కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖపత్ర అంశం: లోకాంతమంటే మీరు భయపడాలా?

లోకాంతం—భయపడుతున్నారా? ఎదురుచూస్తున్నారా? విసిగిపోయారా?

లోకాంతం—భయపడుతున్నారా? ఎదురుచూస్తున్నారా? విసిగిపోయారా?

మాయా క్యాలెండరు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులు వస్తాయని చాలామంది చెప్పిన తేదీ 2012 డిసెంబరు 21. దాని గురించి మీరేమంటారు? మీరు ఊహించుకున్నట్టు జరగనందుకు బహుశా మీరు ఉపశమనం పొందివుంటారు, నిరుత్సాహపడి ఉంటారు లేదా విసుగుచెంది ఉంటారు. అది లోకాంతం గురించిన మరో తప్పుడు జోస్యమేనా?

బైబిలు చెబుతున్న ‘లోకాంతం’ సంగతేంటి? (మత్తయి 24:3, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) కొందరు భూమి కాలిపోతుందని భయపడతారు. ఇంకొందరు అంతం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని ముచ్చటపడతారు. అయితే చాలామంది అంతం వస్తుందని ఎంతోకాలంగా ఎదురుచూసీ చూసీ విసిగిపోయారు. ఇంతకీ ఇన్ని ఊహాగానాలకు తెరతీసిన ఆ అంతం వాస్తవమా లేక కల్పితమా?

లోకాంతం గురించి బైబిలు నిజంగా ఏమి చెబుతుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. కొందరైతే తాము అనుకున్న సమయానికి అంతం రానందుకు చాలా విసిగిపోతారని కూడా బైబిలు వివరిస్తోంది. లోకాంతం గురించి తరచూ తలెత్తే కొన్ని ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు ఏమిటో దయచేసి పరిశీలించండి.

ఈ భూమి కాలి బూడిదైపోతుందా?

బైబిలు ఇలా చెబుతోంది: “భూమి యెన్నటికిని కదలకుండునట్లు [దేవుడు] దానిని పునాదులమీద స్థిరపరచెను.”కీర్తన 104:5.

ఈ భూమి అగ్నివల్ల గానీ మరి దేనివల్ల గానీ నాశనమైపోదు. నిజానికి, ఈ భూమే మనుషులకు నిత్య నివాసమని బైబిలు బోధిస్తోంది. కీర్తన 37:29 ఇలా చెబుతోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 115:16; యెషయా 45:18.

దేవుడు భూమిని సృష్టించిన తర్వాత, అది ‘చాలమంచిగా’ ఉందన్నాడు, ఆయన అభిప్రాయం ఇప్పటికీ అదే. (ఆదికాండము 1:31) భూమిని నాశనం చేయాలన్న ఆలోచన ఆయనకు ఎంతమాత్రం లేదు సరికదా ‘భూమిని నశింపజేయువారిని నశింపజేస్తానని,’ దానికి శాశ్వత నష్టం వాటిల్లకుండా కాపాడతానని ఆయన మాటిస్తున్నాడు.—ప్రకటన 11:18.

మరైతే 2 పేతురు 3:7 చెప్పేదేమిటని మీకు అనుమానం రావచ్చు. ఆ వచనంలో ఇలా ఉంది: ‘ఇప్పుడున్న ఆకాశం, భూమి అగ్ని కోసం నిలువచేయబడ్డాయి.’ అంటే దానర్థం, భూమి కాలి బూడిదైపోతుందని కాదా? నిజానికి బైబిలు కొన్నిసార్లు “ఆకాశం,” “భూమి,” “అగ్ని” వంటి పదాలను సూచనార్థకంగా, గుర్తులుగా వాడుతుంది. ఉదాహరణకు, ఆదికాండము 11:1లో ఇలా ఉంది: “భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను,” ఇక్కడ, మానవ సమాజాన్ని సూచించడానికి “భూమి” అన్న పదాన్ని ఉపయోగించారు.

రెండవ పేతురు 3:7కు ముందూ తర్వాతా ఉన్న వచనాలు చూస్తే, అక్కడ పరలోకాన్ని, భూమిని, అగ్నిని కూడా గుర్తులుగానే వాడారని తెలుస్తోంది. 5, 6 వచనాలు నోవహు కాలానికి, మన కాలానికి మధ్య ఉన్న ఒక పోలిక గురించి చెబుతున్నాయి. ఆయన కాలంలో ఆ ప్రాచీన లోకం నాశనమైంది. అయినా మన గ్రహమేమీ ఉనికిలో లేకుండాపోలేదు. కానీ, ఆ జలప్రళయం అప్పుడున్న క్రూర మానవ సమాజం అనే ‘భూమిని’ తుడిచిపెట్టేసింది. ఆ భూసమాజాన్ని పరిపాలిస్తున్న ‘ఆకాశం’ లాంటి ప్రజల్ని కూడా అది మింగేసింది. (ఆదికాండము 6:11) సరిగ్గా అలాగే ఇప్పుడున్న దుష్ట మానవ సమాజం, అవినీతికర ప్రభుత్వాలు కూడా అగ్నిలో కాలిపోయినట్లు నామరూపాల్లేకుండా పోతాయని 2 పేతురు 3:7 ప్రవచించింది.

లోకాంతమప్పుడు ఏమి జరుగుతుంది?

బైబిలు ఇలా చెబుతోంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”1 యోహాను 2:17.

ఇక్కడ, గతించిపోయే “లోకము” భూమి కాదుగానీ దేవుని ఇష్టప్రకారం జీవించని మానవజాతి. ఒక డాక్టరు, రోగి ప్రాణాలను కాపాడడానికి క్యాన్సర్‌ కంతిని తొలగించినట్లే, మంచి ప్రజలు భూమ్మీద ఆనందంగా జీవించడానికి దేవుడు దుష్ట ప్రజలను ‘నిర్మూలిస్తాడు.’ (కీర్తన 37:9) ఆ రకంగా చూస్తే ‘లోకాంతం’ రావడం మంచిదే.

బైబిలు అనువాదాలు “విధానాంతం,” “యుగసమాప్తి” అనే పదాలు వాడి, ‘లోకాంతం’ అంటే భూమికి అంతం కాదనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. (మత్తయి 24:3; NW) అంతం వచ్చినప్పుడు మానవజాతి, భూమి నాశనమైపోవు కాబట్టి, అంతం ఒక కొత్త యుగానికి, కొత్త విధానానికి తెరతీస్తుందనడం సమంజసమేనంటారా? బైబిలు అవుననే చెబుతోంది, అందులో “రాబోవు లోకం” గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.—మార్కు 10:30.

రాబోయే ఆ కాలాన్ని యేసు “నవ యుగం” అని పిలిచాడు. ఆ కాలంలో యేసు మానవజాతిని దేవుడు కోరుకున్న స్థితికి తీసుకువస్తాడు. (మత్తయి 19:28, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అదెలా ఉంటుందంటే...

  • మనం సురక్షితంగా, సుభిక్షంగా ఉండే అందమైన ఉద్యానవనంలాంటి భూమిపై ఆనందంగా జీవిస్తాం.—యెషయా 35:1; మీకా 4:4.

  • మనం చేసే పనికి ఒక సంకల్పం ఉంటుంది, దాన్ని మనస్ఫూర్తిగా చేస్తాం, అప్పుడు మనకెంతో సంతృప్తి కలుగుతుంది.—యెషయా 65:21-23.

  • మనకున్న రోగాలన్నీ నయమైపోతాయి.—యెషయా 33:24.

  • వృద్ధులందరూ యవ్వనులౌతారు.—యోబు 33:25.

  • చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు.—యోహాను 5:28, 29.

మనం “దేవుని చిత్తం” చేస్తే, అంటే దేవుడు చెప్పింది చేస్తే లోకాంతం గురించి భయపడం. నిజానికి అదెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాం.

లోకాంతం నిజంగా దగ్గరపడిందా?

బైబిలు ఇలా చెబుతోంది: ‘మీరు ఈ సంగతులు జరగడం చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమైందని తెలుసుకోండి.’లూకా 21:31.

ప్రొఫెసర్‌ రిచర్డ్‌ కైల్‌, ద లాస్ట్‌ డేస్‌ ఆర్‌ హియర్‌ ఎగైన్‌ అనే తన పుస్తకంలో ఇలా రాశారు: ‘సమాజంలో అలజడి రేగినప్పుడు, గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పుడు లోకాంతం దగ్గరపడిందనే ఊహాగానాలు అంతటా వ్యాపిస్తాయి.’ అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో అర్థంకానప్పుడు అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే, లోకాంతం గురించి రాసిన బైబిలు ప్రవక్తలు తమ కాలాల్లోని కలవరపెట్టే సంఘటనలను వివరించాలనే ఉద్దేశంతో దాని గురించి రాయలేదు. కానీ రాబోయే లోకాంతమప్పుడు జరిగే సంఘటనలను వర్ణించాలనే ఉద్దేశంతో దేవుడే వాళ్లతో అలా రాయించాడు. ఆ ప్రవచనాల్లో కొన్నిటిని పరిశీలించి, అవి మన కాలంలో నెరవేరుతున్నాయో లేదో మీరే చూడండి.

  • యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ప్రాణాంతకమైన రోగాలు.—మత్తయి 24:7; లూకా 21:11.

  • గమనార్హంగా పెరిగిపోతున్న నేరాలు.—మత్తయి 24:12.

  • మనిషి చేతుల్లో పతనమౌతున్న భూమి.—ప్రకటన 11:18.

  • దేవుణ్ణి పక్కనబెట్టి తమను, డబ్బును, సుఖభోగాల్ని ప్రేమించే మనుషులు.—2 తిమోతి 3:2, 4.

  • తెగిపోతున్న కుటుంబ బంధాలు.—2 తిమోతి 3:2, 3

  • అంతం ముంచుకొస్తుందని చూపించే రుజువుల్ని గమనించని వైఖరి.—మత్తయి 24:37-39.

  • ప్రపంచమంతటా వ్యాపిస్తున్న దేవుని రాజ్య సువార్త.—మత్తయి 24:14.

‘ఈ సంగతులన్నీ జరగడం’ చూసినప్పుడు లోకాంతం దగ్గరపడింది అనే విషయం తెలుసుకోమని యేసు చెప్పాడు. (మత్తయి 24:33) ఈ రుజువులన్నిటిని బట్టి అంతం దగ్గరపడిందని యెహోవాసాక్షులు బలంగా నమ్ముతారు. వాళ్లు 236 దేశాల్లో ప్రకటిస్తూ తమ విశ్వాసం గురించి వేరేవాళ్లకు చెబుతున్నారు.

అంతం గురించిన ఊహాగానాలు నిజమవనంత మాత్రాన అది ఎప్పటికీ రాదనే అనుకోవాలా?

బైబిలు ఇలా చెబుతోంది: ‘లోకులు—నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుంటున్నప్పుడు, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మాత్తుగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రం తప్పించుకోలేరు.’1 థెస్సలొనీకయులు 5:3.

బైబిలు లోకాంతాన్ని నిండు చూలాలికి అకస్మాత్తుగా వచ్చే పురిటి నొప్పులతో పోలుస్తోంది. ఆ నొప్పులు తప్పకుండా వస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. నెలలు నిండినప్పుడు గర్భవతి పరిస్థితి ఎలా ఉంటుందో అంతం దగ్గర పడినప్పుడు లోకం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబోయే తల్లికి తనలో అంతకంతకూ కలిగే మార్పుల వల్ల కాన్పు దగ్గరపడిందని తెలుస్తుంది. డాక్టరు కాన్పు తేదీని అంచనా వేసివుంటాడు; కానీ బిడ్డ ఆ సమయానికే పుట్టివుండకపోవచ్చు, అయినా బిడ్డ త్వరలోనే తప్పక పుడుతుందని ఆమెకు తెలుసు. అలాగే, లోకాంతం గురించి చాలామంది తప్పుడు ఊహాగానాలు చేసినంత మాత్రాన, ఇవి అంత్యదినాలు అని చూపించే సూచనలు తప్పయిపోవు.—2 తిమోతి 3:1.

‘లోకాంతం దగ్గరపడిందని చూపించే రుజువులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా చాలామంది వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు?’ అని మీరు అనుకోవచ్చు. అంతం దగ్గరపడినప్పుడు చాలామంది రుజువుల్ని పట్టించుకోరని బైబిలు చెబుతోంది. వాళ్లు ప్రపంచంలో పరిస్థితులు విషమిస్తున్నాయని, తాము అంత్యదినాల్లో జీవిస్తున్నామని గుర్తించరు, పైగా గుర్తించేవాళ్ళను ఎగతాళి చేస్తూ, ‘పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభాన ఉన్నట్టే నిలిచివున్నదే’ అంటారు. (2 పేతురు 3:3, 4) ఒక్క మాటలో చెప్పాలంటే, అంత్యదినాలకు రుజువులు స్పష్టంగా ఉన్నా చాలామంది పట్టించుకోరు.—మత్తయి 24:38, 39.

లోకాంతం దగ్గరపడింది అనడానికి బైబిలు ఇచ్చే రుజువుల్లో కొన్నిటిని మాత్రమే ఈ ఆర్టికల్‌లో పరిశీలించాం. a మీరు మిగతావాటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, యెహోవాసాక్షులు ఉచితంగా బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తారు, వాళ్లను సంప్రదించండి. మీ ఇంట్లోగానీ, మీకు అనువుగా ఉండే వేరే ఎక్కడైనా గానీ లేదా ఫోన్‌లో గానీ అధ్యయనం చేయవచ్చు. మీరు సమయం వెచ్చిస్తే చాలు, వెలకట్టలేని ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ▪ (w13-E 01/01)

a ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని “మనం ‘అంత్యదినములలో’ జీవిస్తున్నామా?” అనే 9వ అధ్యాయం చూడండి.