కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

బైబిలు కాలాల్లో సంవత్సరాలు, నెలలు ఎప్పుడు మొదలయ్యేవో ప్రజలు ఎలా తెలుసుకునేవాళ్లు?

వాగ్దాన దేశంలో దున్నే పని, విత్తే పని మొదలుపెట్టడంతో ఇశ్రాయేలీయులకు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది. మన క్యాలెండర్‌ ప్రకారం అది సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో వస్తుంది.

అప్పట్లో ప్రజలు ఒక సంవత్సరాన్ని సూర్యుడి కదలికనుబట్టి, నెలల్ని చంద్రుడి కదలికనుబట్టి లెక్కపెట్టేవాళ్లు. అలా లెక్కపెట్టడం వల్ల, నెలకు దాదాపు 29 లేదా 30 రోజులు వచ్చేవి. అయితే సూర్యుడి కదలికనుబట్టి లెక్కపెట్టిన సంవత్సరంలో రోజుల కన్నా, చంద్రుడి కదలికనుబట్టి లెక్కపెట్టిన సంవత్సరంలో రోజులు తక్కువ ఉండేవి. ఈ తేడాను తగ్గించడానికి రెండు పద్ధతులు పాటించేవాళ్లు. ఒక పద్ధతి ఏంటంటే, నెలలన్నిటికి కొన్ని రోజుల్ని చేర్చడం. ఇంకో పద్ధతి ఏంటంటే, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక నెల చేర్చడం. (అంటే సంవత్సరానికి చివర్లో 13వ నెలను చేర్చడం.) ఈ విధంగా ఆ క్యాలెండర్‌లోని నెలలు లేదా రోజులు పంట నాటే సమయానికి, కోసే సమయానికి సరిగ్గా సరిపోయేవి.

మోషే కాలంలో, అబీబు (నీసాను) నెలను సంవత్సరంలో మొదటి నెలగా ఎంచాలని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. మన క్యాలెండర్‌లో అది మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో వస్తుంది. (నిర్గ. 12:2; 13:4) ఆ నెలలో ఇశ్రాయేలీయులు ఒక పండుగను చేసుకునేవాళ్లు. దానిలో భాగంగా బార్లీ పంటలోని ప్రథమ ఫలాల్ని యెహోవాకు అర్పించేవాళ్లు.—నిర్గ. 23:15, 16.

ఎమిల్‌ షూరర్‌ అనే విద్వాంసుడు తాను రాసిన పుస్తకంలో * ఇలా చెప్పాడు: ‘ఒక సంవత్సరంలో అదనపు నెలను చేర్చాలా వద్దా అని నిర్ణయించడం తేలిక. పస్కా పండుగని నీసాను నెల 14వ తేదిన పౌర్ణమి రోజు జరుపుకోవాలి. అయితే ఆ తేదీ వేసవికాలంలో రాత్రీపగలు సమానంగా ఉండే రోజు తర్వాతే రావాలి. ఒకవేళ అలాకాకుండా, రాత్రీపగలు సమానంగా ఉండే రోజుకు ముందే పస్కా తేదీ వస్తుందని యూదులు గమనిస్తే, నీసాను నెలకు ముందు అంటే అప్పటికే జరుగుతున్న పాత సంవత్సరానికి ఒక అదనపు నెలను (13వ నెలను) చేర్చాలని నిర్ణయిస్తారు.’

యెహోవాసాక్షులు ఈ పద్ధతిని ఉపయోగించే ప్రభువు రాత్రి భోజనం తేదీని నిర్ణయిస్తారు. ఆ తేదీ వేసవికాలంలో వస్తుంది. అలాగే హీబ్రూ క్యాలెండర్‌ ప్రకారం నీసాను 14వ తేదీకి అది సరిగ్గా సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటికీ ఆ తేదీని ముందే చెప్తారు. *

యూదులకు ఒక నెల ముగిసి, కొత్త నెల మొదలైందని ఎలా తెలిసేది? ఈ రోజుల్లో అయితే మనం క్యాలెండర్‌ని లేదా ఫోన్‌ని చూసి తేదీని తెలుసుకుంటాం. కానీ బైబిలు కాలాల్లో అది అంత తేలికకాదు.

నోవహు కాలంలో, నెలకు 30 రోజులు ఉంటాయని ప్రజలు అనేవాళ్లు. (ఆది. 7:11, 24; 8:3, 4) కానీ ఆ తర్వాత కాలంలో, యూదులు నెలకు ఖచ్చితంగా 30 రోజులే ఉంటాయని చెప్పేవాళ్లు కాదు. ఎందుకంటే వాళ్ల క్యాలెండర్‌ ప్రకారం అమావాస్య రోజు కొత్త నెల ప్రారంభమౌతుంది. అంటే ముందటి నెల మొదలైన 29 లేదా 30 రోజుల తర్వాత అమావాస్య కనిపిస్తే కొత్త నెల మొదలయ్యేది.

ఒక సందర్భంలో దావీదు, యోనాతాను ఒక కొత్త నెల గురించి మాట్లాడుతూ “రేపు అమావాస్య” అని అన్నారు. (1 సమూ. 20:5, 18) దీన్నిబట్టి వాళ్ల కాలంలో నెలల్ని ముందే లెక్కపెట్టేవాళ్లని అర్థమౌతుంది. కానీ యూదులకు ఒక నెల ప్రారంభమైందని ఎలా తెలిసేది? యూదుల నియమాలు, ఆచారాలు ఉన్న మిష్నా అనే పుస్తకంలో దీనిగురించి కొంత సమాచారం ఉంది. యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చాక మహాసభ (యూదుల హైకోర్టు) ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునేదని అందులో ఉంది. మహాసభ సభ్యులు నెలలో 30వ రోజున కలిసేవాళ్లు. అలా వాళ్లు సంవత్సరానికి ఏడు నెలలు కలిసేవాళ్లు. కొత్త నెల ఎప్పుడు ప్రారంభమౌతుందో వీళ్లు నిర్ణయించేవాళ్లు. వాళ్లు దేని ఆధారంగా లెక్కపెట్టేవాళ్లు?

యెరూషలేము చుట్టూ కొండలమీద కాపలాకాసే మనుషులు అమావాస్య కోసం చూసేవాళ్లు. ఒకవేళ ఆ రోజు అమావాస్య అయితే వాళ్లు వెంటనే మహాసభకు కబురు పంపేవాళ్లు. ఆ వార్తను బట్టి మహాసభ సభ్యులు కొత్త నెల ప్రారంభమైందని ప్రకటన చేసేవాళ్లు. ఒకవేళ మేఘాల వల్లో లేదా మంచు వల్లో కాపలాకాసే వాళ్లకు అమావాస్య కనిపించకపోతే ఏం చేసేవాళ్లు? అప్పుడు మహాసభలోని సభ్యులు జరుగుతున్న నెలకు 30 రోజులు ఉంటాయని, ఆ తర్వాత రోజు నుండి కొత్త నెల మొదలౌతుందని ప్రకటించేవాళ్లు.

మహాసభ తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసేలా, యెరూషలేముకు దగ్గర్లో ఉన్న ఒలీవల కొండమీద మంటను వెలిగించేవాళ్లని మిష్నా చెప్తుంది. అలాగే ఇశ్రాయేలు దేశమంతటా ఉన్న ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు ఈ వార్తని అందించడానికి వేర్వేరు కొండలమీద మంటల్ని వెలిగించేవాళ్లు. ఆ తర్వాతి కాలాల్లో, సందేశాన్ని చేరవేయడానికి మనుషుల్ని పంపించేవాళ్లు. ఆ విధంగా యెరూషలేములో, ఇశ్రాయేలులో అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న యూదులకు కొత్త నెల మొదలైందని తెలిసేది. దానివల్ల అందరూ ఒకే సమయంలో పండుగలు జరుపుకునేవాళ్లు.

ఇశ్రాయేలీయుల కాలంలో ప్రజలు ఏ నెలలో, ఏ పండుగ చేసుకునేవాళ్లో అలాగే అప్పుడు వాతావరణం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఈ కింది చార్టు సహాయం చేస్తుంది.

^ ద హిస్టరీ ఆఫ్‌ ది జ్యూయిష్‌ పీపుల్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ జీసస్‌ క్రైస్ట్‌ (క్రీ.పూ. 175-క్రీ.శ. 135).

^ 1991 ఫిబ్రవరి 1, కావలికోటలో 24-25 పేజీలు అలాగే 1977 జూన్‌ 15, కావలికోటలోని (ఇంగ్లీష్‌) “పాఠకుల ప్రశ్న” చూడండి.