కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

కీర్తన 46:10—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”

కీర్తన 46:10—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”

 “లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. నేను దేశాల మధ్య హెచ్చించబడతాను; నేను భూమ్మీద హెచ్చించబడతాను.”—కీర్తన 46:10, కొత్త లోక అనువాదం.

 “ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును.”—కీర్తన 46:10, పరిశుద్ధ గ్రంథము.

కీర్తన 46:10 అర్థమేంటి?

 ప్రతీఒక్కరు తనను ఆరాధించాలి, భూమిని పరిపాలించడానికి తనకున్న హక్కును గుర్తించాలి అన్నదే దేవుని కోరిక. ఆయన శక్తినీ అధికారాన్నీ ఎవరూ కాదనలేరు, శాశ్వత జీవితం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే.—ప్రకటన 4:11.

 “లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి.” కొన్ని బైబిలు అనువాదాల్లో ఈ వాక్యంలోని మొదటి భాగం “ఊరకుండుడి” అని ఉంటుంది. దానివల్ల, ఈ వచనాన్ని చర్చిలో భయభక్తులు చూపిస్తూ, నిశ్శబ్దంగా ఉండాలని తెలిపే ఆజ్ఞగా అపార్థం చేసుకున్నారు. అయితే, “లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి” అని అనువదించిన హీబ్రూ పదబంధం, స్వయంగా యెహోవా a దేవుడే అన్ని దేశాల ప్రజలను చర్య తీసుకోమని ప్రోత్సహిస్తున్నాడని చూపిస్తుంది. అంటే, తనను వ్యతిరేకించడం ఆపి, తాను మాత్రమే ఆరాధనకు అర్హుడని అందరూ గుర్తించాలన్నదే దేవుని ఆలోచన.

 ఆ ప్రోత్సాహం 2వ కీర్తనలో కూడా కనిపిస్తుంది. అక్కడ, దేవుడు తనను వ్యతిరేకించే వాళ్లపై చర్య తీసుకుంటానని మాటిస్తున్నాడు. మరోవైపున, దేవుని అధికారాన్ని గుర్తించేవాళ్లు నిర్దేశం, బలం, తెలివి కోసం ఆయన మీద ఆధారపడతారు. ఈ కష్టకాలాల్లో కూడా అలా “ఆయన్ని ఆశ్రయించే వాళ్లందరూ” సంతోషంగా, సురక్షితంగా ఉంటారు.—కీర్తన 2:9-12.

 “నేను దేశాల మధ్య హెచ్చించబడతాను; నేను భూమ్మీద హెచ్చించబడతాను.” గతంలో కూడా యెహోవా దేవుడు తన ప్రజలను కాపాడడానికి తన గొప్ప శక్తిని ఉపయోగించినప్పుడు హెచ్చించబడ్డాడు. (నిర్గమకాండం 15:1-3) భవిష్యత్తులో, భూమ్మీదున్న ప్రతి ఒక్కరూ ఆయన అధికారానికి లోబడి, ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మరెంతో గొప్పగా హెచ్చించబడతాడు.—కీర్తన 86:9, 10; యెషయా 2:11.

కీర్తన 46:10 సందర్భం

 ఓ రెఫరెన్సులో 46వ కీర్తన గురించి ఇలా ఉంది: ‘ఇది తన ప్రజల్ని కాపాడే బలవంతుడైన దేవుని శక్తిని కీర్తిస్తూ చేసే భజన.’ యెహోవా తమకు సహాయం చేసి కాపాడగలడనే నమ్మకాన్ని చూపిస్తూ దేవుని ప్రజలు 46వ కీర్తన పాడేవాళ్లు. (కీర్తన 46:1, 2) యెహోవా ఎప్పుడూ తమతోనే ఉన్నాడని ఆ మాటలు వాళ్లకు గుర్తుచేసేవి.—కీర్తన 46:7, 11.

 యెహోవా చేసిన శక్తివంతమైన పనుల గురించి ఆలోచిస్తూ తమను కాపాడే శక్తి ఆయనకుందనే నమ్మకాన్ని పెంచుకోమని ఈ కీర్తన ప్రోత్సహించింది. (కీర్తన 46:8) ముఖ్యంగా, యుద్ధాల్ని ఆపే విషయంలో ఆయనకున్న సామర్థ్యం గురించి ఈ కీర్తన చెప్తుంది. (కీర్తన 46:9) నిజానికి పాతకాలంలో, శత్రు దేశాల నుండి తన ప్రజల్ని కాపాడి యెహోవా యుద్ధాల్ని ఆపాడు. కానీ, దేవుడు త్వరలోనే ఇంకా పెద్ద స్థాయిలో, అంటే భూవ్యాప్తంగా యుద్ధాలనేవే లేకుండా చేస్తాడని బైబిలు మాటిస్తుంది.—యెషయా 2:4.

 యెహోవా ఇప్పుడు కూడా తన ఆరాధకులకు సహాయం చేస్తాడా? అవును, చేస్తాడు. అందుకే, దేవుని సహాయం తీసుకోమని పౌలు క్రైస్తవుల్ని మరీమరీ ప్రోత్సహించాడు. (హెబ్రీయులు 13:6) 46వ కీర్తనలోని మాటలు దేవుని రక్షణ శక్తి మీద మన నమ్మకాన్ని బలపరుస్తాయి. ఆ కీర్తన చదివితే, “మన ఆశ్రయం, మన బలం” ఆయనే అన్న నమ్మకం మనకు కుదురుతుంది.—కీర్తన 46:1.

 కీర్తనల పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్‌ చూడండి.