కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

యౌవనస్థులతో సంభాషించడం

యౌవనస్థులతో సంభాషించడం

“ఇంతవరకూ మా అబ్బాయితో బాగా మాట్లాడగలిగేవాళ్ళం, కానీ ఇప్పుడు వాడికి 16 ఏళ్ళు వచ్చాయి. అందుకే వాడేమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవడం నాకు, నా భర్తకు చాలా కష్టమవుతోంది. వాడు తన గదిలో ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నాడు, మాతో అంతగా మాట్లాడడు.”—మిరియమ్‌, మెక్సికో.

“ఒకప్పుడు మా పిల్లలు నేనేమి చెప్పినా వినడానికి ఇష్టపడేవారు. చెవులు రిక్కించుకుని వినేవారు! ఇప్పుడు వారు యౌవనస్థులయ్యారు కాబట్టి, వారిని నేను అర్థంచేసుకోలేనని అనుకుంటున్నారు.”—స్కాట్‌, ఆస్ట్రేలియా.

మీకు యౌవనస్థులైన పిల్లలుంటే పైన పేర్కొనబడిన తల్లిదండ్రులతో మీరు ఏకీభవిస్తారు. గతంలో, మీ అబ్బాయితో సంభాషణ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగివుండ​వచ్చు. కానీ ఇప్పుడు మీ మధ్య సంభాషణ సాగడంలేదు. ఇటలీకి చెందిన ఏంజెలా అనే ఒక తల్లి ఇలా చెబుతోంది, “మా అబ్బాయి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నన్ను ప్రశ్నలతో ముంచెత్తేవాడు. ఇప్పుడు నేనే చొరవ తీసుకుని వాడితో మాట్లాడాలి, నేనలా మాట్లాడకపోతే సరైన సంభాషణ లేకుండానే రోజులు గడిచిపోతాయి.”

ఏంజెలాలాగే మీరు కూడా ఒకప్పుడు ఎంతో మాట్లాడే మీ అబ్బాయి లేక అమ్మాయి ముభావంగా ఉండడాన్ని గమనించే ఉంటారు. సంభాషించడానికి మీరు చేసే ప్రయత్నాలకు కేవలం పొడి పొడి సమాధానాలే వస్తుండవచ్చు. మీరు మీ అబ్బాయిని “ఏరా ఈ రోజు క్లాసులు ఎలా జరిగాయి?” అని అడిగితే “బాగానే జరిగాయి” అని ముక్తసరిగా సమాధానమిస్తుండవచ్చు. “ఈ రోజు కాలేజిలో ఏంచెప్పారమ్మా?” అని మీరు మీ అమ్మాయిని అడిగితే, “ఏదో చెప్పారులే” అని ఆమె అనాసక్తిగా జవాబివ్వవచ్చు. “అడిగిందానికి సరిగ్గా సమాధానం చెప్పొచ్చుగా!” అని మీరు సంభాషణ కొనసాగించడానికి ప్రయత్నిస్తే, వారు మరింకేం మాట్లాడకుండా బిగదీసుకు​పోవచ్చు.

కొంతమంది యౌవనస్థులు మాట్లాడడానికి వెనుకాడరనేది నిజమే. అయితే, వారి తల్లిదండ్రులు వినాలనుకునేది మాత్రం వారు చెప్పరు. నైజీరియాకు చెందిన ఎడ్నా అనే ఒక తల్లి ఇలా అంటోంది, “మా అమ్మాయిని ఏమైనా చేయమని చెబితే ‘నన్ను విసిగించకు’ అనే సమాధానమే వస్తుంది.” మెక్సికోకు చెందిన రామోన్‌ కూడా 16 ఏళ్ళ తన కుమారుని విషయంలో అలాగే భావిస్తున్నాడు. “మేము ఇంచుమించు ప్రతీరోజు వాదించు​కుంటాం, నేనేదైనా చేయమని వాడికి చెబితే సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు” అని ఆయన అంటున్నాడు.

సరిగా ప్రతిస్పందించని యౌవనులతో సంభాషించడానికి ప్రయత్నించడం తల్లిదండ్రుల ఓర్పును పరీక్షించగలదు. “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును” అని బైబిలు అంగీకరిస్తోంది. (సామెతలు 15:22) “మా అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియనప్పుడు కోపంతో గట్టిగా అరవాలనిపిస్తుంది” అని రష్యాకు చెందిన ఆనా అనే ఒంటరి తల్లి చెబుతోంది. సంభాషించడం ఎంతో ప్రాముఖ్యమైన సమయంలో యౌవనులు, అలాగే వారి తల్లిదండ్రులు సంభాషణా సామర్థ్యాన్ని ఎందుకు కోల్పోతున్నట్లు అనిపిస్తుంది?

ఆటంకాలను గుర్తించడం

సంభాషణ అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదు. యేసు ఇలా చెప్పాడు, “హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:45) కాబట్టి మనం చక్కగా సంభాషిస్తే ఇతరుల నుండి నేర్చుకోవచ్చు, మన గురించి ఇతరులకు తెలియజేయవచ్చు. ఈ రెండవది యౌవనులకు ఒక సవాలుగా ఉంటుంది, ఎందుకంటే నలుగురితో కలిసిమెలిసి ఉండే పిల్లలు యౌవనప్రాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు అకస్మాత్తుగా బిడియస్థులుగా మారిపోతారు. యౌవనులు సాధారణంగా అందరూ తమనే గమనిస్తున్నట్లు భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. తమ గురించి తాము ఎక్కువగా ఆలోచించుకునే యౌవనస్థులు నలుగురిలోకి రాకుండా గిరిగీసుకొని ఉండిపోవాలని కోరుకుంటారు, తల్లిదండ్రులు ఆ గిరిదాటి వారి దగ్గరికి అంత సులువుగా వెళ్ళలేరు.

యౌవనస్థులు సంభాషించడానికి మరో ఆటంకం, వారు స్వేచ్ఛ కావాలని కోరుకోవడం. అలా కోరుకోవడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే ఎదగడంలో భాగంగా, మీ పిల్లలు పెరిగేకొద్దీ తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకుంటారు. అంతమాత్రాన వారు తమంతట తామే జీవించగలరని కాదు. నిజానికి వారికి ముందటికన్నా ఇప్పుడే మీ సహాయం ఎంతో అవసరమవుతుంది. అయితే ఒక అబ్బాయి ఒక వ్యక్తిగా ఎదిగే ప్రక్రియ యుక్తవయస్సుకు రావడానికి ఎన్నో సంవత్సరాల ముందే మొదలవుతుంది. చాలామంది యౌవనస్థులు తాము పరిణతి చెందడంలో భాగంగా తమ ఆలోచనలను ఇతరులకు చెప్పేముందు వాటి గురించి తామే ఆలోచించుకోవడానికి ఇష్టపడతారు.

నిజమే, యౌవనస్థులు తమ తోటి వయస్సు వారి విషయంలో అలా ఉండరని మెక్సికోకు చెందిన జెస్సికా అనే ఒక తల్లి గమనించింది. ఆమె ఇలా చెబుతోంది, “మా అమ్మాయి చిన్నవయసులో ఉన్నప్పుడు తన సమస్యలన్నీ నాకు చెప్పుకునేది. కానీ ఇప్పుడు తన స్నేహితులకు చెప్పుకుంటోంది.” యౌవనస్థులైన మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తుంటే, వారు మిమ్మల్ని తల్లిదండ్రులుగా తిరస్కరించారని అనుకోకండి. దానికి భిన్నంగా, యౌవనస్థులు నోటితో చెప్పకపోయినా వారు, స్నేహితులిచ్చే సలహాల​కన్నా తమ తల్లిదండ్రులిచ్చే సలహాలకే విలువిస్తారని సర్వేలు చూపిస్తున్నాయి. అయితే మీ మధ్య సంభాషణ సజావుగా సాగాలంటే మీరేమి చేయవచ్చు?

విజయానికి తోడ్పడే అంశాలు —అడ్డుగోడలను పడగొట్టడం

మీరు తిన్నని, పొడవైన రహదారి మీద వాహనం నడుపుతున్నట్లుగా ఊహించుకోండి. చాలా కిలోమీటర్ల వరకు మీరు మీ స్టీరింగ్‌ను ఎక్కువగా తిప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే హఠాత్తుగా రోడ్డు మలుపు తిరిగినప్పుడు, మీ వాహనం రోడ్డు మీదే వెళ్ళాలంటే, మీరు మీ స్టీరింగ్‌ను తప్పక తిప్పాల్సిందే. మీ అబ్బాయి యౌవనదశకు చేరుకున్నప్పుడు కూడా పరిస్థితి ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాలపాటు తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలను పెంచడంలో కొన్ని పద్ధతులను పాటించివుండవచ్చు. అయితే ఇప్పుడు మీ అబ్బాయి జీవితం మలుపు తిరుగుతోంది కాబట్టి మీ ‘స్టీరింగ్‌ను రోడ్డుకు అనుగుణంగా తిప్పాలి’ అంటే మీరు మీ పద్ధతుల్లో మార్పుచేసు​కోవాలి. మిమ్మల్ని మీరు ఈ క్రింది విధంగా ప్రశ్నించుకోండి.

‘మా అబ్బాయి లేదా అమ్మాయి నాతో మాట్లాడాలనుకుంటు​న్నప్పుడు నేను సంభాషించడానికి సిద్ధంగా ఉన్నానా?’ బైబిలు ఇలా చెబుతోంది, “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.” (సామెతలు 25:11) ఈ లేఖనం స్పష్టం చేస్తున్నట్లుగా, సరైన సమయం నిజంగా చాలా ప్రాముఖ్యం. సోదాహరణంగా చెప్పాలంటే, ఒక రైతు సమయానికి ముందే కోత కోయకూడదు, అలాగని సమయం మించి​పోయేదాక కూడా ఆగకూడదు. పంట కోతకొచ్చినప్పుడే దాన్ని కోయాలి. యౌవనస్థులైన మీ పిల్లలు ఏదైనా ఒక సమయంలో మాట్లాడాలని ఆశిస్తుండవచ్చు. మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. “చాలాసార్లు మా అమ్మాయి రాత్రిపూట నాతో మాట్లాడడానికి వచ్చేది, కొన్నిసార్లు మా సంభాషణ గంటపైనే సాగేది, నేను రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకువగా ఉండలేను కాబట్టి నాకు అది కష్టంగా ఉండేది, అయితే అలాంటి సమయాల్లోనే మేము దాదాపు అన్ని విషయాల గురించి మాట్లాడు​కునేవాళ్ళం” అని ఆస్ట్రేలియాకు చెందిన ఒంటరి తల్లియైన ఫ్రాన్సెస్‌ అంటోంది.

ఇలా చేసి చూడండి: యౌవనస్థుడైన మీ అబ్బాయి మాట్లాడడానికి వెనుకాడుతుంటే, అతనితోపాటు కాసేపు అలా నడుచు​కుంటూ వెళ్ళండి, అతడిని ఏదైనా పార్కుకో హోటల్‌కో తీసుకువెళ్ళండి, కలిసి ఏవైనా ఆటలు ఆడండి లేదా ఏదైనా ఇంటి పని చేయండి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో యౌవనస్థులు తమ మనసువిప్పి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

‘మాటల వెనకున్న భావాలను నేను అర్థంచేసుకుంటు​న్నానా?’ యోబు 12:11 ఇలా చెబుతోంది, “అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?” ఇంతకు ముందుకన్నా ఎక్కువగా ఇప్పుడు మీ అబ్బాయి లేదా అమ్మాయి చెప్పేవాటిని మీరు ‘పరీక్షించాలి’ అంటే వారు చెబుతున్నదాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. యౌవనస్థులెప్పుడూ తాము చెబుతున్నదే సరైనదన్నట్లు మాట్లాడుతుంటారు. ఉదాహరణకు, మీ అబ్బాయి, “మీరు ఎప్పుడూ నన్ను చిన్నపిల్లవాడిలా చూస్తారు!” అనో లేదా “నా మాట ఎప్పుడూ వినరు!” అనో అంటుండవచ్చు. “ఎప్పుడూ” అనే మాటను పట్టుకుని వాదించే బదులు, మీ అబ్బాయి చెప్పాలనుకుంటున్నది అది కాదనే విషయాన్ని అర్థంచేసుకోండి. “మీరు ఎప్పుడూ నన్ను చిన్నపిల్లవాడిలా చూస్తారు!” అన్నప్పుడు బహుశా మీ అబ్బాయి ఉద్దేశం, “మీకు నా మీద నమ్మకంలేదని​పిస్తోంది” అని కావచ్చు, “నా మాట ఎప్పుడూ వినరు!” అని అన్నప్పుడు బహుశా మీ అబ్బాయి ఉద్దేశం, “నాకెలా అనిపిస్తుందో మీకు చెప్పాలనుకుంటున్నాను” అని కావచ్చు. మాటల వెనకున్న భావాలను గ్రహించడానికి ప్రయత్నించండి.

ఇలా చేసి చూడండి: యౌవనస్థుడైన మీ అబ్బాయి తన అభిప్రాయాన్ని తెగేసి చెబితే ఇలా మాట్లాడి చూడండి, “నువ్వు దేని గురించో బాధపడుతున్నట్లుగా ఉంది, దేని గురించి బాధపడుతున్నావో నాకు చెప్పు, నేను నిన్ను చిన్నపిల్లవాడిలా చూస్తున్నానని ఎందుకనుకుంటున్నావు?” ఆ తర్వాత మీ అబ్బాయి చెప్పేదానిని మధ్యలో ఆపకుండా వినండి.

‘యౌవనస్థుడైన మా అబ్బాయిని మాట్లాడమని బలవంత​పెడుతూ నాకు తెలియకుండానే సంభాషణను అడ్డుకుంటున్నానా?’ బైబిలు ఇలా చెబుతోంది, “శాంతి స్థాపకులు శాంతిని విత్తి నీతి అనే పంటను కోస్తారు.” (యాకోబు 3:18, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ‘శాంతికరమైన’ పరిస్థితులు కల్పిస్తే, యౌవనస్థులైన మీ పిల్లలు మాట్లాడేందుకు సుముఖత చూపిస్తారు. మీ అబ్బాయికి మద్దతు​నివ్వాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. మీరొక విషయం గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు, కోర్టులో ముద్దాయిని విచారిస్తున్నట్లు మాట్లాడకండి. “తెలివిగల తల్లిదండ్రులు ‘నీకు ఎప్పటికి బుద్ధొస్తుంది?,’ ‘నీకెన్నిసార్లు చెప్పాను?’ వంటి మాటలు అనరు. ఈ విషయంలో నేను చాలా పొరపాట్లు చేసిన తర్వాత, మా అబ్బాయిలు నేను మాట్లాడే పద్ధతిని బట్టే కాదు, నేను మాట్లాడే విషయాలను బట్టి కూడా చిరాకుపడుతున్నారని నేను గమనించాను” అని కొరియా వాసియైన ఆన్‌ అనే తండ్రి చెబుతున్నాడు.

ఇలా చేసి చూడండి: యౌవనస్థులైన మీ పిల్లలు మీరడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకపోతే, మరో విధానాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు, మీ అమ్మాయి రోజంతా ఏం చేసిందో అడిగే బదులు మీరు రోజంతా ఏమి చేశారో చెప్పండి, అప్పుడు మీ అమ్మాయి ఎలా ప్రతిస్పందిస్తుందో చూడండి. లేదా ఏదైనా ఒక విషయంమీద మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవడానికి, అవధానాన్ని మీ అమ్మాయిపై నుండి ప్రక్కకు మళ్ళించే ప్రశ్నలు అడగండి. ఒక విషయం గురించి ఆమె స్నేహితురాలు ఏమనుకుంటుందో అడగండి. ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలికి ఎలాంటి సలహానిస్తుందో అడగండి.

యౌవనస్థులతో మాట్లాడడం అసాధ్యమేమీ కాదు. మీ పిల్లలతో మీరు మాట్లాడే పద్ధతిని అవసరానికి తగ్గట్టుగా మార్చుకోండి. ఈ విషయంలో చక్కని ఫలితాలను సాధించిన ఇతర తల్లిదండ్రులతో మాట్లాడండి. (సామెతలు 11:14) మీ అబ్బాయితో లేదా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, ‘వినడానికి వేగిరపడేవారిగా, మాట్లాడడానికి నిదానించేవారిగా, కోపించుటకు నిదానించేవారిగా’ ఉండండి. (యాకోబు 1:19) అన్నిటికన్నా ముఖ్యంగా, యౌవనస్థులైన మీ పిల్లలను ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను పెంచడానికి’ మీరు చేసే ప్రయత్నాలను ఎప్పుడూ మానుకోకండి.—ఎఫెసీయులు 6:4. (w 08 8/1)

మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి . . .

  •   మా పిల్లలు యౌవనస్థులైనప్పటి నుండి వారిలో ఎలాంటి మార్పులు రావడం గమనించాను?

  •   మాట్లాడే నైపుణ్యాన్ని నేనెలా మెరుగుపర్చుకోవచ్చు?