కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను తుపాకి లేకుండా అడుగు బయటపెట్టేవాణ్ణే కాదు

నేను తుపాకి లేకుండా అడుగు బయటపెట్టేవాణ్ణే కాదు
  • జననం: 1958

  • దేశం: ఇటలీ

  • ఒకప్పుడు: క్రూరమైన ముఠా సభ్యుడు

నా గతం:

నేను రోము నగర శివార్లలో పుట్టి పెరిగాను, అక్కడ అందరూ బీద కార్మికులే. అన్నీ కష్టాలే. మా అమ్మని నేను ఎప్పుడూ చూడలేదు. నాన్నతో అంత చనువు ఉండేదికాదు. బ్రతకడం ఎలాగో వీధుల్లోనే నేర్చుకున్నాను.

పదేళ్లకే నేను దొంగనయ్యాను. 12వ ఏట మొదటిసారి ఇంట్లోనుండి పారిపోయాను. కొన్నిసార్లు నాన్న నన్ను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుండి విడిపించి ఇంటికి తీసుకురావాల్సి వచ్చేది. నేను చాలా క్రూరుణ్ణి, పైగా లోకమంటే ద్వేషం. దాంతో ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపడేవాణ్ణి. 14 ఏళ్లకు ఇంటినుండి వెళ్లిపోయాను. మత్తుపదార్థాలకు అలవాటుపడ్డాను, వీధే నా ఇల్లు అయ్యింది. పడుకోవడానికి చోటులేక, ఏదోక కారు తలుపు పగులగొట్టి తెల్లవారే వరకూ అందులోనే పడుకునేవాణ్ణి. ఎక్కడైనా ఫౌంటేన్‌ (fountain) కనిపిస్తే వెళ్లి మొహం కడుక్కునేవాణ్ణి.

బ్యాగ్‌లు లాక్కోవడం మొదలుకొని రాత్రుళ్లు అపార్ట్‌మెంట్‌లలో, భవనాల్లో చొరబడి దోచుకోవడం వరకు ఏదైనా సునాయాసంగా చేసేవాణ్ణి. నా పేరు అంతటా మారుమ్రోగడంతో, తమతో చేరమని పేరుమోసిన ఓ ముఠా అడిగింది. దాంతో బ్యాంకులు దోచుకునే స్థాయికి ఎదిగాను. నాకున్న దూకుడు స్వభావం వల్ల ముఠాలో బాగా పేరొచ్చింది. నేను తుపాకి లేకుండా అడుగు బయటపెట్టేవాణ్ణే కాదు, చివరికి పడుకునేటప్పుడు కూడా అది నా తలకిందే ఉండేది. హింస, మత్తుపదార్థాలు, దొంగతనం, బూతులు, అమ్మాయిలతో తిరగడం . . . అదే నా జీవితం. పోలీసులు నాకోసం ఎప్పుడూ గాలిస్తూ ఉండేవాళ్లు. చాలాసార్లు అరెస్టయ్యాను, ఎన్నో ఏళ్లు జైళ్లలో గడిపాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

ఒకసారి జైలు నుండి విడుదలయ్యాక మా పిన్నివాళ్ల ఇంటికి వెళ్లాను. మా పిన్ని, వాళ్ల పిల్లల్లో ఇద్దరు యెహోవాసాక్షులు అయ్యారని నాకు తెలీదు. నన్ను వాళ్ల కూటానికి ఆహ్వానించారు. అక్కడెలా ఉంటుందో చూద్దామని నేను వెళ్లాను. రాజ్యమందిరానికి వచ్చిపోయేవాళ్ల మీద ఓ కన్నేసి ఉంచుదామని, పట్టుబట్టి మరీ తలుపు దగ్గరే కూర్చున్నాను. నా తుపాకీ కూడా నా దగ్గరే ఉంది.

ఆ కూటంతో నా జీవితమే మారిపోయింది. ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది. కూటంలో అందరూ ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. వాళ్ల కళ్లలో కనిపించిన దయ, నిజాయితీ నాకు ఇంకా గుర్తుంది. నేను చూసిన ప్రపంచానికీ దీనికీ, భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది!

యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేర్చుకునేకొద్దీ, నా జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలని గ్రహించాను. సామెతలు 13:20⁠లోని ఈ సలహాను పాటించాను: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” అంటే, నేను ముఠాకు దూరంగా ఉండాలి. అది కష్టమే అయినా యెహోవా సహాయంతో వాళ్లను దూరం పెట్టగలిగాను.

జీవితంలో మొట్టమొదటిసారి, నా ప్రవర్తనను అదుపు చేసుకోవడం నేర్చుకున్నాను

నేను కూడా చాలా మార్పులు చేసుకున్నాను. ఎంతో కష్టం మీద చివరికి పొగత్రాగడం-మత్తుపదార్థాలు తీసుకోవడం మానుకున్నాను. పొడవాటి జుట్టు కత్తిరించుకున్నాను, చెవిపోగులు తీసేశాను, బూతులు మానేశాను. జీవితంలో మొట్టమొదటిసారి, నా ప్రవర్తనను అదుపు చేసుకోవడం నేర్చుకున్నాను.

చదవడమన్నా, అధ్యయనం చేయడమన్నా నాకు పెద్దగా ఆసక్తి ఉండేదికాదు. కాబట్టి బైబిలు గురించి నేర్చుకుంటున్నప్పుడు దానిమీద మనసుపెట్టడం చాలా కష్టమనిపించేది. అయినా ప్రయత్నం చేసి మెల్లమెల్లగా యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టాను. నా లోలోపల మార్పు వచ్చింది, మనస్సాక్షి పనిచేయసాగింది. నాలాంటి చెడ్డవాణ్ణి యెహోవా ఎప్పటికైనా క్షమిస్తాడా? అనే ఆలోచన ఎప్పుడూ నన్ను వేధించేది. అలాంటి సమయాల్లో, ఘోరమైన పాపం చేసినప్పుడు దావీదు రాజును యెహోవా క్షమించాడని చదివి, ఎంతో ఊరట పొందేవాణ్ణి.—2 సమూయేలు 11:1–12:13.

నాకు బాగా కష్టమనిపించిన మరో పని, ఇంటింటికి వెళ్లి సువార్త చెప్పడం. (మత్తయి 28:19, 20) ఒకప్పుడు నేను బాధపెట్టిన, హానిచేసిన వాళ్లు ఎదురుపడతారేమోనని భయపడేవాణ్ణి! కానీ మెల్లమెల్లగా ఆ భయాలన్నీ తీసేసుకున్నాను. విస్తారంగా క్షమించే, మన గొప్ప పరలోక తండ్రి గురించి ప్రజలకు నేర్పించడంలో ఎంతో సంతృప్తి పొందగలుగుతున్నాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .

యెహోవా గురించి తెలుసుకోవడం వల్లే ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను! నా స్నేహితుల్లో కొందరు చనిపోయారు, ఇంకొందరు జైళ్లలో ఉన్నారు. నేను మాత్రం సంతృప్తితో, భవిష్యత్తు మీద ఆశతో సంతోషంగా జీవిస్తున్నాను. వినయంగా ఉండడం, లోబడడం, నా పిచ్చి కోపాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాను. దానివల్ల ఇతరులతో నా సంబంధాలు మెరుగయ్యాయి. నేను కార్మెన్‌ అనే అందమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మేమిద్దరం ఇతరులకు బైబిలు నేర్పిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాం.

ఇంకోమాట, ఇప్పుడు నేను నిజాయితీగా కష్టపడుతున్నాను. కొన్నిసార్లు బ్యాంకులకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే దోచుకోవడానికి మాత్రంకాదు, శుభ్రం చేయడానికి! ▪ (w14-E 07/01)