కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి విశ్వాసాన్ని అనుసరించండి | మరియ

ఆమె తీవ్రమైన వేదనను తట్టుకుంది

ఆమె తీవ్రమైన వేదనను తట్టుకుంది

మరియ తన మోకాళ్ల మీద కూలబడింది, ఆమె వేదనను మాటల్లో వర్ణించలేం. తన కొడుకు ఎన్నో గంటలు యాతనపడి, చనిపోయే ముందు బిగ్గరగా వేసిన కేక ఇంకా ఆమె చెవుల్లో మారుమోగుతోంది. మధ్యాహ్నమే ఆకాశమంతా చీకటి అలుముకుంది. కాసేపటికి, భూమి పెద్దగా కంపించింది. (మత్తయి 27:45, 51) యేసుక్రీస్తు చనిపోయినందుకు వేరే ఎవరికన్నా కూడా తాను ఎంతో బాధపడుతున్నానని యెహోవాయే స్వయంగా తెలియజేస్తున్నట్లు మరియకు అనిపించివుంటుంది.

గొల్గొతా (లేదా కపాలస్థలము) ప్రాంతంలో పరుచుకున్న చీకట్లను మధ్యాహ్న సూర్యుడు తరిమేస్తుండగా మరియ తన కొడుకు కోసం ఏడుస్తోంది. (యోహాను 19:17, 25) ఆమె మనసులో ఎన్నో జ్ఞాపకాలు మెదిలివుంటాయి. అన్నిటికన్నా ఎక్కువగా, దాదాపు 33 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషయం ఆమెకు మరీమరీ గుర్తొచ్చివుంటుంది. ఆమె, యోసేపు ప్రశస్తమైన తమ బిడ్డను యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారు. అప్పుడు, సుమెయోను అనే వృద్ధుడు యెహోవా ప్రేరేపణతో ఒక ప్రవచనం చెప్పాడు. యేసు చాలా గొప్పవాడౌతాడని చెప్పిన తర్వాత, మరియ ఎంతో వేదన అనుభవించాల్సిన రోజు ఒకటి వస్తుందని ఆయన ప్రవచించాడు. (లూకా 2:25-35) ఈ విషాద ఘడియలో, అప్పుడాయన అన్న మాటల భావం మరియకు పూర్తిగా అర్థమైంది.

మరియ తీవ్రమైన వేదన అనుభవించింది

మనుషులకు ఎదురయ్యే అత్యంత ఘోరమైన, వేదన కలిగించే విషయం కన్నబిడ్డ చనిపోవడమేనని ఒక వ్యక్తి అన్నాడు. మరణం ఒక భయంకరమైన శత్రువు, ఏదోక రకంగా అది మనందర్నీ బాధిస్తుంది. (రోమీయులు 5:12; 1 కొరింథీయులు 15:26) ఆ బాధను తట్టుకొని నిలబడడం సాధ్యమేనా? యేసు పరిచర్య మొదలైనప్పటి నుండి ఆయన మరణించిన తర్వాతి కొన్ని రోజుల వరకు మరియ జీవితం ఎలా ఉందో పరిశీలిద్దాం. దానివల్ల, మరియ విశ్వాసం గురించీ, తీవ్రమైన వేదనను తట్టుకొని నిలబడడానికి అది ఆమెకెలా సహాయం చేసిందనే దాని గురించీ మనం ఎంతో నేర్చుకోవచ్చు.

“ఆయన మీతో చెప్పునది చేయుడి”

ఒకసారి మూడున్నర సంవత్సరాలు వెనక్కు వెళ్దాం. ఏదో మార్పు రాబోతుందని మరియకు అర్థమైంది. నజరేతు చిన్న పట్టణమే అయినా, అక్కడి ప్రజలు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి, మారుమనస్సు పొందమని ఆయన ప్రకటించిన ఉత్తేజకరమైన సందేశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ వార్త విన్న తన పెద్ద కొడుకు, తాను పరిచర్య మొదలుపెట్టే సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు మరియ గ్రహించింది. (మత్తయి 3:1, 13) యేసు అలా వెళ్లడం మరియకు, ఆమె ఇంట్లోవాళ్లకు ఎంతో లోటుగా ఉంటుంది. ఎందుకు?

మరియ భర్త యోసేపు బహుశా అప్పటికే చనిపోయాడు. కాబట్టి, కుటుంబంలో ఒకరు లేకపోతే ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. a ఇప్పుడు యేసును “వడ్లవాని కుమారుడు” అనే కాదు “వడ్లవాడు” అని కూడా పిలుస్తున్నారు. అంటే, యేసు తన తండ్రి వృత్తిని చేపట్టి, కుటుంబాన్ని పోషించే బాధ్యత భుజానికెత్తుకున్నాడు. తన తర్వాత పుట్టిన కనీసం ఆరుగురు తోబుట్టువులు ఆయనకు ఉన్నారు. (మత్తయి 13:55, 56; మార్కు 6:3) ఆ సమయంలో యేసు తన తర్వాత పుట్టిన యాకోబుకు కుటుంబ వృత్తిని నేర్పిస్తూ ఉన్నా, పెద్ద కొడుకు ఇంటికి దూరంగా వెళ్లడమంటే ఇంట్లోవాళ్లకు తీరని లోటే. అప్పటికే ఎంతో బరువును మోస్తున్న మరియ, ఆ మార్పు గురించి ఆందోళనపడిందా? బహుశా పడివుండవచ్చు. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే, నజరేయుడైన యేసే యేసుక్రీస్తుగా అంటే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాగ్దత్త మెస్సీయగా అయ్యాడని తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుంది అనేదే. దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లోని ఒక వృత్తాంతం సహాయం చేస్తుంది.—యోహాను 2:1-12.

యేసు యోహాను దగ్గరకు వెళ్లి బాప్తిస్మం తీసుకొని, దేవుని అభిషిక్తుడు (మెస్సీయ) అయ్యాడు. (లూకా 3:21, 22) తర్వాత ఆయన తన శిష్యుల్ని ఎంపికచేసుకోవడం మొదలుపెట్టాడు. తాను చేసే పని ఎంత ప్రాముఖ్యమైనదైనా తన కుటుంబంతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడపడానికి సమయం వెచ్చించాడు. తన తల్లితో, శిష్యులతో, తమ్ముళ్లతో కలిసి కానాలో జరిగిన ఒక పెండ్లి విందుకు వెళ్లాడు. ఆ పట్టణం బహుశా నజరేతుకు దాదాపు 13 కి.మీ. దూరంలో, ఓ కొండమీద ఉండేది. అందరూ విందును ఆనందిస్తున్నప్పుడు, ఏదో సమస్య ఉందని మరియకు అర్థమైంది. ఆ కుటుంబంలోని కొందరు ఆందోళనగా ఒకరినొకరు చూసుకోవడం, ఏదో సమస్య గురించి మెల్లగా మాట్లాడుకోవడం ఆమె గమనించివుంటుంది. ద్రాక్షారసం అయిపోయింది! వాళ్ల సంస్కృతిలో, ఆచారంగా ఇచ్చే ఆతిథ్యంలో అలాంటి లోటు జరిగితే అది ఆ కుటుంబానికి అవమానాన్ని తీసుకొస్తుంది, ఆ కార్యక్రమాన్నంతటినీ పాడుచేస్తుంది. వాళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరియ యేసు దగ్గరకు వెళ్లింది.

“వారికి ద్రాక్షారసము లేదు” అని మరియ తన కొడుకుతో అంది. ఆయన ఏంచేయాలని ఆమె కోరుకుంది? మనకు సరిగ్గా తెలీదు. అయితే, తన కొడుకు గొప్పవాడని, గొప్పగొప్ప పనులు చేస్తాడని మాత్రం ఆమెకు తెలుసు. అది బహుశా ఇప్పుడు మొదలుపెడతాడని ఆమె అనుకొనివుండవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఆమె యేసుతో ఇలా అంది: “బాబూ, ఏదోకటి చేయి!” కానీ యేసు, “అమ్మా, నాతో నీకేమి పని?” అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోయి ఉంటుంది. మూలభాషలో యేసు అన్న మాటలు, తల్లి సూచనకు ఆయన అభ్యంతరం తెలిపాడని సూచిస్తున్నాయి. అంటే యేసు ఆమెను మృదువుగా సరిదిద్దాడు. తాను ఎలా పరిచర్య చేయాలో నిర్దేశించే పని ఆమెది కాదని యేసు ఆమెకు గుర్తుచేస్తున్నాడు; ఆ పని చేయాల్సింది కేవలం తన తండ్రి యెహోవాయే.

మరియ, చక్కగా అర్థంచేసుకునే సామర్థ్యం, వినయం ఉన్న స్త్రీ కాబట్టి కొడుకు ఇచ్చిన దిద్దుబాటును స్వీకరించింది. విందు జరిగే చోట పనిచేస్తున్న సేవకులను పిలిచి ఇలా అంది: “ఆయన మీతో చెప్పునది చేయుడి.” తన కొడుకును నిర్దేశించే పని ఇక తనది కాదని మరియకు అర్థమైంది. నిజానికి ఇప్పటినుండి ఆమె, మిగతావాళ్లు ఆయన నిర్దేశానికి లోబడాలి. యేసు విషయానికొస్తే, కొత్తగా పెళ్లయిన ఆ దంపతుల పట్ల తల్లికున్న శ్రద్ధే తనకూ ఉందని చూపించాడు. నీళ్లను మంచి ద్రాక్షారసంగా మార్చాడు, ఆయన చేసిన అద్భుతాల్లో అదే మొదటిది. ఫలితంగా, “ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.” మరియ కూడా యేసు మీద విశ్వాసం ఉంచింది. ఇక ఆయనను తన కొడుకులా కాక తన ప్రభువులా, రక్షకునిలా చూసింది.

మరియ చూపించిన విశ్వాసం నుండి నేటి తల్లిదండ్రులు ఎంతో నేర్చుకోవచ్చు. నిజమే, అచ్చం యేసు లాంటి కొడుకు ఎవరికీ లేడు. అయితే పిల్లలు ఎలాంటి వాళ్లయినా, వాళ్లు పెద్దౌతున్నప్పుడు తల్లిదండ్రులకు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. పిల్లలు పెద్దయిన తర్వాత కూడా కొందరు తల్లిదండ్రులు వాళ్లను ఇంకా చిన్నపిల్లల్లాగే చూస్తుండవచ్చు. అలా చూడడం సరికాదు. (1 కొరింథీయులు 13:11) ఎదిగిన పిల్లలకు తల్లిదండ్రులు ఎలా మద్దతివ్వవచ్చు? ఒక పద్ధతి ఏమిటంటే, దేవునికి నమ్మకంగా ఉన్న తమ పిల్లలు బైబిలు బోధలను పాటించడంలో కొనసాగుతూ యెహోవా ఆశీర్వాదాలు పొందుతారని తాము మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు వాళ్లకు తెలియజేయడం. అలా తమ పిల్లలు యెహోవా సేవలో కొనసాగుతారనే, సరైనదే చేస్తారనే నమ్మకం తమకుందని తెలియజేయడానికి తల్లిదండ్రులకు వినయం అవసరం. ఎంతో ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగిన ఆ తర్వాతి ఏళ్లలో మరియ ఇచ్చిన మద్దతును యేసు తప్పకుండా ఎంతో విలువైనదిగా ఎంచివుంటాడు.

“ఆయన సహోదరులు . . . ఆయనయందు విశ్వాసముంచలేదు”

యేసు పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాల కాలంలో మరియ గురించి సువార్తలు ఎక్కువగా చెప్పడం లేదు. అప్పటికి ఆమె భర్త చనిపోయాడు, పైగా ఆమెకు ఎదిగే పిల్లలున్నారు. కాబట్టి యేసు తన సొంత ఊరిలో ప్రకటిస్తున్నప్పుడు మరియ ఆయనను అనుసరించలేకపోయుంటే ఆమెను మనం తప్పుపట్టకూడదు. (1 తిమోతి 5:8) అయినా సరే, ఆమె మెస్సీయ గురించి నేర్చుకున్న విషయాలను మననం చేసుకుంటూ, కుటుంబ అలవాటు ప్రకారం స్థానిక సమాజమందిరంలో కూటాలకు వెళ్తూ ఉండేది.—లూకా 2:19, 51; 4:16.

కాబట్టి నజరేతులోని సమాజమందిరంలో యేసు బోధిస్తున్నప్పుడు ఆమె కూడా అక్కడ ఉండివుంటుంది. వందల సంవత్సరాల క్రితం మెస్సీయ గురించి చెప్పిన ప్రవచనం ఇప్పుడు తన విషయంలో నెరవేరిందని ఆమె కుమారుడు ప్రకటించినప్పుడు మరియ ఎంత సంతోషించివుంటుందో కదా! అయితే, ఆ పట్టణంలోని ఇతరులు తన కొడుకును మెస్సీయగా అంగీకరించలేదని చూసి ఆమె ఎంతో బాధపడివుంటుంది. వాళ్లు ఆయనను చంపడానికి కూడా ప్రయత్నించారు!—లూకా 4:17-30.

యేసు విషయంలో తన మిగతా కుమారులు స్పందించిన తీరు కూడా ఆమెకు ఎంతో వేదన కలిగించివుంటుంది. యేసు నలుగురు తమ్ముళ్లు తమ తల్లిలా విశ్వాసం చూపించలేదని యోహాను 7:5 చెబుతుంది. అక్కడిలా ఉంది: “ఆయన సహోదరులు . . . ఆయనయందు విశ్వాసముంచలేదు.” యేసుకు కనీసం ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు, అయితే వాళ్ల గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు. b ఏదేమైనా, ఒకే ఇంట్లో వేర్వేరు మత నమ్మకాలు గలవాళ్లు ఉంటే కలిగే బాధ ఎలా ఉంటుందో మరియకు తెలుసు. తాను దేవుని గురించిన సత్యానికి కట్టుబడివుంటూనే, తన కుటుంబ సభ్యుల్ని బలవంతం చేయకుండా, వాళ్లతో గొడవపడకుండా వాళ్ల హృదయాల్ని గెలుచుకోవడానికి ప్రయత్నించాలి.

ఒక సందర్భంలో యేసు బంధువులు ఆయనను ‘పట్టుకోబోయారు,’ వాళ్లలో ఆయన తమ్ముళ్లు కూడా ఉండేవుంటారు. నిజానికి వాళ్లు, ఆయన “మతి చలించియున్నది” అని కూడా అన్నారు. (మార్కు 3:21, 31) మరియకు అలాంటి ఆలోచన లేకపోయినా, తమ విశ్వాసాన్ని బలపర్చే ఏదోక విషయాన్ని వాళ్లు నేర్చుకుంటారనే ఉద్దేశంతో తన కుమారులతో కలిసి వెళ్లింది. మరి వాళ్లు నేర్చుకున్నారా? యేసు ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ, అద్భుతమైన సత్యాలు బోధిస్తున్నా మరియ మిగతా కుమారులు ఆయన మీద నమ్మకముంచలేదు. మరియ విసుగెత్తిపోయి, ‘వీళ్ల హృదయాల్ని కదిలించాలంటే ఏంచేయాలో’ అని అనుకొనివుంటుందా?

మీ మత నమ్మకాలు, మీ ఇంట్లోవాళ్ల మత నమ్మకాలు వేరా? అలాగైతే, మరియ విశ్వాసం నుండి మీరెంతో నేర్చుకోవచ్చు. అవిశ్వాసులైన తన బంధువుల విషయంలో ఆమె ఆశలు వదిలేసుకోలేదు. కానీ, తన విశ్వాసం తనకు సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తోందని వాళ్లు గ్రహించేలా చేయాలని అనుకుంది. అదే సమయంలో, దేవునికి నమ్మకంగా ఉన్న తన కొడుకుకు మద్దతిస్తూ వచ్చింది. యేసు తనతో లేడని అడపాదడపా ఆమె బాధపడివుంటుందా? కొన్నిసార్లు, ఆయన కూడా తమతోపాటు ఉంటే బావుండేదని ఆమెకు అనిపించివుంటుందా? అలా అనిపించినా, ఆమె తనకు తాను సర్దిచెప్పుకుంది. యేసుకు మద్దతిస్తూ ముందుకు నడిపించడం తనకు దొరికిన గొప్ప అవకాశమని ఆమె అనుకుంది. తమ జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చేలా మీరు మీ పిల్లలకు సహాయం చేయగలరా?

“నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవును”

యేసు మీద విశ్వాసముంచడం వల్ల మరియ ఎలాంటి ఆశీర్వాదాలు పొందింది? విశ్వాసం చూపించిన వాళ్లను యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడు కాబట్టి మరియ విషయంలో కూడా అంతే చేశాడు. (హెబ్రీయులు 11:6) తన కుమారుని మాటలను ఆలకిస్తున్నప్పుడు లేదా ఆయన బోధల గురించి వేరేవాళ్లు చెప్పగా వింటున్నప్పుడు మరియకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

యేసు ఉపయోగించిన చాలా ఉపమానాలు, యోసేపు మరియలు ఇచ్చిన శిక్షణను గుర్తుచేస్తాయి

ఆయన చెప్పిన ఉపమానాల్లో, నజరేతులో ఎదుగుతున్నప్పుడు ఆయన చూసిన కొన్ని విషయాలను చేర్చడం ఆమె గమనించిందా? పోగొట్టుకొన్న వెండి నాణెం కోసం ఇల్లంతా ఊడ్చడం, రొట్టె కోసం పిండిని విసరడం, దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టడం గురించి యేసు మాట్లాడాడు. అవి విన్నప్పుడు మరియకు, యేసు చిన్నతనంలో తన పక్కనే ఉండి తాను అలాంటి రోజువారీ పనులు చేస్తుంటే చూడడం గుర్తొచ్చివుంటుందా? (లూకా 11:33; 15:8, 9; 17:35) తన కాడి సులువైనదని, తన భారం తేలికైనదని యేసు చెప్పాడు. యేసు చిన్నప్పుడు ఒకానొక మధ్యాహ్నం వేళ, పశువులు సునాయాసంగా మోయగలిగే కాడిని ఎలా తయారుచేయాలో యోసేపు నేర్పిస్తుంటే తాను సంతోషంగా చూసిన సందర్భాన్ని మరియ గుర్తుచేసుకొని ఉంటుంది. (మత్తయి 11:30) యెహోవా తనకిచ్చిన గొప్ప అవకాశాన్ని, అంటే మెస్సీయ అవ్వబోయే పిల్లవాణ్ణి పెంచే, శిక్షణనిచ్చే అవకాశాన్ని తలపోస్తూ మరియ తప్పక ఎంతో సంతృప్తిని పొందివుంటుంది. నిజ జీవితంలో చూసే సాధారణ వస్తువులను, దృశ్యాలను ఉపయోగిస్తూ యేసు అత్యంత జ్ఞానయుక్తమైన పాఠాలు నేర్పించాడు. మానవుల్లో అత్యంత గొప్ప బోధకుడైన యేసు మాట్లాడుతుండగా వినడం ఆమెకు ఎంత సంతోషాన్ని ఇచ్చివుంటుందో!

అయినా, మరియ వినయంగానే ఉంది. ఆమె అధిక గౌరవం, ఆరాధన పొందడానికి అర్హురాలని యేసు ఎప్పుడూ చెప్పలేదు. యేసు పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయనను కన్నందుకు ఆయన తల్లి ఎంతో ధన్యురాలని ఒక స్త్రీ అంది. కానీ యేసు, “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు” అని అన్నాడు. (లూకా 11:27, 28) ఆయన తల్లి, ఆయన సహోదరులు దగ్గర్లో ఉన్నారని జనసమూహంలో కొందరు చెప్పినప్పుడు యేసు, విశ్వాసం ఉంచినవాళ్లే తన తల్లులు, తన సహోదరులు అని అన్నాడు. మరియ అందుకు బాధపడలేదు గానీ యేసు ఏమి చెప్పాలనుకున్నాడో అర్థం చేసుకుంది. అదేమిటంటే, రక్తసంబంధాల కంటే ఆధ్యాత్మిక బంధాలకే ఎక్కువ విలువివ్వాలి.—మార్కు 3:32-35.

అయినప్పటికీ, తన కుమారుడు హింసాకొయ్య మీద ఎంతో బాధపడుతూ చనిపోయినప్పుడు మరియ ఎంత వేదన అనుభవించి ఉంటుందో వర్ణించడం అసాధ్యం. ఆ సమయంలో అక్కడే ఉన్న అపొస్తలుడైన యోహాను ఆ తర్వాత తాను రాసిన సువార్తలో ఈ ప్రాముఖ్యమైన వివరాన్ని చేర్చాడు: ఆ కష్టమైన సమయంలో మరియ “యేసు సిలువయొద్ద” ఉంది. చివరివరకూ తన కుమారుని పక్కన ఉండకుండా ప్రేమగల, విశ్వసనీయురాలైన ఆ తల్లిని ఏదీ ఆపలేకపోయింది. యేసు ఆమెవైపు చూశాడు. ఒక్కో శ్వాస తీసుకోవడం ఆయనకు ఎంతో కష్టంగా ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. అయినా, ఆయన మాట్లాడాడు. తన తల్లిని చూసుకునే బాధ్యతను తన ప్రియ అపొస్తలుడైన యోహానుకు అప్పగించాడు. యేసు తమ్ముళ్లు ఇంకా అవిశ్వాసులే కాబట్టి వాళ్లలో ఎవరికీ కాకుండా తనను నమ్మకంగా అనుసరించిన వ్యక్తికే ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ విధంగా ఒక విశ్వాసి తన ఇంటివాళ్ల అవసరాలు తీర్చడం, ముఖ్యంగా వాళ్ల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడం ఎంత ప్రాముఖ్యమో యేసు చూపించాడు.—యోహాను 19:25-27.

చివరికి యేసు చనిపోయాడు. ఆ సమయంలో, సుమెయోను ప్రవచించినట్లు నిజంగానే తన హృదయంలోకి ఖడ్గం దూసుకుపోయినట్లు మరియకు అనిపించివుంటుంది. అప్పుడామె పడిన బాధను అర్థంచేసుకోవడం మీకు కష్టమనిపిస్తుందా? అలాగైతే, మూడు రోజుల తర్వాత ఆమె పొందిన ఆనందాన్ని మీరు పూర్తిగా అర్థంచేసుకోలేరు! అతి గొప్ప అద్భుతం జరిగింది. యేసు పునరుత్థానమయ్యాడు! ఆ విషయం మరియకు తెలిసింది. ఆ తర్వాత, తన తమ్ముడైన యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు యేసు అతనికి కనిపించాడని తెలుసుకొని ఆమె ఇంకా ఎక్కువ సంతోషించి ఉంటుంది. (1 కొరింథీయులు 15:7) దానివల్ల యాకోబులో, యేసు ఇతర తమ్ముళ్లలో కూడా మార్పు వచ్చింది. ఆ తర్వాత యేసే క్రీస్తని వాళ్లు నమ్మారని బైబిలు చెబుతుంది. కొన్ని రోజులకే వాళ్లు తమ తల్లితోపాటు క్రైస్తవ కూటాల్లో “ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 1:14) వాళ్లలో ఇద్దరు అంటే యాకోబు, యూదా బైబిల్లోని పుస్తకాలను కూడా రాశారు.

మరియ మిగతా కుమారులు కూడా నమ్మకమైన క్రైస్తవులైనప్పుడు ఆమె ఎంతో సంతోషించింది

మరియ గురించి బైబిలు చివరిసారి ప్రస్తావించినప్పుడు, ఆమె తన కుమారులతో కలిసి కూటాల్లో ప్రార్థిస్తూ ఉంది. ఆమె గురించిన నివేదికకు అదెంత సముచితమైన ముగింపో కదా! అంతేకాదు, ఆమె మనందరికీ చక్కని ఆదర్శం కూడా. ఆమె తన విశ్వాసంతో, తీవ్రమైన వేదనను కూడా తట్టుకొని స్థిరంగా నిలబడింది, చివరికి తిరుగులేని బహుమానం పొందింది. మనం కూడా ఆమెలా విశ్వాసం చూపిస్తే, జాలిలేని ఈ లోకం చేసే గాయాలన్నిటినీ తట్టుకొని నిలబడగలుగుతాం, మనం ఊహించినదానికన్నా గొప్ప బహుమానాలు పొందుతాం. (w14-E 05/01)

a యేసుకు 12 ఏళ్లున్నప్పుడు జరిగిన ఒక సంఘటనలో కనిపించిన తర్వాత సువార్తల్లో యోసేపు మళ్లీ కనిపించడు. ఆ తర్వాత యేసు తల్లి గురించి, ఆమె మిగతా పిల్లల గురించి ఉంది కానీ యోసేపు గురించి లేదు. ఒక సందర్భంలో, యోసేపు ప్రస్తావన లేకుండానే యేసును “మరియ కుమారుడు” అని పిలిచారు.—మార్కు 6:3.

b యేసుకు యోసేపు సొంత తండ్రి కాదు కాబట్టి ఆయన తమ్ముళ్లు, చెల్లెళ్లు కూడా సొంత తోబుట్టువులు కాదు.—మత్తయి 1:20.