కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

సమస్యలను పరిష్కరించుకోవడం

సమస్యలను పరిష్కరించుకోవడం

భర్త: “మన అమ్మాయిలు ఏరి?”

భార్య: “కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్లారు.”

భర్త: [చిరాకుగా అరుస్తూ] “మళ్లీ ‘కొత్త బట్టలు కొనుక్కోవడమేమిటి’? పోయిన నెలే కదా కొనుక్కున్నారు.”

భార్య: [నొచ్చుకుని, తనను తాను సమర్థించుకోవాలని] “ఏదో డిస్కౌంట్‌కి దొరుకుతున్నాయని వెళ్లారు. అయినా వాళ్లు నన్ను అడిగారు కాబట్టి సరే వెళ్ళమన్నాను.”

భర్త: [కోపం పట్టలేక అరుస్తూ] “నన్ను అడక్కుండా వాళ్లలా డబ్బు ఖర్చుచేయడం నాకిష్టం ఉండదని నీకు తెలుసు. అయినా నాకు చెప్పకుండా నీ అంతట నువ్వే వాళ్ళను ఎందుకు పంపించావ్‌?”

ఆ భార్యాభర్తలు పరిష్కరించుకోవలసిన సమస్యలు ఏవని మీరనుకుంటున్నారు? భర్త తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడని తెలుస్తోంది. అంతేగాక, తమ పిల్లలకు ఎంత స్వేచ్ఛనివ్వాలనే విషయంలో వారిద్దరి అభి​ప్రాయాలు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వారిద్దరూ ఒకరితో ఒకరు అంతగా మాట్లాడుకోవడం లేదనిపిస్తోంది.

గొడవలు లేని భార్యాభర్తలు అంటూ ఎవరూ ఉండరు. భార్యాభర్తలందరికీ ఏదో ఒక విధమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి పెద్దవైనా, చిన్నవైనా భార్యాభర్తలిద్దరూ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు?

కాలం గడిచేకొద్దీ, పరిష్కరించబడని సమస్యలవల్ల ఇద్దరి మధ్య దూరంపెరిగి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేయవచ్చు. “వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు” అని జ్ఞానియైన సొలొమోను రాజు చెప్పాడు. (సామెతలు 18:​19) సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడానికి మీరేమి చేయవచ్చు?

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఒకరిపట్ల ఒకరు ప్రేమాగౌరవం కలిగివుండడం కూడా అంతే ప్రాముఖ్యం. (ఎఫెసీయులు 5:​33) భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే, భార్య లేదా భర్త గతంలో చేసిన తప్పులను, ఆ తప్పులవల్ల కలిగిన బాధను వారు మనసులో పెట్టుకోకుండా ప్రస్తుత సమస్యను పరిష్కరించుకో​గలుగుతారు. (1 కొరింథీయులు 13:​4, 5; 1 పేతురు 4:⁠8) ఒకరినొకరు గౌరవించుకునే భార్యాభర్తలు, తమ భాగస్వామికి మనసు విప్పి మాట్లాడే అవకాశాన్నిస్తారు, అంతేగాక వారు తమ భాగస్వామి మాటల్లో వ్యక్తం చేసినదాన్ని మాత్రమే కాదు మాటల్లో చెప్పని మనసులోని భావాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

సమస్యలను పరిష్కరించుకోవడానికి పాటించవలసిన నాలుగు పద్ధతులు

క్రింద ఇవ్వబడిన నాలుగు పద్ధతులను పరిశీలించండి. సమస్యలను ప్రేమతో, గౌరవంతో పరిష్కరించుకోవడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేయగలవో గమనించండి.

1. సమస్య గురించి మాట్లాడడానికి సమయాన్ని కేటాయించండి.

‘ప్రతిదానికి సమయము కలదు. మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయం కలదు.’ (ప్రసంగి 3:1, 7) ప్రారంభంలో ప్రస్తావించబడిన భార్యాభర్తల వాదనలో చూపించబడినట్లుగా, కొన్ని సమస్యల వల్ల ఎవరికైనా కోపం రావచ్చు. అలా జరిగితే, కోపం తారాస్థాయికి చేరకముందే, గొడవను తాత్కాలికంగా ఆపేయడానికి అంటే ‘మౌనముగా ఉండడానికి’ ప్రయత్నించండి. “నీవు వాదం మొదలుపెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి” అని బైబిలు ఇస్తున్న సలహాను పాటించడం ద్వారా మీ మధ్యవున్న సంబంధాన్ని కాపాడుకోవచ్చు.​—⁠సామెతలు 17:​14, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

అంతేగాక ‘మాటలాడుటకు కూడా సమయం కలదు.’ సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తే అవి కలుపుమొక్కల్లా అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతాయి. కాబట్టి సమస్య దానంతటదే పోతుందని ఆశిస్తూ దాన్ని అలక్ష్యం చేయకండి. మీరు ఒకవేళ గొడవను తాత్కాలికంగా ఆపేస్తే, సాధ్యమైనంత త్వరలో, ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఒక సమయాన్ని కేటాయించి మీ భాగస్వామిని గౌరవిస్తున్నట్లు చూపించండి. అలా చేయడం ద్వారా, “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు” అని బైబిలు ఇస్తున్న ఉపదేశ సారాంశాన్ని మీరిద్దరూ పాటించగలుగుతారు. (ఎఫెసీయులు 4:​26) అయితే మీరు మీ మాటమీద నిలబడాలి.

ఇలా చేసి చూడండి: క్రమంగా వారానికి ఒకసారి కుటుంబ సమస్యలను చర్చించుకోండి. మీకు రోజులోని ఫలానా సమయంలో ఉదాహరణకు, ఆఫీసు నుండి ఇంటికి రాగానే లేదా భోజనానికి ముందు కోపం వస్తుంటే, ఆ సమయాల్లో సమస్యల గురించి చర్చించకూడదని మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రండి. అయితే మీరిద్దరూ ప్రశాంతంగా ఉండే సమయాన్ని ఎన్నుకోండి.

2. మీ అభిప్రాయాన్ని నిజాయితీగా, గౌరవపూర్వకంగా తెలియజేయండి.

“ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.” (ఎఫెసీయులు 4:​25) మీరు వివాహితులైతే మీ భాగస్వామే మీ పొరుగువారు, అంటే మీకు అత్యంత సన్నిహితులు. కాబట్టి మీరు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ భావాలను నిజాయితీగా, స్పష్టంగా వ్యక్తం చేయండి. 26 సంవత్సరాల క్రితం వివాహమైన మార్గరేటా a ఇలా అంటోంది: “మాకు పెళ్లైన కొత్తలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నా భర్త నా భావాలను అర్థం చేసుకుంటాడని అనుకునే​దాన్ని. కానీ అలా అనుకోవడం సబబు కాదని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నా అభిప్రాయాలను, భావాలను స్పష్టంగా తెలియ​జేయడానికి ప్రయత్నిస్తున్నాను.”

ఒక సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు, మీమాటే నెగ్గించుకోవడం కాదుగానీ మీ తలంపులను మీ భాగస్వామికి అర్థమయ్యేటట్లు తెలియజేయడమే మీ లక్ష్యమై ఉండాలని గుర్తుంచుకోండి. అలా సమర్థవంతంగా తెలియజేయాలంటే మీకు ఏది సమస్యగా కనిపిస్తుందో, అది ఎప్పుడు తలెత్తుతుందో చెప్పండి. దానివల్ల మీకు ఎలా అనిపిస్తుందో కూడా వివరించండి. ఉదాహరణకు, ఇంటిని శుభ్రంగా ఉంచే విషయంలో మీ భర్త మీకు సహకరించకపోతే ఆయనతో మర్యాదపూర్వకంగా ఇలా చెప్పవచ్చు: ‘మీరు పని నుండి ఇంటికి రాగానే మాసిన బట్టల్ని కింద పడేస్తే [ఏది సమస్య, అది ఎప్పుడు తలెత్తుతుంది అనే వివరాలు] నేను ఇల్లు శుభ్రం చేయడానికి పడిన కష్టమంతా వృధా అయినట్లు అనిపిస్తుంది [మీకు ఎలా అనిపిస్తుందో తెలియజేయడం].’ ఆ తర్వాత ఆ సమస్యను ఎలా పరిష్కరించవచ్చని మీకనిపిస్తోందో నేర్పుగా సూచించండి.

ఇలా చేసి చూడండి: మీరు మీ భాగస్వామితో మాట్లాడాలనుకుంటున్న విషయాలు మీ మనసులో స్పష్టంగా ఉండాలంటే, మీకు ఏది సమస్యగా అనిపిస్తోందో, దానిని మీరు ఎలా పరిష్కరిస్తే బావుంటుందని అనుకుంటున్నారో వ్రాసిపెట్టుకోండి.

3. మీ భాగస్వామి చెప్పేది విని, వారి భావాలను అర్థం చేసుకోండి.

క్రైస్తవులు ‘వినుటకు వేగిరపడువారిగా, మాటలాడుటకు నిదానించువారిగా, కోపించుటకు నిదానించువారిగా’ ఉండాలని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 1:​19) ఒక సమస్య గురించి మీరెలా భావిస్తున్నారో మీ భాగస్వామి అర్థంచేసుకోవడంలేదనే తలంపు కన్నా బాధ కలిగించేది మరింకేదీ ఉండదు. కాబట్టి మీ భాగస్వామికి అలా బాధకలిగించకుండా ఉండాలని తీర్మానించుకోండి.​—⁠మత్తయి 7:​12.

35 సంవత్సరాల క్రితం వివాహమైన వుల్ఫ్‌గాంగ్‌ ఇలా అంటున్నాడు: “మేము సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకేదో కంగారుగా ఉంటుంది. నా భార్య నా ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోదని నాకనిపించినప్పుడు నా కంగారు మరింత ఎక్కువవుతుంది.” 20 సంవత్సరాల క్రితం వివాహమైన డయానా ఇలా ఒప్పుకుంటోంది, “మేము సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ‘మీరు నేను చెప్పేది సరిగ్గా వినడంలేదు’ అని నేను నా భర్తతో ఎన్నోసార్లు అన్నాను.” ఆ అడ్డంకును ఎలా అధిగమించవచ్చు?

మీ భాగస్వామి ఆలోచనలు, భావాలు మీకు తెలుసని అనుకోకండి. “గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును” అని దేవుని వాక్యం చెబుతోంది. (సామెతలు 13:​10) మీ భాగస్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు, మీరు మధ్యలో మాట్లాడకుండా మీ భాగస్వామి​పట్ల గౌరవం చూపించండి. మీ భాగస్వామి చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని రూఢిపర్చుకునేందుకు విన్నదాన్ని మళ్లీ ఒకసారి చెప్పండి, హేళనగానో, కోపంగానో అలా చెప్పకండి. మీ భాగస్వామి చెబుతున్న విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే ఆమె లేదా ఆయన మిమ్మల్ని సరిచేయనివ్వండి. మీరొక్కరే మాట్లాడకండి. మీరిద్దరూ ఈ పద్ధతిని అనుసరిస్తూ, ఒక విషయంపై ఒకరికున్న ఆలోచనలను, భావాలను మరొకరు అర్థం చేసుకున్నారన్న అంగీకారానికి వచ్చేంత​వరకు సంభాషణను కొనసాగించండి.

మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా విని, ఆమె లేక ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడానికి వినయం, ఓపిక అవసరమన్నది నిజమే. కానీ ముందు మీరు వారిని గౌరవిస్తే వారు కూడా మిమ్మల్ని గౌరవించడానికి ఇష్టపడతారు.​—⁠మత్తయి 7:⁠2; రోమీయులు 12:⁠10.

ఇలా చేసి చూడండి: మీ భాగస్వామి చెప్పినదాన్ని తిరిగి చెబుతున్నప్పుడు చిలక పలికినట్లు అవే మాటల్ని వల్లించకండి. దయాపూర్వకంగా, మీ భాగస్వామి మాటలను, భావాలను మీరెలా అర్థం చేసుకున్నారో వివరించడానికి ప్రయత్నించండి.​—⁠1 పేతురు 3:⁠8.

4. పరిష్కారం విషయంలో ఏకాభిప్రాయానికి రండి.

“ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును.” (ప్రసంగి 4:​9, 10) భార్యాభర్తలు సమస్యను పరిష్కరించుకోవడానికి కలిసి ప్రయత్నిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటేనే వివాహ జీవితంలో సమస్యలు లేకుండా ఉంటాయి.

యెహోవా దేవుడు పురుషుణ్ణి కుటుంబానికి శిరస్సుగా నియమించాడనేది నిజమే. (1 కొరింథీయులు 11:⁠3; ఎఫెసీయులు 5:⁠23) కానీ శిరస్సుగా బాధ్యతలు నిర్వర్తించడం అంటే నియంతలా అధికారం చెలాయించడం కాదు. జ్ఞానంగల ఒక భర్త తన భార్య అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోడు. 20 సంవత్సరాల క్రితం వివాహమైన డేవిడ్‌ ఇలా అంటున్నాడు: “నా భార్యతో నేను ఏకీభవించే విషయం ఏదైనా ఉందేమో చూడడానికి ప్రయత్నిస్తూ, ఇద్దరం సమర్థించగల నిర్ణయం తీసుకోవడానికి చూస్తాను.” 7 సంవత్సరాల క్రితం వివాహమైన టాన్యా ఇలా అంటోంది: “ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది ప్రాముఖ్యంకాదు. కొన్నిసార్లు ఒక సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై ఇద్దరికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా మారడం, సర్దుకు​పోవడం సంతోషానికి కీలకమని నేను తెలుసుకున్నాను.”

ఇలా చేసి చూడండి: ఒక సమస్యను పరిష్కరించడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు, మీకిద్దరికీ సాధ్యమని అనిపించినవాటిని వ్రాసిపెట్టుకోవడం ద్వారా మీ మధ్య పరస్పర సహకార స్ఫూర్తిని పెంపొందించుకోండి. సాధ్యమని మీకనిపించినవన్నీ వ్రాసేసుకున్న తర్వాత మీరు తయారుచేసుకున్న లిస్టును పరిశీలించి, మీరిద్దరూ అంగీకరించే పరిష్కారాన్ని అమలులో పెట్టండి. వీలైనంత త్వరలో ఒక సమయాన్ని కేటాయించుకొని, మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలులో పెట్టారో లేదో, అదెంత వరకు విజయవంతమైందో పరిశీలించుకోండి.

కలిసి పనిచేయండి

యేసు, వివాహాన్ని రెండు జంతువులు జతపరచబడే కాడితో పోల్చాడు. (మత్తయి 19:⁠6) ఆయన కాలంలో కూడా, రెండు జంతువులు కలిసి పనిచేసేలా వాటిని ఒక కాడికి కలిపి కట్టేవారు. ఒకవేళ ఆ జంతువులు కలిసి నడవకపోతే అవి సమర్థవంతంగా పనిచేయలేవు, అంతేగాక రాపిడివల్ల వాటి మెడ ఒరుసుకు​పోతుంది. అవి కలిసి పనిచేస్తే అవి ఎంతో బరువును లాగగలవు, పొలాలను దున్నగలవు.

అలాగే ఒక జట్టుగా కలిసి పనిచేయలేని భార్యాభర్తలు, వివాహమనే కాడిక్రింద నలిగిపోతారు. మరోవైపు వారు కలిసి పనిచేయడం నేర్చుకుంటే దాదాపు సమస్యలన్నీ పరిష్కరించు​కోవచ్చు, దానివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వివాహితునిగా ఎంతో సంతోషాన్ని పొందుతున్న కలాలా, క్లుప్తంగా ఇలా చెబుతున్నాడు: “గత 25 సంవత్సరాలుగా నేను, నా భార్య నిర్మొహమాటంగా మాట్లాడుకోవడం ద్వారా, అవతలి వ్యక్తి స్థానంలో మమ్మల్ని ఉంచుకోవడం ద్వారా, యెహోవా సహాయం కోసం ప్రార్థించడం ద్వారా, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా మా సమస్యలను పరిష్కరించుకున్నాము.” మీరు కూడా అలాగే చేయగలరా? (w 08 5/1)

మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి . . .

  •   నా భాగస్వామితో నేను చర్చించాలని ఎంతగానో కోరుకునే ఒక సమస్య ఏమిటి?

  • ఈ విషయంలో నా భాగస్వామి భావాలను నేను సరిగ్గా అర్థం చేసుకున్నానని నాకెలా తెలుస్తుంది?

  • ఎప్పుడూ నేను అనుకున్నట్టే జరగాలని పట్టుబడితే, నేనెలాంటి సమస్యలను సృష్టిస్తాను?

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.