కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీరు చాలా విలువైనవాళ్లు.”—మత్తయి 10:31

దేవుడు మిమ్మల్ని చూస్తాడా?

దేవుడు మిమ్మల్ని చూస్తాడా?

సృష్టి ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు

తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన బిడ్డకు మొదటి 60 నిమిషాలు చాలా కీలకమైనవి. పిల్లలు బయట వాతావరణానికి అలవాటు పడడానికి ఆ సమయం చాలా ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలతో ఈ సమయంలో బంధాన్ని ఏర్పర్చుకున్న తల్లులు వాళ్ల ఎదుగుదలకు, వికాసానికి చాలా ఎక్కువగా తోడ్పడతారు. *

ఒక తల్లి తనకు అప్పుడే పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకునేలా చేసేది ఏంటి? పొఫెసర్‌ జానెట్‌ క్రెన్‌షా, ద జర్నల్‌ ఆఫ్‌ పెరినాటల్‌ ఎడ్యుకేషన్‌లో వివరిస్తున్నట్లు ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల “ప్రసవం కాగానే తల్లి తన బిడ్డను ముట్టుకుంటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, పాలు ఇస్తున్నప్పుడు ఆమెలో మాతృ భావాలు పెరుగుతాయి.” ఈ సమయంలో విడుదల అయ్యే మరో హార్మోన్‌ “తల్లి తన బిడ్డకు ప్రతిస్పందించేలా చేస్తుంది,” ఇంకా బిడ్డతో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అది అంత బాగా ఎలా జరుగుతుంది?

తల్లి, శిశువు మధ్య ఉండే ఆ సన్నిహిత సంబంధాన్ని మన ప్రేమ గల సృష్టికర్తయైన యెహోవా దేవుడు * ఏర్పాటు చేశాడు. రాజైన దావీదు, తల్లి కడుపులోనుండి తనను బయటకు తెచ్చి, తల్లి ఒడిలో హాయిగా ఉండేలా చేసిన ఘనతను దేవునికే ఇచ్చాడు. ఆయన ఇలా ప్రార్థించాడు: “గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.”—కీర్తన 22:9, 10.

ఆలోచించండి: తల్లి తన బిడ్డను చూసుకునేలా, బిడ్డ అవసరాలకు స్పందించేలా శరీరంలో గొప్ప ఏర్పాటును దేవుడు చేశాడు. మనం ఆయన పిల్లలం కాబట్టి, మన గురించి కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటాడు అని నమ్మడంలో అర్థం ఉంది.—అపొస్తలుల కార్యాలు 17:29.

దేవుడు మనల్ని గమనిస్తూ శ్రద్ధ చూపిస్తున్నాడనే విషయం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

యేసుక్రీస్తుకు సృష్టికర్త గురించి అందరికన్నా బాగా తెలుసు, ఆయన ఇలా నేర్పించాడు: “తక్కువ విలువగల ఒక నాణేనికి రెండు పిచ్చుకలు వస్తాయి కదా? అయితే మీ తండ్రికి తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలమీద పడదు. మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి భయపడకండి; మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.”—మత్తయి 10:29-31.

మనలో ప్రతి చిన్న పక్షిని చూసి పట్టించుకునే వాళ్లు చాలా తక్కువ. ఇంకా అవి ఎప్పుడు నేల మీద పడుతున్నాయి అనేది అసలే పట్టించుకోము. కానీ మన పరలోక తండ్రి వాటిలో ప్రతి ఒక్కదాన్ని చూస్తాడు. చాలా పక్షుల్ని కలిపినా, వాటికన్నా మనిషి ఆయనకు చాలా విలువైనవాడు. కాబట్టి పాఠం ఏంటంటే: దేవుడు మిమ్మల్ని చూడడం లేదని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు మీ మీద చాలా శ్రద్ధ ఉంది.

దేవుడు మన క్షేమం విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నాడు, ఎంతో ప్రేమగా మనలను కాపాడతాడు

లేఖనాలు మనకు నమ్మకాన్ని ఇస్తున్నాయి

  • “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.”సామెతలు 15:3.

  • “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.”కీర్తన 34:15.

  • “నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను.”కీర్తన 31:7.

“యెహోవాకు నా మీద ప్రేమ లేదని అనుకున్నాను”

దేవుడు మన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు, ప్రేమతో మనల్ని చూసుకుంటాడు అని తెలుసుకోవడం మన జీవితంపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా చూపిస్తుంది అని ఇంగ్లండ్‌కు చెందిన హన్నా * వివరిస్తుంది:

“చాలా, చాలాసార్లు నేను, యెహోవాకు నా మీద ప్రేమ లేదని, నా ప్రార్థనలకు జవాబులు రావడం లేదని అనుకున్నాను. నాకు విశ్వాసం లేకపోవడం వల్లే అలా అవుతుందని అనుకున్నాను. నేను ముఖ్యమైనదాన్ని కాదు కాబట్టే నాకు శిక్ష పడుతుందని, లేదా నన్ను పట్టించుకోవడం లేదని అనుకున్నాను. దేవునికి నా గురించి అవసరం లేదని అనుకున్నాను.”

కానీ హన్నాకు ఇప్పుడు, యెహోవా శ్రద్ధ గురించి, ప్రేమ గురించి ఏ సందేహాలు లేవు. ఆమె అనుకున్న దానిలో మార్పు ఎలా వచ్చింది? “అది మెల్లమెల్లగా వచ్చిన మార్పు. నేను చాలా సంవత్సరాల క్రితం విన్న ఒక ప్రసంగం నాకు గుర్తుంది. అది యేసు విమోచన క్రయధనం గురించి. ఆ ప్రసంగం నామీద చాలా ప్రభావం చూపించింది. యెహోవా ప్రేమ గురించి నమ్మకంతో ఉండడానికి నాకు సహాయం చేసింది. ఇంకా నా ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు, ఎంతైనా యెహోవాకు నా మీద ప్రేమ ఉంది అని గ్రహించినప్పుడు, నేను ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతేకాదు బైబిలు చదవడం ద్వారా, మీటింగ్స్‌కి వెళ్లడం ద్వారా నేను యెహోవా గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన మనల్ని చూసే విధానం గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఇప్పుడు నేను స్పష్టంగా యెహోవా మద్దతును, మనందరి మీద ఆయనకున్న ప్రేమను, మనలో ప్రతి ఒక్కరిని చూసుకోవాలనే ఆయన కోరికను స్పష్టంగా చూడగలగుతున్నాను” అని ఆమె చెప్తుంది.

హన్నా చెప్తున్న విషయాలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. కానీ దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడని, మీ భావాలను గుర్తు పెట్టుకుంటాడని మీరు ఎలా నమ్మకంతో ఉండవచ్చు? తర్వాత ఆర్టికల్‌ దాని గురించి చెప్తుంది.

^ పేరా 3 ప్రసవం తర్వాత డిప్రెషన్‌తో బాధపడే తల్లులకు ఆ పుట్టిన బిడ్డతో బంధాన్ని ఏర్పర్చుకోవడం కష్టం అవుతుంది. కానీ అందుకు వాళ్లను వాళ్లు తప్పు పట్టుకోకూడదు. యు.యస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రకారం ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్‌ (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) “చాలావరకు శారీరక, మానసిక అంశాల సమ్మేళనంతో కలగవచ్చు . . . కానీ తల్లి ఏదైనా చేయడం లేక చేయకపోవడం వల్ల కలగదు.” ఈ విషయంలో ఎక్కువ సమాచారం కోసం, జూన్‌ 8, 2003 తేజరిల్లు! ప్రచురించిన “అండర్‌స్టాండింగ్‌ పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 5 బైబిల్లో దేవుని పేరు యెహోవా అని ఉంది.​—కీర్తన 83:18.

^ పేరా 15 ఈ ఆర్టికల్లో కొన్ని అసలు పేర్లు కావు.