కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్తకు లేదా భార్యకు ఎలా సహాయం చేయవచ్చు?

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్తకు లేదా భార్యకు ఎలా సహాయం చేయవచ్చు?

నాకు తీవ్రమైన ఫటీగ్‌ సిండ్రోమ్‌ a ఉందని తేలిన దగ్గర నుండీ, నా భర్త ఒక్కడే ఉద్యోగం చేయాల్సివచ్చింది. ఖర్చుల గురించి ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడడు. డబ్బు విషయాల గురించి ఆయన నాకు ఎందుకు ఏమీ చెప్పడు? మా ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా తయారైవుంటుంది, నాకు ఆ విషయం తెలిస్తే కంగారుపడతాననే ఆయన నాకు చెప్పడం లేదు.—నాన్సీ. b

వైవాహిక జీవితమే ఓ సవాలు, దానికితోడు దంపతుల్లో ఒకరు తీవ్రమైన అనారోగ్యంపాలై మరొకరు ఆరోగ్యంగానే ఉన్నప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. c మీరు జబ్బుపడిన భార్యను లేదా భర్తను చూసుకుంటున్నారా? అయితే మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా: ‘నా భర్త/భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తే, ఆ పరిస్థితిని నేనెలా ఎదుర్కొంటాను? ఇంటిపని, వంటపనితోపాటు ఉద్యోగం చేసుకుంటూ నా భార్యను లేదా భర్తను ఎంతకాలం చూసుకోగలుగుతాను? ఈ జబ్బు నాకు వచ్చివుంటే బాగుండేదని నాకెందుకు అనిపిస్తోంది?’

ఒకవేళ మీరే ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే మీరిలా అనుకుంటుండవచ్చు: ‘నేను నా బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నా కృంగిపోకుండా ఆత్మాభిమానాన్ని ఎలా కాపాడుకోగలను? నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి నా భర్త/భార్య నామీద చికాకు పడుతున్నారా? దంపతులుగా మేము సంతోషంగా గడిపే రోజులు ఇక లేనట్లేనా?’

కొందరు తమ భర్త లేదా భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఉండే సమస్యలను తట్టుకోలేక విడాకులు తీసుకోవడం విచారకరం. అయితే ఎవరో ఒకరు జబ్బుపడినంత మాత్రాన భార్యాభర్తలు ఖచ్చితంగా విడిపోవాలనేమీ లేదు.

తీవ్రమైన వ్యాధి పట్టిపీడిస్తున్నా, చాలామంది భార్యాభర్తలు సంతోషంగా కలిసి జీవిస్తున్నారు. ఉదాహరణకు, యోషీయకీ, కజుకోల విషయమే తీసుకోండి. వెన్నుపూసకు దెబ్బతగలడం వల్ల యోషీయకీ ఒకరి సహాయం లేకుండా ఒక్క అంగుళం కూడా కదల్లేడు. కజుకో ఇలా వివరిస్తోంది: “నా భర్త, సహాయం లేకుండా ఏ పనీ చేసుకోలేడు. ఆయనను చూసుకోవడంవల్ల నాకు మెడ, భుజాలు, చేతుల్లో నొప్పి మొదలైంది, దానితో నేను చికిత్స కోసం తరచూ అర్థోపెడిక్‌ (ఎముకల) ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. బాగోలేని వారిని చూసుకోవడం చాలా కష్టమని నాకు తరచూ అనిపిస్తుంది.” అయితే, ఇన్ని బాధలున్నా, “మేము ఒకరికొకరం ఇంకా దగ్గరయ్యాం” అని కజుకో అంటోంది.

అలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉండడానికి ఏమి తోడ్పడుతుంది? తమ వివాహ జీవితంలో సంతృప్తిని, సంతోషాన్ని కాపాడుకున్న దంపతులు తమ భర్తకు లేదా భార్యకు వచ్చిన అనారోగ్య సమస్య ఒక్కరిదే కాదుగానీ, అది తమ ఇద్దరి సమస్యగా భావిస్తారు. నిజానికి, భార్యాభర్తల్లో ఒక్కరు అనారోగ్యంపాలైనా అది వారిద్దరిమీద ఏదోవిధంగా ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తల అవినాభావ సంబంధం గురించి ఆదికాండము 2:24లో ఇలా వర్ణించబడింది: ‘పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు; వారు ఏక శరీరమై ఉంటారు.’ కాబట్టి భర్త లేదా భార్య నయంకాని వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి భార్యాభర్తలిద్దరూ సమిష్టిగా పనిచేయడం చాలా ప్రాముఖ్యం.

అంతేకాదు, తమలో ఒకరు తీవ్రమైన అనారోగ్యానికి గురైనా చక్కని సంబంధాన్ని కాపాడుకునే భార్యాభర్తలు, తమ పరిస్థితిని గురించి మరీ ఎక్కువగా బాధపడకుండా దానిని తట్టుకుని నిలబడడానికి ఏమిచేయాలో ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితిని తాళుకునేందుకు వాళ్లు ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు, అటువంటి వాటి గురించి బైబిలు వివరిస్తోంది. దీనిలోని సలహాలు ఎప్పటికీ ఉపయోగపడతాయి. ఈ మూడు సలహాలను పరిశీలించండి.

ఒకరి గురించి ఒకరు ఆలోచించండి

“ఇద్దరు కూడి యుండుట మేలు” అని ప్రసంగి 4:9 చెబుతోంది. ఎందుకు? 10వ వచనం ఇలా వివరిస్తోంది: ‘వారు పడిపోయినా, ఒకరు తమ తోటివారిని లేవనెత్తుతారు.’ మీరు మెచ్చుకోలు మాటలతో ‘మీ తోటివారిని లేవనెత్తుతారా?’

ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఏమి చేయవచ్చో మీరు ఆలోచించారా? యోంగ్‌ భార్యకు పక్షవాతం వచ్చింది. ఆయనిలా అంటున్నాడు: “నేను అన్ని సమయాల్లో నా భార్య గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. నాకు దాహమేసినప్పుడు, ఆమెకు కూడా దాహమేస్తుండవచ్చని అనుకుంటాను. బయటకు వెళ్లి అందమైన ప్రకృతిని చూడాలనిపించినప్పుడు, తను కూడా వస్తుందేమో అడుగుతాను. బాధను మేమిద్దరం పంచుకుంటూ పరిస్థితిని తట్టుకుని నిలబడగలుగుతున్నాం.”

మీ భర్త/భార్య మిమ్మల్ని చూసుకుంటుంటే, మీ ఆరోగ్యం దెబ్బతినకుండా మీరు సొంతగా చేసుకోగల పనులేమైనా ఉన్నాయా? అలా చేసుకోగలిగితే మీరు కృంగిపోకుండా ఆత్మాభిమానంతో ఉండగలుగుతారు, మిమ్మల్ని శ్రద్ధగా చూసుకునే మీ భర్తకు/భార్యకు మీవంతు సాయం చేయగలుగుతారు.

మిమ్మల్ని చూసుకుంటున్న మీ భర్తకు/భార్యకు సహాయం చేయడానికి ఏం చేయాలో మీకు తెలుసనుకునే బదులు, వారినే ఎందుకు అడగకూడదు? ముందు మనం చూసిన నాన్సీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తనకు తెలియకపోవడం వల్ల తను ఎంతగా బాధపడుతుందో తన భర్తకు చెప్పేసింది. ఇప్పుడామె భర్త ఆ విషయం గురించి ఆమెతో ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇలా చేసిచూడండి: మీ ప్రస్తుత పరిస్థితిని కాస్త మెరుగుపర్చడానికి మీ భర్త/భార్య ఏమేమి చేస్తే బావుంటుందని మీరనుకుంటున్నారో ఒక పేపరు మీద రాయండి, మీ భర్తను/భార్యను కూడా అలాగే రాయమనండి. ఆ తర్వాత ఒకరు రాసింది మరొకరు చూడండి. మీరిద్దరూ రాసిన వాటిలో నుండి చేయడానికి సాధ్యపడే ఒకటి రెండు సూచనలు మీరిద్దరు ఎంచుకోండి.

చక్కని ప్రణాళిక వేసుకోండి

‘ప్రతిదానికి సమయముంది’ అని జ్ఞానవంతుడైన సొలొమోను రాజు రాశాడు. (ప్రసంగి 3:1) అయితే కుటుంబంలో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇంటి పనులు, బయటి పనులు కుంటుపడే అవకాశముంది కాబట్టి, చక్కని ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం అసాధ్యమనిపించవచ్చు. అయితే భారాన్ని కొంతైనా తగ్గించుకోవడానికి ఒక చక్కని ప్రణాళిక ఎలా వేసుకోవచ్చు?

తీవ్రమైన అనారోగ్యం గురించి ఎక్కువగా చింతించకుండా ఇద్దరూ కలిసి వేరే పనులు చేయడానికి ప్రయత్నించవచ్చు. జబ్బుపడక ముందు మీరిద్దరు కలిసి చేసిన పనులేవైనా ఇప్పుడు మళ్లీ సరదాగా చేసే వీలుందా? అవి చేయలేకపోతే, వేరే పనులేవైనా చేయడానికి ప్రయత్నించగలరా? అవి ఒకరికొకరు చదివి వినిపించుకోవడం లాంటి సులభమైన పనులు కావచ్చు లేదా కొత్త భాష నేర్చుకోవడం వంటి కష్టమైన పనులూ కావచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మీరిద్దరూ కలిసి చేయగలిగే పనులు చేయడం మీ “ఏక శరీర” బంధాన్ని బలోపేతం చేస్తుంది, మీ సంతోషాన్ని అధికం చేస్తుంది.

భారాన్ని తగ్గించుకునేందుకు ఇద్దరికీ ఇష్టమైన పనులేవైనా చేయగలరా?

ఇతరులతో సమయం గడపడం వల్ల కూడా మీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. బైబిలులో సామెతలు 18:1 (పవిత్ర గ్రంథము, క్యాథలిక్‌ అనువాదము) ఇలా చెబుతోంది, ‘ఇతరులతో కలవక తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు. అతడు ఇతరుల సలహాను అంగీకరించడు.’ ఇతరులతో కలవకపోతే మనసు హానికరమైన ప్రభావానికి గురవగలదనే విషయాన్ని మీరు ఆ వచనంలో గమనించారా? అలా అందరికీ దూరంగా ఉండే బదులు అప్పుడప్పుడు ఇతరులతో సమయం గడపడం మీ మనసుకు ఉల్లాసం కలిగించడమే కాక మానసికంగా బలపడేందుకూ సహాయం చేస్తుంది. మిమ్మల్ని వచ్చి చూడమని చొరవ తీసుకొని మీరే ఎవరినైనా ఎందుకు అడగకూడదు?

శ్రద్ధ తీసుకుంటున్న భార్యకు లేదా భర్తకు కొన్నిసార్లు భారాన్ని తగ్గించుకోవడమే ఒక సమస్య కావచ్చు. కొందరు మరీ ఎక్కువ పనిని భుజాలమీద వేసుకుని, క్రమేణా నీరసించిపోయి, తమ ఆరోగ్యాన్నే పాడుచేసుకుంటారు. చివరకు వారు తాము ప్రేమిస్తున్న భర్తను లేదా భార్యను శ్రద్ధగా చూసుకోలేనంత బలహీనులుకావచ్చు. అందువల్ల, మీరు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న భర్తను లేదా భార్యను శ్రద్ధగా చూసుకుంటున్నట్లయితే మీ అవసరాల్ని నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి తీసుకోవడానికి క్రమం తప్పకుండా కొంత సమయం కేటాయించండి. d తమ మనసులోని బాధను అప్పుడప్పుడు నమ్మకమైన స్నేహితులతో (అంటే భార్య అయితే స్నేహితురాలితో, భర్త అయితే స్నేహితునితో) మాట్లాడడం ఉపశమనమిచ్చినట్లు కొందరు తెలుసుకున్నారు.

ఇలా చేసి చూడండి: మీ భర్తను లేదా భార్యను శ్రద్ధగా చూసుకోవడంలో మీకెలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ఒక పేపరు మీద రాయండి. ఆ తర్వాత వీటిని అధిగమించడానికి లేదా మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మీరెలాంటి చర్యలు తీసుకోవచ్చో రాయండి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆలోచించకుండా, ‘పరిస్థితిని సులభంగా ఎలా మెరుగుపర్చుకోవచ్చు?’ అని ఒకసారి ఆలోచించండి.

సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి

‘గడిచిపోయిన రోజులే మేలు అనబోకు’ అని బైబిలు హెచ్చరిస్తోంది. (ప్రసంగి 7:10, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి ‘ఈ వ్యాధి రాకపోతే ఎంత బాగుండేది’ అని ఆలోచిస్తూ ఉండకండి. ఈ లోకంలో పూర్తి సంతోషం పొందడం సాధ్యంకాదని గుర్తుంచుకోండి. వచ్చిన వ్యాధిని పూర్తిగా తీసివేయలేమని అర్థంచేసుకుని, సాధ్యమైనంత మెరుగ్గా జీవించడం ప్రాముఖ్యం.

ఈ విషయంలో మీకు, మీ భాగస్వామికి ఏది సహాయం చేస్తుంది? మీరు పొందిన ఆశీర్వాదాల గురించి మాట్లాడుకోండి. మీ ఆరోగ్యం కాస్త కుదుటపడినా సంతోషించండి. ఎదురుచూడదగ్గ విషయాల గురించి ఆలోచించండి. ఇద్దరూ కలిసి సాధించగల లక్ష్యాలు పెట్టుకోండి.

షోజీ, అకీకో అనే దంపతులు పైన ఇవ్వబడిన సలహాను పాటించి మంచి ఫలితాలను పొందారు. అకీకోకు ఫైబ్రోమైయాల్జియా (తీవ్రమైన కండరాల నొప్పి) ఉందని తెలిసినప్పుడు, వాళ్లు చేస్తున్న ప్రత్యేకమైన క్రైస్తవ సేవను ఆపాల్సివచ్చింది. వారు నిరుత్సాహపడిపోయారా? అవును. అయినా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి షోజీ ఇలా సలహా ఇస్తున్నాడు: “మీరిక ఎంతమాత్రం చేయలేని పనుల గురించి ఆలోచిస్తూ నిరుత్సాహపడకండి. సానుకూలంగా ఆలోచించండి. ఏదోక రోజున సాధారణ పరిస్థితి మళ్లీ వస్తుందనే నమ్మకం మీకిద్దరికీ ఉన్నా, ఇప్పటి పరిస్థితికి తగ్గట్టు మీ జీవితాన్ని మలచుకోండి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, నా భార్యను శ్రద్ధగా చూసుకుంటూ, ఆమెకు సహాయం చేస్తున్నాను.” మీ భాగస్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే, ఈ సలహా మీరూ పాటించవచ్చు. (w09-E 11/01)

a ఈ జబ్బుకు కారణాలేమిటో తెలీదు. అయితే ఇది సోకినవారిలో దీర్ఘకాల నిస్సత్తువ, కండరాల బలహీనత, మానసిక కృంగుదల, నిద్రలేమి వంటి లక్షణాలు కనబడతాయి.

b కొన్నిపేర్లు మార్చబడ్డాయి.

c ఈ ఆర్టికల్‌ భర్త/భార్య నయం కాని వ్యాధితో బాధపడుతుంటే ఏమి చేయవచ్చో చర్చిస్తోంది. ప్రమాదాల వల్ల వచ్చే శారీరక సమస్యలు, కృంగుదల వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న భార్యాభర్తలకు కూడా ఈ ఆర్టికల్‌లో చర్చించిన విషయాలు ఉపయోగపడతాయి.

d మీ పరిస్థితుల్ని బట్టి, వైద్య సిబ్బంది నుండి లేదా ఒకవేళ సేవా సంస్థలాంటివి అందుబాటులో ఉంటే వాటి నుండి రోజులో కొంత సమయమైనా సహాయం లభిస్తుందేమో చూడడం మంచిది.

మీరిలా ప్రశ్నించుకోండి . . .

నేనూ నా భాగస్వామి ఇప్పుడు ఏమి చేయడం అవసరం?

  • వ్యాధి గురించి ఎక్కువ మాట్లాడాలి

  • వ్యాధి గురించి తక్కువ మాట్లాడాలి

  • కలవరపడడం తగ్గించాలి

  • ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచించాలి

  • వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇద్దరికీ ఆసక్తివున్నవాటిని చేయడం గురించి ఆలోచించాలి

  • ఇతరులతో ఎక్కువ సమయం గడపాలి

  • ఇద్దరూ కలిసి సాధించగలిగే లక్ష్యాలు పెట్టుకోవాలి