కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు పుట్టినరోజు ఎందుకు చేసుకోరు?

యెహోవాసాక్షులు పుట్టినరోజు ఎందుకు చేసుకోరు?

 యెహోవాసాక్షులం పుట్టినరోజు చేసుకోం, ఎందుకంటే అలాంటి ఆచారాల్ని దేవుడు ఇష్టపడడని మా నమ్మకం. పుట్టినరోజు చేసుకోకూడదని బైబిలు సూటిగా చెప్పట్లేదు. కానీ ఆ ఆచారం గురించి సరైన అభిప్రాయానికి రావడానికి, దేవుని అభిప్రాయమేమిటో అర్థం చేసుకోవడానికి బైబిల్లోని విషయాలు సహాయం చేస్తాయి. పుట్టినరోజుల గురించిన ఈ నాలుగు విషయాల్ని, దానికి సంబంధించిన బైబిలు సూత్రాల్ని పరిశీలించండి.

  1.   పుట్టినరోజు చేసుకోవడం అన్యమత ఆచారం నుండి పుట్టుకొచ్చింది. ఓ వ్యక్తి పుట్టినరోజున, “అపవిత్ర ఆత్మలు లేదా వాటి ప్రభావం ఆ వ్యక్తిపై దాడి చేసే అవకాశం ఉంటుంది” కాబట్టి “అతని స్నేహితులు అతని దగ్గర ఉండడం, శుభాకాంక్షలు చెప్పడం అతనికి రక్షణగా ఉంటుంది” అనే నమ్మకం నుండి పుట్టినరోజు చేసుకోవడం అనే ఆచారం వచ్చిందని ఫంక్‌ & వాగ్నల్స్‌ స్టాండర్డ్‌ డిక్షనరీ ఆఫ్‌ ఫోక్లోర్‌, మైథాలజీ అండ్‌ లెజండ్‌ చెప్తుంది. ద లోర్‌ ఆఫ్‌ బర్త్‌డేస్‌ అనే పుస్తకం ఏం చెప్తుందంటే, ప్రాచీనకాలంలో “అంతుపట్టని జ్యోతిష్యశాస్త్రం” ఆధారంగా “రాశిచక్రాన్ని తయారుచేయడానికి” పుట్టినరోజు వివరాలు చాలా అవసరమయ్యవి. అంతేకాదు “కొన్ని ఆచారాల ప్రకారం, పుట్టినరోజు వేడుకల్లో వెలిగించే కొవ్వొత్తులకు కోరికలు తీర్చే ప్రత్యేక శక్తులు ఉండేవి” అని నమ్మేవాళ్లని కూడా ఆ పుస్తకం చెప్తుంది.

     అయితే బైబిలు మాత్రం మ్యాజిక్‌, శకునాలు చూడడం, మంత్రతంత్రాలు లేదా అలాంటి వేటికైనా దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది. (ద్వితీయోపదేశకాండం 18:14; గలతీయులు 5:19-21) నిజానికి, దేవుడు ప్రాచీన పట్టణమైన బబులోనును నాశనం చేయడానికిగల ఓ కారణమేమిటంటే, అక్కడి ప్రజలు జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు. అది శకునాలు చూడడంలో భాగమే. (యెషయా 47:11-15) అలాగని యెహోవాసాక్షులం ప్రతీ ఆచార మూలాల గురించి ఆలోచిస్తూ కూర్చోం. కానీ లేఖనాలు ఏవైనా సూచనలు ఇస్తే మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయం.

  2.   తొలి క్రైస్తవులు పుట్టినరోజుల్ని చేసుకోలేదు. “పుట్టినరోజు చేసుకోవడాన్ని వాళ్లు అన్యమత ఆచారంగా చూసేవాళ్లు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది. యేసు చేత నేరుగా బోధించబడిన అపొస్తలులు అలాగే మరితరులు క్రైస్తవులకు మంచి ఆదర్శాన్ని ఉంచారని బైబిలు చూపిస్తుంది.—2 థెస్సలొనీకయులు 3:6.

  3.   జన్మదినం కాదుగానీ యేసు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే ఆజ్ఞ క్రైస్తవులకు ఇవ్వబడింది. (లూకా 22:17-20) ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఎందుకంటే, “పుట్టిన రోజు కన్నా చనిపోయే రోజు మేలు” అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 7:1) యేసు తన భూజీవితాన్ని ముగించేలోపు, ఆయన దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. అలా యేసు పుట్టిన రోజు కన్నా చనిపోయిన రోజే మరింత ముఖ్యమైన రోజుగా మారింది.—హెబ్రీయులు 1:4.

  4.   సేవకులెవ్వరూ పుట్టినరోజు చేసుకున్నట్లు బైబిల్లో లేదు. అయితే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్లో ఉంది, కానీ వాళ్లు దేవుని సేవకులు కాదు. పైగా ఆ రెండు పుట్టినరోజు వేడుకల్లో చెడు చోటుచేసుకుంది.—ఆదికాండం 40:20-22; మార్కు 6:21-29.

పుట్టినరోజు చేసుకోనందుకు సాక్షుల పిల్లలు బాధపడుతున్నారా?

 అందరి మంచి తల్లిదండ్రుల్లానే, యెహోవాసాక్షులు కూడా తమ పిల్లలపై వాళ్లకున్న ప్రేమను సంవత్సరమంతా చూపిస్తారు. అంతేకాదు తమ పిల్లలకు గిఫ్టులు ఇస్తారు, సరదాగా అందరూ కలిసి పార్టీలు చేసుకుంటారు. తన పిల్లలకు మంచివాటిని ఇచ్చే దేవుణ్ణి అనుకరించడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. (మత్తయి 7:11) పుట్టినరోజు చేసుకోనందుకు యెహోవాసాక్షుల పిల్లలు బాధపడడంలేదని వాళ్లు చెప్తున్న ఈ మాట్లలోనే తెలుస్తుంది:

  •   “మీరు ఊహించని సమయంలో ఓ గిఫ్ట్‌ అందుకోవడం చాలా సరదాగా ఉంటుంది.”—టామీ, వయసు 12.

  •   “నా పుట్టినరోజున నాకు ఏ గిఫ్టులు రాకపోయినా, వేరే సందర్భాల్లో మా మమ్మీడాడీ నాకు గిఫ్టులు ఇస్తుంటారు. నాకు అలానే ఇష్టం, ఎందుకంటే అలా గిఫ్టులు తీసుకోవడం చాలా సర్‌ప్రైజింగా ఉంటుంది.”—గ్రిగరీ, వయసు 11.

  •   “ఆ పది నిమిషాలు, కొన్ని కేకులు, ఓ పాట ఉంటే అది పార్టీ అనుకుంటున్నారా? మా ఇంటికి వస్తే అసలు పార్టీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది.”—ఎరిక్‌, వయసు 6.