కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యెషయా 26:3—“స్థిరమనస్సు” గలవారికి “నీవు పరిపూర్ణ శాంతిని” ఇస్తావు

యెషయా 26:3—“స్థిరమనస్సు” గలవారికి “నీవు పరిపూర్ణ శాంతిని” ఇస్తావు

 “నీ మీద పూర్తిగా ఆధారపడేవాళ్లను నువ్వు కాపాడతావు; నువ్వు వాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తావు, ఎందుకంటే వాళ్లు నిన్నే నమ్ముకున్నారు.”—యెషయా 26:3‏, కొత్త లోక అనువాదం.

 “స్థిరమనస్సుతో నిన్ను నమ్ము వారికి నీవు పరిపూర్ణ శాంతిని ఒసగుదువు.”—యెషయా 26:3, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

యెషయా 26:3 అర్థమేంటి?

 భరోసానిచ్చే ఆ మాటలతో యెషయా ప్రవక్త, దేవున్ని పూర్తిగా నమ్ముకున్న వాళ్లను ఆయన కాపాడతాడని చెప్తున్నాడు. అంటే వాళ్లు సురక్షితంగా, ప్రశాంతంగా ఉన్నట్టు భావించేలా ఆయన చేస్తాడు.

 “నీ మీద పూర్తిగా ఆధారపడేవాళ్లను నువ్వు కాపాడతావు.” వచనంలోని ఈ భాగం, అన్ని సమయాల్లో యెహోవా a దేవున్ని నమ్ముకోవాలని మనసులో తీర్మానించుకున్న వాళ్ల గురించి చెప్తుంది. దేవున్ని నమ్ముకున్న వాళ్లకు ఆయన మీద ఆధారపడాలని తెలుసు. ఉదాహరణకు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్లు సొంత ఆలోచన మీద ఆధారపడరు. బదులుగా, వాళ్లు ఏ పని చేసినా దేవుని ఆలోచన ఏంటో తెలుసుకొని చేస్తారు. (సామెతలు 3:5, 6) అలా తెలుసుకోవడానికి వాళ్లు దేవుని వాక్యమైన బైబిల్ని జాగ్రత్తగా చదువుతారు, చదివినవాటి గురించి లోతుగా ఆలోచిస్తారు. (కీర్తన 1:2; 119:15) కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లు యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించి సహాయం చేయమని అడుగుతారు. (కీర్తన 37:5; 55:22) అలా వాళ్లు దేవుని మీద నమ్మకం ఉందని చూపిస్తారు, అప్పుడాయన వాళ్లకు శాంతిని ఇస్తాడు.

 “నువ్వు వాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తావు.” మూలభాషైన హీబ్రూలో, నొక్కిచెప్పడం కోసం “శాంతి” అనే మాట రెండుసార్లు కనిపిస్తుంది; కాబట్టి దాన్ని “ఎడతెగని (ఎప్పుడూ ఉండే) శాంతి,” “పరిపూర్ణ శాంతి” లేదా “పూర్ణ శాంతి” అని అనువదించవచ్చు. ఇంకోమాటలో చెప్పాలంటే, యెహోవాను పూర్తిగా నమ్ముకున్న వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే వాళ్లకు లోపల ఒకలాంటి మనశ్శాంతి లేదా నెమ్మది ఉంటుంది. (కీర్తన 112:7; 119:165) యెహోవాతో దగ్గరి అనుబంధం ఉండడం, ఆయన దృష్టిలో సరైనది చేయడానికి గట్టిగా ప్రయత్నించడం వల్లే అలాంటి శాంతి ఉంటుంది.—సామెతలు 3:32; యెషయా 48:18.

 దేవుడు “ఎప్పుడూ శాంతిని” ఇస్తాడంటే దానర్థం, తన సేవకులకు కష్టాలు రాకుండా చేసి ఆందోళనే లేకుండా చేస్తాడని కాదు. (1 సమూయేలు 1:6, 7; యోబు 6:1, 2; కీర్తన 31:9) బదులుగా, కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. (యెషయా 41:10, 13) వాళ్లు చేసే ప్రార్థనలకు జవాబుగా తెలివిని, శక్తిని, ఊరటను ఇస్తాడు. (కీర్తన 94:19; సామెతలు 2:6; యెషయా 40:29) దానివల్ల వాళ్లు కష్టమైన పరిస్థితుల్లో కూడా మనశ్శాంతితో ఉండగలుగుతారు.—ఫిలిప్పీయులు 4:6, 7.

యెషయా 26:3 సందర్భం

 యెషయా ప్రవక్త క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దంలో జీవించాడు. ఆ సమయంలో, అలాగే ఆ తర్వాతి సంవత్సరాల్లో యూదాలోని చాలామంది యెహోవా దేవున్ని నమ్మకంగా ఆరాధించలేదు. దానివల్ల క్రీ.పూ. 607 లో, వాళ్ల రాజధాని యెరూషలేము నాశనం అవ్వడానికి యెహోవా అనుమతించాడు.

 అయినా సరే, అలా జరగడానికి వందకన్నా ఎక్కువ సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త 26వ అధ్యాయంలో యెహోవాను స్తుతిస్తూ రాబోయే రోజుల గురించి ఒక పాట రాశాడు. (యెషయా 26:1-6) ఆ పాట, యూదా దేశంలోని ఒక నగరం అంటే యెరూషలేము మళ్లీ మంచి స్థితికి వచ్చే సమయాన్ని వర్ణిస్తుంది.

 క్రీ.పూ. 537 తర్వాతి సంవత్సరాల్లో యెరూషలేమును మళ్లీ కట్టారు. దానివల్ల, యెరూషలేముకు తిరిగివచ్చిన నమ్మకమైన యూదులు సురక్షితంగా ఉన్నామని భావిస్తూ, “మనకొక బలమైన నగరం ఉంది” అని చెప్పగలిగారు. (యెషయా 26:1) అయితే ఆ నగరం బలంగా ఉండడానికి కారణం దాని కోట గోడలు కాదు. బదులుగా యెహోవా ఆశీర్వాదం, కాపుదల వల్లే ఆ నగరం సురక్షితంగా ఉంటుంది.—యెషయా 26:2.

 ఈ రోజుల్లో కూడా అంతే. యెహోవాను పూర్తిగా నమ్ముకునే వాళ్లు ఆయనే తమ “బండరాయి” లేదా “ఆశ్రయదుర్గం” అనుకుంటారు, దానివల్ల సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు.—యెషయా 26:4, అధస్సూచి.

 యెషయా పుస్తకం గురించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్‌ చూడండి.