కంటెంట్‌కు వెళ్లు

ఒక ఆధ్యాత్మిక మైలురాయి!

పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం విడుదలైంది

ఒక ఆధ్యాత్మిక మైలురాయి!

2019 అక్టోబరు 25న మనం ఒక ఆధ్యాత్మిక మైలురాయిని చేరుకున్నాం: పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం తెలుగులో విడుదలైంది.

కొత్త లోక అనువాదం ప్రత్యేకత ఏంటంటే, అది దేవుని ప్రేరేపిత సందేశాన్ని ఉన్నదున్నట్లుగా, ఖచ్చితంగా తెలియజేస్తుంది. (2 తిమోతి 3:16) ఆధునిక బైబిలు అనువాదాల్లో కనిపించే ఎలాంటి లోటుపాట్లను ఇది అధిగమించింది? ఈ కొత్త అనువాదం వెనక ఉన్నది ఎవరు? కొత్త లోక అనువాదం నమ్మదగినది అని ఎలా చెప్పవచ్చు?

నా బైబిలు ఖచ్చితమైనదేనా?

“సంవత్సరం మొత్తంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకం బైబిలే, ప్రతీ సంవత్సరం ఇదే జరుగుతుంది” అని అంతర్జాతీయ వ్యాపారవేత్త ప్రొఫెసర్‌ డిక్లాన్‌ హేస్‌ రాశాడు. విచారకరంగా, బైబిలు అనువాదాలన్నీ ఖచ్చితత్వాన్ని పాటించట్లేదు. ఉదాహరణకు ఒక బైబిలు అనువాదంలో, తమ ప్రచురణకర్తలకు “ఆసక్తిగా అనిపించని” భాగాల్ని తీసేశారు. మరో బైబిలు అనువాదం, కొంతమంది ఆధునిక కాల పాఠకులకు నచ్చని పదాల్ని లేదా మాటల్ని మార్చేసింది. ఉదాహరణకు, కొంతమంది పాఠకుల్ని ఆకట్టుకోవడం కోసం ఆ బైబిల్లో, దేవుణ్ణి “తల్లి-తండ్రి” అని సంబోధించారు.

బహుశా బైబిలు అనువాదాల్లో జరుగుతున్న అన్నిటికన్నా పెద్ద పొరపాటు, యెహోవా అనే దేవుని వ్యక్తిగత పేరుకు సంబంధించినది. (కొంతమంది విద్వాంసులు దేవుని పేరును “యావే” అని అనువదించారు.) ప్రాచీన బైబిలు ప్రతుల్లో దేవుని పేరును నాలుగు హీబ్రూ హల్లులతో రాశారు. వాటిని ఇంగ్లీషులో YHWH లేదా JHVH అని అనువదించవచ్చు. ఈ ప్రత్యేకమైన పేరు ఒక్క హీబ్రూ లేఖనాల్లోనే * దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. (నిర్గమకాండం 3:15; కీర్తన 83:18) అవును, తన ఆరాధకులు ఆ పేరు తెలుసుకొని దాన్ని ఉపయోగించాలని మన సృష్టికర్త కోరుకుంటున్నాడు!

అయితే, కొన్ని వందల సంవత్సరాల క్రితం యూదులు మూఢనమ్మకాల వల్ల, భయాల వల్ల దేవుని పేరును ఉపయోగించడం మానేశారు. తర్వాత, అలాంటి మూఢనమ్మకాలు క్రైస్తవుల్లో కూడా వ్యాపించాయి. (అపొస్తలుల కార్యాలు 20:29, 30; 1 తిమోతి 4:1) నేడు, చాలావరకు బైబిలు అనువాదకులు దేవుని పేరు తీసేసి “ప్రభువు” అనే బిరుదును ఉపయోగిస్తున్నారు. కొన్ని ఆధునిక ఇంగ్లీషు బైబిళ్లైతే యోహాను 17:6 లో “పేరు” అనే పదాన్ని కూడా తీసేశాయి. ఆ వచనంలో యేసు, “నీ పేరు వెల్లడిచేశాను” అన్నాడు. గుడ్‌ న్యూస్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు ఈ వచనంలో పేరు అనే పదాన్ని తీసేసి, “నిన్ను తెలియజేశాను” అని అనువదించింది.

కొంతమంది విద్వాంసులు తాము అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నామని, అందుకే దేవుని పేరుకు బదులు “ప్రభువు” అనే బిరుదును ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది తమ అమ్మకాలు పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒప్పుకుంటున్నారు. * అయితే దేవుణ్ణి అగౌరవపర్చే ఆచారాల్ని యేసు ఖండించాడు. (మత్తయి 15:6) పేరుకు బదులు బిరుదును ఉపయోగించడానికి లేఖనాల్లో ఎలాంటి ఆధారమూ లేదు. యేసుక్రీస్తుకు “దేవుని వాక్యం,” “రాజులకు రాజు” లాంటి ఎన్నో బిరుదులు ఉన్నాయి. (ప్రకటన 19:11-16) అందుకని యేసు పేరుకు బదులు వీటిలో ఏదోక బిరుదును ఉపయోగించడం సరైనదేనా?

ఇక్కడ విషయం చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్లో నుండి దేవుని పేరును తీసేయడం గురించి భారత దేశానికి చెందిన ఒక బైబిలు అనువాద సలహాదారుడు ఇలా అన్నాడు: “దేవునికున్న బిరుదు విషయంలో హిందువులకు ఆసక్తి ఉండదు; వాళ్లు దేవుని వ్యక్తిగత పేరు తెలుసుకోవాలనుకుంటారు. పేరు తెలీకుండా ఆ పేరు కలిగివున్న వ్యక్తికి వాళ్లు దగ్గరవ్వలేరు.” అవును, దేవుణ్ణి తెలుసుకోవాలనుకునే వాళ్లందరి విషయంలో అది నిజం. దేవుణ్ణి వ్యక్తిత్వం లేని ఒక శక్తిలా కాకుండా మనం దగ్గరవ్వగల ఒక నిజమైన వ్యక్తిలా తెలుసుకోవాలంటే, ఆయన పేరు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. (నిర్గమకాండం 34:6, 7) అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” (రోమీయులు 10:13) దేవుణ్ణి ఆరాధించేవాళ్లు ఆయన పేరును తప్పకుండా ఉపయోగించాలి!

దేవుణ్ణి గౌరవించే ఒక అనువాదం

కొత్త లోక అనువాదం దేవుని పేరైన యెహోవాను ఉపయోగిస్తుంది

1950 లో క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం మొదటిసారి ఇంగ్లీషులో ప్రచురించబడింది. ఆ సంఘటన ఒక మైలురాయిగా నిలిచింది. తర్వాతి పది సంవత్సరాల్లో హీబ్రూ లేఖనాలు చిన్నచిన్న భాగాలుగా ప్రచురించబడ్డాయి. 1961 లో మొత్తం బైబిలు ఇంగ్లీషులో ఒకే సంపుటిగా విడుదలైంది. ముఖ్యంగా, ఈ కొత్త లోక అనువాదం, పాత నిబంధనలో దాదాపు 7,000 సార్లు ఉన్న “యెహోవా” అనే దేవుని పేరును ఎక్కడా తీసేయకుండా అనువదించింది. ఇక క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో * ఆ పేరును 237 సార్లు తిరిగి చేర్చడం నిజంగా గొప్ప విషయం.

దేవుని పేరును తిరిగి చేర్చడం వల్ల ఆయన్ని గౌరవించినట్లు అవుతుంది, అలాగే ఆయన గురించి మనం ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, చాలా బైబిళ్లు మత్తయి 22:44 ను “ప్రభువు నా ప్రభువుతో చెప్పెను” అని అనువదించాయి. కానీ ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? కొత్త లోకం అనువాదం కీర్తన 110:1 నుండి తీసుకున్న మత్తయి 22:44 ను, “యెహోవా నా ప్రభువుతో ఇలా చెప్పాడు” అని సరిగ్గా అనువదించింది. కాబట్టి పాఠకులు యెహోవా దేవునికి, ఆయన కుమారునికి మధ్యున్న ముఖ్యమైన తేడాను గుర్తించగలుగుతారు.

ఈ అనువాదం వెనక ఉన్నది ఎవరు?

యెహోవాసాక్షులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అనే చట్టపరమైన సంస్థ, కొత్త లోక అనువాదం బైబిల్ని ప్రచురించింది. వంద కన్నా ఎక్కువ సంవత్సరాలుగా, యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా బైబిళ్లను ముద్రించి, పంచిపెడుతున్నారు. న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీగా ఏర్పడ్డ ఒక యెహోవాసాక్షుల గుంపు ఈ కొత్త లోక అనువాదం బైబిల్ని తయారు చేసింది. ఈ కమిటీ సభ్యులు, వ్యక్తిగతంగా గొప్ప పేరు సంపాదించుకోవాలని అనుకునే బదులు, తాము చనిపోయిన తర్వాత కూడా తమ పేర్లు ఎవ్వరికీ తెలియనివ్వద్దని కోరారు.—1 కొరింథీయులు 10:31.

దీనికి కొత్త లోక అనువాదం అనే పేరు ఎందుకు పెట్టారు? 1950 ఎడిషన్‌లోని ముందుమాటలో చెప్పినట్లు, మానవజాతి 2 పేతురు 3:13 లో వాగ్దానం చేసిన “కొత్తలోకానికి చేరువలో ఉందనే” గట్టి నిశ్చయాన్ని ఈ పేరు సూచిస్తుంది. “పాత లోకం నీతి ఉండే కొత్తలోకంగా మారే ఈ సమయంలో,” బైబిలు అనువాదాలు “దేవుని వాక్యంలోని అసలు సత్యం” మీద వెలుగు ప్రసరింపజేయడం చాలా ప్రాముఖ్యమని న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ రాసింది.

ఒక ఖచ్చితమైన అనువాదం

ఖచ్చితత్వానికి ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. ఇంగ్లీషు ఎడిషన్‌ని తయారు చేసిన అనువాదకులు నేరుగా ప్రాచీన హీబ్రూ, అరామిక్‌, గ్రీకు భాషల్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రతుల్ని ఉపయోగించుకుని అనువదించారు. వాళ్లు ప్రాచీన ప్రతుల్లో ఉన్న సమాచారాన్ని సాధ్యమైనంత ఖచ్చితంగా అనువదించడానికి, అలాగే ఆధునిక కాల పాఠకులకు చదవగానే అర్థమయ్యే భాషలో అనువదించడానికి ఎంతో కృషి చేశారు.

ఉన్నదున్నట్లుగా, ఖచ్చితంగా అనువదించినందుకు కొంతమంది విద్వాంసులు కొత్త లోక అనువాదం బైబిల్ని మెచ్చుకున్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇజ్రాయిల్‌లో హీబ్రూ విద్వాంసుడైన ప్రొఫెసర్‌ బెంజమిన్‌ కెదార్‌-కోఫ్‌స్టీన్‌ 1989 లో ఇలా చెప్పాడు: “నేను హీబ్రూ బైబిలుకు, దాని అనువాదాలకు సంబంధించిన భాషను పరిశోధించేటప్పుడు కొత్త లోక అనువాదం అని పిలవబడే ఇంగ్లీషు ఎడిషన్‌ని ఎక్కువగా చూస్తుంటాను. అలా చేసేటప్పుడు, సమాచారాన్ని వీలైనంత ఖచ్చితంగా అర్థం చేసుకునేలా అనువదించడానికి వీళ్లు నిజాయితీగా కృషి చేశారని నాకు పదేపదే అనిపిస్తుంది.”

ఎన్నో భాషల్లో బైబిల్ని అందుబాటులోకి తేవడం

తర్వాత, యెహోవాసాక్షులు ఇంగ్లీషులోనే కాకుండా వేరే భాషల్లో కూడా కొత్త లోక అనువాదం బైబిల్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం అది పూర్తిగా లేక భాగాలుగా 182 భాషల్లో ప్రచురించబడుతుంది. అందుకోసం, బైబిలు పదాల్ని కంప్యూటర్‌ టెక్నాలజీ సహాయంతో అధ్యయనం చేసి అనువదించే పద్ధతిని రూపొందించారు. అనువాదకులకు సహాయం చేయడానికి ట్రాన్స్‌లేషన్‌ సర్వీసెస్‌ అనే విభాగం స్థాపించబడింది. యెహోవాసాక్షుల పరిపాలక సభ, రైటింగ్‌ కమిటీ ద్వారా బైబిలు అనువాద పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది. ఇంతకీ ఈ పని ఎలా జరుగుతుంది?

ముందుగా, సమర్పించుకున్న కొంతమంది క్రైస్తవుల్ని అనువాదకుల బృందంగా నియమిస్తారు. అనువాదకులు ఒంటరిగా కాకుండా ఒక బృందంగా కలిసి పని చేసినప్పుడు అనువాదం ఇంకా మెరుగ్గా, అర్థవంతంగా ఉంటుందని అనుభవాలు చూపిస్తున్నాయి. (సామెతలు 11:14) సాధారణంగా, ఆ బృందంలోని ప్రతీ ఒక్కరికి యెహోవాసాక్షుల ప్రచురణల్ని అనువదించిన అనుభవం ఉంటుంది. అంతేకాదు, బైబిల్ని అనువదించడానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాల విషయంలో, ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ని ఉపయోగించే విషయంలో వాళ్లకు మంచి శిక్షణ ఇస్తారు.

ఖచ్చితంగా ఉండేలా, అలాగే సామాన్య ప్రజలకు కూడా తేలిగ్గా అర్థమయ్యేలా బైబిల్ని అనువదించమని అనువాద బృందాలకు నిర్దేశం ఇస్తారు. వాళ్లు సాధ్యమైన చోట ఉన్నదున్నట్లు అనువదించాలి, అదే సమయంలో దాని అసలు భావం ఏమాత్రం మారకుండా జాగ్రత్తపడాలి. అదెలా చేశారు? కొత్తగా విడుదలైన బైబిల్ని ఒకసారి పరిశీలించండి. ముందుగా, ఇంగ్లీషు కొత్త లోక అనువాదంలో ఉపయోగించిన ముఖ్యమైన బైబిలు పదాలన్నిటికీ సరిగ్గా సరిపోయే తెలుగు పదాలను అనువాదకులు ఎంచుకున్నారు. వాచ్‌టవర్‌ ట్రాన్స్‌లేషన్‌ సిస్టమ్‌ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌, ఒక పదంతో సంబంధం ఉన్న బైబిలు పదాలను, పర్యాయపదాలను చూపించింది. ఇంగ్లీషు బైబిల్లోని పదాలను, గ్రీకు లేదా హీబ్రూ మూల భాషల్లోని ఏ పదాల నుండి తీసుకున్నారో వాటిని కూడా ఆ ప్రోగ్రామ్‌ చూపించింది. దానివల్ల, అనువాదకులు ఆ గ్రీకు లేదా హీబ్రూ పదాలను వేర్వేరుచోట్ల ఇంగ్లీషులో ఎలా అనువదించారో అర్థం చేసుకోగలిగారు. ఆ పదాల విషయంలో బృందమంతా ఒక అభిప్రాయానికి వచ్చాక, బైబిల్ని అనువదించడం మొదలుపెట్టారు. ఇంగ్లీషు పదాలకు సరిగ్గా సరిపోయే తెలుగు పదాలను కంప్యూటర్‌ చూపిస్తూ ఉండగా, వాళ్లు ఒక్కో వచనాన్ని అనువదించారు.

అయితే, కేవలం ఇంగ్లీషులో ఉన్న పదాలకు బదులు మన భాషలోని పదాలను పెట్టేస్తే అది అనువాదం అయిపోదు. తెలుగులో ఎంచుకున్న పదాలు బైబిల్లో ఉన్న ప్రతీ సందర్భంలో సరైన భావాన్ని తెలియజేస్తున్నాయో లేదో చూసుకోవాలి. అందుకోసం చాలా పని చేయాల్సి ఉంటుంది. వ్యాకరణం అలాగే వాక్య నిర్మాణం చదవడానికి బాగుందో లేదో, సహజంగా ఉందో లేదో జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ని అనువదించడం ఎంత శ్రమతో కూడుకున్నదో వేరే చెప్పనక్కర్లేదు. తెలుగు కొత్త లోక అనువాదం, ప్రాచీన ప్రతుల్లో ఉన్న సమాచారాన్ని ఉన్నదున్నట్లు, సులభంగా చదవగలిగేలా, స్పష్టంగా, తేలిగ్గా అర్థం చేసుకోగలిగేలా అనువదించింది. *

పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం బైబిల్ని స్వయంగా పరిశీలించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మీరు దాన్ని ఆన్‌లైన్‌లో గానీ, JW లైబ్రరీ యాప్‌లో గానీ చదవవచ్చు, లేదా ఒక ముద్రిత కాపీని మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షుల సంఘంలో తీసుకోవచ్చు. దేవుని మాటల్ని ఉన్నవి ఉన్నట్లుగా మీ సొంత భాషలో చదువుతున్నారనే నమ్మకంతో మీరు దాన్ని చదవవచ్చు. ఈ బైబిలు విడుదలవడం నిజంగా ఒక ఆధ్యాత్మిక మైలురాయి అని త్వరలోనే మీరూ ఒప్పుకుంటారు, అందులో సందేహం లేదు!

 

కొత్త లోక అనువాదంలోని ప్రత్యేకతలు

 

దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి: ప్రాథమిక బైబిలు బోధలకు సంబంధించిన 20 ప్రశ్నలు, వాటికి జవాబిచ్చే బైబిలు వచనాలు ఇందులో ఉంటాయి

ఖచ్చితమైన అనువాదం: హీబ్రూ, అరామిక్‌, గ్రీకు మూల భాషల్లో ఉన్న సమాచారాన్ని ముందు ఇంగ్లీషులోకి, తర్వాత తెలుగులోకి సాధ్యమైనంత ఖచ్చితంగా, ఉన్నదున్నట్లుగా అనువదించేందుకు చాలా జాగ్రత్త తీసుకున్నారు

మార్జినల్‌ రెఫరెన్సులు: లేఖనంతో సంబంధం ఉన్న ఇతర బైబిలు వచనాల్ని ఇవి పాఠకులకు చూపిస్తాయి

అనుబంధం A: కొత్త ఎడిషన్‌లో ఉన్న ప్రత్యేకతల గురించి, అంటే అందులో ఉపయోగించిన శైలి, పదాల్లో మార్పులు, అలాగే దేవుని పేరును అనువదించడం వంటివాటి గురించి వివరిస్తుంది

అనుబంధం B: మ్యాపులు, బొమ్మలు ఉన్న 15 రంగురంగుల భాగాలు ఇందులో ఉన్నాయి

^ పేరా 7 సాధారణంగా పాత నిబంధన అని పిలుస్తారు.

^ పేరా 9 ఉదాహరణకు, న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌ అనువాద సమన్వయకర్త ఇలా రాశాడు: “దేవునికున్న యెహోవా అనే పేరు చాలా విశిష్టమైనది. నిజానికి మేము దాన్నే ఉపయోగించి ఉండాల్సింది. కానీ మేము 22 లక్షల కన్నా ఎక్కువ డాలర్లు ఈ అనువాదం కోసం ఖర్చు చేశాం. 23వ కీర్తనలో ‘యావే నా కాపరి’ అని అనువదిస్తే, ఆ డబ్బంతా కాలువలో పోసినట్టే. ఇక మా అనువాదం వృథా అయిపోతుంది.”

^ పేరా 12 సాధారణంగా కొత్త నిబంధన అని పిలుస్తారు.

^ పేరా 24 బైబిలు అనువాద సూత్రాల గురించి, తెలుగు ఎడిషన్‌లో ఉన్న ప్రత్యేకతల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి కొత్త లోక అనువాదంలో అనుబంధం A1, A2 చూడండి.