కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ పాఠం

దేవుడు చెప్పేవి మీరు నమ్మవచ్చా?

దేవుడు చెప్పేవి మీరు నమ్మవచ్చా?

దేవుడు భవిష్యత్తు గురించి బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు, అంతేకాదు ఎన్నో సలహాలు ఇచ్చాడు. బైబిలు చెప్పేవి తెలుసుకోవాలనే కోరిక ఉన్నా, మీకు కొన్ని సందేహాలు ఉండవచ్చు. ‘బైబిలు పాత కాలం పుస్తకం కదా, అందులో ఉన్న సలహాలు ఇప్పుడు పనికొస్తాయా? భవిష్యత్తు గురించి బైబిలు చెప్పేవి నిజంగా జరుగుతాయా?’ అని మీరు అనుకోవచ్చు. కానీ లక్షలమంది బైబిలు ఇచ్చే సలహాల నుండి ప్రయోజనం పొందుతున్నారు, భవిష్యత్తు గురించి అది చెప్పే విషయాల్ని నమ్ముతున్నారు. బైబిల్ని మీరు ఎందుకు నమ్మవచ్చో ఇప్పుడు చూద్దాం.

1. బైబిలు చెప్పేవి వాస్తవాలా లేక కట్టుకథలా?

బైబిలు “సత్యమైన మాటల్ని ఉన్నదున్నట్టు” చెప్తుంది. (ప్రసంగి 12:10) నిజంగా జరిగిన సంఘటనల గురించి, నిజంగా జీవించిన ప్రజల గురించి బైబిలు మాట్లాడుతుంది. (లూకా 1:3; 3:1, 2 చదవండి.) అంతేకాదు ఆ సంఘటనలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి జరిగాయో కూడా చెప్తుంది. బైబిల్లో చెప్పినవి నిజంగా జరిగాయి అనడానికి చరిత్రలో చాలా రుజువులు ఉన్నాయి.

2. బైబిలు ఇప్పటికీ ఉపయోగపడుతుందని ఎలా చెప్పవచ్చు?

పూర్వకాలం నాటి ప్రజలకు తెలియని చాలా విషయాల్ని బైబిలు ముందే చెప్పింది. ఉదాహరణకు సైన్స్‌ విషయమే తీసుకోండి. సైన్స్‌కి సంబంధించి బైబిలు చెప్పిన ఎన్నో విషయాల్ని అప్పట్లో చాలామంది నమ్మలేదు. కానీ, బైబిలు చెప్పింది నిజమని ఇప్పుడు సైన్స్‌ కనిపెట్టిన విషయాలు రుజువు చేస్తున్నాయి. అవును, బైబిలు “ఇప్పుడూ, ఎప్పుడూ” ఉపయోగపడుతుంది.—కీర్తన 111:8.

3. భవిష్యత్తు గురించి బైబిలు చెప్పే విషయాల్ని ఎందుకు నమ్మవచ్చు?

“ఇంకా జరగని సంగతుల్ని” తెలిపే ప్రవచనాలు a బైబిల్లో ఉన్నాయి. (యెషయా 46:10) బైబిలు ఎన్నో సంఘటనల్ని చాలాకాలం ముందే చెప్పింది, అవి ఖచ్చితంగా ఎలా జరుగుతాయో కూడా చెప్పింది. ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ముందే చెప్పింది. ఈ పాఠంలో మనం కొన్ని ప్రవచనాల్ని చూస్తాం. అవి సరిగ్గా బైబిలు చెప్పినట్టే జరిగాయి!

ఎక్కువ తెలుసుకోండి

బైబిలు చెప్పేవి నిజమని సైన్స్‌ కనిపెట్టిన విషయాలు ఎలా రుజువు చేశాయో తెలుసుకోండి. అలాగే, అచ్చం బైబిలు చెప్పినట్టే జరిగిన కొన్ని విషయాల్ని గమనించండి.

4. బైబిలు చెప్పేవి నిజమని సైన్స్‌ ఒప్పుకుంటోంది

పూర్వకాలంలో చాలామంది ప్రజలు, భూమిని రకరకాల జంతువులు మోస్తున్నాయి అని నమ్మేవాళ్లు. వీడియో చూడండి.

దాదాపు 3,500 సంవత్సరాల క్రితం బైబిలు ఏం చెప్పిందో గమనించండి. యోబు 26:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ‘భూమి ఏ ఆధారం లేకుండా వేలాడుతుంది’ అని బైబిలు ముందే చెప్పడం ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుంది?

సూర్యుని వేడికి సముద్రాల్లో ఉన్న నీళ్లు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి, అవి నేల మీద వర్షంలా కురుస్తాయి, ఆ నీళ్లు మళ్లీ సముద్రాల్లో కలుస్తాయి. దీన్నే నీటిచక్రం అంటారు. సైంటిస్టులు దీన్ని దాదాపు 200 సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారు. కానీ, బైబిలు వేల సంవత్సరాల క్రితమే దాని గురించి చెప్పింది. యోబు 36:27, 28 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • నీటిచక్రం గురించి బైబిలు చెప్పింది తెలుసుకున్నాక మీకు ఏమనిపిస్తుంది?

  • ఈ వచనాలు చదివాక మీకు బైబిలు మీద నమ్మకం పెరిగిందా?

5. కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి బైబిలు ముందే చెప్పింది

యెషయా 44:27–45:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బబులోను పతనం అవ్వడానికి 200 సంవత్సరాల ముందు బైబిలు ఏ వివరాలు చెప్పింది?

క్రీస్తు పూర్వం 539 లో పర్షియా రాజైన కోరెషు, అతని సైన్యం బబులోను నగరాన్ని ఓడించారని చరిత్ర రుజువు చేసింది. నగరం చుట్టూ ఉన్న నదిలోని నీళ్లను వాళ్లు పక్కకు మళ్లించారు. నగర ద్వారాలు తెరిచి ఉండేసరికి వాళ్లు నేరుగా లోపలికి వెళ్లి, యుద్ధం చేయకుండానే దాన్ని ఓడించారు. 2,500 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత అంటే నేడు, బబులోను పాడుబడిపోయి ఉండడం మనం చూడవచ్చు. దాని గురించి బైబిలు ముందే ఏం చెప్పిందో గమనించండి.

యెషయా 13:19, 20 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఈ ప్రవచనం ఎలా నెరవేరింది?

నేడు ఇరాక్‌లో పాడుబడివున్న బబులోను

6. మనకాలంలో జరుగుతున్న వాటిని బైబిలు ముందే చెప్పింది

బైబిలు మనం జీవిస్తున్న కాలాన్ని “చివరి రోజులు” అని పిలుస్తుంది. (2 తిమోతి 3:1) ఈ “చివరి రోజుల” గురించి బైబిలు ముందే ఏం చెప్పిందో గమనించండి.

మత్తయి 24:6, 7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని బైబిలు చెప్పింది?

2 తిమోతి 3:1-5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • చివరి రోజుల్లో ఎక్కువగా ఎలాంటివాళ్లు ఉంటారని బైబిలు చెప్పింది?

  • ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు?

కొంతమంది ఇలా అంటారు: “బైబిల్లో ఉన్నవన్నీ కట్టుకథలే.”

  • బైబిల్ని నమ్మవచ్చని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

ఒక్కమాటలో

బైబిలు చెప్పేవి మీరు నమ్మవచ్చని చరిత్ర, సైన్స్‌, ప్రవచనాలు రుజువు చేస్తున్నాయి.

మీరేం నేర్చుకున్నారు?

  • బైబిల్లో ఉన్నవి వాస్తవాలా లేక కట్టుకథలా?

  • బైబిల్లో ఉన్న ఏ విషయాల్ని సైన్స్‌ ఒప్పుకుంటోంది?

  • జరగబోయే వాటిని బైబిలు ముందే చెప్పగలదు అని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

సైన్స్‌కి సంబంధించి బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా?

“బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందా?” (jw.org ఆర్టికల్‌)

“చివరి రోజుల” గురించి బైబిలు ఏం చెప్తుందో తెలిపే ఆర్టికల్స్‌ని చదవండి.

“6 బైబిలు ప్రవచనాలు మనకాలంలో నెరవేరుతున్నాయి” (కావలికోట ఆర్టికల్‌)

గ్రీకు సామ్రాజ్యం గురించి బైబిలు చెప్పిన ప్రవచనాలు ఎలా నిజం అయ్యాయో తెలుసుకోండి.

“ప్రవచన వాక్యం” ద్వారా విశ్వాసం బలపడుతుంది (5:22)

బైబిలు ప్రవచనాల్ని తెలుసుకున్న తర్వాత, ఒక వ్యక్తికి బైబిలు మీదున్న అభిప్రాయం ఎలా మారిందో చూడండి.

“అసలు దేవుడే లేడని అనుకునేవాణ్ణి” (కావలికోట ఆర్టికల్‌)

a ప్రవచనాలు అంటే భవిష్యత్తు గురించి దేవుడు చెప్పిన మాటలు.