కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“కోపంతో విరుచుకుపడేవాణ్ణి”

“కోపంతో విరుచుకుపడేవాణ్ణి”
  • పుట్టిన సంవత్సరం: 1975

  • దేశం: మెక్సికో

  • ఒకప్పుడు: కోపంతో విరుచుకుపడేవాడు; ఖైదీ

నా గతం

 మెక్సికోలోని చియాపాస్‌ రాష్ట్రంలో సాన్‌ జుయాన్‌ చాన్‌కాలైటో అనే ఒక చిన్న పట్టణంలో నేను పుట్టాను. మా కుటుంబం చోల్‌ తెగకు చెందినది. అది మాయా ప్రజల్లో నుండి వచ్చిన ఒక తెగ. మేము 12 మంది పిల్లలం, నేను ఐదవవాడిని. చిన్నప్పుడు నేను, మా తోబుట్టువులు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసేవాళ్లం. విచారకరంగా, నా చిన్నతనంలో నేను బైబిలు నిర్దేశాలను పాటించలేదు.

 నాకు 13 సంవత్సరాలు వచ్చేసరికి డ్రగ్స్‌ తీసుకోవడం, దొంగతనం చేయడం మొదలుపెట్టాను. ఆ వయసులో నేను ఇల్లు వదిలేసి వేర్వేరు ఊళ్లల్లో తిరిగాను. నాకు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఒక గంజాయి తోటలో పని చేయడం మొదలుపెట్టాను. ఒక సంవత్సరంపాటు నేను అక్కడే ఉన్నాను. ఒక రోజు రాత్రి మేము ఎక్కువ మొత్తంలో గంజాయిని ఒక పడవ ద్వారా రవాణా చేస్తుండగా మాకు శత్రువులైన ఇంకో డ్రగ్స్‌ గ్యాంగ్‌ ఆయుధాలతో మాపై దాడి చేసింది. వాళ్లను తప్పించుకోవడానికి నేను నదిలోకి దూకి, ఈదుతూ దూరంగా ఉన్న వేరే చోటుకు వెళ్లాను. ఆ తర్వాత నేను అమెరికాకు పారిపోయాను.

 అమెరికాలో కూడా నేను డ్రగ్స్‌ అమ్ముతూ మరిన్ని సమస్యల్లో చిక్కుకున్నాను. 19 ఏళ్ల వయసులో, దొంగతనం, ఒకరిని చంపడానికి ప్రయత్నించడం అనే నేరాల కింద నన్ను అరెస్టు చేసి, జైలు శిక్ష వేశారు. జైల్లో నేను ఒక గ్యాంగ్‌లో చేరి, వేరేవాళ్లను హింసించేవాణ్ణి. దానివల్ల అధికారులు నన్ను పెన్సిల్వేనియాలోని లూయిస్‌బర్గ్‌లో హై సెక్యూరిటీ ఉన్న పెద్ద జైల్లోకి మార్చారు.

 లూయిస్‌బర్గ్‌ జైల్లో నా ప్రవర్తన ఇంకా ఘోరంగా తయారైంది. నా గ్యాంగ్‌కు సంబంధించి నా ఒంటి మీదున్న పచ్చబొట్లను బట్టి ఈ జైల్లో ఉన్న అదే గ్యాంగ్‌లో వెంటనే కలిసిపోయాను. నేను ఇంకా క్రూరంగా తయారయ్యాను, ఎప్పుడూ గొడవల్లోకి దిగేవాణ్ణి. ఒకసారి జైలు మైదానంలో గ్యాంగ్‌ల మధ్య జరిగిన కొట్లాటలో నేనూ పాల్గొన్నాను. బేస్‌బాల్‌ బ్యాట్స్‌తో, వ్యాయామం కోసం వాడే బరువులతో ఘోరంగా కొట్టుకున్నాం. గొడవ ఆపడానికి అక్కడి గార్డ్‌లు టియర్‌ గ్యాస్‌ వాడారు. ఆ సంఘటన తర్వాత, జైలు అధికారులు నన్ను కరడుగట్టిన నేరస్థుల కోసం తయారుచేసిన ఒక ప్రత్యేకమైన విభాగంలో వేశారు. పిచ్చి కోపం వచ్చేది, వేరేవాళ్లను అవమానిస్తూ మాట్లాడేవాణ్ణి. వేరేవాళ్లను కొట్టడం నాకు పెద్ద విషయమేమీ కాదు, నిజానికి అలా చేయడాన్ని ఆనందించేవాణ్ణి. నా ప్రవర్తన విషయంలో నేను ఎప్పుడూ బాధపడలేదు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

 జైలు ప్రత్యేక విభాగంలో, నేను ఎక్కువసేపు నా గదిలోనే ఉండాల్సి వచ్చేది, కాబట్టి సమయం గడపడానికి బైబిలు చదవడం మొదలుపెట్టాను. తర్వాత, ఒక గార్డ్‌ నాకు మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు a అనే పుస్తకాన్ని ఇచ్చింది. అది చదివినప్పుడు, నేను చిన్నప్పుడు సాక్షులతో బైబిలు అధ్యయనం చేసినప్పుడు నేర్చుకున్న చాలా విషయాలు గుర్తొచ్చాయి. నా క్రూరమైన వ్యక్తిత్వం వల్ల నేను ఎంతగా దిగజారిపోయానో ఆలోచించాను. నా కుటుంబం గురించి కూడా ఆలోచించాను. నా అక్క, చెల్లి యెహోవాసాక్షులు అయ్యారు కాబట్టి, ‘వాళ్లు నిరంతరం జీవిస్తారు, నేను కూడా అలా నిరంతరం జీవిస్తే ఎంత బావుంటుంది’ అని ఆలోచించాను. అప్పుడు నేను మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.

 అయితే, మారడానికి సహాయం అవసరమని నాకనిపించింది. కాబట్టి, మొదటిగా యెహోవా దేవునికి ప్రార్థించి, నాకు సహాయం చేయమని బ్రతిమాలాను. తర్వాత, అమెరికాలో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాసి బైబిలు అధ్యయనం కావాలని అడిగాను. దగ్గర్లో ఉన్న ఒక సంఘం నన్ను సంప్రదించేలా బ్రాంచి కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఆ సమయంలో, నన్ను నా కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవ్వరూ కలవడానికి అనుమతి లేదు కాబట్టి ఆ సంఘం నుండి ఒక సాక్షి నాకు ప్రోత్సాహకరమైన ఉత్తరాలు, బైబిలు సాహిత్యం పంపించేవాడు. వాటివల్ల మారాలనే నా కోరిక ఇంకా బలపడింది.

 నేను చాలా సంవత్సరాలుగా ఉన్న గ్యాంగ్‌ నుండి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకుని, ఒక పెద్ద అడుగు ముందుకు వేశాను. ఆ గ్యాంగ్‌ నాయకుడు కూడా జైలు ప్రత్యేక విభాగంలో ఉండేవాడు, నేను ఒకసారి అతని దగ్గరికి వెళ్లి, నాకు యెహోవాసాక్షి అవ్వాలనుంది అని చెప్పాను. ఆశ్చర్యకరంగా, అతను నాతో ఇలా అన్నాడు: “నీకు నిజంగా అలా మారాలనుంటే, అది నీ ఇష్టం. నేను దేవుని విషయాల్లో తలదూర్చను. కానీ ఊరికే గ్యాంగ్‌ను వదిలేస్తే, ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో నీకు బాగా తెలుసు.”

 ఆ తర్వాతి రెండు సంవత్సరాల్లో నా వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులను జైలు సిబ్బంది గమనించారు. ఫలితంగా, వాళ్లు నాకు కాస్త స్వేచ్ఛను ఇచ్చారు. ఉదాహరణకు, స్నానం చేయడానికి నన్ను బయటికి తీసుకెళ్లేటప్పుడు నా చేతికి సంకెళ్లు తీసేసేవాళ్లు. ఒక గార్డ్‌ అయితే నా దగ్గరకు వచ్చి, నేను చేస్తున్న మార్పులు కొనసాగించమని నన్ను ప్రోత్సహించాడు. నా జైలు శిక్షలోని చివరి సంవత్సరంలో నన్ను జైలు దగ్గర్లో, తక్కువ గార్డ్‌లు ఉన్న ఒక చిన్న క్యాంప్‌కు మార్చారు. 2004లో పది సంవత్సరాల జైలు శిక్ష తర్వాత, నన్ను విడుదల చేసి జైలు బస్సులో మెక్సికోకు పంపించారు.

 మెక్సికోకు చేరిన వెంటనే, నేను యెహోవాసాక్షుల రాజ్యమందిరం కోసం వెతికాను. నేను జైలు బట్టల్లోనే నా మొదటి మీటింగ్‌కు వెళ్లాను. అవి కాకుండా నా దగ్గర వేరే మంచి బట్టలు లేవు. నేను ఎలా కనిపించినా సాక్షులు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వాళ్లు చూపించిన దయను బట్టి నేను నిజమైన క్రైస్తవుల మధ్య ఉన్నానని నాకనిపించింది. (యోహాను 13:35) ఆ మీటింగ్‌లో సంఘ పెద్దలు నాకు ఒక బైబిలు అధ్యయనం ఏర్పాటు చేశారు. ఒక సంవత్సరం తర్వాత అంటే సెప్టెంబర్‌ 3, 2005లో నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాను.

 జనవరి 2007లో నేను పూర్తికాల సేవ మొదలుపెట్టాను. అంటే ప్రతీనెల 70 గంటలు బైబిలు గురించి నేర్పిస్తాను. 2011లో “ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల”కు హాజరయ్యాను (ఇప్పుడు దాన్ని “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల” అని పిలుస్తున్నారు). సంఘంలో నా బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి ఈ పాఠశాల నాకు బాగా సహాయం చేసింది.

నేను ఇప్పుడు శాంతంగా ఉండమని ఇతరులకు నేర్పిస్తూ సంతోషంగా ఉన్నాను

 2013లో నేను పీలార్‌ను పెళ్లి చేసుకున్నాను, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె కొన్నిసార్లు నా గతం గురించిన కొన్ని విషయాలు నమ్మలేకపోతున్నానని సరదాగా అంటుంది. నేను మళ్లీ ఎప్పుడూ నా పాత స్వభావంలోకి జారిపోలేదు. నేను ఈరోజు ఇలా మారిపోయాను అంటే అది కేవలం బైబిలుకున్న శక్తి వల్లే అని నేను, నా భార్య నమ్ముతున్నాం.—రోమీయులు 12:2.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

 లూకా 19:10 లోని యేసు మాటలు నాకు వర్తిస్తాయని అనిపిస్తుంది. ఆయనిలా అన్నాడు: “తప్పిపోయిన దాన్ని వెతకడానికి, దాన్ని రక్షించడానికే మానవ కుమారుడు [యేసు] వచ్చాడు.” నేను తప్పిపోయినట్టు నాకు ఇప్పుడు అనిపించడం లేదు. నేను ఇప్పుడు ఇతరుల్ని హింసించడం లేదు. బైబిలు వల్ల, అత్యంత గొప్ప ఉద్దేశంతో నేను జీవిస్తున్నాను, ఇతరులతో శాంతంగా ఉంటున్నాను; అన్నిటికన్నా ముఖ్యంగా నా సృష్టికర్త అయిన యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉన్నాను.

[అధస్సూచి]

a ఈ పుస్తకం యెహోవాసాక్షులు ప్రచురించినది. అయితే దీన్ని ఇప్పుడు ముద్రించడం లేదు. వాళ్లు ఇప్పుడు బైబిలు అధ్యయనం చేయడానికి ముఖ్యంగా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు.