కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

యేసులాగే కొయ్యకు వేలాడదీసిన వాళ్ల శరీరాల్ని రోమన్లు పాతిపెట్టడానికి అనుమతించేవాళ్లా?

ఇద్దరు దొంగల మధ్య యేసును కొయ్యకు వేలాడదీసి, చంపారని చాలామందికి తెలుసు. (మత్త. 27:35-38) కానీ ఆ తర్వాత ఆయన శరీరాన్ని సిద్ధంచేసి, సమాధి చేయడం గురించి బైబిలు చెప్తున్నది నిజం కాదని కొంతమంది అంటారు.—మార్కు 15:42-46.

అయితే అలా కొయ్యకు వేలాడదీసి చంపినవాళ్లను యూదుల ఆచార ప్రకారం సమాధి చేసేవాళ్లు కాదని కొంతమంది పండితులు అంటారు. బదులుగా అలాంటివాళ్ల విషయంలో మరోలా చేసేవాళ్లని వాళ్లంటారు. వాళ్లు అలా ఎందుకు అంటున్నారో వివరిస్తూ ఏరీయల్‌​ సబర్‌ అనే జర్నలిస్ట్‌​ స్మిత్సోనీయన్‌​ అనే పత్రికలో ఇలా రాశాడు: “సమాజంలో దారుణమైన నేరాలు చేసిన వాళ్లనే కొయ్యకు వేలాడదీసేవాళ్లు. కాబట్టి అలాంటివాళ్లకు తగిన గౌరవాన్నిస్తూ రోమన్లు సమాధి చేస్తారని అనుకోవడం అమాయకత్వమని కొంతమంది పండితులు చెప్పారు.” రోమన్లు మరణశిక్ష విధించబడిన నేరస్తులను ఘోరంగా అవమానించాలనే ఉద్దేశంతో, వాళ్ల శవాల్ని క్రూర జంతువులు తినడానికి కొయ్య మీదే వదిలేసేవాళ్లు. ఆ తర్వాత, ఆ శవంలో ఇంకా ఏమైనా మిగిలివుంటే ఆ భాగాల్ని వేరే శవాలున్న సమాధిలో పడేసేవాళ్లు.

అయితే రోమన్లు నేరస్తులందరితో ఇలాగే చేసేవాళ్లా? మరణశిక్ష విధించబడిన కొంతమంది యూదుల విషయంలో అలా జరగలేదని పురాతన వస్తువులను తవ్వి పరిశీలించేవాళ్లు తెలుసుకున్నారు. వాళ్లకు 1968 లో, దాదాపు యేసు కాలంలో జీవించిన యెహోఖనెన్‌​ అనే వ్యక్తి ఎముకలు దొరికాయి. అవి యెరూషలేముకు దగ్గర్లో ఒక మామూలు యూదా కుటుంబానికి చెందిన సమాధిలో కనిపించాయి. అందులో ఉన్న ఒక శవపేటికలో మడిమె ఎముక కూడా ఉంది. అది 11.5 సెంటీమీటర్లు (4.5 అంగుళాలు) పొడవున్న ఇనుప మేకుతో ఒక చెక్కకు దిగగొట్టబడి ఉంది. దాని గురించి సబర్‌​ ఇలా రాశాడు: “యేసు సమాధి చేయబడ్డాడా లేదా అని చాలా సంవత్సరాలుగా పండితులు వాదించుకున్నారు. అయితే యెహోఖనెన్‌ మడిమె ఎముక దొరకడాన్ని బట్టి, యేసును సమాధి చేయడం గురించి బైబిలు చెప్తుంది నిజమే అని రుజువౌతుంది. అంతేకాదు యేసు కాలంలో కొయ్యకు వేలాడదీయబడిన కొంతమందిని రోమన్లు యూదుల ఆచార ప్రకారం సమాధి చేయనిచ్చారని అర్థమౌతుంది.”

అయితే యెహోఖనెన్‌ మడిమె ఎముక ఆధారంగా యేసును కొయ్యమీద ఏ విధంగా వేలాడదీశారో మనం చెప్పలేం. ఈ విషయంలో చాలామందికి ఇప్పటికీ వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మరణశిక్ష విధించబడిన నేరస్తులందరి శవాల్ని రోమన్లు ఊరికే అలా పడేయలేదు కానీ, కొంతమందిని సమాధి చేయనిచ్చారని మాత్రం స్పష్టమౌతుంది. కాబట్టి యేసు శరీరాన్ని సమాధి చేయడం గురించి బైబిలు చెప్తుంది నిజమని, దానికి రుజువులు కూడా ఉన్నాయని అర్థమౌతుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా యేసు ధనవంతుల దగ్గర సమాధి చేయబడతాడని యెహోవా ముందే చెప్పాడు. కాబట్టి యెహోవా మాట నెరవేరకుండా ఎవ్వరూ ఆపలేరు.—యెష. 53:9; 55:11.