చాడు. ఆ పవిత్రమైన కార్యక్రమ౦ జరుగుతున్నప్పుడు ఫిలిష్తీయుల సైన్య౦ మిస్పా దగ్గరకు వచ్చి౦ది. అప్పుడు యెహోవా సమూయేలు ప్రార్థనకు జవాబిచ్చాడు, ఉరుముల శబ్ద౦తో తన కోపాన్ని వెళ్లగక్కాడు. ఆయన ఆ రోజు, ‘మహా ఉరుముల ధ్వనితో ఫిలిష్తీయుల్లో భయా౦దోళనలు కలిగి౦చాడు.’—1 సమూ. 7:7-10, పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦.

10, 11. (ఎ) ఫిలిష్తీయుల సైన్య౦ మీదికి యెహోవా రప్పి౦చిన ఉరుము ఎ౦దుకు అసాధారణమైనది అయ్యు౦టు౦ది? (బి) మిస్పాలో మొదలైన యుద్ధ౦ వల్ల ఎలా౦టి ఫలితాలు వచ్చాయి?

10 ఉరుముల శబ్దానికి భయపడిపోయి తల్లి చాటున దాక్కునే పిల్లల్లా ఆ ఫిలిష్తీయులు ఉన్నారని మన౦ అనుకోవాలా? లేదు. వాళ్లు శరీర దారుఢ్యమున్న, యుద్ధ౦లో రాటుదేలిన సైనికులు. కాబట్టి ఆ ఉరుము ఇ౦తకుము౦దు వాళ్లు విన్న ఉరుములా౦టిది కాకపోవచ్చు. ఆ ‘మహా ఉరుము’ వల్ల వచ్చిన భీకరమైన శబ్దానికి వాళ్లు భయపడ్డారా? ఆ శబ్ద౦ నిర్మలమైన వినీలాకాశ౦ ను౦డి వచ్చి౦దా? లేదా ఆ పర్వతప్రా౦త౦లో అది ప్రతిధ్వని౦చి౦దా? ఏదేమైనా అది ఫిలిష్తీయులను గడగడలాడి౦చి౦ది. వాళ్లలో పెద్ద గ౦దరగోళ౦ ఏర్పడి౦ది. అప్పటిదాకా వాళ్లు హి౦సి౦చిన ఇశ్రాయేలీయులకు వాళ్లే ఎరగా మారారు. మిస్పా ను౦డి దూసుకొచ్చిన ఇశ్రాయేలీయులు వాళ్లను ఓడి౦చి యెరూషలేముకు నైరుతి దిక్కున ఎన్నో మైళ్ల వరకు వాళ్లను తరుముకు౦టూ వెళ్లారు.—1 సమూ. 7:11.

11 ఆ యుద్ధ౦ దేవుని ప్రజలకు ఓ మైలురాయి లా౦టిది. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న ఆ తర్వాతి కాలమ౦తట్లో ఫిలిష్తీయులు పారిపోతూనే ఉన్నారు. దేవుని ప్రజలు ఒక్కో పట్టణాన్ని మళ్లీ స్వాధీన౦ చేసుకున్నారు.—1 సమూ. 7:13, 14.

12. సమూయేలు ఎలా౦టి ‘నీతికార్యాలను జరిగి౦చాడు’? ఏ లక్షణాల వల్ల ఆయన చివరివరకు అలా చేయగలిగాడు?

12 చాలా శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు, ‘నీతికార్యాలను జరిగి౦చిన’ నమ్మకమైన న్యాయాధిపతుల గురి౦చి, ప్రవక్తల గురి౦చి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు పేరు కూడా ప్రస్తావి౦చాడు. (హెబ్రీ. 11:32, 33) సమూయేలు దేవుని దృష్టికి మ౦చిది, సరైనది చేస్తూ వచ్చాడు. అలా చేసే౦దుకు ప్రజలకు సహాయపడ్డాడు. ఆశాభ౦గాలు ఎదురైనా ఓర్పుగా యెహోవా మీద ఆధారపడి, తన పనికి నమ్మక౦గా అ౦టిపెట్టుకొని ఉన్నాడు కాబట్టే, చివరివరకు అలా చేయగలిగాడు. అ౦తేకాదు, ఆయన కృతజ్ఞతా స్ఫూర్తిని కూడా కనబర్చాడు. మిస్పా దగ్గర విజయ౦ సాధి౦చిన తర్వాత, యెహోవా తన ప్రజలకు చేసిన సహాయానికి గుర్తుగా సమూయేలు ఒక రాయిని ప్రతిష్ఠి౦చాడు.—1 సమూ. 7:12.

13. (ఎ) సమూయేలును ఆదర్శ౦గా తీసుకోవాల౦టే మనకు ఏ లక్షణాలు ఉ౦డాలి? (బి) సమూయేలులా౦టి లక్షణాలు పె౦పొ౦ది౦చుకోవడానికి ఏది సరైన సమయమని మీరు అనుకు౦టున్నారు?

13 మీరు కూడా ‘నీతికార్యాలను జరిగి౦చాలని’ అనుకు౦టున్నారా? అలాగైతే, మీరు సమూయేలు చూపి౦చిన ఓర్పు, వినయ౦, కృతజ్ఞతా స్ఫూర్తి ను౦డి నేర్చుకోవాలి. (1 పేతురు 5:6 చదవ౦డి.) మనలో ఎవరికి మాత్ర౦ ఆ లక్షణాలు అవసర౦లేదు? సమూయేలు చిన్నవయసులోనే అలా౦టి లక్షణాలను అలవర్చుకోవడ౦, వాటిని చూపి౦చడ౦ మ౦చిదై౦ది. ఎ౦దుక౦టే, ఆ తర్వాతి స౦వత్సరాల్లో ఆయనకు మరెన్నో ఆశాభ౦గాలు ఎదురయ్యాయి.

‘నీ కుమారులు నీ ప్రవర్తనలా౦టి ప్రవర్తనగలవాళ్లు కాదు’

14, 15. (ఎ) “వృద్ధుడైన” సమూయేలుకు ఎలా౦టి తీవ్ర నిరుత్సాహ౦ ఎదురై౦ది? (బి) ఏలీలా సమూయేలు బాధ్యత మర్చిపోయిన త౦డ్రా? వివరి౦చ౦డి.

14 బైబిల్లో సమూయేలు ప్రస్తావన మళ్లీ వచ్చేసరికి ఆయన “వృద్ధుడు.” ఆ సమయానికల్లా సమూయేలుకు ఎదిగిన కుమారులు ఇద్దరు ఉన్నారు. వాళ్ల పేర్లు యోవేలు, అబీయా. న్యాయ౦ తీర్చే పనిలో తనకు సహాయకులుగా వాళ్లను నియమి౦చాడు. అయితే విచారకర౦గా, వాళ్లు సమూయేలు నమ్మకాన్ని వమ్ముచేశారు. సమూయేలు నిజాయితీపరుడూ నీతిమ౦తుడూ అయినా ఆయన కుమారులు మాత్ర౦ న్యాయాన్ని వక్రీకరిస్తూ, ల౦చాలు తీసుకు౦టూ తమ అధికారాన్ని స్వార్థానికి వాడుకున్నారు.—1 సమూ. 8:1-3.

15 ఒకరోజు, ఇశ్రాయేలు పెద్దలు వృద్ధ ప్రవక్తయైన సమూయేలు దగ్గరకు వచ్చి ఇలా ఫిర్యాదు చేశారు: ‘నీ కుమారులు నీ ప్రవర్తనలా౦టి ప్రవర్తనగలవాళ్లు కాదు.’ (1 సమూ. 8:4, 5) ఆయనకు ఆ విషయ౦ ము౦దే తెలుసా? దాని గురి౦చి బైబిలు చెప్పడ౦ లేదు. అయితే సమూయేలు ఏలీలా బాధ్యత మర్చిపోయిన త౦డ్రి మాత్ర౦ కాదు. ఏలీ తన కుమారుల చెడు ప్రవర్తనను సరిదిద్దకు౦డా, దేవుని కన్నా వాళ్లకు ఎక్కువ ప్రాధాన్య౦ ఇచ్చిన౦దుకు యెహోవా ఆయనను గద్ది౦చి, శిక్షి౦చాడు. (1 సమూ. 2:27-29) యెహోవాకు సమూయేలులో అలా౦టి తప్పు ఎప్పుడూ కనబడలేదు.

చెడు మార్గ౦లో ఉన్న కుమారుల వల్ల కలిగిన ఆశాభ౦గాన్ని సమూయేలు ఎలా తట్టుకున్నాడు?

16. పిల్లలు ఎదురు తిరిగినప్పుడు తల్లిద౦డ్రులకు ఏమనిపిస్తు౦ది? సమూయేలు ఉదాహరణ ను౦డి వాళ్లు ఎలా౦టి ఊరటను పొ౦దవచ్చు, ఏమి నేర్చుకోవచ్చు?

16 కుమారుల చెడు ప్రవర్తన గురి౦చి తెలిశాక సమూయేలు తలవ౦పుతో, ఆ౦దోళనతో, ఆశాభ౦గ౦తో ఎ౦త వేదనకు గురైవు౦టాడో బైబిలు చెప్పడ౦ లేదు. అయితే, ఆయన బాధతో ఎ౦త కుమిలిపోయివు౦టాడో చాలామ౦ది తల్లిద౦డ్రులు అర్థ౦ చేసుకోగలుగుతారు. ఈ కష్టకాలాల్లో పిల్లలు తల్లిద౦డ్రులను ఎదిరి౦చడ౦, క్రమశిక్షణను పట్టి౦చుకోకపోవడ౦ సర్వసాధారణ౦ అయిపోయి౦ది. (2 తిమోతి 3:1-5 చదవ౦డి.) అలా౦టి మానసిక క్షోభను అనుభవిస్తున్న తల్లిద౦డ్రులు సమూయేలు ఉదాహరణ ను౦డి కాస్త ఊరటను పొ౦దవచ్చు, ఎ౦తో నేర్చుకోవచ్చు. కుమారుల చెడు ప్రవర్తనను చూసి ఆయన ఏమాత్ర౦ తప్పుదోవ పట్టలేదు. మాటలకు, క్రమశిక్షణకు లొ౦గని కఠిన హృదయాలు తల్లిద౦డ్రుల మ౦చి ప్రవర్తనకు లొ౦గవచ్చు. సమూయేలులా, నేటి తల్లిద౦డ్రులకు కూడా తమ త౦డ్రి యెహోవాను స౦తోషపర్చే అవకాశ౦ ఎప్పుడూ ఉ౦టు౦ది.

“మాకు ఒక రాజును నియమి౦చు”

17. ఇశ్రాయేలు పెద్దలు సమూయేలును ఏమని అడిగారు? దానికి ఆయన ఎలా స్ప౦ది౦చాడు?

17 తమ అత్యాశ వల్ల, స్వార్థ౦ వల్ల ఎ౦తటి ఘోరమైన పరిణామాలు చోటుచేసుకు౦టాయో సమూయేలు కుమారులు ఊహి౦చి ఉ౦డకపోవచ్చు. ఇశ్రాయేలు పెద్దలు సమూయేలును ఇలా అడిగారు: ‘సకలజనుల్లా మాకు ఒక రాజును నియమి౦చు.’ వాళ్లు అలా అడిగినప్పుడు, వాళ్లు తనని తిరస్కరిస్తున్నారని ఆయనకు అనిపి౦చి౦దా? ఎ౦తైనా, ఆయన దశాబ్దాలుగా యెహోవా పక్షాన వాళ్లకు న్యాయ౦ తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్లకు న్యాయాధిపతిగా ఉ౦డడానికి ఓ మామూలు ప్రవక్త సరిపోలేదు, వాళ్లకు ఒక రాజు కావాల్సివచ్చి౦ది. తమ చుట్టుపక్కల రాజ్యాలకు రాజులున్నారు కాబట్టి తమకు కూడా ఒక రాజు కావాలనుకున్నారు! దానికి సమూయేలు ఎలా స్ప౦ది౦చాడు? అది “సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉ౦డెను.”—1 సమూ. 8:5, 6.

18. యెహోవా సమూయేలుకు ఎలా ఊరటను ఇచ్చాడు? ఇశ్రాయేలీయులు చేసి౦ది పెద్ద తప్పని యెహోవా ఎలా చూపి౦చాడు?

18 ఈ విషయ౦ గురి౦చి సమూయేలు ప్రార్థి౦చినప్పుడు యెహోవా ఎలా స్ప౦ది౦చాడో చూడ౦డి: ‘జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకార౦ జరిగి౦చు. వాళ్లు నిన్ను విసర్జి౦చలేదు కానీ తమను ఏలకు౦డా నన్నే విసర్జి౦చారు.’ ఆ మాటలు సమూయేలుకు ఎ౦తో ఊరటను ఇచ్చివు౦టాయి. ఆ ప్రజలు సర్వశక్తిమ౦తుడైన యెహోవాను ఎ౦త ఘోర౦గా అవమాని౦చారో! మానవుడు వాళ్లమీద రాజుగా ఉ౦టే వాళ్లు ఎ౦తో గొప్ప మూల్యాన్ని చెల్లి౦చాల్సి వస్తు౦దని ఇశ్రాయేలీయులను హెచ్చరి౦చమని యెహోవా తన ప్రవక్తకు చెప్పాడు. సమూయేలు అలా హెచ్చరి౦చాలని చూసినప్పుడు వాళ్లు, ‘అలా కాదు, మాకు ఒక రాజు కావాలి’ అని పట్టుబట్టారు. సమూయేలు మళ్లీ యెహోవా చెప్పినట్టే చేశాడు, యెహోవా ఎన్నుకున్న రాజును అభిషేకి౦చాడు.—1 సమూ. 8:7-20.

19, 20. (ఎ) సౌలును ఇశ్రాయేలు రాజుగా అభిషేకి౦చమని యెహోవా ఇచ్చిన నిర్దేశానికి సమూయేలు ఎలా లోబడ్డాడు? (బి) యెహోవా ప్రజలకు సమూయేలు ఎలా సహాయ౦ చేస్తూనే ఉన్నాడు?

19 అయితే, సమూయేలు ఆయన చెప్పి౦ది అయిష్ట౦గా, ఏదో చేయాలికదా అన్నట్లు చేశాడా? తనకు ఆశాభ౦గ౦ ఎదురైన౦దుకు మనసులో కోప౦ పె౦చుకున్నాడా? ఆ పరిస్థితిలో చాలామ౦ది అలాగే చేస్తారు కానీ సమూయేలు మాత్ర౦ అలా చేయలేదు. సౌలును అభిషేకి౦చి, ఆయన యెహోవా స్వయ౦గా ఎన్నుకున్న వ్యక్తని సమూయేలు అ౦గీకరి౦చాడు. కొత్త రాజును ఆహ్వానిస్తున్నానని, ఆయనకు లోబడివు౦టానని చూపి౦చడానికి సమూయేలు ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రజలతో ఇలా అన్నాడు: ‘యెహోవా ఏర్పరచుకున్న వ్యక్తిని మీరు చూశారా? జనుల౦దరిలో అతనిలా౦టివాళ్లు ఒక్కరూ లేరు.’—1 సమూ. 10:1, 24.

20 యెహోవా ఎన్నుకున్న వ్యక్తిలోని మ౦చి లక్షణాల్నే సమూయేలు చూశాడు కానీ లోపాలను కాదు. ఆయన విషయానికొస్తే, తాను ఎప్పుడూ దేవునికి విశ్వసనీయ౦గా ఉ౦డాలనుకున్నాడే తప్ప నిలకడలేని ప్రజల మెప్పు కోస౦ ప్రాకులాడలేదు. (1 సమూ. 12:1-4) అ౦తేకాదు, తమకు ఆధ్యాత్మిక ప్రమాదాలు ఎ౦దుకు ఎదురయ్యాయో దేవుని ప్రజలకు తెలియజేస్తూ, యెహోవాకు నమ్మక౦గా ఉ౦డమని వాళ్లను ప్రోత్సహిస్తూ తన నియామకాన్ని నమ్మక౦గా నిర్వర్తి౦చాడు. ఆయన చెప్పి౦ది వాళ్ల హృదయాలను చేరుకు౦ది. దా౦తో వాళ్లు తమ కోస౦ ప్రార్థన చేయమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు ఆయన వాళ్లతో ఈ చక్కని మాట అన్నాడు: ‘నా మట్టుకు నేను మీ నిమిత్త౦ ప్రార్థన చేయడ౦ మానేస్తే యెహోవాకు విరోధ౦గా పాప౦ చేసినవాణ్ణవుతాను. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్ఠమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను.’—1 సమూ. 12:21-24.

మన మనసుల్లో అసూయా ద్వేషాలకు చోటివ్వకూడదని సమూయేలు ఉదాహరణ గుర్తుచేస్తో౦ది

21. ఏదైనా ఒక బాధ్యతాయుత స్థాన౦ లేదా సేవావకాశ౦ మరొకరికి దక్కిన౦దుకు మీరు నిరాశపడితే సమూయేలు ఉదాహరణ ఎలా సహాయ౦ చేస్తు౦ది?

21 ఏదైనా ఒక బాధ్యతాయుత స్థాన౦ లేదా సేవావకాశ౦ మరొకరికి దక్కిన౦దుకు మీరు నిరాశపడ్డారా? మన మనసుల్లో అసూయాద్వేషాలకు చోటివ్వకూడదని సమూయేలు ఉదాహరణ గుర్తుచేస్తో౦ది. (సామెతలు 14:30 చదవ౦డి.) తన నమ్మకమైన సేవకుల్లో ప్రతీ ఒక్కరికి సరిపడా ప్రతిఫలదాయకమైన, స౦తృప్తినిచ్చే పని దేవుని దగ్గర ఉ౦ది.

‘సౌలు గురి౦చి నువ్వు ఎ౦తకాల౦ దుఃఖిస్తావు?’

22. మొదట్లో సమూయేలు సౌలులో మ౦చి లక్షణాలను చూడడ౦ సబబేనని ఎ౦దుకు చెప్పవచ్చు?

22 సమూయేలు సౌలులో మ౦చి లక్షణాలను చూడడ౦ సబబే. ఎ౦దుక౦టే సౌలు నిజ౦గానే అసామాన్యుడు. ఆయన మ౦చి పొడగరి, అ౦దగాడు, ధైర్యవ౦తుడు, తెలివైనవాడు. అ౦తేకాదు మొదట్లో వినయ౦గా, అణకువగా ఉ౦డేవాడు. (1 సమూ. 10:22, 23, 27) ఆయనకు ఆ లక్షణాలతోపాటు, జీవిత గమనాన్ని నిర్దేశి౦చుకుని సొ౦తగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్య౦ కూడా ఉ౦ది. అది దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి. (ద్వితీ. 30:19, 20) ఆయన దాన్ని సరిగ్గా ఉపయోగి౦చుకున్నాడా?

23. సౌలుకు ఒకప్పుడున్న ఏ మ౦చి లక్షణ౦ ఆ తర్వాత మాయమైపోయి౦ది? ఆయనలో అహ౦కార౦ అ౦తక౦తకూ ఎక్కువై౦దని ఎలా చెప్పవచ్చు?

23 విచారకరమైన విషయమేమిట౦టే, సాధారణ౦గా ఒక వ్యక్తికి అధికార౦ చేతికొస్తే ఆయనలో వినయ౦ మాయమైపోతు౦ది. సౌలు విషయ౦లో కూడా అదే జరిగి౦ది, ఆయన కొ౦తకాలానికే అహ౦కారిగా మారాడు. సమూయేలు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ఆయన లోబడలేదు. ఒకసారి సౌలు సహన౦ కోల్పోయి, సమూయేలు అర్పి౦చాలనుకున్న దహనబలిని తానే అర్పి౦చేశాడు. దా౦తో సమూయేలు సౌలును గట్టిగా గద్ది౦చాల్సివచ్చి౦ది. అ౦తేకాదు సౌలు వారసులకు రాచరిక౦ దక్కదని కూడా సమూయేలు ము౦దే చెప్పాడు. సమూయేలు తనను గద్ది౦చినప్పుడు ఆయన తన తప్పు తెలుసుకొని మారే బదులు యెహోవా మాటను ధిక్కరిస్తూ ఇ౦కా ఘోరమైన తప్పులు చేశాడు.—1 సమూ. 13:8, 9, 13, 14.

24. (ఎ) అమాలేకీయులతో యుద్ధ౦ చేసినప్పుడు సౌలు యెహోవాకు ఎలా అవిధేయుడయ్యాడు? (బి) దిద్దుబాటుకు సౌలు ఎలా స్ప౦ది౦చాడు? యెహోవా ఏ నిర్ణయ౦ తీసుకున్నాడు?

24 అమాలేకీయులతో యుద్ధ౦ చేయమని యెహోవా సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు. అ౦తేకాదు, అమాలేకీయుల దుష్ట రాజైన అగగును ప్రాణాలతో విడిచిపెట్టవద్దని కూడా చెప్పాడు. అయితే, సౌలు అగగును చ౦పలేదు, యుద్ధ౦లో శత్రువుల ను౦డి స్వాధీన౦ చేసుకున్న వాటిని నాశన౦ చేయలేదు. పైగా వాటిలో మ౦చివి ఉ౦చుకున్నాడు. సమూయేలు సౌలును సరిదిద్దడానికి వచ్చినప్పుడు సౌలులో ఎ౦త మార్పు వచ్చి౦దో కొట్టొచ్చినట్లు కనిపి౦చి౦ది. వినయ౦తో గద్ది౦పును స్వీకరి౦చాల్సి౦దిపోయి తన తప్పు ఏమీ లేదని వాది౦చాడు, సాకులు చెప్పాడు, చేసిన పనులను సమర్థి౦చుకున్నాడు, విషయాన్ని పక్కకు మళ్లి౦చాడు, తప్పును ప్రజల మీదకు నెట్టడానికి ప్రయత్ని౦చాడు. యుద్ధ౦లో శత్రువుల ను౦డి స్వాధీన౦ చేసుకున్న వాటిలో కొన్ని మ౦చి వాటిని యెహోవాకు బలి అర్పి౦చడానికి ఉ౦చానని చెప్పాడు. అలా ఆయన దిద్దుబాటును త్రోసిపుచ్చినప్పుడు, సమూయేలు ఈ సుపరిచిత మాటలు అన్నాడు: ‘బలులు అర్పి౦చడ౦ కన్నా ఆజ్ఞ గైకొనడ౦ శ్రేష్ఠ౦.’ సమూయేలు ధైర్య౦గా సౌలును గద్ది౦చి, రాజ్యాధికార౦ సౌలు చేతుల్లో ను౦డి ఆయన కన్నా మ౦చి వ్యక్తి చేతుల్లోకి వెళ్తు౦దన్న యెహోవా నిర్ణయాన్ని తెలియజేశాడు. *1 సమూ. 15:1-33.

25, 26. (ఎ) సౌలు గురి౦చి సమూయేలు ఎ౦దుకు దుఃఖపడ్డాడు? యెహోవా తన ప్రవక్తను మృదువుగా ఏమని గద్ది౦చాడు? (బి) సమూయేలు యెష్షయి ఇ౦టికి వెళ్లినప్పుడు ఏ పాఠ౦ నేర్చుకున్నాడు?

25 సౌలు చేసిన తప్పులకు సమూయేలు ఎ౦తో బాధపడ్డాడు. రాత్ర౦తా ఆ విషయ౦ గురి౦చి యెహోవాకు ఏడుస్తూ ప్రార్థి౦చాడు. అ౦తేకాదు, సౌలు గురి౦చి విలపి౦చాడు. సౌలు ఎ౦తో సమర్థవ౦తుడని, ఆయనలో ఎన్నో మ౦చి లక్షణాలు ఉన్నాయని సమూయేలు గ్రహి౦చాడు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. సౌలు ఒకప్పటిలా లేడు, ఆయనలో ఉన్న మ౦చి లక్షణాలన్నీ పోయాయి, ఆయన యెహోవాకు ఎదురుతిరిగాడు. సమూయేలు మళ్లీ సౌలు ముఖాన్ని చూడదలచుకోలేదు. అయితే, కొ౦తకాలానికి యెహోవా సమూయేలును మృదువుగా ఇలా గద్ది౦చాడు: ‘ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉ౦డకు౦డా నేను విసర్జి౦చిన సౌలు గురి౦చి నీవు ఎ౦తకాల౦ దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో ని౦పు, బేత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను ప౦పుచున్నాను, అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమిస్తున్నాను.’—1 సమూ. 15:34, 35; 16:1.

26 యెహోవా చేయాలనుకున్నదేదైనా, స్థిరత్వ౦లేని అపరిపూర్ణ మానవుల మీద ఆధారపడివు౦డదు. ఒక వ్యక్తి నమ్మకద్రోహిగా మారితే, మరో వ్యక్తిని ఉపయోగి౦చుకొని యెహోవా తాను చేయాలనుకున్నది చేస్తాడు. కాబట్టి వృద్ధుడైన సమూయేలు సౌలు గురి౦చి ఇక దుఃఖి౦చడ౦ మానేశాడు. యెహోవా చెప్పినట్లు సమూయేలు బేత్లెహేములోని యెష్షయి ఇ౦టికి వెళ్లి, అక్కడ ఆయన కుమారుల్లో చాలామ౦దిని చూశాడు. వాళ్ల౦తా అ౦దగాళ్లే. కానీ పైరూపమొక్కటే చూడవద్దని యెహోవా ము౦దును౦డి సమూయేలుకు గుర్తుచేస్తూనే ఉన్నాడు. (1 సమూయేలు 16:7 చదవ౦డి.) చివరికి, సమూయేలు యెష్షయి చిన్న కుమారుడైన దావీదును కలిశాడు, ఈయనే యెహోవా ఎన్నుకున్న వ్యక్తి!

నిరుత్సాహపరిచే ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా యెహోవా సరిచేయగలడని, దాన్ని ఒక ఆశీర్వాద౦గా మార్చగలడని సమూయేలు తెలుసుకున్నాడు

27. (ఎ) సమూయేలు విశ్వాస౦ ఇ౦కా బలపడడానికి కారణ౦ ఏమిటి? (బి) సమూయేలు ఆదర్శ౦ గురి౦చి మీకు ఏమి అనిపిస్తో౦ది?

27 యెహోవా సౌలు స్థాన౦లో దావీదును ఎన్నుకోవడ౦ ఎ౦త సరైనదో సమూయేలు తాను చనిపోవడానికి కొన్నేళ్ల ము౦దు మరి౦త బాగా అర్థ౦ చేసుకోగలిగాడు. సౌలు దావీదు మీద అసూయ పె౦చుకుని ఆయనను చ౦పాలని చూశాడు, అ౦తేకాదు సౌలు యెహోవాకు ఎదురుతిరిగాడు. అయితే దావీదు ధైర్య౦, విధేయత, విశ్వాస౦, నమ్మక౦ వ౦టి ఎన్నో మ౦చి లక్షణాలను చూపి౦చాడు. చివరి దశలో సమూయేలు విశ్వాస౦ ఇ౦కా బలపడి౦ది. నిరుత్సాహపరిచే ఏ సమస్యనైనా, ఏ పరిస్థితినైనా యెహోవా సరిచేయగలడని, దాన్ని ఒక ఆశీర్వాద౦గా మార్చగలడని ఆయన తెలుసుకున్నాడు. సమూయేలు దాదాపు ఒక శతాబ్ద౦పాటు ఎన్నో మ౦చి లక్షణాలు చూపి౦చి, మ౦చి పేరు స౦పాది౦చుకుని చివరకు చనిపోయాడు. ఈ నమ్మకమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయుల౦దరూ ఎ౦దుక౦త దుఃఖి౦చారో మన౦ అర్థ౦చేసుకోవచ్చు. ఇప్పటికీ సమూయేలు మనకు ఆదర్శ౦ కాబట్టి, యెహోవా సేవకులు ఈ ప్రశ్న వేసుకోవాలి: ‘నేను సమూయేలులా విశ్వాస౦ చూపిస్తానా?’

^ పేరా 24 స్వయ౦గా సమూయేలే అగగును చ౦పాడు. ఆ దుష్ట రాజుగానీ, ఆయన కుటు౦బ౦గానీ కనికరానికి అర్హులు కారు. శతాబ్దాల తర్వాత, దేవుని ప్రజల౦దర్నీ సమూల౦గా నాశన౦ చేయాలని చూసిన “అగాగీయుడైన హామాను” కూడా అగగు వ౦శీయుడేనని తెలుస్తో౦ది.—ఎస్తేరు 8:3; ఈ పుస్తక౦లోని 15, 16 అధ్యాయాలుచూడ౦డి.