కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు చెప్పేది మీరు ప్రతీరోజు వింటున్నారా?

దేవుడు చెప్పేది మీరు ప్రతీరోజు వింటున్నారా?

మీరెంత తరచుగా అద్దంలో చూసుకుంటారు? మనలో చాలామందిమి ప్రతీరోజూ బహుశా చాలాసార్లు అద్దంలో చూసుకుంటాం. ఎందుకు? ఎందుకంటే మనమెలా కనబడుతున్నామో తెలుసుకోవాలని అలా చూసుకుంటాం.

బైబిలు చదవడాన్ని అద్దంలో చూసుకోవడంతో పోల్చవచ్చు. (యాకోబు 1:23-25) మనం నిజంగా ఎలా ఉన్నామో తెలుసుకునేందుకు సహాయంచేసే శక్తి దేవుని వాక్యంలోని సందేశానికి ఉంది. అది ‘చొచ్చుకొనిపోయి ఆత్మను, ప్రాణాన్ని విభాగించగలదు.’ (హెబ్రీయులు 4:12, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మరోలా చెప్పాలంటే, అది మనం బయటకు ఎలా కనిపిస్తున్నామో, మన స్వభావం నిజంగా ఎలావుందో తేటతెల్లం చేస్తుంది. అద్దంలా, అది మనమెక్కడ సరిదిద్దుకోవాలో చూపిస్తుంది.

మనమెక్కడ సరిదిద్దుకోవాలో చూపించడమే కాక, ఆ దిద్దుబాట్లు చేసుకునేందుకు కూడా బైబిలు మనకు సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపించబడ్డాయి. అవి నీతిని బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతివిషయం తర్ఫీదు ఇవ్వడానికి ఉపయోగపడతాయి.’ (2 తిమోతి 3:16, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఈ వచనంలో నొక్కిచెప్పబడిన నాలుగు ఉపయోగాల్లో మూడు ఏమిటంటే గద్దించడం, సరిదిద్దడం, నీతివిషయంలో తర్ఫీదు ఇవ్వడం. దేవుని వాక్యం ఈ మూడు పనులు చేసినప్పుడు మనం మన స్వభావంలో, పనుల్లో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. మనం సరిగా కనబడుతున్నామని నిర్ధారించుకోవడానికే మనం క్రమంగా అద్దంలో చూసుకుంటామే, మరి దేవుని వాక్యమైన బైబిలును ఇంకెంత క్రమంగా చదవాలి!

యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించేందుకు యెహోషువను నియమిస్తూ ఆయనకిలా చెప్పాడు: “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ 1:8) అవును, యెహోషువ విజయవంతంగా ముందుకుసాగాలంటే దేవుని వాక్యాన్ని “దివారాత్రము” చదవాలి, అంటే క్రమం తప్పకుండా చదవాలి.

క్రమం తప్పకుండా బైబిలు చదవడంవల్ల ప్రయోజనం ఉందని మొదటి కీర్తన కూడా చెబుతోంది. అక్కడిలా ఉంది: “దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును. అతడు చేయునదంతయు సఫలమగును.” (కీర్తన 1:1-3) మనం ఖచ్చితంగా అలాంటి వ్యక్తిలా ఉండాలని కోరుకుంటాం.

చాలామంది ప్రతీరోజు బైబిలు చదవడం అలవాటు చేసుకున్నారు. ప్రతీరోజు బైబిలు చదవడానికి కారణం ఏమిటని అడిగినప్పుడు ఓ క్రైస్తవుడు ఇలా అన్నాడు: “రోజులో నేను చాలాసార్లు దేవునికి ప్రార్థిస్తాను, ఆయన నా ప్రార్థన ఆలకించాలని ఎంతో కోరుకుంటాను. అలాంటప్పుడు నేను కూడా ఆయన వాక్యాన్ని ప్రతీరోజు చదువుతూ ఆయన చెప్పింది వినాలి కదా? మనమే ఎప్పుడూ మాట్లాడుతుంటే మంచి స్నేహితులం ఎలా అవుతాం?” ఆయన సరిగ్గా చెప్పాడు. బైబిలు చదివితే దేవుడు చెబుతున్నది విన్నట్లుగానే ఉంటుంది, ఎందుకంటే మనమలా చదివినప్పుడు ఆయన అభిప్రాయమేమిటో మనకు తెలుస్తుంది.

మీరు ప్రతీరోజు బైబిలు ఎలా చదవవచ్చు?

బైబిలు చదివే కార్యక్రమాన్ని మీరు బహుశ ఇప్పటికే ఆరంభించి ఉండవచ్చు. మీరు మొత్తం బైబిలు చదివారా? అందులోని విషయాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు అదొక చక్కని మార్గం. కొందరు బైబిలు మొత్తం చదవాలని చాలాసార్లు మొదలుపెట్టారు, కానీ మధ్యలోనే ఆపేశారు. మీక్కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? మొత్తం బైబిలు చదవాలనే మీ లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు? ఈ రెండు సూచనలను పాటిస్తే ఉపయోగం ఉంటుంది.

బైబిలు చదవడానికి మీరు ప్రతీరోజు కొంత సమయం కేటాయించగలరా?

ప్రతీరోజు బైబిలు చదివేందుకు సమయం కేటాయించండి. ప్రతీరోజు బైబిలు చదవడానికి మీకు అనువైన సమయాన్ని ఎంచుకోండి, వేరొక సమయం గురించి కూడా ఆలోచించండి. ఒకవేళ ఆ సమయంలో చదవడం కుదరకపోతే అదేరోజున వేరే సమయంలో చదివేలా ఏర్పాటు చేసుకోండి. ఆవిధంగా మీరు దేవుని వాక్యం చదవకుండా ఏరోజూ పోనివ్వకండి. అప్పుడు మీరు పూర్వకాల బెరయలోని క్రైస్తవుల్లా ఉంటారు. ‘వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ వచ్చారు’ అని బైబిలు చెబుతోంది.—అపొస్తలుల కార్యములు 17:11.

నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోండి. ఉదాహరణకు, ప్రతీరోజు మీరు మూడు నుండి ఐదు అధ్యాయాలు చదివితే, ఒక సంవత్సరంలోనే మొత్తం బైబిలును చదవడం పూర్తిచేస్తారు. ఇలా ఎలా చేయవచ్చో తర్వాతి పేజీల్లోని పట్టిక మీకు వివరిస్తుంది. ఈ పట్టిక ప్రకారం చదవడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? “తేదీ” అనివున్న శీర్షిక క్రింద, మీరు ఏ రోజు ప్రతీ సెట్టు అధ్యాయాలు చదవాలనుకుంటున్నారో రాసుకోండి. మీరు ఆ అధ్యాయాలు చదివేసిన తర్వాత వాటికి గుర్తుగా ఇవ్వబడిన బాక్సులో టిక్కు పెట్టండి. ఇలా చేయడం, మీరు ఎంతవరకు చదివారో తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది.

మీరు మొత్తం బైబిలు చదవడం పూర్తిచేసిన తర్వాత, ఇక చదవడం ఆపేయాలా? మీరు అదే పట్టికను ఉపయోగించి, వేర్వేరు విభాగాల నుండి మొదలుపెట్టి ప్రతీ సంవత్సరం పూర్తి బైబిలును చదువవచ్చు. లేదా మీరు నెమ్మదిగానే బైబిలు చదవడం పూర్తిచేయాలనుకుంటే, పట్టికలో సూచించబడిన అధ్యాయాల సెట్టును రెండు మూడు రోజుల్లో పూర్తిచేయవచ్చు.

బైబిలు చదివే ప్రతీసారి మీ జీవితానికి అనువర్తించే కొత్తవిషయాలను అంటే మీరు అంతకుముందెప్పుడూ గమనించని విషయాలను కనుగొంటారు. ఎందుకు? ఎందుకంటే, ‘ఈ లోకపు నటన’ అంటే ఈ లోకం తీరు మారిపోతుంది కాబట్టి మన జీవితాలు, పరిస్థితులు తదేకంగా మారుతున్నాయి. (1 కొరింథీయులు 7:31) కాబట్టి, దేవుని వాక్యమైన బైబిలు అనే అద్దంలో ప్రతీరోజు చూసుకునేందుకు తీర్మానించుకోండి. ఈ విధంగా, మీరు దేవుడు చెప్పేది ప్రతీరోజు వినగలుగుతారు.—కీర్తన 16:8. (w09 08/01)