కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

ఎఫెసీయులు 3:20—“మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి“

ఎఫెసీయులు 3:20—“మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి“

 “మనలో పనిచేస్తున్న తన శక్తి ప్రకారం, దేవుడు మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు. ఆయనకు … మహిమ కలగాలి.”—ఎఫెసీయులు 3:20, 21, కొత్త లోక అనువాదం.

 “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి … మహిమ కలుగునుగాక.”—ఎఫెసీయులు 3:20, 21, పరిశుద్ధ గ్రంథము.

ఎఫెసీయులు 3:20 అర్థమేంటి?

 తనను ఆరాధించేవాళ్లు కలలో కూడా జరగదని అనుకునే విధాల్లో వాళ్ల ప్రార్థనలకు జవాబిచ్చే, వాళ్లు కోరుకునే వాటిని చేసే సామర్థ్యం దేవునికి ఉందనే నమ్మకాన్ని అపొస్తలుడైన పౌలు వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ల ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబు కొన్నిసార్లు వాళ్లు అనుకున్నదాని కన్నా, ఆశించినదాని కన్నా గొప్పగా ఉంటుంది.

 “మనలో పనిచేస్తున్న తన శక్తి ప్రకారం … చేయగలడు” అలా చేసేది యెహోవా దేవుడు a అని 21వ వచనం చెప్తుంది. ఆ వచనంలో పౌలు ఇలా రాశాడు: “ఆయనకు సంఘం ద్వారా, క్రీస్తుయేసు ద్వారా … మహిమ కలగాలి.” అంతేకాదు, మనం తన ఇష్టాన్ని చేసేలా దేవుడు మనకు కావాల్సిన శక్తిని లేదా బలాన్ని ఇవ్వగలడు.—ఫిలిప్పీయులు 4:13.

 20వ వచనంలో, తనను ఆరాధించేవాళ్లకు సహాయం చేసే యెహోవా సామర్థ్యం గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు. ఆ వచనంలోని “చేయగలడు” అనే మాట గురించి ఒక రెఫరెన్సు ఇలా చెప్తుంది: “ఈ వచనం కేవలం దేవుడు ఫలానాది చేయగలడని లేదా చేసే అవకాశం ఉందని చెప్పడం లేదు కానీ దాన్ని పూర్తి చేసే శక్తి ఆయనకు ఉందని చెప్తుంది.“ మన స్నేహితులు మన మంచిని కోరుకున్నా, అన్నిసార్లూ మనకు సహాయం చేయలేరు. కానీ యెహోవా మాత్రం తన ఆరాధకుల సంక్షేమం కోసం, వాళ్ల ప్రార్థనలకు జవాబివ్వడం కోసం అవసరమైనది ఏదైనా చేయగలడు. కేవలం ఆయనకు మాత్రమే అపరిమితమైన శక్తి, అధికారం ఉన్నాయి.—యెషయా 40:26.

 “దేవుడు మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు” యెహోవా తన ఆరాధకులకు కావాల్సినవి సమృద్ధిగా లేదా ‘ఎంతో గొప్పగా’ ఇవ్వడం కన్నా ఎక్కువే చేయగలడు. వాళ్లకు, చాలా ఎక్కువ అనిపించే దానికన్నా ఎంతో గొప్పగా సహాయం చేయగలడు.

 “మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా” అనే పదాలు ఈ వచనం గురించి ఇంకో విషయం చెప్తుంది. అపొస్తలుడైన పౌలు “మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా” అని అనడం ద్వారా, దేవుడు తాము కలలో కూడా అనుకోని విధాల్లో సహాయం చేయగలడని క్రైస్తవులందరూ అర్థంచేసుకోవాలని కోరుకున్నాడు. న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌ బైబిలు (ఇంగ్లీష్‌) 20వ వచనం మొదటి భాగాన్ని, “మనం అడిగే లేదా ఊహించే వాటన్నిటి కన్నా కొలవలేనంత ఎక్కువగా చేయగలవానికి“ అని అనువదిస్తుంది. ఒక్కోసారి క్రైస్తవులకు తమ సమస్యలు చాలా పెద్దవిగా లేదా పరిష్కరించలేనంత కష్టమైనవిగా కనిపిస్తాయి. అసలు ఏమని ప్రార్థన చేయాలో కూడా వాళ్లకు అంతుపట్టక పోవచ్చు. కానీ యెహోవాకు ఆ పరిస్థితి గురించి పూర్తి అవగాహన, ఎలాగైనా సహాయం చేసే సామర్థ్యం ఉన్నాయి. సరైన సమయంలో ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలడు; అది కూడా మనం అస్సలు ఊహించని విధాల్లో మనకు సాధ్యం కాదని అనిపించే పద్ధతుల్లో చేయగలడు. (యోబు 42:2; యిర్మీయా 32:17) ఈలోపు, దాన్ని భరించడానికి కావాల్సిన శక్తిని, నిజానికి సంతోషంగా భరించడానికి కావాల్సిన శక్తిని ఆయన వాళ్లకు ఇస్తాడు!—యాకోబు 1:2, 3.

ఎఫెసీయులు 3:20 సందర్భం

 ఎఫెసీయులు పుస్తకం, అపొస్తలుడైన పౌలు ఆసియా మైనరులో ఉన్న ఎఫెసు నగరంలో జీవిస్తున్న క్రైస్తవులకు రాసిన ఉత్తరం. అది ఇప్పుడు ఆధునిక టర్కీలో ఉంది. తన ఉత్తరంలో పౌలు, వాళ్ల గురించి తాను ప్రార్థించిన విషయాలను రాశాడు. (ఎఫెసీయులు 3:14-21) వాళ్లు తమ ఆలోచనల్లో, క్రియల్లో క్రీస్తులా ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలని, అలా క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థించాడు. అది క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. తన ప్రార్థన ముగింపులో పౌలు దేవుణ్ణి స్తుతించి, ఎఫెసీయులు 3:20, 21 లో ఉన్న మాటలు అన్నాడు.

 ఎఫెసీయులు పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.