కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు బైబిలు నుండే జవాబిచ్చారు!

నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు బైబిలు నుండే జవాబిచ్చారు!
  • జననం: 1950

  • దేశం: స్పెయిన్‌

  • ఒకప్పుడు: క్యాథలిక్‌ నన్‌

నా గతం:

స్పెయిన్‌లోని గాలీషియ అనే పల్లెటూర్లో నేను పుట్టాను. అక్కడ మాకొక చిన్న పొలం ఉండేది. మేము ఎనిమిదిమంది పిల్లలం, నేను నాల్గవదాన్ని. మేమంతా చాలా సంతోషంగా ఉండేవాళ్లం. పిల్లల్లో ఒక్కరినైనా సెమినరీలోగానీ, మఠంలోగానీ చేర్పించడం అప్పట్లో అక్కడ ఆనవాయితీ. మా ఇంట్లో అయితే నాతో కలిపి మొత్తం ముగ్గురం అలా వెళ్లాం.

13 ఏళ్లప్పుడు నేను మాడ్రిడ్‌లోని ఒక మఠంలో చేరాను, అప్పటికే మా అక్క అక్కడుంది. ఆ మఠంలో వాతావరణం అంత స్నేహపూర్వకంగా ఉండేదికాదు. నియమనిష్ఠలు, ప్రార్థనలే తప్ప స్నేహితులు, స్నేహం అనే మాటే అక్కడ ఉండేది కాదు. పొద్దున్నే అందరం ప్రార్థనా మందిరానికి వెళ్లి దేవుని గురించి ధ్యానించేవాళ్లం. అయితే చాలాసార్లు, నా మనసు మాత్రం ఖాళీగానే ఉండేది. ఆ తర్వాత పాటలు పాడి, మాస్‌ ఆచరించేవాళ్లం. అదంతా లాటిన్‌ భాషలోనే జరిగేది కాబట్టి నాకు అసలేం అర్థమయ్యేదికాదు. దాంతో, దేవుడు నాకు అందనంత దూరంలో ఉన్నాడని అనిపించేది. అక్కడున్నన్ని రోజులూ నా జీవితం మౌనంగానే గడిచిపోయింది. మా అక్క ఎదురుపడినా “పరిశుద్ధ మేరీమాతకు జయం” అని చెప్పుకోవడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోవడానికి వీలయ్యేదికాదు. భోజనం తర్వాత అరగంట మాత్రమే మాట్లాడుకోనిచ్చేవాళ్లు. ఎప్పుడూ సంతోషంగా ఉండే మా ఇంటికీ, ఇక్కడికీ ఎంత తేడా! నాకంటూ ఎవరూ లేరనిపించి చాలాసార్లు ఏడ్చాను కూడా.

దేవునికి దగ్గరగా ఉన్నానని నాకెప్పుడూ అనిపించలేదు, అయినా 17 ఏళ్లకే నన్‌ అయ్యాను. ఏదో అవ్వాలి కాబట్టి అయ్యాను గానీ, అసలు నేను నన్‌ అవ్వాలన్నది దేవుని చిత్తమేనా అనే సందేహం మెల్లమెల్లగా నాలో మొదలైంది. అలాంటి సందేహాలున్న వాళ్లను దేవుడు నరకంలో కాలుస్తాడని నన్‌లు చెప్పేవాళ్లు. అయినా సరే, నా సందేహాలు నన్ను వీడలేదు. యేసుక్రీస్తు మాలా అందరికీ దూరంగా ఉండేవాడుకాదనీ, ఎప్పుడూ ఇతరులకు బోధిస్తూ, సహాయం చేస్తూ బిజీగా ఉండేవాడనీ నాకు తెలుసు. (మత్తయి 4:23-25) 20 ఏళ్లు వచ్చేసరికి, అసలు నన్‌గా ఎందుకు కొనసాగాలనే ప్రశ్న నాలో తలెత్తింది. ఎంత ఆలోచించినా జవాబు దొరకలేదు. ఆశ్చర్యమేమిటంటే, మఠంలో నన్‌లందర్నీ చూసుకునే మదర్‌ కూడా నాకు నన్‌గా కొనసాగాలని లేకపోతే వీలైనంత త్వరగా అక్కడినుండి వెళ్లిపోవడమే మంచిదని అంది. బహుశా, నా వల్ల మిగతావాళ్లు కూడా పాడౌతారని ఆమె భయపడిందేమో. దాంతో, నేను అక్కడినుండి వచ్చేశా.

ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మానాన్నలు నన్ను బాగా చూసుకున్నారు. అయితే, మా పల్లెటూర్లో చేయడానికి ఏ పనీ లేకపోవడంతో నేను జర్మనీకి తరలివెళ్లాను. అక్కడ మా తమ్ముడు ఉండేవాడు. స్పెయిన్‌ వలసదారుల క్రియాశీల కమ్యూనిస్టు గుంపులో అతను సభ్యుడు. కార్మికుల హక్కుల కోసం, స్త్రీ సమానత్వం కోసం వాళ్లు పోరాడేవాళ్లు. వాళ్లతో కలిసి ఉండడం నాకు బాగా నచ్చింది. అందుకే, నేను కూడా కమ్యూనిస్టునై, కొంతకాలానికి అందులోని వ్యక్తినే పెళ్లాడాను. కమ్యూనిస్టు సాహిత్యాన్ని పంచిపెడుతూ, నిరసన ర్యాలీల్లో పాల్గొంటూ ఉపయోగపడే పనే చేస్తున్నానని అనుకునేదాన్ని.

కానీ, కొంతకాలానికి మళ్లీ నాలో అసంతృప్తి మొదలైంది. చాలాసార్లు కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవట్లేదని నాకు అనిపించేది. 1971⁠లో, మా గుంపులోని కొందరు యౌవనులు ఫ్రాంక్‌ఫర్ట్‌లోని స్పానిష్‌ దౌత్య కార్యాలయాన్ని తగులబెట్టినప్పుడు నా అనుమానాలు ఇంకా బలపడ్డాయి. నిరంకుశ స్పెయిన్‌లో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ వాళ్లు అలా చేశారు. అయితే, కోపాన్ని చూపించే పద్ధతి అది కాదని నాకు అనిపించింది.

మా మొదటి అబ్బాయి పుట్టినప్పుడు, నేనిక కమ్యూనిస్టు మీటింగులకు రానని మావారితో చెప్పేశాను. నన్నుగానీ, మా అబ్బాయినిగానీ చూడడానికి పాత స్నేహితులెవ్వరూ రాలేదు. దాంతో మళ్లీ ఒంటరిదాన్నైపోయానని అనిపించింది. అసలు జీవిత పరమార్థం ఏమిటి? సమాజాన్ని బాగుచేయడానికి ప్రయత్నించడం వల్ల నిజంగా ఏమైనా లాభం ఉందా? అని ఆలోచించసాగాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

1976⁠లో, స్పెయిన్‌ దేశస్థులైన ఇద్దరు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చి బైబిలు సాహిత్యాన్ని ఇచ్చారు. ఆ దంపతులు మళ్లీ మా ఇంటికి వచ్చినప్పుడు నేను బాధ, అసమానత, అన్యాయం గురించి అడుగుతూ ప్రశ్నల వర్షం కురిపించాను. అయితే వాళ్లు నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు బైబిలు నుండే జవాబిచ్చారు! నేను ఆశ్చర్యపోయి, వెంటనే బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నాను.

అవన్నీ తెలుసుకోవడం మొదట్లో నాకు కేవలం ఒక సరదాగా ఉండేది. కానీ నేను, మావారు యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాక నాలో మార్పు వచ్చింది. అప్పటికి మాకు ఇద్దరు అబ్బాయిలు. సాక్షులు దయతో మమ్మల్ని కూటాలకు తీసుకెళ్లేవాళ్లు, కూటాలు జరుగుతున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి సహాయం చేసేవాళ్లు. దాంతో, సాక్షుల మీద నాకు ప్రేమ పెరిగింది.

అయితే, మతం విషయంలో నాకున్న సందేహాలు పూర్తిగా తీరిపోలేదు. నేను స్పెయిన్‌లో ఉన్న మా కుటుంబాన్ని చూడడానికి వెళ్లాలనుకున్నాను. మా చిన్నాన్న ఓ చర్చి పాదిరి. నన్ను బైబిలు అధ్యయనం ఆపేయమని చెప్పడం మొదలుపెట్టాడు. అయితే, అక్కడి యెహోవాసాక్షులు నాకు చాలా సహాయం చేశారు. జర్మనీలోని సాక్షుల్లాగే వీళ్లు కూడా బైబిలు ఉపయోగించి నా ప్రశ్నలకు జవాబిచ్చారు. దాంతో, జర్మనీకి వెళ్లాక బైబిలు అధ్యయనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాను. మావారు బైబిలు అధ్యయనం ఆపేయాలని అనుకున్నా, నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. బైబిలు అధ్యయనం కొనసాగించి 1978⁠లో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షినయ్యాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .

బైబిలు సత్యాలు నేర్చుకోవడం వల్ల నా జీవితానికి నిజమైన అర్థం చేకూరింది, మంచి నిర్దేశం దొరికింది. ఉదాహరణకు, భార్యలు భర్తలను ప్రగాఢంగా గౌరవిస్తూ వాళ్లకు ‘లోబడి ఉండాలని,’ “దేవుని దృష్టికి మిగుల విలువగల” మృదువైన స్వభావాన్ని అలవర్చుకోవాలని 1 పేతురు 3:1-4 చెబుతుంది. అలాంటి బైబిలు సూత్రాలు మంచి భార్యగా, తల్లిగా ఉండడమెలాగో నాకు నేర్పించాయి.

నేను యెహోవాసాక్షినై ఇప్పటికి దాదాపు 35 ఏళ్లయింది. దేవుణ్ణి సేవించే ప్రజల ప్రపంచవ్యాప్త కుటుంబంలో భాగమై ఆయనను సేవించడం నాకెంతో సంతోషంగా ఉంది. మా ఐదుగురు పిల్లల్లో నలుగురు నాలాగే దేవుణ్ణి సేవిస్తుంటే చూడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. (w14-E 04/01)