కంటెంట్‌కు వెళ్లు

యేసు ఎప్పుడు పుట్టాడు?

యేసు ఎప్పుడు పుట్టాడు?

బైబిలు ఇచ్చే జవాబు

 యేసు ఫలానా తేదీన పుట్టాడని బైబిలు ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఈ కిందున్న రెఫరెన్సులను పరిశీలించండి:

  •   “యేసు ఖచ్చితంగా ఏ తేదీన పుట్టాడో ఎవ్వరికీ తెలియదు.”—న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా.

  •   “యేసు ఖచ్ఛితంగా ఏ తేదీన పుట్టాడో తెలీదు.”—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఎర్లీ క్రిస్టియానిటీ.

 ‘యేసు ఎప్పుడు పుట్టాడు?’ అనే ప్రశ్నకు బైబిలు సూటిగా సమాధానం చెప్పకపోయినా, ఆయన పుట్టినప్పుడు జరిగిన రెండు సంఘటనల గురించి అది వివరిస్తుంది. వాటి ఆధారంగా, ఆయన డిసెంబరు 25న పుట్టలేదనే నిర్ధారణకు చాలామంది రాగలిగారు.

చలికాలంలో కాదు

  1.   వివరాలు నమోదు చేయించుకోవడం. యేసు పుట్టడానికి కొంచెం ముందు కైసరు ఔగుస్తు “సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని” ఆజ్ఞ జారీ చేశాడు. అందుకోసం అందరూ “తమతమ పట్టణములకు” ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చింది. (లూకా 2:1-3) పన్నులు విధించడానికి, సైన్యంలో చేర్చుకోవడానికి అవసరమైన సమాచారం కోసం కైసరు బహుశా ఆ ఆజ్ఞను జారీ చేసి ఉంటాడు. కానీ అలా ప్రయాణం చేసి వివరాలు నమోదు చేయించుకోవడం ప్రజలకు చాలా కష్టమైన పని. తీవ్రమైన చలికాలంలో అంతంత దూరం ప్రయాణం చేయమని ఔగుస్తు ప్రజలను బలవంతం చేయడమంటే వాళ్లకు కోపం రేపడమే అవుతుంది. కాబట్టి ఔగుస్తు అలాంటి పొరపాటు చేయడు.

  2.   గొర్రెలు. ‘గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు.’ (లూకా 2:8) గొర్రెల మందలు “పస్కాకు ఒక వారం ముందు [మార్చి చివర]” నుండి నవంబరు నెల మధ్య వరకు ఆరుబయట ఉండేవని డైలీ లైఫ్‌ ఇన్‌ ద టైమ్‌ ఆఫ్‌ జీసస్‌ అనే పుస్తకం చెప్తుంది. దాంట్లో ఇంకా ఇలా ఉంది, “చలికాలంలో గొర్రెలను పాకలో ఉంచేవాళ్లు; అయితే యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు పొలములో తమ మందలను కాచుకుంటున్నారని బైబిలు చెప్తుంది. కాబట్టి యేసు పుట్టినరోజుగా జరుపుకునే క్రిస్మస్‌ చలికాలంలో రాదని మనం చెప్పవచ్చు.”

శరదృతువు తొలిభాగంలో పుట్టాడు

 సా.శ. 33 వసంత ఋతువులో, నీసాను నెల 14 పస్కా పండుగ రోజున యేసు చనిపోయాడు. ఆయన చనిపోయిన రోజు నుండి వెనక్కి లెక్కేయడం ద్వారా యేసు ఎప్పుడు పుట్టి ఉంటాడో మనం అంచనా వేయవచ్చు. (యోహాను 19:14-16) యేసు తన మూడున్నర సంవత్సరాల పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయనకు 30 ఏళ్లు. కాబట్టి ఆయన సా.శ.పూ. 2వ శతాబ్దం శరదృతువు తొలిభాగంలో పుట్టాడని మనకు అర్థమౌతుంది.—లూకా 3:23.

క్రిస్టమస్‌ను డిసెంబరు 25న ఎందుకు జరుపుకుంటున్నారు?

 యేసుక్రీస్తు డిసెంబరు 25న పుట్టాడనడానికి ఏ రుజువూ లేనప్పుడు మరి ఆ రోజున క్రిస్మస్‌ ఎందుకు జరుపుకుంటున్నారు? బహుశా చర్చి నాయకులు “అన్యజనులైన రోమన్లు, శీతాకాలపు పండుగగా జరుపుకునే ‘అజేయుడైన సూర్యుని పుట్టిన రోజుతో’ ” ఈ తేదీ కలవాలని ఉద్దేశించి ఆ రోజును ఎంపిక చేసుకొని ఉంటారని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. అలాగే ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ప్రకారం, “క్రైస్తవులుగా మారే అన్యులకు క్రైస్తవత్వం మరింత అర్థవంతంగా కనిపించేలా చేయడానికి” అలా చేసి ఉంటారని చాలామంది మేధావులు నమ్ముతున్నారు.