కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రేమ వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు

దేవుని ప్రేమ వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు

దేవుడు మన శరీరాన్ని గాయాలు మానిపోయే అద్భుతమైన శక్తితో తయారు చేశాడు. శరీరం కోసుకుపోతే, దోక్కుపోతే లేదా దెబ్బ తగిలితే, ‘పెద్ద గాయాలనైనా, చిన్న గాయాలనైనా మాన్పడానికి శరీరం రకరకాల ప్రక్రియలను ఎన్నిటినో మొదలుపెడుతుంది.’ (జాన్‌ హాప్కిన్స్‌ మెడిసిన్‌) రక్తం కారకుండా ఆపడానికి, లేదా రక్త నాళాలు వెడల్పు అవడానికి, పుండును మాన్పడానికి, కణజాలం బలపడడానికి శరీరం వెంటనే రంగంలోకి దిగుతుంది.

ఆలోచించండి: సృష్టికర్త మన శరీరాన్ని గాయాలు తగ్గిపోయే సామర్థ్యంతో తయారు చేశాడు. కాబట్టి మన మనసుకు తగిలిన గాయాలను తగ్గించుకోవడానికి సహాయం చేస్తానని ఆయన ఇచ్చిన మాటను కూడా మనం పూర్తిగా నమ్మవచ్చు. “గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు” అని కీర్తనకర్త రాశాడు. (కీర్తన 147:3) కానీ మీరు మానసిక కృంగుదలతో బాధపడుతుంటే, యెహోవా ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీ బాధను తీసేయగలడని ధైర్యంతో ఉండవచ్చు.

దేవుని ప్రేమ గురించి బైబిలు మనకు ఏమి నేర్పిస్తుంది?

దేవుడు ఇలా వాగ్దానం చేశాడు: “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.” (యెషయా 41:9, 10) దేవుడు తనను చూసుకుంటాడని తెలిసిన వ్యక్తికి మనశ్శాంతి ఉంటుంది, వేర్వేరు పరీక్షలు తట్టుకునే శక్తి ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ఈ మనశ్శాంతిని “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి” అని పిలిచాడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది.”—ఫిలిప్పీయులు 4:4-7, 9, 13.

లేఖనాలు మన విశ్వాసాన్ని బలపర్చి, మనుషుల భవిష్యత్తు గురించి యెహోవా చేసిన వాగ్దానాలను నమ్మడానికి సహాయం చేస్తాయి. ఉదాహరణకు, ప్రకటన 21:4, 5 వచనాల్లో (తర్వాత పేజీలో ఉంది) మనకు ఆయన ఏమి చేస్తాడో, ఆయన వాటిని చేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చో ఉంది:

  • ప్రజల కళ్లల్లో నుండి కారే “ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు.” యెహోవా మన బాధలు అన్నిటినీ, ఆందోళన అంతటినీ తీసేస్తాడు, ఇతరులు అంతగా పట్టించుకోనివాటిని కూడా ఆయన పట్టించుకుంటాడు.

  • సృష్టి అంతటికీ సర్వశక్తిమంతుడైన రాజు తన పరలోక మహిమతో “సింహాసనం మీద కూర్చొని” ఉన్నాడు. ఆయన తన శక్తిని, అధికారాన్ని ఉపయోగించి మనకు బాధలు రాకుండా చేస్తాడు, మనకు అవసరమైన సహాయాన్ని ఇస్తాడు.

  • ఆయన వాగ్దానాలు “నమ్మదగినవి, సత్యమైనవి” అని యెహోవాయే అభయం ఇస్తున్నాడు. అంటే ఆయన పేరు, ఆయనకున్న గొప్పతనాన్ని బట్టి యెహోవా తన మాటను నిలబెట్టుకుంటానని భరోసా ఇస్తున్నాడు.

‘“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.” అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి కాబట్టి రాయి.”’​—ప్రకటన 21:4, 5.

ఈ విశ్వం, అలాగే బైబిలు మన పరలోక తండ్రి వ్యక్తిత్వాన్ని, ఆయన లక్షణాలను వెల్లడి చేస్తున్నాయి. ఒక సన్నిహిత స్నేహితునిలా దేవుని గురించి తెలుసుకోమని సృష్టి చెప్పకనే చెప్తుంది, అయితే బైబిలు ఆ విషయాన్ని సూటిగా చెప్తుంది. అందులో “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు” అని ఉంది. (యాకోబు 4:8) “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని అపొస్తలుల కార్యాలు 17:27 చెబుతుంది.

దేవుని గురించి తెలుసుకోవడానికి సమయం తీసుకుంటూ ఉంటే “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది” అనే విషయంలో మీ నమ్మకం ఇంకా పెరుగుతుంది. (1 పేతురు 5:7) యెహోవా మీద అలాంటి నమ్మకాన్ని పెట్టుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి?

జపాన్‌కు చెందిన టొరూ ఉదాహరణ పరిశీలించండి. ఆయన ఒక క్రైస్తవ తల్లి పెంపకంలో పెరిగినప్పటికీ, ఆయన జపాన్‌కు చెందిన యకుజ అనే క్రూరమైన మాఫియా ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, “దేవుడు నన్ను ద్వేషించేవాడని నమ్మాను, నా చుట్టు ఉన్నవాళ్లు, ముఖ్యంగా నాకు చాలా దగ్గరి వాళ్లు చనిపోయినప్పుడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని అనుకునేవాడిని.” టొరూ ఇలా ఒప్పుకుంటున్నాడు, చుట్టూ ఉన్న చెడు వాతావరణం, నా మానసిక స్థితి నన్ను “హృదయం లేని వాడిగా, భావాలు లేని మనిషిగా” చేశాయి. ఆయనకున్న బలమైన కోరిక గురించి ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, “నాకన్నా బాగా పేరున్న వ్యక్తిని చంపి నేను చిన్న వయసులోనే చనిపోవాలని అనుకున్నాను. అలా పేరు సంపాదించుకోవాలని అనుకున్నాను.”

అయితే టొరూ, అతని భార్య హన్నా బైబిలును అధ్యయనం చేసిన తర్వాత టొరూ తన జీవితంలో, జీవితాన్ని అర్థం చేసుకునే తీరులో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాడు. “నా భర్త మారడాన్ని నేను నా కళ్లారా చూశాను” అని హన్నా చెప్తుంది. ఇప్పుడు, టొరూ నమ్మకంతో ఇలా చెప్తున్నాడు: “మనలో ప్రతి ఒక్కరి గురించి నిజంగా పట్టించుకునే దేవుడు ఉన్నాడు. ఆయనకు ఎవ్వరూ చనిపోవడం ఇష్టం లేదు, అలాగే చేసిన తప్పుల విషయంలో నిజంగా పశ్చాత్తాపం చూపిస్తున్న వాళ్లను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలను, ఎవ్వరూ అర్థం చేసుకోలేని విషయాలను ఆయన వింటాడు. త్వరలోనే యెహోవా అన్ని సమస్యల్ని, బాధల్ని, వేదనను తీసేస్తాడు. ఇప్పుడు కూడా మనం ఊహించని విధాలుగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనమీద శ్రద్ధ చూపిస్తాడు, మనం కృంగిపోయినప్పుడు మనకు ప్రేమతో సహాయం చేస్తాడు.”—కీర్తన 136:23.

దేవుడు ఏ బాధ లేకుండా చేయగలడు, ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేయగలడు. ఆయన త్వరలోనే అలా చేస్తాడు కూడా. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకు భవిష్యత్తుపై ఆశ కలుగుతుంది, ఇప్పుడు కూడా చక్కగా జీవించడానికి అది సహాయం చేస్తుంది. దీనికి టొరూ అనుభవం ఒక నిదర్శనం. అవును, బాధలతో నిండిపోయిన ఈ లోకంలో కూడా దేవుడు చూపించే ప్రేమపూర్వక శ్రద్ధ నుండి మనం ప్రయోజనం పొందవచ్చు.